Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీమద్రమారమణ-14

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]

[తాను నంద్యాలలో కోనేటయ్యకూ, తిరుపాలమ్మకూ పని చూసిపెట్టాననీ, కోనేటయ్యకు నెలకు నాలుగు వేల ఐదువందలు, తిరుపాలమ్మకు రెండు వేలు జీతమనీ చెప్తాడు దస్తగిరి సారు. వైనతేయ కూడా నంద్యాలలోనే కాలేజీలో చేరతాడనీ, వాళ్ల దగ్గర ఉండి చదువుకుంటాడనీ చెప్తాడు. రాత్రి భోజనాలయ్యాక, పెదరెడ్డి బాకీ వివరాలు అడిగి తెలుసుకుంటాడు. మర్నాడు కోనేటయ్య మేనమామ రామాంజులు, ఇంకో రైతు సహదేవుడు, కోనేటయ్య, తిరుపాలమ్మ, దస్తగిరి సారు కోటకొండకు చేరుకుని శేషశయనారెడ్డిని కలుస్తారు. కోనేటయ్య తన బాకీ తీర్చేద్దామనుకుంటున్నాడనీ, దయచేసి సహకరించమని అడుగుతాడు దస్తగిరి సారు. తాకట్టు పెట్టిన పొలాన్ని తనకే అమ్మేయమంటాడు పెద్దరెడ్డి. కుదరదంటుంది తిరుపాలమ్మ. వడ్డీ కలిపి ఎనిమిది వేల చిల్లరయిందంటాడు పెద్దరెడ్డి. దస్తగిరి సారు లెక్కలు కట్టి, ఇప్పటిదాక కోనేటయ్య కట్టిన డబ్బే పన్నెండువేలయింటాడు. చివరికి వడ్డీ మినహాయించి, అసలు మొత్తం చెల్లించేలా ఒప్పిస్తాడు. ఐదువేలు ఆయనకి కోనేటయ్య చేత ఇప్పిస్తాడు. తర్వాత పెద్దరెడ్డికి ఇష్టం లేకపోయినా చెల్లుచీటీ రాయిస్తాడు. ఇంటికి వచ్చాకా, నంద్యాలలో రైల్వే స్టేషన్ వెనుక ఉన్న కాలనీలలో ఇల్లు వెతుకుతున్నామనీ, దొరంకాగే వచ్చేయచ్చు అని కోనేటయ్యకూ, తిరుపాలమ్మకూ చెప్తాడు దస్తగిరిసారు. తాను తెచ్చిన డబ్బులో మిగిలిన ఐదువేలను కూడా వాళ్ళకే ఇచ్చేసి, స్తిమితపడ్డాకా, తన అప్పు తీర్చమంటాడు. వైనతేయతో కలిసి బేతంచెర్లకి వెళ్ళిపోతాడాయన. రెండ్రోజుల తర్వాత గురుశిష్యులిద్దరూ వెళ్ళి ఇళ్ళు వెతుకుతారు. ఒక ఇల్లు వాళ్ళకి నచ్చుతుంది. దస్తగిరిసారు అడ్వాన్సు ఇస్తాడు. నాలుగు రోజుల్లో ఉన్న సామాను తీసుకొని కోనేటయ్య, తిరుపాలమ్మ వచ్చేస్తారు. ఇద్దరూ హోటల్లో ఉద్యోగాల్లో కుదురుకుంటారు. బిర్యానీ చేయడంలో మొనగాడనీ కోనేటయ్యకి పేరొస్తుంది. అలా ఒక గౌరవప్రదమైన, వారికి నచ్చిన ఉపాధి ఏర్పడుతుంది. – ఇక చదవండి.]

