[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘శ్రీకృష్ణదేవరాయలు – ఆముక్తమాల్యద’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము. ఇది మొదటి భాగము.]
స్వాతంత్రోద్యమ కాలంలో చరిత్రను పరిశీలించిన పరిశోధకులు విజయనగర చరిత్రను స్వదేశీ, విదేశీ కోణాల్లోంచి ఎక్కువగా విశ్లేషణ చేశారు. ఆనాటి చరిత్రలో సుల్తాన్లు విదేశీ శక్తులు. స్వాతంత్యం వచ్చాక పరిశోధకుల దృష్టి హిందూ ముస్లిం వైరుధ్యాల కోణం మీదకు ఎక్కువగా మళ్లింది. కొత్త సహస్రాబ్దిలో గడచిన ఈ పాతికేళ్ల కాలంలో సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. కానీ, చరిత్ర పరిశీలనా దృక్పథంలో మార్పు రాలేదు. ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో అప్పట్లో జరిగిన సంఘటనల్ని ఇప్పటి అంశాలకు ఆపాదించి, మత విద్వేషాలకు చరిత్రను వాడుకునే పరిస్థితి నడుస్తోంది. చరిత్ర ఆశించే ప్రయోజనం ఇది కాదు కదా!
విజయనగర కాలంలో జరిగిన అభివృద్ధి పైన దృష్టిపెట్టి పరిశీలన చేస్తే, అది నేటి కాలపు ఆలోచనలకు మేలు చేసేదిగా ఉంటుంది. చరిత్ర పరిశీలనా దృష్టి మారాలన్నదే ఈ రచన ఆశిస్తున్న లక్ష్యం. చరిత్ర అవసరాన్ని ప్రజలు గుర్తించటానికి కావలసిన అంశాల గురించిన ప్రతిపాదనే తప్ప చరిత్రకారులకు పాఠాలు చెప్పే ప్రయత్నం ఇది ఎంత మాత్రమూ కాదు. చరిత్రను పాఠ్యాంశంగా ఎత్తేసి చరిత్ర తెలియని తరాన్ని సృష్టించే పాలకులు చరిత్ర ప్రాముఖ్యతను గుర్తించేలా చేయాల్సిన బాధ్యత చరిత్రకారులది. అలాగే, మేధావులది కూడా!
ఇన్నాళ్లూ, విజయనగర చరిత్రను భారతీయత, ప్రాంతీయత, జాతీయత, కులమతవర్గాల కోణాల్లోంచి పరిశీలిస్తూ వచ్చారు. కానీ, చరిత్ర ఆధారాలు, సాహిత్య ఆధారాలు, ప్రజల్లో వ్యాప్తిలో ఉన్న కథలు ఈ మూడింటికీ పొంతన లేకపోవటం, వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు తగ్గట్టుగా వీటిని ఎవరికివారు వ్యాఖ్యానించటం వలన ముఖ్యంగా కృష్ణదేవరాయల చరిత్రలో వక్రీకరణలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి.
ఈ కథనాలు ఎలా పుట్టాయి?, ఎందుకు పుట్టాయి? వాటిలో నిజం ఎంత? అనే ఆలోచనే లేకుండా ‘ట’కార ప్రయోగాలతో ప్రజలు అదే నిజమైన చరిత్రగా భావిస్తూ తమ తరువాతి తరాలకు అందిస్తూ వస్తున్నారు. ఈ 21వ శతాబ్దపు యువతకు కూడా అలాంటి కల్పిత గాథలను అందించే పరిస్థితి ఉండకూడదనే ఆవేదన ఈ రచనకు ప్రేరణ.
చరిత్ర గురించి కేవలం చరిత్రకారులు మాత్రమే మాట్లాడుకుంటారు. ప్రజలకు అసలు చరిత్ర తెలియకపోవటం వలన అమ్మమ్మ చెప్పినవో నాయనమ్మ చెప్పినవో చరిత్రగా భావిస్తారు. వాళ్లలో ప్రతిభావంతులు వాటికి మరిన్ని కొత్త కథలు అల్లి జనరంజకం చేస్తారు. తెనాలి రామకృష్ణ కథల సృష్టికర్తలు ఎంతటి ప్రతిభావంతులు కాకపోతే మేకకొక మేక.. మేకతోక లాంటి పద్యాలు అల్లగలుగుతారు? కానీ, అంతటి ప్రతిభావంతులు తమ సమర్థతను చరిత్ర సత్యాలను ప్రజలకు తెలపటానికి ఉపయోగించి ఉంటే ఎంతో మేలు జరిగి ఉండేది.
విజయనగర చరిత్ర అధ్యయనం అంటే, ఆర్థిక క్రమశిక్షణ, విదేశీ వాణిజ్యం, అధిక ఉత్పాదకత ఇవి ప్రధాన వస్తువులు కావాలి. పేదరాశి పెద్దమ్మకథలు చరిత్ర పట్ల ఉత్సాహాన్ని మాత్రమే కలిగిస్తాయి. కానీ, చరిత్ర పరిశోధనలు జ్ఞానాన్ని కలిగించేవిగా ఉండాలి.
కల్నల్ మెకంజీ కైఫీయత్తుల్లో ఉన్నకథనాలకు భిన్నంగా 1810 A.D.లో కల్నల్ మార్క్ విల్క్స్ అనే ఈస్టిండియా కంపెనీ గవర్నర్ మరియు చరిత్రకారుడు మైసూరు రాజ్యం ఎలా అభివృద్ధిని సాధించిందో వివరించాడు. మైసూరు రాజ్య చరిత్ర అనే కోణం లోంచి దక్షిణ భారత దేశంలో విజయనగర సామ్రాజ్యం నిర్వహించిన పాత్రని తొలుతగా విశ్లేషించిన పరిశోధకుడాయన. ఆ తరువాత వందేళ్లకు రాబర్ట్ సూయల్ పరిశోధనలు వెలువడ్డాయి. సూయల్ మద్రాస్ ప్రెసిడెన్సీలో రికార్డ్ కీపరుగా ఉద్యోగం చేసేవాడు. ఆయన విజయనగరాన్ని ఒక విస్మృత సామ్రాజ్యం (ఎ ఫర్గాటెన్ ఎంపైర్) అన్నాడు. కానీ, తెలుగు ప్రజల హృదయాలలో విజయనగర సామ్రాజ్యం అలాగే, శ్రీకృష్ణ దేవరాయలు అభిమానపాత్రమై చిరస్థాయిగా నిలిచి ఉన్నారు.
