[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]
[మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో ‘భక్త ప్రహ్లాద’ కథాగానం, పద్యాలతో గొప్పగా చేస్తాడు వైనతేయ. భజన బృందం సభ్యులు అబ్బురపడతారు. వైనతేయని మెచ్చుకుంటారు. భక్తులు వరుసగా నిలబడి బాలహరిదాసుకు సంభావన చదివించి, పాదాలకు నమస్కరిస్తారు. మొత్తం రెండు వందల నలభై రూపాయలు వస్తాయి. కొందరు దస్తగిరిసారు బేతంచెర్లలో ఎక్కడ ఉంటాడో కనుక్కున్నారు. మర్నాడు ఉదయం బయల్దేరి, బేతంచర్లకు చేరుకుంటారు. ఒకరోజున యానాదుల దిబ్బలో తమ ఇంటి పరిస్థితిని దస్తగిరిసారుకు వివరిస్తాడు వైనతేయ. జొన్నల సంచులు బలవంతంగా లాక్కుపోయిన విషయం చెప్తాడు. రెడ్డి అసలు ఆలోచన ఆ పొలం దక్కించుకోవాలనే, అని తాను ఎప్పుడో చెప్పాను గదా అని అంటాడు సారు. వైనతేయని నంద్యాలలోని కాలేజీలో చేర్చి, కోనేటయ్యనీ, తిరుపాలమ్మను కూడా తీసుకువచ్చేద్దామని అంటాడు దస్తగిరిసారు. ముందుగా పెదరెడ్ది బాకీ తీర్చేయాలనీ అందుకు, తాను ప్రావిడెంట్ ఫండ్ మీద లోను తీసుకుంటానీ చెప్తాడు. మర్నాడు ఉదయం నంద్యాలలోని సారు తమ్ముడు ఉస్మాన్ వలీ ఇంటికి వెళ్తారు గురుశిష్యులు. అన్నని చూసి సంతోషిస్తాడు తమ్ముడు. ఉస్మాన్ వలీ, అతని భార్య దస్తగిరిని, వైనతేయను ఆదరంగా ఆహ్వానిస్తారు. వైనతేయని ఇక్కడ ఇంటర్మీడియట్లో చేర్పించాలంటూ, వారి వివరాలన్నీ తమ్ముడికి చెప్తాడు సారు. వలీకి తెలిసిన సివిక్స్ లెక్చరర్ అశ్వత్థ నారాయణ గారిని కలుస్తారు. వైనతేయని ఆర్ట్స్ గ్రూపులో చేర్పించడంలో సాయం కోరుతారు. వైనతేయ యానాదుల కుర్రాడనీ, హరికథలు చెప్తాడని విన్న ఆయన ఒక పద్యం పాడించుకుని విని సంతోషిస్తారు. పిల్లవాడి అడ్మిషన్ తాను చూసుకుంటానని చెప్తారు. నూనేపల్లిలో ‘నవనంది విలాస్’ అనే హోటల్లో కోనేటయ్యకు, తిరుపాలమ్మకు ఉద్యోగాలిప్పిస్తాడు ఉస్మాన్ వలీ. రైల్వే స్టేషన్ వెనుక కాలనీలో ఇల్లు చూసుకోమని చెప్తాడు. గురుశిష్యులిద్దరూ బస్సులో బేతంచెర్ల చేరుకుంటారు. సారుకు పి.ఫ్. లోను పదివేలు శాంక్షన్ అవుతుంది. ఆ డబ్బు తీసుకుని గురుశిష్యులు యానాదుల దిబ్బ చేరుకుంటారు. – ఇక చదవండి.]
కోనేటయ్య, తిరుపాలమ్మలకు విషయమంతా వివరించాడు దస్తగిరిసారు. నంద్యాల లోనే మీ ఇద్దరికి గౌరవప్రదమైన పని దొరికిందనీ, కోనేటయ్యకు నెలకు నాలుగు వేల ఐదువందలు, తిరుపాలమ్మకు రెండు వేలు జీతమనీ చెప్పాడు. వాళ్లూ కొడుకు కూడా నంద్యాలలోనే కాలేజీలో చేరతాడనీ, వాళ్ల దగ్గర ఉండి చదువుకుంటాడనీ చెప్పాడు.
వాళ్ళిద్దరి ఆనందం చెప్పనలవి కాదు. ఆ రోజు రాత్రి తిరుపాలమ్మ రాగి సంకటి, ఉల్లిపాయల పులుసు చేసింది. సారు, భోజనాలయిన తర్వాత, వాళ్లను కూర్చోబెట్టి, ఇలా చెప్పాడు.
