[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘శ్రీకృష్ణదేవరాయలు – ఆముక్తమాల్యద’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది మూడవ, చివరి భాగము.]
రాయలవారి చాపట్లు
ఎసఁగు కట్టా విక్రియ నావి రెగయ బగటి
యెండ యుడుకాఱకుండు భూమండలమునఁ
దొలిచె మాపటఁ బండు వెన్నెల చకోర
పోత వితతికిఁ జాపట్టు వోసినట్టు.. (ఆముక్తమాల్యద)
పగలంతా ఎండ మాడ్చేసింది. సాయంకాలం అయి మసకచీకట్లు కమ్ముకుంటున్నా భూమి వేడి చల్లారలేదు. అంతలో చీకటి ముసురుకుని వెన్నెల వచ్చేసింది అయినా భూమి వేడినే వెలిగక్కుతోంది. ఇది ఎలా ఉందంటే, పెనం మీద చాపట్లు పోసినప్పుడు పెనం ఆవిర్లు గక్కినట్టుగా ఉంది. వర్షపు నీటికోసం ఎదురుచూసే చకోరపక్షుల పిల్లల కోసం ప్రకృతి వేడినేల అనే పెనం మీద చాపట్లు పోసినట్టుగా వెన్నెల ఉందనేది ఇందులో అంతరార్థం.
చీకటయినాక్కూడా ఎండవేడి తగ్గలేదు అంటాం మనం. అదే కవితాత్మకంగా చెప్పటానికి కాలే పెనం మీద అట్టు పోసినప్పుడు ఆవిర్లు ఎగసినట్టుంది వెన్నెల అనీ, ఈ వెన్నెల ఏ మాత్రం చల్లదనం ఇవ్వట్లేదని వర్ణించవచ్చు. కానీ, కృష్ణదేవరాయలు అలా వదల్లేదు. భూగోళం ఆకాశం చాలా విస్తారమైనవి కాబట్టి. ఎండ తీవ్రత కూడా అంతకన్నా విస్తృతంగా ఉంది కాబట్టి ఆయన చాపరాయి మీద పెద్ద చాపట్టు పోసినట్టుంది అన్నాడు.
చాపట్లు పోసుకునే అలవాటు శ్రీనాథుడి (365–44) కాలానికే తెలుగువారికుంది. పలు సందర్భాల్లో చాపట్లను, దోసియల్ని, రొట్టెల్ని వేర్వేరుగా ప్రస్తావించాడు.
6వ శతాబ్దికి చెందిన గణపవరపు వేంకట కవి ప్రబంధరాజ వెంకటేశ్వర విజయవిలాసము కావ్యంలో తన కాలపు వంటకాల పెద్ద పట్టికని వచనంలోనే వ్రాశాడు.
“దోసెలు నిప్పట్లు రొట్టెలు వడ లతిరసంబులు యప్పములు వెన్నప్పములు సుకియ లమృత కలశంబులు లాగులు చక్కెరబురు లుక్కెరలు కరిజలు పొరివిళంగాయలు తిమ్మనంబులు పాలకాయలు చక్కిలంబులు మోరుండలు మనోహరంబులు గారెలు బూరెలు మండెంగ లంగరొల్లెలు మణుగుఁబువ్వులు ఫేణీ లొబ్బట్టు కడియపుటట్లు చాపట్టు లిడ్డెనలు తేనెతొలలు గురుగు లేలకికాయలు వెన్నమెఱుఁగులు నిడికుండుకలు, లడ్వాలు ముత్తెపుఁజిప్పలు చంద్రకాంతంబులు మణతలు సారసత్తులు..” అంటూ పేర్కొన్న అనేక వంటకాలలో చాపట్లున్నాయి. “వండిన వలిపెంపుం జాఁపట్లు:” అని శృంగార నైషధంలో శ్రీనాథుడు చాపట్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
“కలవంటకములు బూరెలు దేనెతొలలు చాపట్లు మండెంగ లొబ్బట్లు వడలు” అంటూ పింగళి సూరన కళాపూర్ణోదయంలో కొన్ని ఆహారపదార్థాల పట్టిక ఇచ్చాడు. వాటిలో చాపట్లున్నాయి.
