Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీకృష్ణదేవరాయలు – ఆముక్తమాల్యద-2

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘శ్రీకృష్ణదేవరాయలు – ఆముక్తమాల్యద’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది రెండవ భాగము.]

బీరపువ్వు లాంటి రాగి నాణాలు

వాద మొనరించి గెలిచి తత్త్వంబు దెలుపు
వాని కని బీరపువ్వులఁ బోని టంక
సాల వాటులు నించి యాస్థానిఁ గట్టం
గాల సర్పము గతి నలు జాలెం జూచి”

ఆముక్తమాల్యద కథలో పాండ్యరాజు దైన్యంలో మునిగిపోయి ఉన్నాడు. రోజువారీ రాజవ్యవహారాల పట్ల ఆసక్తి చూపించ లేకపోతున్నాడు. అన్ని కార్యక్రమాలనూ వాయిదా వేసి, కాసేపు కవి పండితులతో గడిపితే మనశ్శాంతైనా ఉంటుందని భావించి రాజ్యంలో అందుబాటులో ఉన్న కవుల్ని పిలిచాడు. వాళ్లలో వాళ్ళకే పోటి పెట్టాడు. తర్కంలో ఎవరు గెలిస్తే వాళ్లకి అప్పుడే కొత్తగా టంకశాలలో ముద్రించిన పచ్చని బీరపువ్వుల్లాంటి బంగారు నాణేలను బహూకరిస్తానన్నాడు. ఇంకా చలామణీలోకి వెళ్ళని నాణాలు కాబట్టి చాలా ప్రత్యేకమైనవి. వాటిని ఒక సంచీలో మూటగట్టి సభాస్థలి మధ్యలో వ్రేలాడ కట్టించాడు.

రాయలవారి కాలంలో కూడా రాగి కలవని దీనారాలు చెలామణిలో ఉండేవని చరిత్రకారులు చెప్తారు.

ఈ పద్యంలో బంగారు నాణాలను బీరపువ్వుతోనూ, నాణాల సంచీని కాలసర్పంతోనూ పోల్చారు. పచ్చని బీరపూలు మేలిమి బంగారపౌ రంగులో ఉంటాయి. రాగి ఏమాత్రం కలవని 24 కేరెట్ల స్వచ్ఛమైన బంగారు నాణాలని చెప్పటానికి పచ్చబీర పూల ప్రస్తావన తెచ్చాడు రాయలవారు. మరి, కాలసర్పం మాటేమిటీ? తరువాత జరగబోయే కథతో ముడిపడిన అంశం అది.

శ్రీ విల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు మంచి వాసన గల తులసి దండను అష్టాక్షరి జపిస్తూ స్వామి విగ్రహం మెడలో వెయ్యబోగా, స్వామి విష్ణుచిత్తుడితో “పాండ్యరాజు మోక్షాసక్తిలో మునిగి ఉన్నాడు. పండితులకు తర్కపరీక్ష పెడ్తున్నాడు. ఇదే సమయం. ఆ పండితుల గర్వం అణచి, తర్కంలో గెలిచి నా మహిమను ప్రకటించు. ప్రభువు ఇచ్చే సత్కారం స్వీకరించు..” అని చెప్తాడు.

విష్ణుచిత్తుడనే భక్తుడు స్వామి అనుగ్రహంతో వస్తున్నాడు. ఈ సభలో ప్రతో ఒక్కరినీ ఓడిస్తాడు అని చదువుతున్న మనకు అర్థం కావటానికి సభలో ఆ పండితులకు బంగారు నాణాల మూట కాలసర్పంలా కనిపిస్తోందన్నాడు.

ఎండాకాలంలో ఓ రోజు

అతివృష్టిన్‌ మును వార్థి గూర్చునెడ కాఁడౌటన్‌ దమిన్‌ గూర్చున
న్మతి లంచంబుగ హేమటంకములు మింటన్‌ బొల్చు పర్దన్యదే
వతకీ నెత్తిన కేల నాఁ బొలిచె, నిర్వారిస్రవంతిన్‌ న్బయ
శ్చుతి నమ్రచ్ఛద దృశ్యకర్ణికములై యున్నాళ నాళీకముల్‌

కృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద కావ్యంలో వ్రాసిన పద్యం ఇది.

వానలు బాగా కురిసేటువంటి ఆ రోజుల్లో, మనుషుల్లో కొద్దిగా నైనా పాపభీతి ఉండేది. మొక్కలు నరకటం, నీటిని వృథా చేయటం, అన్నం పారేయటం ఇలా చాలా విషయాల్లో పాపభీతి వెన్నాడేది. మనుషుల్లో మంచితనం వలన వానలు కొన్నయినా కురిసేవి. ఇప్పుడు మనకి ఎండాకాలం ఒక్కటే నడుస్తోంది. వాన కురిసినంత సేపే వానాకాలం! అలాగే, చలి వేసిన ఆ కొద్దిసే సేపూ శీతాకాలం. మిగలిందంతా ఎండాకాలమే! మునిమాణిక్యం వారన్నట్టు మనది ఎండామండిత ప్రదేశం!