సూయల్ విస్మృత సామ్రాజ్యం గ్రంథ ప్రచురణ తరువాతే విజయనగర పరిశోధనలు ముమ్మరం అయ్యాయి. జాతీయోద్యమం అందుకు ప్రధాన కారణం. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో అనేకమంది పండితులు విజయనగర చరిత్రను తమకు దొరికిన ఆధారాలతో తమ భాషలో అందించే ప్రయత్నం చేశారు.
కృష్ణస్వామి అయ్యంగార్, కె.ఎ. నీలకంఠశాస్త్రి, బి.యె. శాలట్టోర్ లాంటి చరిత్రకారులు జాతీయతా వాద ప్రభావంతో విజయనగర సామ్రాజ్యం భారతీయతకు, భారతీయ సాంస్కృతిక వికాసానికి ఏ విధంగా తోడ్పడిందో వివరించారు. పరాయి సంస్కృతికి హంపీ విధ్వంసాన్ని ఒక సాక్షిగా చూపించారు. దక్షిణాదిలో ఏకైక హిందూ సామ్రాజ్యంగా విజయనగరాన్ని నిలిపారు.
Albert Henry Longhurst (1876 – 1955) అనే బ్రిటిష్ చరిత్రకారుడు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దక్షిణ భారత విభాగానికి ఆయన అధికారి. జాన్ మార్షల్ గారికి బావమరిది కూడా! 1927-31 నాగార్జున కొండ త్రవ్వకాలలోంచి బౌద్ధ చారిత్రక సంపదను వెలుగులోకి తెచ్చింది ఆయనే! 1917లో ‘Hampi Ruins Described and Illustrated’ అనే పుస్తకం వ్రాశాడు. హంపీ నగరం గురించి బైట ప్రపంచానికి ఈ పుస్తకం చాలా విలువైన విషయాలను తెలిపింది.
కొడాలి సుబ్బారావుగారు, కామరాజుగడ్డ శివయోగానందరావు కలిసి హంపీ క్షేత్రం పేరుతో ఒక్కో శిధిలం మీద పద్యాలలో వాటి చరిత్ర చెప్తూ గొప్పకావ్యం వ్రాశారు. చాలాకాలం ఈ పుస్తకం ముద్రణకు నోచుకోక పోవటంతో 1933లో విశ్వనాథ సత్యనారాయణ ప్రభృతులు పట్టుబట్టి ఆ పుస్తకాన్ని అచ్చులోకి తెచ్చారు.
Hampi Ruins, హంపీ క్షేత్రం ఈ రెండు పుస్తకాలనూ పక్కపక్కన బెట్టుకుని చూస్తే, బ్రిటిష్ అధికారి రచనలో భారతదేశానికి బ్రిటిష్ వారి అవసరం ఎంతైనా ఉందనే కోణం ప్రధానంగా కనిపిస్తుంది. కొడాలివారి హంపీ క్షేత్రంలో విదేశీ శక్తులు మన సంస్కృతిని, జాతీయతని ఎలా విధ్వంసం చేశారో ఆవేదన ధ్వనిస్తుంది. ఆనాడు తెలుగువారిని కృష్ణదేవరాయలు అమితంగా ప్రభావితం చేశాడు. జాతీయోద్యమంలోకి అత్యధిక సంఖ్యలో తెలుగు జనసామాన్యం ముందుకు దూకటానికి రాయలవారే పరోక్షంగా ప్రేరకుడయ్యాడనటానికి ఈ హంపీక్షేత్ర కావ్యమే తార్కాణం.
కొమర్రాజు లక్ష్మణరావుగారు, జమీందార్లు నాయని వేంకట రంగారావు (మునగాల), పార్థసారథి అప్పారావు (పాల్వంచ), సహచరుడు రావిచెట్టు రంగారావు ఇంకా ఆనాటి అభివృద్ధి కాంక్షాపరులు 1901లోనే తెలుగువారి కోసం శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని హైదరాబాద్ నగరంలో స్థాపించారు. అప్పటి దాకా తిరుమలలో ఇద్దరు దేవేర్లతో పాటుగా ఉన్న విగ్రహం తప్ప, రాయలవారు ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు, ఆనాడు కొమర్రాజువారు గీయించిన కృష్ణదేవరాయల ఊహాచిత్రమే ఈ నాటికీ రాయలవారి ముఖచిత్రంగా ప్రచారంలో ఉంది. కృష్ణదేవరాయల్ని తెలుగుభాషామూర్తిగా ప్రచారంలోకి తెచ్చారాయన. ఆ విధంగా తెలుగు వారిలో భాషా స్ఫూర్తిని కొమర్రాజువారే కలిగించారు. ఇదంతా జాతీయతాభావ ఆవేశంతో సాగిన భాషాసేవలో ఒక భాగం.
మండలి బుద్ధప్రసాద్ గారు కృష్ణాజిల్లా శ్రీకాకుళం ఆంధ్రమహావిష్ణు దేవాలయం ప్రాంగణాన ఆముక్తమాల్యద మంటపంలో రాయల వారు కూర్చుని ఆముక్తమాల్యద రచనకు శ్రీకారం చుడుతున్నట్టు ఒక నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పరచటం ద్వారా తెలుగుభాషోద్యమానికి గొప్ప ఊపుతెచ్చారు. తెలుగు భాషకు క్లాసికల్ హోదా కోసం జరిగిన పోరాటాన్ని తద్వారా ఉధృతం చేయగలిగారు. 2007 ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో కృష్ణదేవరాయ మహోత్సవాలు నిర్వహించారు. రాయలవారి వారసుడు శ్రీ అచ్యుతదేవరాయలను ఆహ్వానించారు. అది మొదలు ప్రతీ ఏటా ఫిభ్రవరి 11న ఈ మహోత్సవాలు క్రమం తప్పకుండా 2018 వరకూ నిర్వహించారు. ఈ ఉత్సవాల నిర్వహణలో నేను కూడా ముఖ్యభూమికను పోషించటం జన్మధన్యతగ అచెప్పుకోదగిన విషయం. తెలుగు వారందరూ రాయల వారిని కులమతాలతో నిమిత్తం లేకుండా భాషా సాంస్కృతిక ప్రతినిధిగా గౌరవించుకుంటూనే ఉన్నారు.
కన్నడ రాజ్య రమావిభు డైనప్పటికీ కన్నడం వారికన్నా రాయల కోసం ముందుగా స్పందించింది తెలుగు వారే! గురుజాడ శ్రీరామమూర్తిగారు 1893లో కవిజీవితములు గ్రంథంలో అష్టదిగ్గజాల ఉనికిపై మొదటగా సందేహం వ్యక్తపరిచారు.
కందుకూరి వీరేశలింగం గారు 1895లో ఈ ఆలోచనల్ని మరింత ముందుకు తీసుకుపోయారు.