“చాపట్లు నెంత్రీలు చంద్రకాంతంబులు” అని “బ్రహ్మూత్తర ఖండం”లో ‘పట్టమెట్ట సోమనాథ సోమయాజి’ గారు కూడా చాపట్లు సహా అనేక వంటకాల్ని ప్రస్తావించాడు.
3వ శతాబ్ది నుండీ 6-7 వశతాబ్ది దాకా చాపట్లను ఘనంగానే తెలుగువారు తిన్నారు ఆ తర్వాతే, ఆ పేరు మాయమైంది. పేరు మాయమైతే, ఇప్పటి మన వంటకాలలో దేన్ని ఆనాడు చాపట్టు అన్నారో తెలుసుకోవటం కష్టం కదా!
అప్పటికప్పుడు రుబ్బిన పిండి పులవకుండా చాపలా నలుపలకులుగా వేసిన పెద్ద రొట్టె అని పదబంధ పారిజాతం పేర్కొంది. లక్ష్మీనారాయణీయ నిఘంటువు ‘అప్పడము వంటి యొక దినుసు పిండివంట’ అంది. మొత్తం మీద చాపట్టు అంటే పెద్ద దోసె లేదా రొట్టె అనే నిర్ణయానికి మనం రావచ్చు. ‘చాప’ అంటే, బల్లపరుపుగా (anything flat) ఉండేదని అర్థం. హోటళ్లవారుగానీ, కేటరర్లు గానీ పెద్ద నాపరాయి లేదా ఇనుప పెనం మీద దోసెలు, పరోటాలు, చపాతీలు కాలుస్తారు. ఈ రాయిని ‘చాపరాయి’ అంటారు.
చాపన్నం, చాపవంటకం, చాప+అట్టు ఈ చాపరాయి మీద కాలినవే!
సంస్కృతంలో ‘చర్పట:’ అంటే చాచిన అరచెయ్యి, మందంగా కాల్చిన రొట్టె అని రెండు అర్థాలున్నాయి. తమిళంలో చప్పట్టాయ్, కన్నడంలో చప్పటె, తెలుగులో చప్పి, చప్పిడి ఇవన్నీ flatnessని సూచించే పదాలు. 4-5 అడుగుల పొడవైన అట్టుని మనం ఇంట్లో చిన్నపెనం మీద కాల్చలేం. దానికి చాపలా పెద్దదిగా ఉన్న పెనం కావాలి. అలాంటి పెనాన్ని చాపరాయి అంటారు. ‘చాపరాయి అనే పెద్ద పెనం మీద కాల్చిన మందపాటి ‘అట్టు’ని చాపట్టు అంటారు.
పెనం మీద కాల్చినప్పుడు తడి ఆవిరై అట్టగడుతుంది. కాబట్టి, దాన్ని ‘అట్టు’ అన్నారు. ఐతే, చాపలా చుట్టేది చాపట్టు అని కొందరి అభిప్రాయం. పలుచని దోసెల్ని మందపాటి చపాతీల్ని కూడా మధ్యలో కూర పెట్టి చాపలా చుట్టి తినటం ఉంది కదా!
చాపరాయి, చాపట్లు అనే ఊళ్లపేర్లు, ఇంటిపేర్లు కూడా ఉండటం తెలుగు నేలపైన చాపరాయి ప్రాచీనతని, అలాగే చాపట్లంటే మనకు గల ఇష్టతని చాటుతోన్నాయి. ఇప్పుడంటే ఇనుప పెనాలు వాడ్తున్నారు గానీ ఒకప్పుడు పెద్ద నల్లరాయినే పెనంగా వాడేవారు. చాపరాయి మీద కాలిన అట్టు, రాచ్చిప్పలో (రాతిగిన్నె)లో కాగిన పప్పుచారు సాటిలేని రుచిని కలిగి ఉంటాయి.
చపాతీలు, పుల్కాలూ,పూరీలు నార్త్ ఇండియన్ ఫుడ్స్ అని ఒక ముద్ర వేసేశారు. మనం వారినుండి అరువు తెచ్చుకున్నాం అనే అపోహ బలంగా ఉండటాన చపాతీ సృష్టికర్తల్లో తెలుగు వారు కూడా ఉన్నారేమో ఆలోచించే అవకాశం లేకుండా పోయింది.