వానలు లేక అలా ఎండిన ఒక జలాశయంలో కృష్ణదేవరాయలు తామరపూలు వడలి పోతున్న ఒక దృశ్యాన్ని చూశాడు. అప్పటిదాకా నీళ్ళమీద తేలియాడిన తామర మొక్కల బతుకు బజార్న పడిందని అనిపించిం దాయనకి! మనుషుల్లో నిజాయితీ చచ్చిపోతే ప్రకృతి కన్నెర్ర జేస్తుందని పరోక్షంగా హెచ్చరించాలనుకున్నాడు.

తామరతూళ్ళు నిట్టనిలువుగా జొన్నదంటుల్లా నిలబడ్డాయి. అంతరిక్షంలో ఎగిరే పళ్ళాల్లాగా విహరించిన తామర పూరేకులు ఎండకు మాడి వడలి వాలిపోయాయి. తామరపూల మధ్యన ఉండే కర్ణికలు పచ్చగా పొడుచు కొచ్చినట్టు ఉన్నాయి. ఈ కర్ణికల్ని తామర దుద్దులు అంటారు. చెవులకు పెట్టుకునే బంగారపు దుద్దులు కూడా వీటిలానే గుబ్బలాగా ఉంటాయి కాబట్టి, వాటిని దుద్దులన్నారు. తామరపూల మధ్య అమ్మవారు ఈ మెత్తని దుద్దుమీదే కూర్చుంటుంది. వేసవి తాకిడికి ఆ దుద్దులు ఎండి వడిలాయి. ఇదీ అక్కడి దృశ్యం

నదులు వెళ్ళి సముద్రంలో కలుస్తాయి. దీన్ని కవులు సాగర సమాగమం అని కూడా అంటారు: ప్రేయసీ ప్రియుల సమాగమం లాంటిదని! నదిని సముద్రంతో కలిపే వాడు పర్జన్యుడు. అంటే, ఉరిమే మేఘం! మామూలు భాషలో అమ్మాయిని అబ్బాయి దగ్గరకు చేర్చటాన్ని తార్చటం అంటారు. తమని సముద్రానికి తార్పులాదే మేఘుణ్జి మంచి చేసుకోవటానికి నదులు సహజంగా ప్రయత్నిస్తాయి. అందుకు ప్రతిఫలంగా ప్రవాహాలు లంచం ఇచ్చుకున్నాయని రాయల వారంటారు. ఇప్పటి భాషలో దాన్ని బ్రోకరేజీ, కమీషన్‌ అని గౌరవంగా పిలుస్తున్నారు. రాయలవారు దీన్ని లంచం అనే అన్నారు. దిగువ స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఎలా పనిచేస్తున్నాయో నాకు తెలుసనే హెచ్చరిక రాయలు చేస్తూ ఉండవచ్చు కూడా! దీన్ని ఇలాగే చెప్పి ఊరుకుని ఉంటే ఇందులో కవిత్వం ఏమీ లేదు. దీన్ని లోకానికి అన్వయించి చెప్పాలి. అది జనం మీద ప్రభావాన్ని చూపించాలి. కావ్య ప్రయోజనం అలా సిద్ధించాలని ఆశించారాయన.

మేఘుడి వాటా మేఘుడి కిచ్చేస్తే, వానలు కురిపించి తమని త్వరగా సాగరానికి చేరుస్తాదని నదుల ఆశ. అప్పుటికే వడలిన తామర తూళ్ళు ఆ ఎండు జలాశయాన్ని చేతులుగానూ వాడి వాలిపోయిన తామర పూలను చేతివ్రేళ్ళుగానూ ఆయన భావించాడు. పూల మధ్యన ఉండే కర్ణికలు అంటే తామర దుద్దులు లంచం ఇవ్వటానికి అరచేతిలో పట్టుకున్న హేమటంకాల్లా (బంగారు నాణేలు) ఉన్నాయంటాడు. కృశించిన తన చేతుల్ని బారచాచి, నదులు తమ చేతుల్లో బంగారు నాణాలు చూపిస్తూ, ‘ఇవి తీసుకుని వాన కురిపించవయ్యా’ అని మేఘుణ్ణి అడుగుతున్నట్టుగా ఉందట. అవినీతి, లంచగొండితనాలు ప్రపంచ పరివ్యాప్తం. వానలు కురవాలంటే మేఘాలకు లంచం మేపాలన్న మాట. లంచగొండుల్ని ఒక కంట కనిపెడుతూనే, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించాలనేది రాయలవారి అభిప్రాయం!

దొంగస్వాములు

“అక్షర పక్షపాతమున నర్థము నూళ్ళ నొనంగ నుబ్బునన్
భిక్షు జటాధరాధికులు భిన్న నిజవ్రతులౌదు, రైన దు
ర్భిక్ష రుజా శిశు చ్యుతులుపెక్కగు, భక్తియు చాలు, దానఁద
త్పక్షుభితత్వమే యఘముఁ దార్పదు శంక దలంగుమయ్యెదన్” (ఆముక్తమాల్వద 4.242)