1903లో జీర్ణకర్ణాటరాజ్య చరిత్రని వ్రాసి చిలుకూరి వీరభద్రరావుగారు రాయలవారిని ఒక సాంస్కృతిక వారధిగా ముద్ర వేశారు. రాబర్ట్ స్యూయల్ విస్మృత సామ్రాజ్యం ఇంకా అందుబాటులోకి రావటానికి ముందే విజయనగర చరిత్ర వ్రాసిన తెలుగు ప్రముఖులు వీళ్లు.
1915లో మహమ్మదీయమహాయుగం గ్రంథం ద్వారా కొమర్రాజు వేంకట లక్ష్మణరావు విజయనగర సామ్రాజ్యం హిందువుల ఐక్యత ఆవశ్యకత చాటారు.
1922లో వేటూరి ప్రభాకరశాస్త్రిగారు చాటుపద్యమణిమంజరిలో విజయనగర ప్రభువులు, కవుల ప్రశస్తిని లోకానికి చాటారు.
1935లో నేలటూరి వేంకట రమణయ్య, 1950లో చాగంటి శేషయ్య, 1960లో నిడుదవోలు వేంకటరావు ప్రభృతులు విజయనగర వైభవాన్ని విరివిగా వెలుగులోకి తెచ్చారు.
తెలుగు పరిశోధకులు రాయలవారి భాషాసేవ పైన ఎక్కువ దృష్టిపెట్టగా, కన్నడం వారు సంగమ వంశం మూలాలు గురించి తర్కం నడిపారు. రాయలవారి వలన ఆదరణ పొందిన కన్నడ కవులెందరో ఉన్నారు. కానీ, విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాల రాజకీయాల మూలాల గురించిన పరిశోధనల ద్వారా ప్రాంతీయతకే కన్నడం వారు ఎక్కువగా ప్రాధాన్యత నిచ్చారు.
క్రీ.శ. 1900లో రాబర్ట్ సూయల్ విధ్వంసానికి గురైన హంపీ నగరం వైపు పండితుల దృష్టిని మరల్చాడు. హంపీని తమ కళ్ళతో ఆఖరుగా చూసిన డొమింగో పేస్ మరియు నూనిజ్ కళ్లతో చూస్తూ ఆయన హంపీ చిత్రాన్ని చిత్రించాడు. ఒక అభివృద్ధిని దోచుకోవటానికి బహమనీ సుల్తాన్లు చేసిన ప్రయత్నంగా కాకుండా దీన్ని మతపరమైన ద్వేషానికి పరాకాష్ఠగా చిత్రించాడు. దోపిడీ దొంగని ఒక దొంగగా కాక అతని మతం, కులం అనే కోణంలోంచి విశ్లేషిస్తే దోపిడీ అప్రధానం అయి, మతవిద్వేషాలు పెచ్చుమీరటానికి కారణం అయ్యింది.
దక్షిణ భారతదేశ చరిత్రలో ఇస్లామీకరణను ప్రతిఘటించిన ఏకైక సామ్రాజ్యం విజయనగరమే! కానీ, విజయనగర వైభవానికి అది ఒక్కటే ప్రధానాంశం కాదు. కేవల మత వ్యతిరేకత వలన విజయనగర సామ్రాజ్యం ప్రపంచ ధనిక సామ్రాజ్యం కాలేదు కదా! అభివృద్ధి వెనక ఉన్న రహస్యం చరిత్రలో ప్రధానాంశం కాకపోవటం వలన చరిత్ర కలిగించే సామాజిక ప్రయోజనం నెరవేరకుండా పోతోంది.
కర్ణాటకలో మరో విచిత్ర పరిస్థితి కనిపిస్తుంది. రాయలు తుళువ వంశీకుడు కాబట్టి తుళువ వంశేతరులకు రాయలపట్ల ఉత్సాహం లేదనే ఆరోపణ ఉంది. కొందరైతే రాయలవారు విచక్షణ లేకుండా విదేశీ వ్యాపారుల్ని రప్పించటం వలనే ఈ రోజు భారతదేశం స్వాతంత్ర్యాన్ని కోల్పోయి బ్రిటిష్ వారికి బానిస అయ్యిందన్నవాళ్లూ ఉన్నారు. కలిబురిగి లాంటి కన్నడ మేథావులు రాయలు చేసిందంతా తెలుగుకే గానీ కన్నడానికి ఏమీ లేదన్నారు. కృష్ణదేవరాయల మహోత్సవాలను బహిష్కరించాలన్నారు. దీనివలన తుళు ప్రాంతీయుల మనోభావాలు గాయపడ్డాయి. తుళునాడు ఏర్పాటు చేయాలనే వాదానికి బలం చేకూరింది.
1520-22 లలో విజయనగరం కాలంలో కూరగాయలు అమ్మినంత స్వేచ్చగా వజ్రాల మార్కెటింగ్ జరిగేదని డోమింగో పేస్ వ్రాశాడు. విజయనగర సామ్రాజ్యంలో వజ్రాల గనులు ప్రధానంగా ఉన్నది తెలుగు ప్రాంతాల్లోనే! మంచిగంధం మొక్కల అడవులున్నది కన్నడ నేలమీద. తమిళ మలబారు ప్రాంతాలలో సుగంధ ద్రవ్యాలు పండుతాయి. ఈ విధంగా తెలుగు, కన్నడ, తమిళ, మళయాల ప్రాంతాలన్నీ కలిసి, విజయనగరాన్ని సుసంపన్నం చేశాయి.
ఉత్పాదకతని పెంచటంతో పాటు పట్టణ సంస్కృతిని పరిచయం చేయటానికి రాయలు ప్రయత్నించారు. రోము నగరం కన్నా పెద్దదని విదేశీ యాత్రికులు ఆనాడే పొగిడిన హంపీ విజయనగరంలో మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రవాణా మరియు నీటి నిర్వహణ లాంటి అంశాలు, ఆనాటి ఇంజనీరింగ్ వ్యవస్థ, పంటభూములకు నీటిని అందించిన వైనం, జలవనరులు, ఇరిగేషన్ విధానాలు, ప్రణాళికా బద్ధమైన పాలనా యంత్రాంగం, వాస్తుశిల్పకళలు, భవన నిర్మాణాలు, అపారంగా సాగిన వాణిజ్యం, సంస్కృతి మరియు కళలు విదేశీయుల్నే కాదు స్వదేశీయుల్ని కూడా ఆకర్షించాయి. ఆనాటి రహదారుల నిర్మాణాల గురించి కూడా చర్చ జరగాలి. గ్రామపాలనా వ్యవస్థతో పాటు, త్రిసముద్రాధీశుడైన రాయలవారు ఓడరేవుల్ని నిర్వహించిన విధానాలు గొప్పవి. సులభతరం చేసిన వాణిజ్య విధానాలు, ఉత్పాదకత నిచ్చిన వ్యవసాయం, పరిశ్రమలు, ఆనాటి ప్రజల జీవన ప్రమాణాలు, ప్రజాశ్రేయోపథకాలు ఇలాంటివి చరిత్రలో ప్రధాన చర్చనీయాంశా లైనప్పుడు ఈనాటి సమాజానికి అవి మార్గదర్శకా లౌతాయి. తప్పొప్పుల్ని సరిచేసుకునే ఆకరాలౌతాయి.