జూన్ 13న కాలేజీలు తెరిచారు. వైనతేయ ప్రభుత్వ జూనియర్ కాలేజిలో చేరాడు. హెచ్.యి.సి. గ్రూపులో అశ్వత్థనారాయణ సారు వాడికి సివిక్స్ లెక్చరర్. ఇంగ్లీషు మీడియం కూడా ఉండేది. పెద్ద కాలేజీ అది. పదిహేను వందలమంది పిల్లలు. కో-ఎడ్యుకేషన్. ఇంగ్లీషు మీడియం అని వైనతేయ జంకినా, దస్తగిరిసారు, అశ్వత్థ సారు వాడికి ధైర్యం చెప్పారు.

కాలేజీ మూలసాగరం దగ్గర. వీళ్ళున్న చోటికి రెండు మైళ్ళు. పొద్దున్న అన్నం తిని నడిచి వెళ్లేవాడు. ఒక బాక్సులో ఇంత కట్టుకొని వెళ్లేవాడు. మధ్యాహ్నం తిని పోవడానికి టైం చాలదు.

క్లాసులు ప్రారంభమైనాయి. మొదట్లో ఇబ్బంది పదినా, ఇంగ్లీష్ మీడియం రాను రాను సులభగ్రాహ్యమైంది. ఇంగ్లీషు లెక్చరర్ యజ్ఞనారాయణశర్మగారు.

సి. రాజగోపాలాచారి గారి ‘గుడ్ బ్రిక్స్’ అనే పాఠం అద్భుతంగా చెబుతున్నారు. విద్యార్థులు మంచి ఇటుకల లాంటి వారనీ, వారి ద్వారానే దేశం అనీ భవనం పటిష్టంగా ఉంటుందని రాజాజీగారు అందులో చెప్పారు.

పాఠాలు శ్రద్ధగా వినేవాడు వైనతేయ. కఠిన పదాలు, వాటి అర్థాలు, భాషాభాగాలు ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని నేర్చుకునేవాడు. ఒక పదం ప్రిఫిక్స్, సఫిక్స్‌లు  చేర్చుకొని, తన భాషాభాగాన్ని ఎలా మార్చుకుంటుందో, ఆ వర్డ్ ఫార్మేషన్ ప్రక్రియను యజ్ఞనారాయణ సారు చక్కగా వివరించారు.

‘డాఫోడిల్స్’ అన్న విలియం వర్డ్స్‌వర్త్ పద్యాన్ని సారు రిథమిక్‌గా, స్ట్రెస్ అండ్ ఇంటోనేషన్‌తో చదువుతూ ఉంటే వైనతేయ ముగ్ధుడయ్యేవాడు. లెక్చరర్స్ కూడా హరికథకుల లాగా పెర్ఫార్మింగ్ ఆర్టిస్టులే అని వాడికి తోచింది.

అదే పద్యాన్ని యింట్లో ప్రాక్టీసు చేసి, సారు చదివినట్లే చదవడం నేర్చుకున్నాడు. మర్నాడు క్లాసులో దాన్ని హావభావాలతో ప్రదర్శిస్తూ చదివి ఇంగ్లీష్ సారుతో భేష్ అనిపించుకున్నాడు.

ఇక తెలుగా లెక్చరర్ రంగారెడ్డిసారు. ఆయన పద్యాలను మామూలుగా చదివేవాడు. రాగయుక్తంగా చదవడం ఆయనకు రాదు. ఒకసారి ‘కుమారాస్త్ర విద్యాప్రదర్శనము’ అన్నపాఠం జరుగుతోంది.

నన్నయ్యగారు రచించిన పద్యభాగమది. కురు పాండవ కుమారులు తమ తమ శస్త్రాస్త్ర విద్యలను ప్రదర్శిస్తున్నారు. వారి గురువు ద్రోణాచార్యుల వారు, అవన్నీ వారికి నేర్పిన మహనీయుడు, ఆ ప్రదర్శనమును పర్యవేక్షిస్తున్నాడు. భీష్మాది కురుశ్రేష్ఠులు దానిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఇంతలో రాధాపుత్రుడైన కర్ణుడు కూడా వచ్చి ఆ సమూహములో చేరినాడు. జబ్బచరచి, అంతవరకు అప్రతిహతంగా తన శాస్త్రవిద్యను ప్రదర్శిస్తున్న అర్జునుని సవాలు చేసినాడు.