ప్రభుత్వానికి అక్షర పక్షపాతం ఉండకూడదని కృష్ణదేవరాయలు బల్లగుద్ది భజాయించి మరీ చెప్తున్నాడీ పద్యంలో! చదువుకున్న వాడు తిన్నగా ఉంటే “సాక్షరా” అవుతాడనీ, బుద్ధి వికటిస్తే సర్వం తిరగబడి “రాక్షసా” అవుతాడనీ ఓ చాటువుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే, చదువుకున్నాడు కదా అని పురస్మారాలు, గౌరవాలు, వంగి దణ్ణాలు పెట్టకుండా ముందు జాగ్రత్తగా ఆలోచించు. ఆ పేరుతో జటాధరాధికులు అంటే మతతత్వ వాదులు “ఉబ్బుతారు” అంటాడు. అంటే, ఒళ్ళు పొగరెక్కి వ్యవహరిస్తా రన్నమాట. సాక్షరులు రాక్షసు లౌతారు. కాబట్టి అక్షర పక్షపాతం లేకుండా అగ్రహారాలు వగైరా ఆలోచించి ఇవ్వాలన్నారు రాయలవారు.

సాధు సన్యాసులక్మూడా లోకోత్తరమైన, లోక హితాన్ని కోరే బాధ్యతలున్నాయి. వాళ్ళ బాధ్యతల్ని వాళ్లు ప్రతిఫలాపేక్ష రహితంగా నెరవేర్చాలి. ప్రధాన మంత్రులూ, ముఖ్యమంత్రులూ, మంత్రులూ, అధికారులూ అదేపనిగా మఠాలు, బాబాల ఆశ్రమాలను సందర్శించటం వలన, “శాంక్టిటీ ఆఫ్ శాంక్టోరం (ఆలయ పవిత్రత) అంటామే అది దెబ్బతింటుంది. లోకానికి దారి చూపించ వలసిన వ్యక్తులు చెడిపోతే లోకానికి అపకారమే కదా! అందువలన అరాచకం ప్రబలుతుంది. దుర్భిక్షం ఏర్పడుతుంది. రోగాలు వ్యాపిస్తాయి. మనుషులు అర్ధంతర చావులు పొందుతారు..” అని హెచ్చరించాడాయన.

“భక్తియు చాలు” అన్నాడు రాయలవారు. ప్రభుత్వాధిపతుల మద్దతు వలన బాబాల చుట్టు మాఫియాలు చేరతారని రాయల వారు ఆనాడే ఊహించాడు. అనుచితమైన భక్తిని ఈ భక్తిబేహారుల పట్ల పెంచుకోవద్దన్నాడు. అందువలన తూరీయాశ్రమ ధర్మాలకు తిలోదకాలిచ్చి సర్వసంగ పరిత్యాగులు సంచీలు నింపుకునే పనిలో పడతారు. రాజసన్మానం మితిమీరితే ఎంత అపకారం జరుగుతుందో తెలుగు నేలపైన ఉదాహరణలకు కరువు లేదు.

రాయలనాటి రెస్టారెంట్లు అక్కలవాడలు

“అక్కలవాడల నరకూళ్ళు మెక్కి” అనే దానికి “వీథులలోనికి పోయి, ‘అక్కా.. అమ్మా..’ అని స్త్రీలను మంచివారిని చేసుకుని, బతిమాలుకుని సగము గడుపున కన్నము తిని” అనే అర్థాన్ని వేదం వారు రాశారు. చాలామంది ఈ వ్యాఖ్యానంతో ఏకీభవించలేదు.

రాయల వారి కాలంలో అక్కలవాడలూ అందులో నక్షత్రాల హోటళ్ళు చరిత్ర ప్రసిద్ధి చెందినవే! అక్షవాడ అంటే మల్లయుద్ధం జరిగే ప్రదేశం. దాన్నే అక్కలవాడ అనేవారు తెలుగులో! వసతి, భోజనం ఇంకా అన్ని ఇతర సౌకర్యాలు కలిగిన హోటళ్లలాంటివి అక్కలవాడలో ఉండేవి. వ్యాయామం చేసుకునేందుకు జిమ్, అరూవాటిక అంటే జూదం, తాగుడు ఉండే బార్ లాంటివి ఈ అక్కలవాడలో ఉండేవి ఆ రోజుల్లో.

మనవాళ్లని చూసే పోర్చుగీసులు, ప్రెంచివాళ్లూ రెస్టారెంట్లను నెలకొల్పారు. అద్దె చెల్లిస్తే పడక వసతులు, పడక సౌఖ్యాన్నిచ్చే పడతులు, భోజన హోటళ్లు, మసాజ్ సెంటర్లు ఒకటేమిటీ అన్నీ దొరికే అక్కవాడలు రాయల యుగంలో రాజధాని నగరంలో ఉండేవి.

అద్దెకు విశ్రాంతి ‘రెస్ట్-ఎ రెంట్’ అనే వ్యవస్థ రెస్టారెంట్ అనే ఫ్రెంచి పదానికి మూలం కావచ్చు! restaurant అనేది ఫ్రెంచి క్రియాపదం restaurer తనని తాను తిరిగి సన్నద్ధం చేసుకోవటం అనే పదం లోంచి పుట్టిందని చెప్తారు. ఫ్రాన్సులో అన్నీ దొరికే రెస్టారెంట్ల వ్యవస్థ 1789 ఫ్రెంచి విప్లవం వరకూ మొదలు కాలేదు. కానీ, విజయనగర సామ్రాజ్యానికి అతిథులుగా వచ్చే విదేశీయుల కోసం రాజధాని నగరం అక్కవాడల్లో 15వ శతాబ్ది నాటికే రెస్టారెంట్లు నిర్వహించినట్టు సాహిత్యాధారాలు పుష్కలంగా ఉన్నాయి.