“రేపు ఉదయం అందరం కోటకొండకు బోయి పెదరెడ్డి బాకీ తీర్చేద్దాం. ఏమయినా కాయితం, బాండ్ పేపరు రాయిచ్చుకున్నాడా రెడ్డి?”
“లేదు సారు. నోటి మాట తోనే!”
దస్తగిరిసారుకు హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర, చక్రవర్తి కాలకౌశికునితో అన్న మాటలు గుర్తుకువచ్చాయి. కాలకౌశికుడు “విశ్వామిత్రునికి నీవు రుణపడినట్లు సాక్ష్యములు గానీ, పత్రములుగానీ లేవా?” అని అడుగుతాడు. లేనప్పుడు ఆ బాకీ ఎగవేయవచ్చుకదా! అని ఆయన ఉద్దేశం.
దానికి ఆ సత్యసంధుని జవాబు ఇది – “మా ఇరువురి అంతఃకరణములే పత్రములు! మా చిత్తవృత్తులే సాక్ష్యములు!”
“అయితే మనం డబ్బు పూర్తిగా చెల్లించినట్లు ఆయన దగ్గర ఒక కాయితం రాయించుకోవాల” అన్నాడు సారు.
“ఇస్తాడా? కోపం తెచ్చుకుంటాడేమో?” అన్నాడు కోనేటయ్య. తరతరాలుగా అణగిమణిగి ఉన్న బానిసత్వ పోకడలు ఆయనలో ఇంకా పోలేదు.
దస్తగిరిసారు నవ్వాడు. “నీవింకా సత్యకాలంలోనే ఉన్నావు. రాసిచ్చి తీరాల. లేకపోతే, రేపు పొద్దున (future) నాకు ఇవ్వలేదంటే? మీ ఊర్లో మీ బంధువులో, లేదా ఇద్దరు పెద్దమనుషులను కూడా తీసుకుపోదాం. సాక్షి సంతకం నేను చేస్తాను. గవర్నమెంటు ఉద్యోగిని కదా!”
యానాదుల దిబ్బలో, కోనేటయ్య మేనమామ రామాంజులు, ఇంకో రైతు సహదేవుడు, వారితో రావడానికి అంగీకరించారు.
అందరూ కోటకొండకు చేరుకున్నారు. శేషశయనారెడ్డి వీళ్లందరినీ బొమలు ముడిచాడు. వారపాగు మీద పడక కుర్చీలో కూర్చుని సిజర్స్ సిగరెట్ తాగుతున్నాడు.
“ఏమిరా కోనేటి? ఇంతమందిని ఎంటేసుకొస్తివి?” అన్నాడు.
దస్తగిరిసారు ఆయనకు నమస్కరించి, “పెదరెడ్డిగారు, కోనేటయ్యకు, వాళ్ల బిడ్డ పెండ్లి కోసరము మీరు దయతో ఇచ్చిన బాకీ తీరుద్దామని వచ్చినాడు. వాండ్లు ఊరిడిసిపెట్టి, బతకనీకె పోతాంతారు. మీరు పెద్దమనసు చేసుకొని వాండ్లకు అనుమతినియ్యాల”.
రెడ్డి కొంచెం ప్రసన్నుడైనాడు. కాని బింకంగా
“ఏం, ఇప్పుడు నా కాడ వానికి ముడ్డి కింద ముండ్లు గుచ్చుకుంటుండాటాయా? ఏం తీపరమయినాది?” అన్నాడు
కోనేటయ్య చేతులు జోడించి, “రొడ్డీ! ఇంతవరకు నీవే గదా నాకు అన్నం బెట్టింది? కొడుకును సదివించుకోవాల! అంతేగాని, ఇంకే ఆలోశన లేదు”
“అయితే నీ చేను నాకమ్ము. రెండెకరాలకు ఇరవై వేలిస్తా. నీ బాకీ పోను, మిగతాది తీస్కపో.”
తిరుపాలమ్మ అనింది “వద్దులే రెడ్డి! నాలుగు జొన్నగింజలన్నా వస్తాయి, అదుంటే.”
“మరి దాన్నేం చేస్తారు?”
“నేను గుత్తకు చేస్తాను మారాజా!” అన్నాడు రామాంజులు.