“ఒరేయ్, బడుద్ధాయిలూ, నన్నయ్య శబ్దశాసనుడు. ఆయన కవిత్వం వ్యాసభారతానికి మక్కికి మక్కీ అనువాదం కాదు. స్వతంత్ర, స్వేచ్ఛానువాదం. ఈ పద్యం వినండి. కర్ణుని గాంచి అక్కడ ఉన్న వారంతా ఎట్లా ఆశ్చర్యపోయినారో అయిన అద్భుతంగా వర్ణిస్తున్నాడు.

శా.

సాలప్రాంశు నిజోజ్జ్వలత్కవచు శశ్వత్కుండలోద్భాసితున్

బాలార్క ప్రతిమున్ శరాసనధరున్ బద్ధోగ్రనిస్త్రింశు శౌ

ర్యాలంకారు సువర్ణ వర్ణు ఘనుఁ గర్ణాఖ్యున్ జగత్కర్ణ పూ

ర్ణాలోలద్గుణుఁ జూచి చూపఱు ప్రభూతాశ్చర్యు లై రచ్చటన్

రంగారెడ్డి సారు కావ్యాలు బాగా చదువుకున్నవాడు. ఇంకా ఇలా చెప్పాడు

“వెధవలూ, చూశారా ఎలా నడిపించాడో పద్యాన్ని?” ఆయన పిల్లలను తిట్లతోనే సంబోధిస్తాడు. కానీ అవన్నీ వారి పట్ల వాత్సల్య భావాన్నే పలుకుతాయి. పిల్లలతో కూడా అవి వీనుల విందుగానే ఉంటాయి. గురువుల తిట్లు దీవెనలే కదా! ఆయన ఆడపిల్లలను మాత్రం, ‘అమ్మణ్ణి, బంగారుతల్లి ‘ అని పిలుస్తాడు. పైగా, మగవెధవల కంటే ఆడపిల్లలే బాగా చదువుకుంటారని ఆయన నిశ్చితాభిప్రాయం.

“సాలప్రాంశుడట కర్ణుడు. అంటే సాలవృక్షం వలె ఎత్తైన వాడు. కవచ కుండలాలు సహజంగా ఆయన శరీరంలో ఏర్పడి, ప్రకాశిస్తున్నాయి. శౌర్యమే అతని అలంకారమంటున్నాడు ఆదికవి. బాహ్యమైన ఆభరణాలు కాదురా అలంకారాలంటే! సద్గుణాలు అన్నీ అలంకారాలే. కర్ణుడు రాజవంశీయుడు కాదు. కాని శౌర్యం అతనికి అలంకారం. మీకు నిన్న చెప్పినాను. ప్రసన్నత, అక్షరరమ్యత, నన్నయ్య ప్రత్యేకత. చివరి రెండు పాదాలలో వృత్యానుప్రాసాలంకారం ఉంది. గమనించండి. దాని లక్షణాలు మీకు చెప్పాను కదా!”

“చెప్పినారు సార్!” అనరిచారు పిల్లలందరు.

“ఈ ‘సాలప్రాంశు’ అన్నపదం ఎక్కడో చదివినానబ్బా..” అంటూ ఆలోచించసాగాడు తెలుగు సారు.

వైనతేయ తీచి నిలబడినాడు. “ఏమిరా? “అనడిగినాడు సారు.