రాజధాని నగరాన్ని ఆధ్యాత్మిక నగరంగా, వాణిజ్యనగరంగా, పాలనా నగరంగా మూడు భాగాలుగా నిర్వహించిన వైనం ఆశ్చర్యం అనిపిస్తుంది. పరమత సహనం అనేది విజయనగరం నేర్పిన మొదటిపాఠం. ప్రభావంతమైన పాలన, పటిష్టమైన సైనిక వ్యవస్థ, ఆయుధ సంపత్తి కలిగి ఉండటం ద్వారా ఇతర రాజ్యాలపై పైచేయిని సాధించగలగటం, అపూర్వమైన సాంకేతిక ప్రగతి, ఆర్థిక ప్రణాళికలు, ఆదాయ వనరులతో పాటు భాషా సాహితీ సాంస్కృతిక కళా రంగాలకు పెద్దపీట వేశారు.
ఆనాటి తెలుగు శాసనాలలో సంస్కృత పారిభాషిక పదాల స్థానంలో అచ్చతెలుగు పదాలు కొత్తగా రూపొందాయి. భాషా వైషమ్యాలు ప్రబలకుండా రాయలవారు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతపు భాషలో పాలన అందించిన వైనం కూడా అర్థం అవుతుంది. రాయల వారు అన్ని విధాలా సమతుల్యత కోసం ప్రయత్నించారు. వాటి అధ్యయనావశ్యకత ఈనాడు ఎంతైనా ఉంది.
మనం కొత్త సహస్రాబ్దిలో మొదటి శతాబ్దిలో మొదటి పాతిక సంవత్సరాలు గడుపుకుని ఆధునికత వైపు పరుగులు పెడ్తూ, అభివృద్ధి కోసం కలలు కంటున్నాం. చరిత్ర కూడా ఆ కోణంలోంచి మనకు మార్గదర్శనం చేసేదిగా ఉండాలి!
“తెలుఁగదేల యన్న? దేశంబు దెలుఁ గేను దెలుగు వల్లభుండఁ, దెలుగొ కండ, యెల్లనృపులు గొలువ నెఱుఁగవే బాసాడి దేశ భాషలందుఁ దెలుగు లెస్స”
“తెలుగే ఎందుకంటే నా మాతృదేశం తెలుగు. నేను తెలుగు వల్లభుణ్ణి. తెలుగొ.. ఇంక తెలుగు భాషంటావా? కండ! అది కలకండలా (పటికబెల్లం) తియ్యనైనది. పటుతరమైన భాష. వివిధ భాషలు మాట్లాడే సామంతాది రాజులెందరో నీ కొలువులో ఉన్నారు. వాళ్లందరితో నువ్వు వాళ్ల భాషల్లోనే మాట్లాడుతుంటావు. నీకు అనేక భాషలతో పరిచయం ఉంది కదా! ఈ భాషలన్నింటిలోనూ తెలుగే లెస్స అని నీకు తెలుసు కదా..” అని కృష్ణరాయలకు స్వప్నసాక్షాత్కారం ఇచ్చిన ఆంధ్రమహావిష్ణువు తెలుగులో అమ్మవారి కథ వ్రాయమని ఆదేశించినట్టు రాయలవారే స్వయంగా పేర్కొన్నారు.
క్రీడాభిరామంలో శ్రీకాకుళ ప్రసక్తి రాగా మళ్ళీ ఆముక్త మాల్యదలోనే వచ్చింది. శ్రీకాకుళానికి రాగానే రాయలవారికి చటుక్కున క్రీడాభిరామం సహజంగానే గుర్తుకొచ్చింది. క్రీడాభిరామం అనగానే ఎవరికైనా ‘దేశభాషలందు తెలుగు లెస్స’ అనే పద్యపాదం కూడా గుర్తుకొస్తుంది. రాయలవారిక్కూడా గుర్తుకొచ్చింది. అది అలవోకగా ఈ పద్యంలో ఒదిగిపోయింది.
ఈ విషయంలో వేటూరి ప్రభాకరశాస్త్రిగారి వివరణ మరో ముందడుగు వేసింది. తెలుగులో ఏ అక్షరం వ్రాయాలన్నా ఎడమవైపుకు చెయ్యి తిప్పాల్సి ఉంటుంది. ఏత్వాలు, ఐత్వాలు, తలకట్లు, కొమ్ములు, గుడింతాలన్నీ ఎడమవైపు చెయ్యి తిప్పి వ్రాయందే కుదరవు. అందుకే తెలుగు లిపిని ‘వామావర్త లిపి’ అంటారు. కాబట్టి, ఇది జగజ్జననికి ప్రీతిపాత్రమైన భాష. అమ్మవారి కథ వ్రాయటానికి తెలుగే తగిందని, అది అమ్మవారి భాష అని భావం.
ఆముక్త మాల్యద వ్రాయాలనే సంకల్పాన్ని ఆంధ్రమహావిష్ణువే రాయలవారికి కలిగించాడు. ఇది ఒక తెలుగు రాజకవి వ్రాసిన అపూర్వ దివ్యప్రబంధం. వ్రాయించిన వాడు ఆంధ్రమహావిష్ణువు. ఈ ఆంధ్రమహావిష్ణువు ఎలా ఉంటాడు?
“నీల మేఘము డాలు డీలు సేయఁగఁ జాలు మెఱుఁగుఁ జామన చాయ మేని తోడ, నరవిందముల కచ్చు లడగించు జిగి హెచ్చు నాయతంబగు కన్నుదోయితోడఁ బులుగు రాయని చట్టుపల వన్నెనొర నెట్టు హొంబట్టు జిలుఁగు రెంటెంబు తోడ నుదయార్క బింబంబు నొఱపు విడంబంబు దొరలంగ నాడు కౌస్తుభముతోడఁ తే.గీ.
దమ్మి కేలుండఁ బెఱకేల దండయిచ్చు లేములుడిపెడు లేఁజూపు లేమతోడఁ దొలకు దయఁ దెల్పు చిఱునవ్వుతోడఁ గలఁ దంధ్ర జలజాక్షుఁ డిట్లని యానతిచ్చె”
రాయలవారికి దర్శనం ఇచ్చిన ఆంధ్రమహావిష్ణువు రూపాన్ని ఇలా వర్ణించాడు కృష్ణదేవరాయలు.