“వడ్డీతో కలిపి ఎనిమిది వేల చిల్లరయినాది. తెచ్చినా రా మరి?”
“నెలనెలా ఇన్నూరు రూపాయలు పట్టుకుంటూనే ఉంటివి గద! ఐదేండ్ల బట్టి? గిత్తను తోలిచ్చుకుంటివి! దాని మాట ఎత్తవు!”
“అదిపోనేరా నేను చెప్పేది! నీ ముష్టి దుడ్డు నా కెందుకురా? నా సిగరెట్ల కర్చంత ఉండదు నీ బాకీ!”
దస్తగిరి సారన్నాడు. “ఐదేండ్లకు జీతంలో మినహాయించుకున్నది పన్నెండు వేలాయె కద సామి! బీదోండ్లు! నీవన్నట్లు, నీ సిగరెట్ల కర్చుకు కూడా తూగదు బాకీ! ఎంతో కొంత తగ్గించి, దయ చూపండి” వినయంగానే చెప్పినా, దస్తగిరిసారు మాటల్లో వ్యవహారం నిక్కచ్చిగా ధ్వనించింది.
“అయితే ఎంతిస్తారు, మీరే చెప్పండి” అన్నాడు రెడ్డి.
“వడ్డే మాఫీ చేయండి. ఆ ఐదు వేలు అసలు ఇస్తాడు. మీ పేరు చెప్పుకుని బతుకుతాడు. నీ దగ్గర పని చేసినోడు బాగుపడితే నీకూ గౌరవమే కదా దేవరా?” అన్నాడు సహదేవుడు. అతడు ప్యాపిలి ‘అంబేద్కర్ యువజన సంఘం’లో సభ్యుడు. రెడ్డికి ఆ విషయం తెలుసు.
“సరే! కానివ్వండి! ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఔనంటాండాను.”
దస్తగిరి సారు నూరు రూపాయల నోట్లు ఎంచి మొత్తం ఐదు వేలు కోనేటయ్య కిచ్చినాడు. ఆయన అవి రెడ్డి చేతిలో పెట్టి కాళ్లు మొక్కినాడు. రెడ్డికి ఆహం శాంతించింది!
దుర్మార్గులను ‘సామ’మనే ఉపాయంతోనే దారికి తెచ్చుకోవాలన్న సత్యం దస్తగిరిసారుకు తెలుసు. రెడ్డి, రెడ్డమ్మను పిలిచి ఆ డబ్బు ఆమెకిచ్చినాడు.
“దయ ఉంచి, డబ్బు ముట్టినట్టు, బాకీ తీరినట్లు ఒక కాయితం ఇవ్వండి రెడ్డిగారు!” అన్నాడు దస్తగిరిసారు.
“ఏం, నా మీద నమ్మకం లేదా?” అని హుంకరించాడాయన.
“పెద్దోండ్లు! మీ మాట మీద మాకు నమ్మకం లేకపోతే, మేం మనగలమా! ఏదో శాస్త్రానికి..” అన్నాడు రామాంజులు
“రేప్పొద్దున్న యాదన్నా అవసరం బడితే, మల్లా నీ దగ్గరికే కద రావాల్సింది, మా కోనేటన్న” అన్నాడు సహదేవుడు.
దస్తగిరిసారు ఒక కాయితం తీసినాడు. దాని మీద ‘చెల్లుచీటి’ అని పైన రాసి ఉంది. క్రింద రూపాయ రెవెన్యూ స్టాంపు అతికించి ఉంది. కోనేటయ్య, పూర్తిగా శేషశయనారెడ్డి బాకీ, వడ్డీతో సహా చెల్లించినట్లు రాసి ఉంది. ఎడమపక్క సాక్షి సంతకాలు.
అయిష్టంగానే పెదరెడ్డి స్టాంపు మీద సంతకం చేశాడు. సాక్షి సంతకం దస్తగిరి సారు చేశాడు. రామా౦జులు, సహదేవుడు ‘నిశాని’లు వీశారు.
అందరూ రెడ్డికి నమస్కరించారు. రెడ్డెమ్మ లోపల్నించి ఒక చీర, పంచె కొత్తవి ఒక తట్టలో పెట్టుకొని వచ్చింది. తమలపాకులు, వక్కలు, రెండు చీనీ (బత్తాయి) పండ్లతో సహా అవి కోనేటయ్య దంపతులకిచ్చింది.
“ఇన్నేండ్లుగా మా ఇంట్లో రుచిగా వంటలు చేసినాడు. హాయిగా బతకండి” అన్నదామె. ఇద్దరూ ఆమెక మొక్కినారు.