“రఘు వంశ కావ్యముతో దిలీప చక్రవర్తిని వర్ణిస్తూ, కాళిదాసులవారు చెప్పిన శ్లోకంలో కూడా ఇది ఉంది సార్” అన్నాడు వాడు. రంగారెడ్డి సారు నివ్వెరబోయినాడు. వాడు బాగా పాడతాడని, హరికథలు చెబుతాడని సారు విని ఉన్నాడు. కానీ సంస్కృత సాహిత్యంలో కూడ వాడికి ఇంత అభినివేశమున్నదని ఆయనకు తెలియదు.

“ఇట్లా రా నాయనా!” అని పిలిచాడు

“ఏదీ, ఆ శ్లోకం నీకు వచ్చునా? చెప్పు చూద్దాము.”

వైనతేయ సారుకు నమస్కరించి, ఖరహరప్రియ రాగంలో శ్లోకాన్ని పాడాడు శ్రావ్యంగా.

“వ్యూఢో రస్కః వృషస్కంధః సాలప్రాంశుర్మహాభుజః

ఆత్మ కర్మక్షమం దేహం క్షాత్రో ధర్మ ఇవాశ్రితః”

“శభాష్ రా! సరే గాని ఈ శ్లోకం నీకెట్లా తెలుసును?”

“తిరుపతిలో నేను హరికథ కోర్సు చేస్తున్నపుడు సింహచల శాస్త్రి గారు చెప్పారండి” అన్నాడు వాడు వినయంగా.

“మహాపండితుడాయన” అన్నాడు సారు చేతులు జోడించి.

“ఈ పద్యానికి ప్రతిపదార్థ తాత్పర్యములు చెబుతాను రాసుకోండిరా.” అని నోట్సు చెప్పసాగాడు.”ఇది పరీక్షలో ఇస్తారు. నేర్చుకొని నాకు రేపు ఒప్పచెప్పాలి. ఇందులో చక్కని ఔచిత్యమున్నవిశేషణం ఒకటి ఉంది.. ఏదో చెప్పగలరా?”

ఒక అమ్మాయి లేచింది. “చెప్పవే చిట్టితల్లీ” అన్నాడాయన.

“నిభోజ్వలత్కవచు సార్!”

“కాదు, అది కాదు. కూచో!’

వైనతేయ లేచాడు. “బాలార్క ప్రతిమున్ సార్” అన్నాడు. సారు ముఖం ప్రసన్నమైంది. “వెరీ గుడ్” అన్నాడు. “అందులో ఔచిత్యం ఏదో చెప్పు మరి.”

“కర్ణుడు సూర్యుని కుమారుడు కదండి. అతన్ని బాలార్క అనడంలో..”

“ఒరేయ్, నీవు అసాధ్యుడిలా ఉన్నావే! ఆయుష్మాన్ భవ!” అని దీవించాడు సారు.

మర్నాడు ఆ పద్యాన్ని చాలామంది పిల్లలు అప్పచెప్పారు. కాని, వైనతేయ దాన్ని మధ్యమావతి రాగంలో, సమాసాలను అర్థవంతంగా విరుస్తూ, పాడాడు.

పిల్లలు ఆనందంతో చప్పట్లు కొట్టారు! అసూయ లెరుగని వయసు అది. అప్రయత్నంగా రంగారెడ్డి సారు కూడా చప్పట్లు కొట్టాడు. వైనతేయ దగ్గరికి వెళ్లి, వాడిని అక్కున చేర్చుకుని, తల నిమిరాడు.

“నాయనా, ఎంత కళ ఉందిరా నీలో! రేపటి నుంచి రోజూ మన క్లాసులో, మన టెక్స్ బుక్ లోని ఒక పద్యాన్ని నీవు పాడి వినిపించాలి. సరేనా?”

“మీ ఆశీస్సులతో, తప్పకుండా సార్!” అన్నాడు వాడు. వంగి సారు కాళ్లకు నమస్కరించాడు. ఆ గురువర్యుని డెందమానంద బంధురమైంది. వాడు ఆయనకు ప్రియ శిష్యుడైనాడు.