“నల్లని మబ్బుల కాంతి అంటే మెరుపు తీగల్ని జయించే మెరుగు చామన చాయ కలిగిన నీలకాంతిపుంజము కనిపించి అదే శరీరంగా మారిందా అన్నట్టుగా అనిపించింది. తామర పూల గర్వాన్ని ధిక్కరించగల విస్తారమైన కనుదోయి ఆ తరువాత కనిపించింది. గరుత్మంతుని రెక్కల కాంతినే మెరుగుపెట్టగల బంగారు పట్టువస్త్రం ఆ శరీరాన్ని ఆవరించి ఉంది. వక్షస్థలం మీద కౌస్తుభరత్నం అరుణార్కబింబ సౌందర్యాన్ని థిక్కరిస్తోంది. అంటే ఆయన వక్షస్థలం నీలాకాశం లాగా, కౌస్తుభరత్నం అక్కడ ఉదయిస్తున్న సూర్యునిలాగా ఉంది. ప్రక్కన లక్ష్మీదేవి ఒక చేతిలో పద్మాన్ని ధరించి మరొక చేతితో భర్త హస్తమును గ్రహించి ఉండగా కారుణ్యం తొణకిసలాడే చిరునవ్వుతో ఆంధ్రవిష్ణువు స్వప్నంలో సాక్షాత్కరించాడట.”
నంది తిమ్మన గారి పారిజాతాపహరణం, అల్లసాని పెద్దనగారి మనుచరిత్ర, రాయలవారి ఆముక్త గ్రంథాల్లో ఏది ముందు అనేది కొన్ని చారిత్రకాంశాలను వెల్లడి చేసే మంచి ప్రశ్న. పారిజాతాపహరణంలో ఈ పద్యం ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి:
“ఉదయాద్రి వేగ నత్యుద్ధతి సాధించె వినుకొండ మాటమాత్రనె హరించె గూటము ల్సెదరంగఁ గొండవీ డగలించె బెల్లముకొండ యచ్చెల్లఁ జెఱిచె వేలుపుఁగొండ యుద్వృత్తి భంగము జేసెఁ గంబంబు మెట్లు గ్రక్కనఁ గదల్చె బల్నికాయము కాలమట్టుల నడంచుఁ గటకమును నింక ననుచు ముత్కల మహీశుఁ డనుదినమ్మును వెఱచు నెవ్వనికి నతఁడు రాజమాత్రుండే శ్రీకృష్ణరాయవిభుఁడు
ఈ పద్యంలో ఉదయగిరి, వినుకొండ, కొండవీడు, బెల్లంకొండ, ఖమ్మంమెట్టు లాంటి దుర్గాలను అవలీలగా జయించాడని నంది తిమ్మన చెప్తున్నాడు. దీన్నిబట్టి దక్షిణ దిగ్విజయ యాత్రలో మొదటి భాగం అయ్యాక పారిజాతాపహరణం రచన జరిగిందని భావించాలి.
ఈ దిగివిజయ యాత్రలో కొండపల్లి కోట స్వాదీనం కాలేదు. రాయలవారు ధరణికోట వెళ్లి అమరావతి అమరేశ్వరుణ్ణి సందర్శించుకుని అక్కడ తులా దానం ఇచ్చినట్టు శాసనం వేయించాడు. “స్వస్తిశ్రీ మన్మహారాజాధిరాజ రాజమపరమేశ్వర మూరురాయర గండ, అరిరాయనిభాడభాషిగెతప్పున రాయరగండ, అష్టదిక్కరాయ మనోభయంకర, పూర్వదక్షిణ పశ్చిమ సముద్రాధీశ్వర, యవనరాజ్య స్థాపనాచార్య, గజపతినిభాడ, శ్రీ వీరప్రతాప, శ్రీకృష్ణదేవమహారాయలు విజయనగరానుండి పూర్వ దిగ్విజయ యాత్రకు వేంచేసి, ఉదయగిరి దుర్గము సాధించి తిరుమల ప్రేతరాయ మహాపాత్రుని బట్టుకుని అద్దంకి, వినుకొండ బెల్లముకొండ, నాగార్జున కొండ, తంగేడు, కేతవరము మొదలయిన గిరిదుర్గ స్థలదుర్గాలు అన్ని యేకధాటిం గైకొని కొండవీటి దుర్గము లగ్గలు పుచ్చుకుని ప్రతాపరుద్ర గజపతి కుమారుడు వీరబద్రరాయనిన్ని.. జీవగ్రహముగా పట్టుకుని వారికి అభయదానమిచ్చి ధరణికోటకు అమరేశ్వరులకై వేంచేసి స్వస్తిశ్రీ..” అది శాలివాహన శకం 1437 యువనంద సంవత్సర ఆషాఢ బహుళ 12 భానువారం.
ఆ తరువాత అహోబిలం వెళ్ళాడు. అక్కడ ఆయన వేయించిన శాసనంలో ఇలా ఉంది: “ధరణికోటకు విచ్చేసి అమరేశ్వర మహాదేవుని తులాపురుష మహాదానమున్ను చేయనవధరించి తిరిగి విజయనగరానకు విచ్చేసి రత్న సింహసనస్థుడై సామ్రాజ్యము చేయుచున్ను, మఱి కళింగదేశ దిగ్విజార్థమై విచ్చేయుచు, అహోబిలానకు వేంచేసి దేవుని దర్శించి, శా.సం 1439 అగు నేటి యువ సం. పుష్య శుద్ధ 15 శుక్రవారమందు శ్రీ అహోబిల దేవునికి..” క్రీ.శ. 1518 లేదా 1519 కావచ్చు. భువనవిజయ నిర్మాణం, పారిజాతాపహరణ కావ్యం ఈ సంవత్సరమే పూర్తయి ఉండాలి.
