Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ శిరిడీ సాయినాధుని సత్య స్వరూపం

సాయి ఎవరు? అనే మౌలికమైన ప్రశ్నకు వివిధ సాయి భక్తుల నుండి విభిన్నమైన సమాధానాలు వస్తాయి. సాయి అంటే శిరిడీలో 60 సంవత్సరాల పాటు నివసించి, యోగ విద్యలో పరిపూర్ణుడై ఎన్నో లీలలు చేసిన గురువు అని కొందరు, షిరిడి మందిరంలో ప్రతిష్ఠించిన విగ్రహం రూపంలో వున్న దేవుడని కొందరు, జీవితమంతా భిక్షాటనతో జీవించిన ఒక ముస్లిం ఫకీరు అని మరికొందరు భావిస్తుంటారు. యద్భావం – తద్భవతి! భావం బట్టే మనకు లభించే గురువు అనుగ్రహం ఆధారపడి వుంటుంది. సాయి పట్ల మన భావం అల్పమైనచో మనపై వర్షించే సాయి అనుగ్రహం కూడా అల్పం గానే వుంటుంది. సాయి అనుగ్రహం మనపై పుష్కలంగా వర్షించాలంటే సాయిపై మన భావం కూడా ఉన్నతం గానే వుండాలి. అందుకు సాయి ఎవరు? ఆయన బోధలు, తత్వం ఏమిటి అన్న విషయాలను అవగతం చేసుకుంటే తప్ప ఉన్నతమైన, శ్రేష్ఠమైన భావాలు మనకు కలగవు.

అందుకే తనను గూర్చి శ్రీ సాయి ఏమన్నారో ఒకసారి శ్రవణం చేద్దాం: “అన్ని ప్రాణుల హృదయాలలో వుండే నేనే నిజమైన నేను” ఆని ఒక సందర్భంలో, “నేనే బ్రహ్మమును, నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడు, నేనే ఓంకారమును, అందరి హృదయాలలో అందరి కంటే సమీపంగా నివసించుచుందును. నన్ను శ్రద్ధా భక్తులతో పూజించిన ఎడల శ్రేయస్సు పొందుతారు.” ఆని పలికారు. ఇంకొక సందర్భంలో “నేను మీకు అన్నింటి కంటే ఎంతో సమీపస్థుడను, సర్వ అంతర్యామిని, అందరికీ ప్రభువును నేను. ఈ దృశ్య ప్రపంచమంతా నా స్వరూపమే! పిపీలికాది పర్యంతం జడమైన పర్వతముల వరకు అన్నియూ నా వ్యక్త స్వరూపములే. ఈ విశ్వమంతా నా ఆత్మ స్వరూపమే. నా రాకపోకలకు తలుపులతో నిమిత్తం లేదు. నేను ఏ ఆధారం లేక ఈ జగత్తు అంతటా ప్రయాణం చేయగలను. నేను నామ, రూప, గుణ రహితుడను. సర్వత్రా నిండి వున్న నేను మూర్తీభవించిన జ్ఞానం, చైతన్యం, ఆనంద రూపమని అవగతం చేసుకొనండి. నా నిజ స్వరూపమును తెలుసుకొని సదా నన్నే ధ్యానించు” అని అపూర్వంగా పలికారు శ్రీ శిరిడీ సాయినాధులు.

దీనిని బట్టి శ్రీ సాయి పరిశుద్ధ పరమేశ్వర అవతారం అని మనకు స్పష్టంగా అవగతమవుతోంది. ఇప్పుడు శ్రీ శిరిడీ సాయినాధుల సత్య స్వరూపం గూర్చి శ్రవణం చేద్దాం. “ప్రకాశైక స్వరూపుడు, జనన మరణ చక్ర భ్రమణములకు అతీతుడు, నిత్య ప్రకాశకుడు, పరమ పవిత్రుడు, విశుద్ధ విజ్ఞాన ఘన రూపుడు, నిరాకారుడు, నిర్గుణుడు, త్రిగుణాతీతుడు, పరిపూర్ణుడు, ఆనంద స్వరూపుడు, క్రియా రహితుడు, నిరాకార పరబ్రహ్మం, మాయాతీతుడు, స్వప్రకాశకుడు, కాలాతీతుడు, సర్వ వ్యాపకుడు, అనంత విశ్వమంతా వ్యాపించి వున్న సత్య జ్ఞాన సాగరుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు, నిర్మలుడు, వాగా తీతుడు, అమృత స్వరూపుడు, శాశ్వత ఆత్మ స్వరూపుడు”.

ఆయనే స్వయంగా ఒక సందర్భంలో ఒక భక్తునితో “నేను పుట్టినప్పుడు కొడుకు పుట్టానని మా అమ్మ ఎంతో పొంగిపోయింది. ఆది చూసి ఆమె నన్ను కన్నది ఎప్పుడు? ఆమె కన్న ముందు నేను లేనా? అందుకు ఆమె ఎందుకంత ఆనంద పడుతోందో నాకు అర్ధం కాలేదు అని ఆశ్చర్యపోయాను” అని అన్నారు. దీనిని బట్టి శ్రీ శిరిడీ సాయినాథులు అయోనిజ సంభవులని, జనన మరణములకు అతీతమైన ఆత్మ స్వరూపమని అర్ధమౌతోంది కదా! అందుకే శ్రీ సాయి వివిధ భక్తులకు వారు కోరిన రూపాలలో దర్సనం ఇచ్చి ఎన్నో సందర్భాలలో తన సర్వజ్ఞత చాటారు.

Exit mobile version