మన వంటకాలు, వాటికి తెలుగు పేర్లు ఇతరులు స్వీకరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు మోరుండ అనేది ఉత్తరాదిలో ప్రసిద్ధమైన మరమరాల ఉండ. చక్కని తెలుగు పేరు. తెలుగు నేలమీద ఆ పేరు వాడకంలో లేకుండాపోయింది. ఇప్పుడెవరైనా మోరుండ అంటే అది యూపీ నుండి వచ్చిందనేస్తారు.
ఐదాకుల వేపుడుకూర
“గురుగుం జెంచలిఁ దుమ్మి, లేఁదగిరిసాకుం, దింత్రిణీపల్లవో
త్కరముం గూడఁ బొరంటి నూనియలతోఁ గట్టావికుట్టారుగో
గిరము ల్మెక్కి, తమిం బసుల్పొలము వోఁ గ్రేఁవు ల్మెయి న్నాక, మే
కెరువుం గుంపటి మంచ మెక్కిరి ప్రభుత్వైకాప్తి రెడ్లజ్జడిన్.” (ఆముక్తమాల్యద)
రెడ్డి అనే బిరుదు కలిగిన భూస్వామి రైతుల గురించి రాయలవారు ఈ పద్యంలో ప్రస్తావిస్తున్నాడు.
- గురుగు ఆకు: ఇది తోటకూర, పాలకూర లాగా ఒక ఆకుకూర. రుచికరంగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. అన్నహితవు కలిగిస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. చలవనిస్తుంది. బలకరమైనది.
- చంచలికూర: రుచిని, ఆకలిని పెంచుతుంది. బలకరం. జ్వరాలు, ఉబ్బసం, కరోనాలాంటి వ్యాధుల్లో వండిపెట్టడం మంచిది. చర్మవ్యాధుల్ని తగ్గిస్తుంది. వీర్యకణాలను, లైంగిక సమర్థతను పెంచుతుంది. ఆకురసం తేలువిషాన్ని హరిస్తుంది.
- తుమ్మి ఆకులు: ఇది చిరుచేదుగా ఉంటుంది. అందుకని పులుపు కలిపి వండుతారు. కడుపులో నులిపురుగుల్ని చంపుతుంది. పాము కాటుకు విరుగుడుగా దీన్ని ఇస్తారు. ఎలర్జీ వ్యాధులున్నవారికి దీన్ని తరచూ వండిపెడితే మేలుచేస్తుంది.
- లే తగిరిశ ఆకులు: వాతవ్యాధుల్లో ఇది బాగా పనిచేస్తుంది. కీళ్లనొప్పులు, గౌట్ వ్యాధి, నడుంనొప్పి, ఎలర్జీ వ్యాధులు, దురదలు, మొలలవ్యాధి, నీరుపట్టటం లాంటి లక్షణాల్లో ఇది ఔషధం. మామూలు ఆకుకూరలకన్నా శక్తిమంతమైనది.
- తింత్రిణీ పల్లవాలు: చింతచిగురుని ఈ నాలుగు ఆకుకూరల్లో కలపాలి. చింతాకుల్లో ఇనుము ఉంటుంది. లివరుని బలపరుస్తుంది.
- నూనియలతో పొరంటి: ఈ ఆకులన్నింటినీ ఒక భాండీలో వేసి బాగా నూనెపోసి వేయిస్తారు. ఎక్కువ నూనె వెయ్యాలనటానికి ‘నూనియలు’ అన్నాడు. పొరటు అంటే తడిలేకుండా వేగిందని. ఇది కమ్మటి వేపుడు కూర.
- కట్టావి కుట్టారు గోగిరము ల్మెక్కి: కట్టావి=కడు+ఆవి= బాగా ఆవిరి (వేడి) మీద ఉడికించిన (కుక్కర్లో ఉడికించినట్టు), కుట్టారుగ= పొట్టి ఆరుగ ధాన్యపు, ఓగిరం= అన్నం. చిన్నఆరుగులనే ధాన్యం ఆ రోజుల్లో బాగా పండేవి కాబోలు. ఈ ధాన్యాన్ని ఆవిరిమీద ఉడికించి తినేవాళ్లని రాయలవారి ఈ పద్యం ఓ కొత్త విశేషాన్ని చెప్పింది.