“తొలుదొల్త నుదయాద్రి శిలఁ దాఁకి తీండ్రించు నసిలోహమున వెచ్చనయి జనించె మఱి కొండవీఁడెక్కి మార్కొని నలియైన యలక సవాపాత్రునంటి రాఁజె నట సాగి జమ్మిలోయఁబడి వేఁగి దహించెఁ గోన బిట్టేర్చెఁ గొట్టానఁ దగిలెఁ గనకగిరిస్ఫూర్తిఁగఱచె గౌతమిఁగ్రాఁచె నవల నాపాట్నూర రవులుకొనియె మాడెములు వ్రేల్చె నొడ్డాది మసియొనర్చె గటకపురిఁ గాల్చె గజరాజు గలఁగి పఱవ దోఁక చిచ్చన నౌర యుద్దురతఁ గృష్ణ రాయ బాహు ప్రతాపజాగ్రన్మహాగ్ని. అభిరతిఁ గృష్ణరాయల జయాంకములన్ లిఖియించి తాళస న్నిభముగఁ బొట్టునూరి కడ నిల్పిన కంబము సింహభూధర ప్రభు తిరునాళ్లకుం దిగు సురప్రకరంబు కళింగమేదినీ విభునపకీర్తి కజ్జలము వేమఱుఁ బెట్టి పఠించు నిచ్చలున్
ఈ పద్యంలో పెద్దనగారు కళింగ దిగ్విజయ యాత్ర ప్రతాపరుద్రుని ఓటమిని ప్రస్తావించాడు సింహాచలంలో తాటి చెట్టంత విజయస్తంభాన్ని వేయించిన వైనాన్ని కూడా పేర్కొన్నాడు. కాబట్టి రాయలవారి కళింగ యాత్ర విజయవంతం అయ్యాకే మనుచరిత్రను పూర్తిచేసి రాయలవారికి కృతి నిచ్చాడని స్పష్టం అవుతోంది. మనుచరిత్ర తరువాతే పెద్దనకు ఆంధ్రకవితాపితామహ అనే బిరుదునిచ్చి గౌరవించాడు రాయలు.
సింహాచల శాసనాలు రెండు ఉన్నాయి. “..కృష్ణదేవ మహారాయలు విజయనగర సింహాసనా రూఢ్డై పూర్వ దిగ్విజయ యాత్రకు విచ్చేసి ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి, త్రాజమహేంద్రవరము మొదలయిన దుర్గాలు సాధించిరి. సింహాద్రికి విచ్చేసి స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శా. స. 1439 అగు నేటి ధాత సంవత్సర చైత్ర బ. ద్వాదశి వారాన సింహాద్రినాథుని దర్శించి…” ఇది మొదటి శాసనం.
రెండవ సింహాచాల శాసనం 2 యేళ్ల తరువాత రాయలవారు వేయించారు అందులో ఇలా ఉంది: “స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శఅవర్షంబు 1441 అగు నేటి ప్రమాది నామ సంవత్సర శ్రావణ శు. 13 సోమవారాన శ్రీ మన్మహారాజాధిరాజ.. శ్రీ వీరప్రతాప కృష్ణదేవరాయలు విజయనగర సింహాసనారూఢుడై సింహాద్రినాధునికి తమ పేరిట భోగము నడిచేటందుకు ప్రతాపరుద్ర గజపతి మహారాయల చేతను పుచ్చుకున్న గ్రామాలు కళింగ దండపాటలోని గ్రామాలు, పెడగాని గ్రామం.. సింహగిరి అప్పనికి..”
దీన్ని బట్టి కళింగ యాత్ర తరువాత పెద్దన మనుచరిత్ర కృతి నిచ్చినట్టు స్పష్టం అవుతోంది కాబట్టి, పారిజాతాపహరణం తరువాత రెండేళ్లకు అంటే 1520-21లో మనుచరిత్ర రచన పూర్తయ్యిందని అర్థం అవుతోంది.
శ్రీ కుందూరి ఈశ్వర దత్తు ఈ రెండు శాసనాలను విశ్లేషిస్తూ, మొదటి శాసనం రాయలవారు సింహాద్రిపైనే ఉండి వేయించాడని, రెండవ శాసనం ఆయన పరోక్షంలో వేయించిందని, రెండవ సింహాచల శాసనానికి దగ్గర్లో మనుచరిత్ర కృతినంది ఉంటాడని వ్రాశారు.
కృష్ణదేవరాయలు సంస్కృతంలో జాంబవతీ కళ్యాణం, మదాలసాచరితం, సత్యవధూప్రీణనం, సకలకథాసారసంగ్రహం, జ్ఞానచింతామణి, రసమంజరి లాంటి సంస్కృత గ్రంథాలు వ్రాశాడు. తెలుగులో ఆముక్తమాల్యద లేక విష్ణుచిత్తీయం అనే గోదాదేవి కథ దివ్యప్రబంధంగా వ్రాశాడు. ఈ ప్రబంధ రచన ఎప్పుడు జరిగిందనేది కూడా పండితుల మధ్య వివాదంగానే ఉంది.
“..విజయవాటిం గొన్ని వాసరంబులుండి శ్రీకాకుళ నికేతనుండగు ఆంధ్రమధుమధను సేవింపబోయి హరిసరోపవాసర మచ్చటగావించిన ఫుణ్యరాత్ర చతురయాముమున” అనే వాక్యాన్ని బట్టి, కుందూరి ఈశ్వరదత్తు గారు ఆముక్త మాల్యద వ్రాసిస తేదిని క్రీ.శ. 1519 జనవరి 26 వ తేదీ రాత్రి సుమారు పదిఘడియలకు కుంభ సంక్రమణ కాలము, ఆ దినము మాఘ బహుళ ఏకాదశినాడు రాత్రి 10 గంటలకు ముహూర్తంగా పెట్టుకుని ఆముక్త మాల్యద రచన ప్రారంభించాడని నిర్ధారించారు.
అంతకు ముందు 1517లో శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు దేవాలయంలో ఆయన దీని రచనకు సంకల్పం చెప్పుకోగా దిగ్విజయ యాత్రలు పూర్తయ్యాక 1519లో ఆముక్తమూల్యద రచన ప్రారంభించాడు.
ఆముక్తమాల్యదని రాయలు వ్రాయలేదనే వాదనతో మన పండితులు కొన్నాళ్ళు కాలక్షేపం చేశారు. ఆయనకంత కవితాశక్తి లేదని వీళ్ల నమ్మకం. నంది తిమ్మన గారు తన కృతిని రాయలకు అంకితం ఇస్తూ, “కవితా ప్రావీణ్య ఫణీశ” అన్నాడు. నిండు పేరోలగంలో కవిపండితుల సమక్షంలో రాయలవారిని కవితా ప్రావీణ్యం కలవాడనేంత పెద్ద అబద్ధం నంది తిమ్మన ఆడాడని వీరి భావన ‘అవంధ్య ప్రబంధ కృతి సంబంధ్యనుభావునకున్’ (1-31) సకల కళా ధోరణికిన్ లాంటి పదాలు కవిత్వ మర్మం తెలియని వాడికి నప్పేవి కాదు.