కన్నడంలో ‘అక్కజం’ అంటే అనురాగం. కానీ తెలుగులో ఇది ‘అవసరం’గా మారింది. అక్కజము గొను = ఆశించడం. అక్కజ తీర్చు = కోర్కె తీర్చడం. అక్కజ గత్తె = తీవ్రవాంఛ గల జాణ! అక్కజగండడు = అవసరం తీరాక దులుపుకు పోయేవాడు. వీళ్ళంతా అక్కలవాడలో దర్శనం ఇస్తారు.

హరివంశం వ్రాసిన గౌరనకవి రాయలవారికి ముందుతరంవాడు. అందులో అక్కరగండడనే పెద్ద వడ్డీవ్యాపారిని ప్రస్తావిస్తాడు. అతను పరమ నిర్దయుడు. కాబూలివాలా లాంటివాడు. అక్కరగండడికి అక్కలవాడలో పనేమిటంటే, జూదగాళ్లకి, విటులకీ అవసరం తీరటానికి అప్పులిచ్చి ఆదుకునేవాడన్నమాట. “అక్కరకు రాని చుట్టము” అనే సుమతి శతకం పద్యంలో “అక్కర” అక్కలవాడలో అక్కర లాంటిది కాదు. అది శుభకార్యమే! కానీ “అక్కఱ తీరాక అల్లుడు గతి” అనే సామెతలో అక్కరకు కొంచెం లోతెక్కువే! ఆ శోభనం ఏదో జరిపించేస్తే అమ్మాయి మోజులో చెప్పుకింద తేలులా పడివుంటాడని అంతరార్థం!

‘అకారకరభ’ అనే వనమూలిక వుంది. ఇది తక్షణం లైంగికోత్తేజాన్ని ‘పెంపొందించేందుకు’ ఉపయోగపడ్తుంది. దీన్ని తెలుగులో ‘అక్కలకర్ర’ లేదా ‘అక్కరకర్ర’ అనడంలో తెలుగువారి కొంటెతనం తేలికగానే అర్థం అవుతోంది.

పేదరాసి పెద్దమ్మకథలు పూటకూళ్ళ హోటళ్లలోనే ఆ రోజుల్లో పుట్టాయి. పరదేశీయులు, పరాయి వాళ్లు కూడా రాచనగరికి వచ్చినప్పుడు ఈ పూటకూళ్ళమ్మే వాళ్ళకు కడుపు నింపేది. వాళ్లు ఊరి సంగతులడిగితే ఆమె చెప్పే కథలే పేదరాశి పెద్దమ్మ కథలు.

ఆముక్తమాల్యదని చేత్తో పుచ్చుకుంటే 500 యేళ్లనాటి తెలుగు గ్రామాలలోని సాంఘిక జీవనం యావత్తూ మన అరచేతిలో కొస్తుంది. నేటి కాలపు పాలకులకు గోడకుర్చీ వేయించి చెవిమెలిపెట్టి చెయ్యి తిరిగేలా పాలనావ్యవహారాలు నేర్పించే పాఠాలు ఇందులో ఎన్నో ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినవి మచ్చుకు కొన్ని!

ఆముక్తమాల్యదలో ఆహారం

మనుషులు రోజూ తాము తినే ఆహారాన్నే తమ దేవుడికి నైవేద్యంగా పెడతాడు. కాబట్టి, నైవేద్యాలే ప్రజల ఆహార చరిత్రకు ఆధారం అని రాహుల్ సాంకృత్యాయన్ వ్రాశారు.

శీతాకాలంలో, వానాకాలంలో, వేసవికాలంలో, అతిథి దేవుళ్లకు ఆ కాలానికి తగ్గ వంటకాలు తయారుచేయించి విష్ణుచిత్తుడు తన అతిథి దేవుళ్లకు వడ్డించినట్టు రాయలవారు ఆముక్తమాల్యద కావ్యంలో వర్ణిస్తారు.

కృష్ణదేవరాయలు మాతృభాష తెలుగేనని, అతని బాల్యం యవ్వనం చంద్రగిరి లోనే ఎక్కువగా గడిచాయని, చరిత్రవేత్తల అభిప్రాయం నిజమే నన్నట్టు ఆముక్తమాల్యద తెలుగు కావ్యంలో తెలుగుదనం ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కవి స్వీయానుభూతి. అద్దె కవులు వ్రాయగలిగేది కాదు. కూలికి పలికే పలుకులు కావు. రాయలవారు సహజ కవి. సాహిత్య ప్రయోజనం ఎరిగిన కవి. సామాజిక స్పృహ కలిగిన మహాకవి.