***

కాలం కదం తొక్కుతూ సాగుతుంది. వైనతేయ ఇంటర్మీడియట్ పూర్తయింది. డెబై మూడు శాతం వచ్చింది. కోనేటయ్య దంపతులు దస్తగిరిసారు అప్పు తీర్చేసినారు. ఆర్థికంగా కొంత నిలదొక్కుకున్నారు కూడా.

వైనతేయను దిగ్రీలో చేర్పించాలి. దస్తగిరిసారు వాడితో ఇలా అన్నాడు.

“ఒరేయ్ వైనా, నంద్యాలలో డిగ్రీ కాలేజి ఉంది కాని, నీవు గ్రూపులో స్పెషల్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం తీసుకోవాలి. దాని వల్ల ఆ రెండు భాషల్లో ఇంకా పట్టు వస్తుంది. కడప ఆర్ట్స్ కాలేజీలో అవి ఉన్నాయని తెలుసుకొన్నాను. అక్కడ చేర్పిస్తా నిన్ను. పైగా అక్కడ పండితులు, సాహితీవేత్తలు ఉన్నారు. సి.పి. బ్రౌన్ గ్రంథాలయం ఉంది. తిరుపతి అక్కడికి దగ్గర.”

సంతోషంగా ఒప్పుకొన్నాడు వైనతేయ. వాడి అమ్మనాన్న, వాడు మళ్లీ తమకు దూరంగా వెళ్లిపోతాడని సంకోచించినా, దస్తగిరి సారు మాట వారికి వేదవాక్కు.

“కడప ఎంత దూరం తిరుపాలమ్మా! గట్టిగా 3 గంటల ప్రయాణం. వాడు సెలవుల్లో వచ్చి పోతుంటాడులే” అన్నాడు సారు.

ఇద్దరూ వెళ్లి, అప్లికేషన్ ఫారం, అన్నీ నింపి సబ్మిట్ చేశారు. కడప ఆర్ట్స్ కళాశాల భవనం చాలా పురాతనమైంది. దానిని 1948లో నిర్మించారు. చాలా కళాత్మకంగా ఉంటుంది. చాలా పెద్ద కాలేజి. యాభైమంది లెక్చరర్లు, పదిహేను వందల మంది విద్యార్థులు, NSS, NCC యునిట్లు ఉన్నాయి.

కలెక్టరేట్ భవనానికి దగ్గరలోనే ఉంటుంది కాలేజి. బి.ఎ. కోర్సులో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం తీసుకున్నాడు. ఇంగ్లీషు సరే కంపల్సరీ. ఇక మూడు గ్రూపు ఆప్షనల్స్ లో ఒక ప్రత్యేకమైన కాంబినేషన్ దస్తగిరిసారును ఆకర్షించింది. అది, సోషియాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు లిటరేచర్. ‘ఇదీ మనోడికి కరెక్ట్ సరిపోయేది!’ అనుకున్నాడాయన. “ఒరేయ్, దీని వల్ల, నీవు ఇంగ్లీష్ టీచరు కావచ్చు, లేదా తెలుగు పండిట్ కావచ్చు. సంస్కృతం ఉండనే ఉంది. ఏమంటావు?”

“అట్లనే సార్!” అన్నాడు వాడు.

ఆర్ట్స్ కాలేజికి అనుబంధంగా హాస్టల్ కూడా ఉంది. వైనతేయ యస్.టి. కాబట్టి ఫీజు కట్టనవసరం లేదు. కాలేజి ఫీజులో కూడా బాగా తగ్గింపు వచ్చింది.

హస్టల్లో బి.ఎ. విద్యార్థులు ముగ్గురికి ఒక రూము ఇచ్చారు. ఒకడు హరికిషన్. రెండవవాడు సుబ్బారెడ్డి. నడవా చివర కామన్ బాత్‌రూములు, టాయిలెట్లు వాష్ బేసిన్లు ఉన్నాయి. భోజనం మాత్రం బాగాలేదు. కానీ తప్పదు.