పాలేర్లు పశువుల్ని మేపటానికి పొలాలకు తీసుకుపోయారు. దూడలు మాత్రం ఇంటిదగ్గరే ఉన్నాయి. వాటిని మంచాలకు కట్టేశారు. అది కుంపటిమంచం. అంటే, మంచానికి కింద కుంపటి అమర్చి ఉంటుంది. ఆ కుంపట్లో మేక ఎరువు (ఎండిన పెంటికల్ని) వేసి నిప్పు రాజేస్తారు. కుంపట్లోంచి వెచ్చదనం మంచం మీద పడుకున్నవారికి తగులుతూ ఉంటుంది. అలా చలికాగుతూ మంచాల మీద పడుకున్న రైతుల కాళ్లను దూడలు నాకుతున్నాయిట. ఇదీ ఆ పద్యంలో కనిపించే ఓ సంక్షిప్త శబ్దచిత్రం.
ఒక్క పద్యంలో గ్రామీణ జీవితాన్ని అద్భుతంగా ప్రతిఫలింపచేశాడు మహాకవి శ్రీకృష్ణదేవరాయలు!!
పొరివిళంగాయలు
“భక్తిఁ ద్రోవకు సాధ్వి పరికరంబులు వెట్టి కట్టిన/ పొరివిళంగాయ గమియున్..” శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్యంలో అలవోకగా ప్రస్తావించిన ఒక తెలుగు వంటకం పొరివిళంగాయ.
శ్రీవిల్లిపుత్తూరు నుండి విష్ణుచిత్తుడు పాండ్యరాజు దర్శనార్థం బయల్దేరినప్పుడు దారిలో తింటానికి ఆయన ఇల్లాలు కొన్ని పొరివిళంగాయలు పొట్లాం కట్టి ఇచ్చిందట.
“చక్కెర బుగుడలు, నుక్కెరలు కరిబాలు పొరివిళంగాయలు తేమనంబులు” అంటూ హంసవింశతి కూడా ఈ పొరివిళంగాయల్ని పేర్కొంది.
11వ శతాబ్దపు మానసోల్లాస గ్రంథంలో బియ్యం, పెసలు వేగించి విసిరిన పిండిని బెల్లం పాకం పట్టి చేసిన చలిమిడి ఉండల్ని పొరి విళంగాయలన్నట్టు ఆహార శాస్త్రవేత్త కె. టి. అచ్చయ్య వ్రాశారు.
‘పొరి’ అంటే మూల ద్రావిడభాషలో వేగించటం అని! తమిళంలో పొరియల్=వేగించటం, వేపుడు వంటకం. తెలుగులో అది పొరటు అయ్యింది. వేగించిన వాటిని కన్నడంలో బురుగులు, తెలుగులో బొరుగులు అంటారు! ‘పొరి విళంకాయ్’ అంటే వేగించిన పెసల పిండిని పాకం పట్టిన ఉండలని తమిళ లెక్సికాన్ అర్థాన్నిచ్చింది.
తమిళనాట ఇప్పటికీ “పొరివిళంగాయ్ ఉరుండాయ్” పేరుతో పొరివిళంగాయల ఉండల్ని వండుకుంటున్నారు. కప్పు బియ్యం, అరకప్పు గోధుమలు, అరకప్పు పెసరపప్పు, అరకప్పు శనగపప్పు, రెండు చెంచాలు కొబ్బరి కోరు వీటిని విడివిడిగా వేగించి అన్నింటిని మిక్సీ పట్టిన పిండిని బెల్లం పాకంలో కొద్దికొద్దిగా కలుపుతూ నేతితో చలిమిడి చెయ్యాలి. ఈ చలిమిడి ఉండలే పొరివిళంగాయ ఉండలు.