శీతాకాలం నులివెచ్చని భోజనం

“పునుగుం దావి నవోదనంబు మిరియంపుం బొళ్ళతో జట్టి చు
య్యను నాదారని కూర గుంపు ముకు మందై యేర్చునావం జిగు
ర్కొను పచ్చళ్ళును బాయసాన్నములు నూరుంగాయలున్ జే సురు
క్కనునేయుం జిరుపాలు వెల్లువుగ నాహారం బిడున్సీతునన్”

శీతాకాలంలో ఇంటికొచ్చిన అతిథులకు విష్ణుచిత్తుడు ఎలాంటి భోజనం వడ్డించాడో శ్రీకృష్ణదేవరాయలవారు ఆముక్తమాల్యద లోని ఈ పద్యంలో చెప్తున్నాడు. శీతాకాలంలో ఎలాంటి పదార్ధాలు తినాలో ఒక సూచన ఇందులో కనిపిస్తుంది

పునుగుం దావి నవోదనంబు:

అక్కుళ్లు, మసూరీలు, బాసుమతి ఇలా అనేక ధాన్యాలు ఇప్పుడున్నట్టే ఆ రోజుల్లో పునుగుదావులనే ఒక రకం బియ్యం ఉండేవి. ఇవి కొంచెం వేడిని కలిగిస్తాయి కాబట్టి, చలికాలంలో వాటితో వండిన వేడి అన్నం తినటం మంచిదని రాయలవారి అభిప్రాయం.

మిరియంపుం బొళ్ళతో జట్టి చుయ్యను నాదారని కూరగుంపు:

మిరియాలపొడితో చట్టి (కుండ)చుయ్యనే తాలింపు చప్పుడు ఆగకుండా వండిన కూరగుంపులు అంటే రకరకాల కూరలు

‘ముకుమందై యేర్చునావం జిగుర్కొను పచ్చళ్ళు’:

కొద్దిగా ఆవపిండి లేదా ఆవాలపిండి చేర్చి, కొద్దిసేపు ఊరిన తరువాత తింటే మూర్ధన్యాలు అదిరేంత ఘాటురుచి కలుగుతుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బూడిదగుమ్మడి, సొర, పొట్ల, బీర, కంద లాంటి కూరల్ని ఉడికించి అందులో పెరుగు, ఆవపిండి కలిపి తాలింపుపెట్టి, కొత్తిమీరతో గార్నిష్ చేస్తే దాన్ని ఆవపచ్చడి అంటారు. ఘాటైన ఈ ఆవపచ్చడి జలుబు రొంప బాధలకు ముక్కుమందు లాగా ఉపయోగిస్తుందని శీతాకాలంలో ఇలాంటివి తినాలంటారు రాయలు.

పాయసాన్నములు:

రకరకాల పాయసాలు

ఊరుంగాయలు:

వేసవికాలం ఊరుగాయల సీజన్. జాడీలకు వాసెనగట్టి ఊరుగాయల్ని 3-4 నెలలు మాగనిచ్చి అప్పుడు తినేవారు. ఊరుగాయల్ని శీతాకాలంలో తినటం కోసమే పెట్టుకునేవాళ్లు. మనం వేసవిలోనే తిని పొట్ట పాడు చేసుకుంటున్నాం.

చే సురుక్కను నేయుం:

చేతిపైన పడితే చురుక్కనేలా బాగా కాచిన వేడివేడి నెయ్యి. అరచేతిని గుంటలా పట్టి అందులో నెయ్యి వడ్డించుకుని అన్నం మీద ధారగా పోసి కలుపుకునేవాళ్లు. పాడి పంటల్ని ఈసడించే ఈ కాలీయులకు ఆ భాగ్యం ఎక్కడిది?

చిరుపాలువెల్లువుగ:

సగం మరిగేంత వరకూ చిక్కగా కాచిన పాలను చిరుపాలంటారు. శీతాకాలపు భోజనంలో మిరియాల పొడి వేసి కాచిన చిరుపాలను వెల్లువగా వడ్డించేవాళ్లట. బహుశా, శీతాకాలంలో పెరుగు బదులు పాలు, పంచదార అన్నంలో కలుపుకుని తినటం అలవాటుగా ఉండేదేమో!

ఈ చిరుపాలనే ‘ఆనవాలు’ అని కూడా తెలుగులో పిలుస్తారు. 2-3 పొంగులు రానిస్తూ చల్లార్చి మళ్ళీ పొంగిస్తూ కనీసం సగం పాలు మరిగేంత దాకా కాయటం వలన పాలలో వుండే చెడ్డ బాక్టీరియా నశించి పోతుంది. ఇలా కాయటాన్ని పాశ్చురైజేషన్ అంటారు. లూయీ పాశ్చర్ పేరుతో బాక్టీరియా లేని శుద్ధ క్షీరాన్ని పాశ్చురైజ్డ్ మిల్క్ అంటారు. అవే చిరుపాలు లేదా ఆనవాలు అంటే. ఈ పాలలో బాక్టీరియా ఆనవాలు లేకుండా పోతుందన్నమాట. పాలు తాగటం అంటే అవి చిరుపాలుగా ఉండాలని రాయలవారి సూచన.