అన్ని క్లాసుల్లో విద్యార్థులు చాలామంది ఉన్నారు. కాని, ఈ లిటరేచర్ గ్రూపులో కేవలం ఇరవై రెండు మంది మాత్రమే చేరారు. ఫస్ట్ లాంగ్వేజ్ లాగా కాకుండా, గ్రూప్ లాంగ్వేజ్ సిలబస్ చాలా ఎక్కువగా ఉంది. పుస్తకాలన్నీ కొనుక్కున్నాడు. కాసులు ప్రారంభమైనాయి.

సంస్కృతం లెక్చరర్ కిళాంబి నరసింహాచార్యులు గారు. ఇంగ్లీష్, ఇంగ్లీష్ లిటరేచర్ డేవిడ్ రాజు గారు చెప్పేవారు. ఇక తెలుగు లిటరేచర్‌కు అలమేలు మంగ గారు వచ్చేవారు.

త్వరలోనే గురువులందరికీ ప్రియశిష్యుడైనాడు వైనతేయ. ప్రతి పదిహేను రోజుల కొకసారి, సెకండ్ సాటర్ డే, సండే లలో నంద్యాలకు వచ్చి తల్లిదండ్రులను, బేతంచెర్లకు వచ్చి, దస్తగిరిసారును చూసి వెళ్లేవాడు.

కడపలో సాహిత్య సభలు, హరికథలు, అష్టావధానాలు, విరివిగా జరుగుతాయి. గొప్ప గొప్ప పండితులు పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, మోచంపేటలోని రామకృష్ణ కళాశాలలో తెలుగు ఆచార్యులుగా పనిచేసేవారు. ‘సరస్వతీపుత్ర’ బిరుదాంకితులు. ఆయన ‘శివ తాండవం’ అనే ద్విపద కావ్యం ప్రసిద్ధం.

ఇక జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు. ఆయనను ‘బ్రౌన్ శాస్త్రి’ గారంటారు. సి.పి. బ్రౌన్ గ్రంథాలయం, కడప అభివృద్ధికి ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. ఆయన శతాధిక గ్రంథకర్త.

ఒకసారి కడప టౌన్ హాల్ నరాల రామిరెడ్డిగారి అష్టావధానం జరిగింది. వైనతేయ వెళ్లాడు. కందుల ఓబుల్రెడ్డిగారు ముఖ్య అతిథి. విద్వాన్ విశ్యం గారు, ఉటుకూరి లక్ష్మీకాంతమ్మగారు, గౌరిపెద్ది రామసుబ్బవర్మగారు, కొలకలూరి ఇనాక్ గారు లాంటి సాహితీ దిగ్గజాలు పృచ్చకులు సభ ప్రారంభమైంది. నరాలరామ రెడ్డిగారు మహాపండితుడు. ఆశువుగా పద్యాలను అలవోకగా చెప్పేస్తుంటే వైనతేయ మనసు పులకరించింది.

పుట్టపర్తి వారి ‘శివతాండవము’ సి.పి. బ్రౌన్ గ్రంథాలయంలో చదువుకున్నాడు.

“ఆడెనమ్మా శివుడు/పాడెనమ్మా భవుడు’ అన్న పల్లవితో సాగుతుందా ద్విపదకావ్యం.

ఫ్రెషర్స్ డే నాడు కల్చరల్ ప్రోగ్రాంలో తన పేరు ఇచ్చాడు వైనతేయ. పుట్టపర్తి వారి ‘శివ తాండవం’ లోని కొన్ని అద్భుత చరణాలను తీసుకొని, రాగయుక్తంగా అభినయిస్తానని, తెలుగు మేడమ్ అలమేలు మంగమ్మగారి చెప్పాడు. అమె సరేనంది.