తెలుగువారి ‘పోక ఉండలు’ కూడా ఇలాంటివే! పోక (వక్క) చెట్టు కాయల ఆకారంలో చిన్నవిగా చేస్తారు కాబట్టి, వీటిని “పోక ఉండ” లన్నారు. 1904లో అచ్చయిన ‘వంటలక్క’ అనే పుస్తకంలో ‘పోక ఉండలు’ తయారీ వివరంగా ఉంది: వేగించిన బియ్యప్పిండిని, నువ్వు పప్పు, కొబ్బరి తురుముల్ని బెల్లం పాకంలో కలిపి, నేతితో చలిమిడి చేసి చిన్న చిన్న ఉండలు కట్టుకోవాలి. పెసరపప్పు బియ్యం కలిపి నానబోసి గరిటజారుగా రుబ్బిన తోపు పిండిలో ఈ ఉండల్ని ఒక్కొక్కటే ముంచి నూనెలో వేసి పూర్ణాలమాదిరి వేగిస్తారు. వీటిని పోక పూర్ణాలంటారు. కొందరు తోపుపిండిలో ముంచకుండా నేరుగా నూనెలో వేగించి పోక ఉండలు చేస్తున్నారు. ఇవి బూరెల్లా ఉంటాయి.
అస్సామీ వాళ్లకీ ‘పోక మిఠాయి’ అనే వంటకం ఉంది. వాళ్లు నేతి చలిమిడి చేసి చిన్న ఉండలు కట్టి నూనెలో వేగించకుండా పొడి బియ్యప్పిండిలో పొర్లిస్తారు. ధనికుణ్ణి ‘ఆసామి’ అంటాం కదా.. అస్సామీ ధనికుడిని బట్టే ఈ ‘ఆసామి’ పదం వచ్చిందని చెప్తారు. ఒకప్పుడు అస్సామీయులు దేశం అంతా విస్తరించిన ధనిక జాతే! అందుకే, దేశంలో అందరి వంటకాలూ వాళ్లకు తెలుసు. అస్సామీ నిఘంటువులో ‘పోక’ అంటే, ఒక పురుగు అనే అర్థం కనిపించింది. కానీ, అస్సామీయులు ఈ స్వీటుని మన పోకఉండల్ని బట్టే, ‘పోక మిఠాయి’ అన్నారు.
మామిడిముక్కలతో చేపల పులుసు
తారుణ్యాతిగ చూత నూత్న ఫలయు క్తైలాభిఘార స్వన
ద్దారా ధూపిత శుష్యదంబు హృత మాత్స్య చ్చేద పాకోద్గతో
ద్లారంపుంగన రార్చు భోగులకు సంధ్యా వేళలం గేళి కాం
తారాభ్యంతర వాలుకాస్థిత హిమాంత ర్నారి కేళలాంబువుల్.
వేసవి కాలంలో లేత మామిడికాయల ముక్కలతో చేపల కూర గురించి శ్రీకృష్ణదేవరాయలు ఈ పద్యంలో వర్ణించాడు. నిజానికి, వింత వంటకాల్ని వర్ణించటంలో రాయలవారు శ్రీనాథుణ్ణి ఒకింత మించిన వాడనే చెప్పాలి. భోజన వర్ణనలు చేశాడని శ్రీనాథుణ్ణి భోజన ప్రియుడన్నారు. భోజనం లేకపోతే మనుగడే లేదు కదా!
మనుషులంతా భోజన ప్రియులే! కానీ, రాయలవారిని అంతమాట అనే ధైర్యం మన పండితులకు లేదు. శ్రీనాథుడైనా, రాయలవారైనా తమ భోగాన్ని కాదు, ఆహారాన్ని ఆస్వాదించే జనాల భోగాన్ని వర్ణించారు.
ఈ పద్యంలో రాయలవారే ‘భోగులు’ అనే పదం వాడాడు. భోగులంటే ఎవరు? భోజనాన్ని రుచిమంతంగా, ఆరోగ్యదాయకంగా వండుకుని ఆస్వాదిస్తూ, తినేవాడు భోగి. అనుభవం, సుఖం, భోజనం అని భోగానికి మూడు అర్థాలున్నాయి. ఆహారాన్ని ఆహా.. ఓహో అంటూ ఆస్వాదిస్తూ తినాలి! మౌనంగా భుజిక్రియ అయ్యిందనిపించటం భోగం కాదు.