వానాకాలపు భోజనాలు

గగనము నీరు బుగ్గకెనగా జడివట్టిననాళ్ళు భార్య క
న్బొగ సొరకుండ నారికెడపుం బొఱియల్దవులించి వండ న
య్యగపల ముంచిపెట్టుఁ గలమాన్నము నొల్చినప్రప్పు నాలుగే
న్బొగిపిన కూరలు న్వడియము ల్వరుగు ల్పెరుగు న్ఘృతప్లుతిన్

గగనము నీరు బుగ్గకెనగా జడివట్టిననాళ్ళు:

ఆకాశం నీటిబుగ్గలాగా ఉండి, ముసురుపట్టి, జడివానలు కురిసే కాలంలో

భార్య కన్బొగ సొరకుండ నారికెడపుం బొఱియల్దవులించి వండ నయ్యగపల:

వానలకు కట్టెలు తడిసిపోయి సరిగా మండకపోతే, తన భార్య కంట్లోకి పొగ దూరకుండా ఉండాలని ఎండిన ఎడనీటి కొబ్బరి బోండాల్ని పొయ్యిలోపెట్టి వంట చేయించాడట.

కలమాన్నం:

ఆరు నెలలపాటు పండిన వరి ధాన్యం కలమ. దీన్నే ఆరునెలలసంబావు ధాన్యం అని కూడా పిలుస్తారు. కలమతోవండిన అన్నం కలమాన్నం.

ఒల్చినపప్పు:

కందులు లేదా, పెసలను విసిరి పొట్టు వల్చిన కంది,పెసర బేడలతో వండిన పప్పు. బేడ అనేది బైదళ (ద్విదళ) బీజానికి తెలుగు రూపం.

నాలుగేన్బొగిపిన కూరలు:

నాలుగైదు పొరటిన కూరలంటే ఉడికి తడారేలా వేగిన ఇగురు కూరలు

వడియములు:

మినపపప్పు మిరియాలు ఇంగువ వగైరా చేర్చి రుబ్బి, బిళ్లలుగా పోసి ఎండించిన వటకాన్ని వడియం అంటారు. అప్పడాలు, వడియాలను సలసలాకాగే నూనెలో వేసి వేయిస్తే అవి విషపదార్ధా లౌతా యని, వాటి సుగుణాలు సగానికి తగ్గిపోతాయనీ ఆయుర్వేదశాస్త్రం చెప్తుంది. వీటిని నిప్పు సెగమీద దోరగా వేగేలా చేసి, కూర, పులుసుల్లో వేసి ఉడికిస్తారు. లేదా, కొద్దిగా నూనెవేసి పైపైన వేయిస్తారు.

వరుగులు:

ఎండబెట్టిన లేదా వరగలించిన కూరగాయలు లేదా చేపల్ని వరుగులంటారు. వరుగుల్ని డబ్బాలో మూతబెట్టి భద్రపరుస్తారు. కూరగాయలు దొరకని రోజుల్లో వీటిని తీసి నానించి కూరగా వండుకునేవారు. లేదా వడియాల్లాగా కొద్దిగా నూనె వేసి పైపైన వేయించి అన్నంలో నంజుకునేవాళ్లు.

పెరుగు:

భోజనం చివరిగా తినే ద్రవ పదార్ధం పెరుగు.

వర్షాకాలపు ఆహారం గురించి ఇలా వివరించారు:

ఆకాశం నీటిబుగ్గలాగా ఉండి, ముసురుపట్టి, జడివానలు కురిసే కాలంలో వానలకు కట్టెలు తడిసిపోయి సరిగా మండకపోతే, తన భార్య కంట్లోకి పొగ దూరకుండా ఉండాలని ఎండిన ఎడనీటి కొబ్బరి బోండాల్ని పొయ్యిలోపెట్టి వంట చేయించాడట. కలమాన్నం, పెసర పప్పు, నాలుగైదు ఇగురు కూరలు, వడియాలు, వరుగులు, పెరుగు సిద్ధం చేయించాడట.

రాయలవారి వేసవి భోజనం

తెలి నులివెచ్చ యోగిరము దియ్యని చారులు దిమ్మనంబులున్
బలుచని యంబళు ల్చెరకు పాలెడనీళ్ళు రసావళు ల్ఫలం
బులును సుగంధి శీత జలముల్వడ పిందెలు నీరు జల్లయు
న్వెలయగ బెట్టు భోజనము వేసవి చందన చర్చ మున్నుగన్

వేసవికాలంలో ఇంటికి వచ్చిన అతిథులకు విష్ణుచిత్తుడు వడ్డించిన వంటకాలను రాయలవారు ఆముక్తమాల్యద కావ్యంలోని ఈ పద్యంలో వివరించారు:

తెలి నులివెచ్చ యోగిరము:

నులివెచ్చగా ఉన్న తెల్లన్నం అంటే వరి అన్నం. తేలికగా అరుగుతుంది. వడకొట్టదు.

దియ్యని చారులు:

తియ్యని చారు అంటే, చింతపండు వెయ్యని రసం. తమిళనాడులో దీన్ని ‘టిక్కాచారు’ అంటారు

తిమ్మనంబులు:

చల్లపులుసు

పలుచని అంబలి:

వరి లేదా జొన్న నూకల జావ (porridge). అంబకళము, పులియంబళకము ఇలా అంబలిని పులియబెట్టి తయారు చేసేవి కూడా ఉన్నాయి. ఇవి వడదెబ్బ తగలకుండా చేస్తాయి.