ఆ రోజు పంచె కట్టుకోని, నడుముకు దట్టి బిగించి, నుదుట విభూతి రేఖలు, మధ్యలో కుంకుమ ధరించి, ఆచార్యుల వారి రచనను వైనతేయ రిథమిక్‌గా పాడుతూ అభినయిస్తుంటే, వీక్షకులు అద్భుతంగా ఉందన్నారు.

“మొలక మీసపుఁ గట్టు, ముద్దు చందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుఁగు వెన్నెల పట్టు
నెన్నడుమునకు చుట్టు, క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు, గురియు మంటల రట్టు”

“యెక్కడను దననాట్యమే మాఱు మ్రోయంగ
దానె తాండవమౌనొ! తాండవమె దానౌనొ!
యేనిర్ణయము దనకె బూనిచేయగరాక
దామఱచి, మఱపించి తన్ను జేరినవారి”

పుట్టపర్తివారి భావ సౌకుమార్యాన్ని అర్థవంతంగా వైనతేయ పాడుతూ నర్తిస్తుంటే సభికులు ముగ్ధులైనారు. ఆ రోజే కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర రెడ్డి గారి దృష్టిలో పడినాడు.

చూస్తుండగానే మొదటి సంవత్సరం పూర్తయింది. రెండవ సంవత్సరంలో ఉండగా ఒక ప్రకటన చూశాడు.

‘అగస్త్యేశ్వర స్వామి వారి దేవస్థానం, ప్రొద్దుటూరు. హరికథా సప్తాహం. స్వామివారి ఉత్సవాల సందర్భంగా హరికథా విద్యాంసులు తమ పేరు నమోదు చేయించుకోడానికి చివరి తేదీ …. హరికథకులకు వసతి, భోజనం సమకూర్చబడును. ఇట్లు దేవాలయ అనువంశిక ధర్మకర్త, శ్రీ వరదరాజులు రెడ్డి గారు.’

కడప నుంచి పొద్దుటారు 48 కిలోమీటర్లు ఉంటుంది. అది వస్త్రవ్యాపారానికి, బంగారం వ్యాపారానికి ప్రసిద్ధి. తెలుగు సినిమాల నిర్మాతలకు అప్పులిచ్చే ఫైనాన్సర్లున్న ఊరది.

కాలేజీ వదిలిన తర్వాత బస్టాండుకు వెళ్లి కడప – జమ్మలమడుగు బస్సు ఎక్కాడు. ప్రయివేటు బస్సులు అప్పుడు ఇంకా తిరుగడం లేదు. ఆర్.టి.సి పూర్తిగా అన్ని రూట్లను స్వాధీనం చేసుకుంది. ఇంటర్ స్టేట్ పర్మిట్ ఉన్నవి మాత్రం తిరుగుతున్నాయి.

ఖాజీపేట, మైదుకూరు వరకు కర్నూలు హైవే. అక్కడ నుంచి ఎడమకు తిరగాలి. 16 కి.మీ ఉంటుంది ప్రొద్దుటూరు. బస్సు దిగి అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి వెళ్లాడు. దాన్ని స్థానికులు ‘శివాలయం’ అని వ్యవహరిస్తారు.

వాణిజ్య కేంద్రం ప్రొద్దుటూరు. రోడ్లు వెడల్పుగా లేవు. బంగారం పాపులు, బట్టల షాపులు వరుసగా ఉన్నాయి. శివాలయం రోడ్డుకు ఎడం వైపు వెళితే ‘రాజబాట వీధి’ వస్తుంది. అది పట్టుమని పదడుగుల వెడల్పు కూడా లేదు!

అగస్త్యేశ్వరాలయం చాలా పెద్దది. ఊరు నడిబొడ్డున ఉంది. ఒక మంటపం దగ్గర ఒకాయన కూర్చుని, హరికథా సప్తాహంలో పాల్గొనే వారి పేర్లు నమోదు చేసుకుంటున్నాడు. వెళ్లి ఆయనకు నమస్కరించాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version