రాయలవారు వ్రాయకపోతే, మరి ఎవరు వ్రాసి ఉంటారు..? ముక్త కంఠంతో అల్లసాని పెద్దనే వ్రాశాడని చాలామంది అరిచారు. దానికి కోపగించి విశ్వనాథ సత్యనారాయణ “ఆముక్త మాల్యదలో నున్నన్ని భిన్నశయ్యలు వ్రాయగలడేని పెద్దన గారు మనుచరిత్రలో నేల వ్రాయలేదు!” – అని వేయిపడగలు నవలలో ఓ పాత్ర చేత అడిగించారు.
కాదు, వేరెవరో తమిళ వైష్ణవ పండితుడు వ్రాశాడన్నవారూ లేకపోలేదు. అంత పండితుడు తన తమిళంలో అలాంటి రచనే ఎందుకు చేయలేదనేది కూడా ఆలోచించాల్సిన ప్రశ్నే!
రాయలవారి కూతురుమోహనాంగి ‘మారీచీ పరిణయం’ ముందుమాటల్లో
“అకలుష మాధురీకలితయై యలసానికవీశు బోలె నల్లిక బిగి ముకు తిమ్మకవి లీలను ముద్దగుబల్కు పాండురంగకవిగతిన్ బదగ్రమముగల్గు కవిత్యముతోడ విష్ణుచిత్తుకథ రచించు మజ్ఞనకు దోరపుబత్తి నుతించి మ్రొక్కెదన్”
అని వ్రాసుకుంది. నిజంగా ఈ మోహనాంగి రాయలవారి కూతురే అయితే అప్పటికి ఇంకా పాండురంగ మహత్మ్య రచనే చేయని తెనాలి కవిని ఎలా ప్రస్తావిస్తుందీ? రామరాజభూషణుడి వసుచరిత్ర తరువాత తెనాలి రామకృష్ణుని పాండురంగ మహాత్మ్యం వచ్చింది.
మొత్తం మీద రాయలవారి గురించిన కథలు, ఆయన చరిత్ర కలగాపులగం అయి, నిజాలు జల్లెడకు దొరక్కుండా పోతున్నాయి.
కాలునిదున్న నందినయి గంటలు దున్నక మంటి నా మహా కాలుని నంది దున్న నయి కర్దమమగ్నత లేక మంటి నా, హాలికులెన్నండుం డెగనియౌరులచేలును, జాకుమళ్లుమం, గా, లలి వేరు సాంగి రిలఁ గల్గుపసింగొని పేద మున్నుగ౯”
ఓ రాజుగారికి పొలంలో పనిచేసుకునే రైతుల కష్టసుఖాల గురించి ఇంత వివేచన, ఇంత పరామరిక ఉంటుందా అని ఆశ్చర్యం కలుగుతుంది.. ఈ పద్యం చదివితే!
వ్యవసాయం మీద పన్నులు వేయటమే తెలుసు గానీ వ్యవసాయ పనుల గురించి ప్రభువులకే కాదు ప్రభుత్వాధికారులకు మాత్రం ఏం తెలుస్తుంది..? అనుకుంటాం! కానీ, రాయలవారి విషయంలో అది నిజం కాదు. సమకాలీన కవులలోకెల్లా రాయలవారి సామాజిక స్పృహ ఎన్నదగినిదిగా కనిపిస్తుంది. ఆయన ప్రతీ పద్యంలోనూ ఎంతో కొంత సమాజం కనిపిస్తుంది.
వానల సమృద్ధి వలన నాగలికి పని తగ్గుతుంది. రైతుకీ శ్రమ తగ్గుతుంది. అహల్యంగా అంటే దున్నకుండా వదిలేసిన భూములకూ జీవకళ వస్తుంది. వ్యవసాయం తొలి దశనాటి జీవనానికి అహల్యాశాప విమోచన వృత్తాంతం ఒక సాక్ష్యం. శ్రీరాముడు నాగలిని పరిచయం చేసి, రాయీ రప్పలతో అహల్యంగా (దున్నని రాళ్ళనేల) ఉన్న భూమిని పునరుత్పత్తికి దోహదపడే వ్యవసాయ క్షేత్రంగా మార్చాడని ఈ కథ మనకు చెప్తోంది.
రైతు కాలు స్పర్శ తగిలితే రాయి ఆడదయ్యిందనటం వెనుక లోతైన అర్థమే ఉంది. రైతు ప్రాధాన్యతని చాటిన కథ ఇది. ఒక ఋషి కుటుంబ వ్యహారంగా మాత్రమే చూస్తే ఈ కథలో తెలుసుకోగలిగేదేమీ ఉండదు.
రాయలవారి బాల్యం చంద్రగిరిలోనే అధికంగా జరగటం వలన చంద్రగిరి చుట్టూ ఉన్న గ్రామీణుల జీవితాలతో ఆయనకు ఎక్కువ పరిచయం ఉంది. పరిచయాన్ని కవిత్వీకరించి కావ్యం చేయటం గొప్ప విషయం. ఇది కూడా యుద్ధంలో గెలిచినంత పరిశ్రమే! అందుకే ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడయ్యారు.
ఈ పద్యంలో రాయలవారు వానలు బాగా కురిస్తే రైతుకు ఏ విధంగా మేలు జరుగుతుందో వివరిస్తున్నాడు: పనిలో పనిగా కొన్ని వ్యాసాయిక పదాలను కూడా ఈ పద్యంలో పరిశీలన చేద్దాం:
కాలుని దున్ననందినయి: వానలు సమృద్ధిగా ఉంటే మొదట సంతోషించేది కాలుని దున్న! యముడి వాహనం అయిన దున్నపోతుకీ వానకీ సంబంధం ఏమిటీ..? దున్నే పోతు కాబట్టి దున్నపోతు అయ్యింది. “దున్నపోతు మీద వాన కురిసినట్టు” అనేది తెలుగు సామెత. వానని పట్టిచుకోని దున్నపోతుకి ఈ వానని చూస్తే సంతోషం అయ్యిందట.
గంటలు: తెలుగులో గంట అనేది వ్యావసాయిక పదం. గడియారపు గంట కాదు, గంట అంటే, గడ్డి దుబ్బు. గంటలు అంటే దున్నక పోవటం వలన బీడు పడి అవురుదుబ్బలుగా గడ్డి పెరిగిన మెట్టిచేలు అని! ‘పైరు బాగా గంటకట్టు కొస్తోంది’ అంటే, రాయలసీమలో వరిమొక్కలు విస్తారంగా పెరిగాయని! గంటాలమ్మ అనే దేవత బహుశా ఈ వ్యాసాయిక దేవతే కావచ్చు కూడా!
మంటి: మంటి అంటే, మట్టి లేదా మన్ను అనే కాదు-మను, మనుగడ, బతకటం అనే అర్థం కూడా ఉంది. మంటినాన్ అంటే, హమ్మయ్య కడతేరాను, బతికిపోయాను అని! ఇంత వాన కురవటం వలన ఈ గడ్డి దుబ్బు నేలని కష్టపడి చదును చేసే శ్రమ తప్పిందని సంతోషపడింది కాలుని దున్న.