చెరకుపాలు:

చెరకు రసం. వేసవి తాపానికి విరుగుడు పానీయం ఇది.

రసావళుల్ఫలంబులు:

బాగా రసం నిండిన తియ్యమామిడిపండ్లు

సుగంధిశీతజలాలు:

ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క లాంటి సుగంధ ద్రవ్యాల పొడిని నీళ్లలో వేసి కాచి, చల్లార్చి కుండలో పోసిన చల్లని నీళ్లు. తమిళనాడు, కేరళలలో పచ్చి మంచినీళ్లకు బదులుగా జీరావాటర్, ధనియావాటర్, దాల్చినివాటర్, వాంవాటర్ లాంటివి ఈనాటికీ త్రాగే అలవాటుంది. వడదెబ్బకు విరుగుడు పానీయాలివి.

వడపిందెలు:

లేతమామిడి పిందెలు. వగరుగా ఉంటాయి వీటిని తరిగి ఉప్పు వేసి ఊరబెట్టి, మిరియాలపొడితో అన్నంలో తింటారు. వడపిందెలు వడకొట్టకుండా కాపాడతాయి.

నీరుచల్ల:

బాగా చిలికి 3 రెట్లు నీళ్లు కలిపి కనీసం 5-6 గంటలు కదల్చకుండా ఉంచిన మజ్జిగ నీటిని ‘నీరుచల్ల’ అంటారు. దీన్నిండా ఉపయోగించే బాక్టీరియా ఉంటుంది. చలవనిచ్చి, పేగులను సంరక్షిస్తుంది. ఉత్తమ వేసవి పానీయం.

ఎండలో పడి వచ్చిన అతిథికి ఇవి స్వాగత పానీయాలు (welcome drinks). చందనచర్చ అంటే మంచిగంథం పూసి వడదెబ్బ నుండి సేదతీర్చి, అప్పుడు భోజనం పెట్టేవాడన్నమాట.

ఇంటికొచ్చిన అతిథి షుగరు రోగి అయినా, బలవంతంగా స్వీట్లు పెట్టి, ఏం పర్వాలేదు, ఇంకో మాత్ర అదనంగా వేసుకోండని ఉచిత సలహాలిచ్చే ‘అతిమర్యాదలు’ విష్ణుచిత్తుడు చేయలేదు. కాలానికి తగ్గ ఆహార పదార్థాలను ఇంపుగా వడ్డించే వాడాయన.

కావ్యాలు చదివితే కలిగే ప్రయోజనం ఏమంటే, చెయ్యవలసినవి, చెయ్యకూడనివి రెండూ తెలుస్తాయి. శ్రీకృష్ణదేవరాయలు ఈపద్యంలో వేసవిలో వడకొట్టనీయని ఆహార పదార్ధాల పట్టిక ఇచ్చాడు. వాటిని మనం అవశ్యం గమనించాలి.

తేమనం/తిమ్మనం:

ఈ ‘తెలి నులివెచ్చ యోగిరము’ పద్యంలో రాయలవారు తిమ్మనం అనే వంటకాన్ని ప్రస్తావించారు.

తేమనం అంటే, తేమ (ద్రవత్వం) కలిగేలా చేయటం. ప్రాకృతంలో ‘తీమణ’ అంటారు. తింట, తిన్న, తిమిత, తిమ్యతి, తీమయతి, తీమన, తేమ, తేమన, తేమయతి, తైమ్య.. ఇవన్నీ తేమని, ద్రవపదార్దాల్ని సూచించే సంస్కృత పదాలు. ‘తేమనం’ వాటిలో ఒక భాగం. “తేమనం న పరివేషితవతి ఏవ” అంటే, అన్నంలో సాంబారు ఇంకా వడ్డించ లేదని అర్థం.

పెరుగుని చిలికి అందులో సంబారాలన్నీ వేసి తాలింపు పెట్టిన మజ్జిగపులుసుగా దీని వర్ణన క్రీశ. 200 నాటి గుజరాతీ లావణ్య సామి రూపొందించిన ‘బినులప్రపంధంలో కనిపిస్తుంది. గుజరాతీలు ఇందులో చిట్టి గారెలు గానీ, చిన్న ఉండల్లాంటి పునుగులుగానీ నానబెట్టు కొని తింటారు. ఒక రకం ఆవడల్లా ఉంటాయి.

ఈ తేమనం ‘ఖాదీ’ లాంటిదేనని ‘బిమల ప్రబంధం’ గ్రంథంలో పేర్కొన్నట్లు కె. టి. అచ్చయ్య తన ‘ఇండియన్‌ పుడ్‌’ పుస్తకంలో ఉదహరించారు. ఖాదీ అంటే తినేదని! తెలుగువాళ్లకూ చల్లపులుసులో బియ్యప్పిండిలో సంబారాలు కలిపి చిన్న చిన్న ఉండలు వేసి ఉడికించి ఆ ఉండల్ని ఇవతలకు తీసి తినే అలవాటుంది. 520 నాటి ‘వరణకసముచ్చయ’ గ్రంథంలో ‘ఖాదీ’ని ఇంగువ తాలింపు పెట్టిన పెరుగు పచ్చడిగా పేర్కొన్నారు. వెలగపండుని కాల్చి గుజ్జు తీసి అందులో పెరుగు కలిపి తాలింపు పెట్టిన పెరుగు పచ్చడిని ఖాదీ అంటారని చరకుడు పేర్కొన్నాడు. ఈ ‘వెలగ పెరుగుపచ్చడి’ 2000 ఏళ్ళ దన్నమాట.