సెలవు తీసుకొని అందరూ వచ్చేసినారు.
***
యనాదుల దిబ్బకు వచ్చింతర్వాత సారు చెప్పాడిలా “కాయితం నా దగ్గరే భద్రపరుస్తాను. మీ ఇద్దరు బేతంచెర్లకు వచ్చేయండి.”
రామాంజులు అన్నాడు “నీ చేను గురించి ఎదారు లేదు లేరా! నేను చూసుకుంటాను. పండితే గుత్త దుడ్డిస్తా. ఎండితే మొండి చేయి చూపిస్తా.”
అందరూ నవ్వారు!
“పంట పండకపోతే నీవేం చేస్తావులే మామా!” అన్నాడు కోనేటయ్య.
“ముందుగా నేను, వైనా గాడు నంద్యాలలో మీకు రైలు స్టేషను ఎనక కోట్ల విజయభాస్కర రెడ్డి కాలనీలో ఒక యిల్లు ఋడుకుతాము (వెదకడం). దొరుకుతూనే ఆడ కాపురం మొదలు పెడుదురు.” అన్నాడు సారు.
“ఆడ మీ సంసారం కుదురుకునే వరకు ఈ మిగిలిన ఐదువేలు కూడ మీ దగ్గరే పెట్టుకోండి. నంద్యాల పెద్ద టవును. శానా కర్చులుంటాయి. స్తిమితపడినాక నాకు నెలనెలా ఐదు నూర్లు ఇయ్యంది. ఇరవైనెలల్లో తీరిపోతాది.”
‘పరోపకారం అనే భావమునకు రూపం వస్తే అది దస్తగిరిసారు మాదిరి ఉంటాది’ అనుకున్నాడు వైనతేయ.
కోనేటయ్య బోరున ఏడుస్తూ సారు కాళ్ల మీద పడినాడు. “మా పాలిటి దేవునివి సారు నీవు! సాచ్చాత్తు ఆ మద్దిలేటయ్యవే” అన్నాడు.
వైనతేయకు కూడా దుఃఖం వచ్చింది. వెళ్లి సారు అక్కున చేరాడు. తిరుపాలమ్మ అందరికీ వరన్నం, కోడిగుడ్ల పులుసు, మామిడికాయ పప్పు చేసింది. ఆ సాయంత్రమే గురుశిష్యులు బేతంచెర్ల చేరుకున్నారు.
రెండు రోజుల తర్వాత ఇద్దరూ నంద్యాలకు పోయినారు. సారు తమ్ముడు ఉస్మాన్ వలీ, రైల్వే స్టేషను వెనుక కోట్ల విజయభాస్కర రెడ్డి కాలనీలో రెండు మూడు ఇండ్లు చూసి పెట్టినాడు. అది కొంచెం బీదవారుండే ఏరియా. అలా అని మురికివాడ కాదు.
ఒక ఇల్లు బాగానే ఉందనిపించింది. గోడలు ఇటుకలతో లేపి, పైకప్పు మీద యాజ్ బెస్టాజ్ రేకులు దింపారు, ఏటవాలుగా. వీధిలోకే వాకిలి. పెద్ద రూము. ఒక వైపు ఐదడుగుల గోడగట్టి వండుకోవడానికి వదిలినారు. వెనక కొంచెం స్థలం అంతే. ఒక వైపు బచ్చలిల్లు (బాత్ రూమ్) ఒక వైపు కక్కసు దొడ్డి. బాడుగ ఎనిమిది నూర్లు. కరెంటు చార్జి యాభై. వీధిలోనే బోరింగు ఉంది. మునిసిపాలిటీ వారి మంచి నీటి కుళాయి ఉంది. గోడలకు లోపలివైపున సిమెంట్ ప్లాస్టరింగ్ చేసినారు గాని, బయట వదిలేసినారు.
“ఏమి రా వైనా, ఇల్లు బాగుందా?” అనడిగాడు సారు.
“శానా బాగుంది సార్!” అన్నాడు వాడు. వాడికి యానాదుల దిబ్బలో తమ ఇల్లు గుర్తొచ్చింది. అది ఒకటిన్నర అంకణాల మట్టి మిద్దె. పెద్ద వర్షం వస్తే పైన బుంగలు (పైకప్పు పై గుంతలు) పడి కారుతుంది. ప్రతి సంవత్సరం మిద్దె మీద చవిటి మన్ను తోలిస్తుండాల. ఏమంటే అది సొంత యిల్లు. దానితో పోలిస్తే ఇది మంచిదే. వాడుక నీళ్లు, తాగే నీళ్లు దగ్గర. నాయనకు సైకిలుంది. నూనేపల్లె హోటలుకు పోయిరావచ్చు.