కర్దమ మగ్నత: ఇదొక చక్కని సంస్కృత పదబంధం. కర్దమం అంటే అడుసు లేదా బురద. భూమిని బాగా తడిపి దమ్ము చేయటానికి దున్నపోతుల్నే ఉపయోగిస్తారు. ఆవులు, ఎడ్లు బురదను ఇష్టపడవు. కాబట్టి, బురదలో పనులకు దున్నపోతులే తగినవి. ఈ వాన వలన కాలుని దున్న కూడా తనకు బురదమర్యాద తప్పిందనుకుందట. రాజకీయ నాయకులు ఒకరిమీద ఒకరు బురదజల్లుకోవటం కూడా ఇలాంటి కర్దమమన్నతే..!
మహాకాలుని నందిదున్న: పరమేశ్వరుడి నందిదున్న. వ్యవసాయ పనుల్లో ఎడ్లనే పొలాలు దున్నటానికి ప్రముఖంగా వాడతారు.
కర్దమమగ్నత: బురదలో పొర్లటం; పొలం దున్నేప్పుడు ఎడ్లకూ తడి మట్టి అంటుతుంది. బురద అంటడాన్ని కర్దమ మగ్నత అన్నారు రాయలవారు. బట్టలకు మట్టి అంటితే ఎక్కడ బురదలో పొర్లి వచ్చావని అడగటం లాంటిది. బురదంటే ఎద్దుకి ఎంత అసహ్యమో ఈ పదబంధం ద్వారా వ్యక్తపరిచారు రాయలవారు.
హాలికులు: హలం (నాగలి) వలన జీవించేవారు.
ఔరుల చేలు: ఔరు అంటే అవురుగడ్డి పెరిగిన భూమి. వ్యవసాయ యోగ్యత లేకుండా ఉండిపోయిన బంజరు భూమి. బంజరు అనేది హిందీ పదం. తెలుగులో ఔరుచేలు అంటారు. ఈ పదాన్ని మరచి పోయి హిందీ పదానికి అలవాటు పడిపోయాం.
జౌకుమళ్లు: జౌకు లేదా జవుకు అనేది కూడా వ్యావసాయిక పదమే. ప్రస్తుతం వాడకంలోంచి తప్పుకుంది. అది తప్పుకోలేదు, మనమే వాడటం మానేశాం. జౌకునేల లేదా జౌకు మడి అంటే ఊటనేల (swampy ground) ..ఊసర క్షేత్రాలు కూడా ఊట భూములుగా మారినందుకు సంతోషించాయట. వానవలన రైతులు, పశువులతో పాటు నేల కూడా ఆనందించిందంటారాయన.
రాజుగారు సుపాలన అందిస్తే వర్షాలు సమృద్ధిగా కురిసాయని నిరూపించటానికి రాయలవారు ఇన్ని ఉత్ప్రేక్షలు ప్రయోగించారు. “నెల మూడు వానలు నింగి కురిసె” అని మనుచరిత్రలో పెద్దనగారు రాయలవారి పాలన గురించి రాశారు ఇలాగే!
వరఁజుబడి రొంపిఁ ద్రొక్కం జరణంబులఁ జుట్టి పసిఁడి చాయకడుపులం బొరి నీరుకట్టె లమరిమ బిరుదములు హాలికులు దున్నఁబెట్టిరొ యనగఁన్”
ఈ చిన్న కందపద్యంలో రైతు పాదానికి రాయలవారు గండపెండేరం తొడిగారు..
రొంపి తొక్కటం అంటే, అడుసు తొక్కటం. నేలను దమ్ము చేయటం. అలా ఆ బురద తొక్కుతున్నప్పుడు ఆ బురదనేలలో ఉండే చిన్నచిన్న బురద పాములు రైతుల కాళ్లకు చుట్టుకుంటూ ఉంటాయి. అవి ప్రమాదం లేని పాములు వాటిని నీరుకట్టె లన్నారీ పద్యంలో రాయలవారు. నీటిపాములన్నమాట. రైతు పాదాలకు చుట్టుకున్న ఈ నీటిపాములు పసిడిచాయలో ఉండి రైతు పండితుల కాళ్ళకు కట్టిన బిరుదులు అంటే గండపెండేరాల్లా అనిపిస్తున్నాయట. వ్యవసాయ పాండిత్యం కలిగిన రైతుకు రాయలవారిచ్చిన గౌరవ భావన ఇది.
ఈ పద్యంలో వరజుబడి అంటే, పొలంగట్లవెంబడి అని! ‘వరజు’ మూలద్రావిడ పదం. తమిళంలో వరంపు, వరప్పు వరై-కన్నడంలో బర, బరె, వరి, వరె- తెలుగులో వరజు= సరిహద్దుగా వేసిన పొలంగట్టు(DEDR 5261). ‘గనిమ’ అనీ అంటారు.
మూలతెలుగు (Proto-Telugu) శబ్దం var- అంటే అడ్డుకట్ట లేదా హద్దుగా పోసిన కట్ట. తెలుగులో వర్జుగాను, వ్రప్పిగానూ వాడకంలోకి వచ్చింది. ఈ వర్ ‘వర’గా తెలుగులో స్థిరపడింది. ‘అంత వర-కు ఆగండి’, దాని వరకు వెళ్ళండి అంటే ఆ హద్దు దాకా అనే! మేర అనేది దీనికి సరైన అనువాదం. ‘ఆ మేరకు’, ‘అంత మేర’ లాంటి ప్రయోగాలు ఇప్పటికీ వాడకంలో ఉన్నాయి.
పదాల మూలాలు తెలిసినప్పుడు దాని వాడకానికి వన్నె తేగలుగుతాము. కానీ, వరజు అనేది వాడకంలోంచి తప్పుకుంది. ఇతర ద్రావిడ భాషల్లో సజీవంగా ఉండి ఒక పదం తెలుగులో మరణించటం మనకు ఘనమైన విషయం కాదుకాదా!
(సశేషం)
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.
You must be logged in to post a comment.
అవి ఎన్నటికీ మరువరాని తలపులు
అనగనగా ఒక అన్వర్
ముద్రారాక్షసమ్ – చతుర్థాఙ్కః – 1
భావోద్వేగాల వనిత
అమ్మ కడుపు చల్లగా-24
ఐదు రూపాయలు
ముద్రారాక్షసమ్ – ప్రథమాఙ్కః – 16
భూతాల బంగ్లా-4
జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-41
కశ్మీర రాజతరంగిణి-46
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®