నులివెచ్చగా ఉన్న అన్నం, చింతపండు రసం పొయ్యకుండా కాచిన తియ్యచారు, తిమ్మనం అంటే మజ్జిగపులుసు, పలుచని అంబలి, చెరకు రసం, మజ్జిగతో చేసిన లస్సీలాంటి పానీయాలు, పండ్లరసాలు, వాము, జీలకర్ర లేదా దాల్చిన చెక్కలాంటి సుగంధ ద్రవ్యాల్లో ఏదోఒకదానిని వేసి కాచిన నీళ్ళనే మంచినీళ్ళుగా ఇచ్చాడట. నీరుచల్ల అంటే గ్లాసు పెరుగుకు 3గ్లాసుల నీళ్ళు కలిపిచిలికిన చల్ల.

తేమనం, తిమ్మనం ఈ రెండింటికీ ఒక రకమైన ద్రవ వంటకం (సాస్) అని సంస్కృత నిఘంటు అర్థం. తెలుగు నిఘంటువులు తేమనం అంటే మజ్జిగ పులుసు అని వ్రాసాయి.

వేదం వారు ఈ పద్యానికి, వ్యాఖ్య వ్రాస్తూ, తిమ్మనం అంటే మజ్జిగపులుసు అని వ్రాశారు. బియ్యప్పిండి, కొబ్బరి, అల్లం, మిరియాలు, వాము వగైరాలను పాలతో ముద్దగా కలిపి చిన్న ఉండలుగా చేసి మరుగుతున్న మజ్జిగపులుసులో వేసి ఉడికిస్తే అవి ‘తిమ్మనలు’ అన్నారు. తేమనంలో ఉడికిన ఉండలు తిమ్మనలు. ఇవి విడిగా తినటానికి కూడా బావుంటాయి. వేసవిలో చలవనిస్తాయి.

బ్రౌన్ నిఘంటువు తిమ్మనము అంటే a sort of flummery, made of milk, flour and sugar. పాలు, పిండి బెల్లమువేసి వండినది, అని వ్రాసింది. శబ్దరత్నాకరం పాయసం అనే వ్రాసింది.

తిమ్మనాన్ని కూడా తేమనం లేదా చల్లపులుసు అనే అర్థంలోనే వాడటం ఉంది.

దామెరల వెంగళభూపాలుడు బహుళాశ్వ చరిత్రం కావ్యంలో “కందబజ్జి సమర్సించెఁ గందకబరి। పాలతిమ్మన మిడియె శంపాలతాంగి” అని పాలతిమ్మనల గురించి పేర్కొంది. అమరకోశంలో “స్యాత్తేమనం తు నిష్టానమ్‌ ‘తేమనాన్ని నిష్ఠానం అంటారని పేర్కొంది. తేమనం అంటే – తిమష్టిమి ఆర్ద్రీభావే. ఆర్ద్రమై అంటే పలుచగా ద్రవంలా ఉండేది అని వివరణ ఇచ్చింది. నిష్ఠానం అనే పేరు ఎలాగంటే, ఈ “తిష్టంత్యస్మిజ రసా ఇతి నిష్టానం”-ఇందులో రసాలుంటాయి కాబట్టి ఇది నిష్ఠానం అని పేర్కొంది.

మొత్తం మీద తేమనంలో రసాలు ఉండి అది పలుచగా ఉంటుందని మాత్రమే దీన్ని బట్టి మనకు తెలిసింది. అది తీపో, కారమో తెలీదు. రెండు రకాలుగానూ వండుకోవచ్చు.

‘పాక తిమ్మనం’:

బెల్లం, బియ్యప్పిండి కలిపి పాకం పట్టిందని!

పాలతిమ్మనం:

పలుచగా రుబ్బిన బియ్యప్పిండిని ఒక మందపాటి బట్టలోవడగడితే చిక్కని పాలలాంటి ద్రవపదార్హం దిగుతుంది. బియ్యంపాలు అనవచ్చు ఈ ద్రవాన్ని! బెల్లాన్ని దంచి, ఉడికిస్తూ, పాకానికి రాగానే అందులో ఈ బియ్యంపిండి పాలను కలిపి గరిట జారుగా చేసిన వంటకాన్ని తిమ్మనం అని కొందరు పిలుస్తారు. ఏలకులు, జీడిపప్ప లాంటివి పాయసంలో కలుపుకొన్నట్టే ఇందులోనూ కలుపుకోవచ్చు. పాలు పోయని. పాయసం ఇది! దీన్ని విడిగా తినవచ్చు, అప్పచ్చుల్లో నంజుకోవచ్చు.

తాలతిమ్మనం:

‘తాల తిమ్మనం’ అంటే తాలింపు పెట్టిందని! సంస్కృత నిఘంటువులు తేమనానికి సాంబారు/లేదా పప్పుచారు లాంటిదని అర్థం చెప్తున్నాయి

(సశేషం)

Exit mobile version