Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

‘శ్రీలక్ష్మీనృసింహమాహత్మ్యము’ పద్యకావ్యం ఆవిష్కరణ మహోత్సవము – నివేదిక

30 జూన్ 2025 వ తేదీన, హైదరాబాద్ లోని టి.డి. కాలనీ లోని, శ్రీమదహోబిల మఠములో వెలసియున్న శ్రీలక్ష్మీనృసింహుని సన్నిధిలో ప్రముఖ కవి, బ్రహ్మశ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన పద్యకావ్యము ‘శ్రీలక్ష్మీనృసింహ మాహత్మ్యము’ ఆవిష్కరణ వైభవముగా జరిగినది.

అది అహోబిల మఠాధిపతులు, 46వ జీయరు, His Holiness, శ్రీ శ్రీ శ్రీవణ్ శఠకోప శ్రీరంగనాథ యతీంద్ర వేదాన్త మహాదేశికన్ వారి జన్మదిన పర్వదినం. పైగా వారి సప్తతి ఉత్సవాలు. అహోబిల మఠంలో జూన్ 26 నుండి వైభవంగా జరిగి, 30 న ముగిశాయి. ఈ ఉత్సవాలు శీరంగంలో కూడా జరుగుతున్నాయి.  శ్రీలక్ష్మీనృసింహుని భక్తులు అసంఖ్యాకంగా హాజరై, స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనారు.

గ్రంథమును, అహోబిల మఠాల సమూహం చైర్మన్ శ్రీమాన్ నీలమేఘం గారు తమ సువర్ణహస్తాలతో ఆవిష్కరించినారు. గ్రంథములను మొదట ఒక పట్టు వస్త్రములో చుట్టి, మూల విరాట్టు పాదపద్మముల కడనుంచి, ప్రధానాచార్యులు స్వామివారికి సహస్రనామార్చన గావించినారు. తర్వాత చైర్మన్ గారు గ్రంథమును, మంగళవాయిద్యాలు మ్రోగుతుండగా, వేదపండితుల వేదమంత్రోచ్చారణముల మధ్య, ఆవిష్కరించినారు.

తర్వాత గ్రంథకర్త పాణ్యం దత్తశర్మను చైర్మన్ శ్రీ నీలమేఘంగారు ఘనంగా సత్కరించినారు. స్వామివారు ధరించిన పూమాలను కవితో ధరింపచేసి, పట్టు శాలువా కప్పి, దత్తశర్మ దంపతులకు స్వామివారి ప్రసాదములు అందించి, ఆశీర్వదించినారు. తర్వాత కవి శ్రీ పాణ్యం దత్తశర్మ ప్రసంగించినారు.

ఆయన, తన ప్రసంగములో భక్త్యోద్వేగమునకు లోనైనారు. తాను ఊహ తెలిసిన నాటి నుండి నృసింహోపాసకుని ననియు, ఈ గ్రంథమును స్వామి వారే వ్రాయించుకున్నారని, తాను కర్తను కాదని, హరియే కర్త అని దత్తశర్మ సవినయముగా సభికులకు విన్నవించినారు.

తర్వాత, కవి తన కావ్యములోని పద్యములను శ్రావ్యముగా గానం చేస్తూ వాటిని వివరించినారు. నృసింహావిర్భావ ఘట్టమును దత్తశర్మ వివరిస్తూండగా, సభికులు భక్తిపరవశులైనారు. వారు ప్రసంగం మొదట ఆలపించిన నృసింహ ధ్యాన శ్లోకము భక్తులను విశేషముగా ఆకట్టుకున్నది. నరసింహ ప్రభువు, భాగవతాగ్రేసరుడైన ప్రహ్లాద కుమారుని దగ్గరకు తీసుకొని, లాలించి ఆశీర్వదించగా, ఆ బాలుడు “పరమాత్మా! రక్తంతో తడిసిన నీ నాలుకను చూసి కరాళ దంష్ట్రలను చూసి, నేను అందరివలె భయలేదు స్వామీ! కానీ

తేగీ:
భయము గల్గును సంసార బంధములను
భయము గల్గును కర్మాను భవము వలన
భయము గల్గును షడ్వర్గ భావనములను
అట్టి భయమును తొలగించు ఆదిపురుష!”

అని వేడుకొన్నాడని, కవి ఆలపించగా, సభికులు పులకించిపోయారు.

తర్వాత, ఐ.ఐ.టి. భౌతికశాస్త్ర ఆచార్యులు, శ్రీమాన్ ఆనంద సేతురామన్ గారు కావ్యమును సమీక్షిస్తూ ప్రసంగించినారు. వారు నరసింహ పరబ్రహ్మకు పరమ భక్తులు. వారు మాట్లాడుతూ, పాణ్యం దత్తశర్మగారి పద్య కావ్యం సరళ సుందర భాషలో, సులభశైలిలో, సామాన్య పాఠకులకు సైతం అర్థమయ్యేలా ఉందన్నారు. ప్రబంధ లక్షణాలైన ఇష్టదేవతాస్తుతి, పూర్వకవిస్తుతి, షష్ట్యంతములు, ఆశ్వాసాంత పద్యగద్యములు, ప్రకృతి, ఋతు వర్ణనలనన్నింటినీ కవి మనోహరముగా పాటించినారని కొనియాడారు. ‘తీలావతి స్వప్నము’ అన్న భాగములో, మహావిష్ణువు విప్రుని రూపాన ఆమె కలలోకి వచ్చి, ఆమెకు సుపుత్రోదయమగునని దీవించి, ఆమె మెడలోని తాళిని తెంచుకుపోతాడు. ఆమె శుక్రాచార్యుల వారిని ఈ స్వప్నపు అంతరార్థమును కోరగా ఆయన హిరణ్యకశ్యపుని వధను ఆమెకు చెప్పకుండా, శుభమే జరుగుతుందంటాడు. తర్వాత సేతురామన్ గారు ప్రహ్లాదుడు రాక్షస బాలురకు నారాయణ తత్త్వాన్ని బోధించిన భాగం అత్యుత్తమమైనదన్నారు. చివరగా, శ్రీమాన్ శ్రీనివాసాచార్యులు, అహబిల మఠం మేనేజరుగారు ప్రసంగించి కవి గారి భక్తితత్పరతను కొనియాడారు. కవిగారికి ఛైర్మన్ గారు 10 వేల రూపాయల నగదు పురస్కారాన్నికూడా బహూకరించారు.

“లక్ష్మీనృసింహ మమదేహి కరావలంబమ్!”

గమనిక:

సంచిక వెబ్ పత్రికలో ధారవాహికగా ప్రచురితమవుతున్న ‘శ్రీలక్ష్మీనృసింహమాహత్మ్యము’ పుస్తక రూపంలో వెలువడినందున, ధారావాహికను ముగించాము.

ఈ పుస్తకం కొనుగోలు చేయదలచినవారు ప్రస్తుతానికి హైదరాబాద్ నల్లకుంటలోని అహోబిలమఠం నిర్వాహకులను సంప్రదించవచ్చు.

Exit mobile version