[శ్రీరామనవమి సందర్భంగా శ్రీ కుంతి రచించిన ‘శ్రీ రామ స్తుతి!’ అనే పద్య కవితని అందిస్తున్నాము.]
శ్రీ నయన కువలసోమా!
దానవ దైత్యభుజశక్తి దర్పవిరామా!
ధ్యానముని హృదయ ధామా!
దీనజనావన శుభగుణ ధీర లలామా! కం
నీ నామంబెవడంతరంగమెలరన్ నిత్యంబు వల్లించు;న
వ్వానిన్ ప్రేమగ జూచి గూర్చెదవయా! భద్రంబు భాగ్యంబు;స
న్మానంబున్, యశమున్, జయంబులను, పూర్ణానుగ్రహంబున్; వెసన్
నానాజన్మల పాప సంచయములన్ నాశంబు గావించుచున్!
మాటయదన్న నొక్కటియె! మాన్య కలంబము గూడ యొక్కటే!
మాట,మనమ్ము చెయ్దముల మైథిలి యందనురాగమొక్కటే!
సాటిగ నిల్చు వారెవరు జానకి నాథుని శీల సంపదన్!
నాటికి నేటికిన్ జనుల నాలుకలందువసించెనందునన్!
ఎవ్వడు తండ్రి యానతిని నిష్టముగా తల దాల్చునెప్పుడున్!
ఎవ్వడు తల్లి పాదములనిచ్ఛగ భక్తిని గొల్చు నెప్పుడున్!
ఎవ్వడు భ్రాతృ ప్రేమ కయి యిక్కటులెన్నియొ నోర్చునెప్పుడున్!
అవ్వరదాతనాప్తుని పదార్చన చేయుచు ముక్తి కోరెదన్!
వందన మాచరించెదను భాస్కర వంశయశః ప్రదాతకున్!
వందన మాచరించెదను వాచిక తాపసికిన్ ప్రవక్తకున్!
వందన మాచరించెదను పావన మార్గము జూపు నేతకున్!
వందన మాచరించెదను భాసుర రావణ దర్ప జేతకున్
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు.
‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు.
వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు.
హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి.
కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.