“బేతంచెర్లకు నీ దగ్గరికి వచ్చిపోవడానికి స్టేషను దగ్గర సార్” అన్నాడు వాడు సంతోషంగా.
దస్తగిరి సారు నవ్వాడు. “అదా నీ దృష్టిలో బాగుండడమంటే! తిక్కవెధవ!” అని తిట్టాడు. ఆ తిట్టులో ఆయనకు వాడి మీద గల ప్రేమ అంతా ప్రతిబింబించింది.
ఒక నెల సంచకారం (అడ్వాన్సు) ఇచ్చినారు ఓనరుకు. ఆయన నంద్యాల స్టేషనులో స్టాలు నడుపుతాడట. వాండ్లది బలపనూరు. నంద్యాలకు పాణ్యానికి మధ్యన.
నాలుగు రోజుల్లో ఉన్న సామాను తీసుకొని కోనేటయ్య, తిరుపాలమ్మ వచ్చేసినారు. ప్యాపిలి నుంచి బనగానిపల్లెకు ఒక రూటుంది. అక్కడికి బస్సులో వచ్చి, అక్కడ నుంచి నంద్యాలకు చేరుకున్నారు. నంద్యాల కడప హైవేలో ‘బొమ్మల సత్రం’ అన్న చోట దిగాలని కార్డు రాసి ఉన్నాడు నాయనకు వైనతేయ.
వాల్లు బస్సు దిగేటప్పటికి దస్తగిరిసారు, వాడు ‘బొమ్మలసత్రం’ దగ్గర కాచుకొని ఉన్నారు. మూడు రిక్షాలలో సామానంతా ఇంటికి చేర్చినారు. యానాదుల దిబ్బ లోని తమ యింటిని సాదేవునికిచ్చినామని చెప్పినారు. బాడుగ ఏమీ లేదు! చేను రామాంజులు మామ గుత్తకు తీసుకొన్నాడు. పంట పండితే రెండు బస్తాల జొన్నలుగాని, రెండు బస్తాల బుడ్డలు (వేరుశనగ) గాని, పది కుంచాల కందులు గాని యిస్తాడు.
ఆ రోజు మద్యాన్నం వంట చేయడం కుదరదు. పైగా కట్టెల పొయ్యి వాడకూడదంట. కిరసనాయిలు స్టవ్వు, బొగ్గుల పొయ్యి, పొట్టు పొయ్యి లాంటివయితే పరవాలేదు అట. బొమ్మలసత్రం ఒక సెంటరు. ఎడమకు పోతే నంద్యాల టౌన్ వస్తుంది. నేరుగా పోతే నూనెపల్లె, ఆళ్లగడ్డ. ఇటువైపు పాణ్యం, కర్నూలు.
అక్కడ ఒక కొట్టం హోటలుంది. దాంట్లో అందరికీ భోజనం పెట్టించాడు దస్తగిరిసారు. సాయంత్రం బజారుకు పోయి – ఒక కిరసనాయిలు స్టవ్వు, ఒక బొగ్గుల పొయ్యి, ఒక బస్తా బొగ్గులు, ఐదు లీటర్ల కిరసనాయిలు, ఇంకా కొన్ని పాత్ర సామాన్లు, కిరాణా సామాన్లు రిక్షాలో తెచ్చారు గురుశిష్యులు. రేషన్ కార్డు నంద్యాలకు మార్పించాల.
మిగిలిన నాలుగు వేలు కోనేటయ్యకిచ్చినాడు. నూనేపల్లెలో రాయలసీమ గ్రావీణ బ్యాంకును చూసినాననీ, ఆ డబ్బులు దాంట్లో అకౌంట్ తెరిచి వేసుకొమ్మనీ చెప్పినాడు. తనకు తిరిగి ఇవ్వాలని తొక్కులాడాల్సిన పనిలేదన్నాడు. జాగ్రత్తలు చెప్పి సారు బేతంచెర్లకు వెళ్లిపోయినాడు.