మండు వేసవిలో ఆకాశం నిప్పులు కక్కుతుంటే, ఇంట్లో చల్లగా కూర్చుని భోగులు తరుణ దశ దాటిన తాజా లేత మామిడి కాయ ముక్కల్ని అలాగే, నీళ్ళు ఎండి, వట్టిపోతున్న చెరువుల్లోంచి తెచ్చి తరిగి శుభ్రపరచిన చేప ముక్కలతో కలిపి ఉడికించి, కమ్మని తాలింపు పెట్టి ఆస్వాదిస్తూ తిన్నారట,
విస్తట్లో అన్నీ వడ్డించాక, ఆఖర్న నెయ్యి తెచ్చి అన్నం మీద కొద్దిగా వేయటాన్ని అభిఘారం అంటారు. ఈ పద్యంలో నూనెని అభిఘరించి తాలింపు పెట్టినట్టు రాయలవారు వ్రాశారు. కొద్దిగా నూనెలో తాలింపు గింజలు అటూ ఇటూ కదుపుతూ వేగిస్తారు కాబట్టి సాతాలింపు, తాలింపు అన్నారు. గవ్వలాటలో గవ్వల్ని అటూ ఇటూ కదిల్చి వేయటాన్ని తాలించటం అంటారు. ఇది వంటగదిలోంచి వెళ్ళిన పదమే కావచ్చు. తాలించి కూర, పప్పు, పులుసు, పచ్చడి వగైరా వంటకాల మీదకు వంచి పొయ్యగానే పొగలు వస్తాయి కాబట్టి పొగపు, పోపు, అన్నారు. అలా పొగచిన పోపుని వంటకం మీద తిరగపోస్తారు కాబట్టి తిరగపోత, తిరగబోత అన్నారు. తిరగబొయ్యగానే చుయ్యిమనే మోత వస్తుంది కాబట్టి, తిరగమోత అనీ, వెంటనే మూతపెడతారు కాబట్టి తిరగమూత అనీ పిలుస్తారు.
“తిరిగి వచ్చిన భార్య, తిరుగబోత వేసిన కూర బహు రుచి” అని తెలుగు సామెత!
అసలే ఎండ. తిన్నదేమో చేపల కూర. దాంతో సాయంత్రం అయ్యే సరికి ఉద్గత ఉద్గారాల కనరు అంటే విపరీతంగా కారపు త్రేన్పులు రావటం మొదలెట్టాయట. ఈ కారానికి గ్రామాల్లో అప్పటికప్పుడు దొరికే విరుగుళ్లు కొబ్బరి నీళ్లు.
ఎండ తగలకుండా నీడ ఉండే స్థలంలో పెద్ద గొయ్యి తీసి కొంత ఇసుక నింపి, దాని పైన కొబ్బరి బోండాల్ని పరిచి వాటి పైన మళ్ళీ ఇసుక పోసి మూయటాన్ని ఇసుక పాతర వెయ్యటం అంటారు. ఈ ఇసుకని మాటిమాటికీ నీళ్ళతో తడుపుతుంటే కొబ్బరి బోండాలలో నీళ్లు చల్లబడతాయి. రెఫ్రిజిరేటర్లు, ఐసు తయారు చేసే యంత్రాలేవీ లేని ఆ రోజుల్లో చల్లదనానికి గ్రామీణులు ఆశ్రయించిన పద్ధతి ఇది.
అప్పుడే టెంకె పడ్తున్న మామిడికాయని ‘తారుణ్యాతిగ చూత నూత్న ఫలం’ అనీ, చెరువు ఎండిపోతుంటే ఆఖరున మిగిలిన చేపల్ని ‘శుష్యదంబు హృత మాత్స్య’ అని, చుయ్యని మోగేలా వేసిన తిరగపోతని అలాగే, నూనె తాలింపుని ‘తైలాభిగార స్వనద్దారా ధూపితం’ అనీ వర్ణించి, పాణింధమములు లాంటి పదాలు వాడిన శ్రీనాథుణ్ణి మించి పోయారు రాయలవారు.
భోజనం ఒక భోగం, ఒక యోగం కూడా!
(సమాప్తం)
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.