రెండో రోజు మళ్లీ వచ్చి, కోనేటయ్యను, తిరుపాలమ్మను నవనంది విలాస్‌లో చేర్పించినాడు సారు. కోనేటయ్యకు వెయ్యి రూపాయలు ఖర్చులకిచ్చినాడు రామ్ముని గౌడు.
హోటల్ వెనుక రేకుల షెడ్లో కిచెన్ ఉంది. పెద్ద పెద్ద పంపు కిరసిన్ స్టవ్వులున్నాయి. పెద్ద పాత్రలున్నాయి. కోనేటయ్యకి సహాయకుడిగా రవి అనే కుర్రవాడు.
పద కొండు గంటలకల్లా, చికెన్ బిరియానీ, మటన్ బిరియానీ తయారు చేసినాడు కోనేటయ్య. ఘుమఘుమ సువాసనలు హోటలంతా వ్యాపించినాయి.
తిరుపాలమ్మ బల్లలు, కుర్చీలు శుభ్రంగా తుడిచింది. పింగాణీపేట్లు, కప్పులు కడిగింది.
ఇంకో చపాతీ, జొన్నరొట్టె మాస్టరున్నాడు. ఆయన పేరు ఆదికేశవులు. రొట్టెకి మాంసం కూరలు, పప్పు, ఆయనే చేసుకుటాడు. అన్నం, సాంబారు కూడా. నవనంది విలాస్‌లో కేవలం రెండు పూట్ల భోజనం మాత్రమే దొరుకుతుంది. టిఫిన్స్ ఉండవు. సాయంత్రం వైను షాపు ముందు మూకుడు పెట్టి ఒకామె, ఆమె పేరు మహాలక్ష్మమ్మ. మిరపకాయ బజ్జీలు, ఆలూ బోండాలు, అలసంద వడలు వేస్తుంది.
కోనేటయ్య డ్యూటీ కేవలం రెండు రకాల బిర్యానీలు చేయడమే. తిరుపాలమ్మ కాయగూరలు తరిగి ఇవ్వాల. టేబుల్లు కుర్చీలు తుడవాల. గిన్నెలు, ప్లేట్లు కడిగే దానికి ఉగ్రమ్మ అనే ఆమె వేరే ఉంది.
నాలుగు రోజుల్లోనే కోనేటయ్యకు బిర్యానీలు బ్రహ్మాండంగా చేస్తాడని పేరు వచ్చింది. కస్టమర్లు కూడా పెరగసాగారు. “సిన్నాయనా! యా రోజు కూలీ ఆ రోజు ఇస్తునా, నెలాకరున మొత్తం తీసుకుంటావా?” అనడిగాడు రామ్ముని గౌడు.
“నెలనెలా ఇయ్యి కొడుకా” అన్నాడు కోనేటయ్య. శేషశయనా రెడ్డి, ఆయన భార్య, ఎంత బాగా వండినా బాగుందని ఒక్క మాట అనేవారు కాదు. పైగా ఎక్కడ లేని దాష్టీకం!
కాని యజమానే యిక్కడ మర్యాదగా సిన్నాయనా! అని పిలుస్తున్నాడు. రామ్ముని గౌడు సిన్నోడే. దస్తగిరిసారు వయసుంటుంది అనుకున్నాడు కోనేటయ్య. తిరుపాలమ్మను సిన్నమ్మా అనేవాడు గౌడు. వారు తక్కువ కులం వారనే వివక్ష ఏ మాత్రం లేదు. పైగా ‘బిర్యానీ మాస్టరు’ అన్న కొత్త హోదా! పదకొండు కల్లా రెండు బిర్యానీలు పెద్ద పెద్ద డేగిశాలలో దింపేసేవారు భార్యాభర్తలు. కొడుకు పొద్దున్నే ఇంత అన్నం, పప్పో, కూరో వండుకొని తినేసేవాడు. మధ్యాహ్నం హోటల్లోనే వారి భోజనం. వైనతేయకు కూడ తెచ్చేవారు. అలా ఒక గౌరవప్రదమైన, వారికి నచ్చిన ఉపాధి ఏర్పడింది.
(ఇంకా ఉంది)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
You must be logged in to post a comment.
చిరస్మరణీయము హరికథ
పూచే పూల లోన-84
సీత-6
నీలమత పురాణం – 10
ఆ పిచ్చివాడు
ఆచార్యదేవోభవ-39
కరోనా కాలక్షేపం
జబర్దస్త్ శివుడు…
‘తుఖ్ఖాపంచకం’ కవయిత్రి తుఖ్ఖాజి
నిత్యవందనం
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®