[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
67. ఒంటె కథ!
పూర్వం ఒక ఒంటె మరెవరికీ అలవి కానంత తపస్సు చేసింది. దానికి బ్రహ్మ మొచ్చుకొని “నీకే వరం కావాలో కోరుకో” అన్నాడు. చాలామందికి చాలా వరకు తమకు ఏమి కావాలో, యేది కోరుకుంటే జీవితం ఆనందభరితం అవుతుందో తెలియదు. మూర్ఖంగా వ్యవహరించి, అర్థంపర్థం లేని కోరికలు కోరుకొని ఆపదల పాలు అవుతుంటారు. ఒంటె అటు వంటేదే.
బ్రహ్మగారితో “నా మెడ నూరు ఆమడల దాకా సాగాలని కోరిక” అన్నది. బ్రహ్మ తనలో తాను నవ్వుకుని “తథాస్తు” అన్నాడు.
వరం పొందిన ఒంటె అహంకారంతో సాటి వాడి సహాయాన్ని ఆశించక సోమరితనంతో ఉన్నది. ఒక రోజున కావాలని మరీ తన మొడకాయను పొడిగించి ఆడవిలో చక్కగా మేత వేస్తున్నది. అంతలో గాలి వాన వచ్చింది. వాన బాగా పడుతుండడంతో ఒంటె తన మొడకాయను చాచి ఒక గుహలోనికి తలను పెట్టింది. ఆదమరిచి హాయిగా నిద్రపోయింది.
అంతలో ఒక నక్క తన భార్యతో అటు కేసి వచ్చింది. గుహలో ఉన్న ఒంటె తలను నక్క దంపతులు చాశాయి. ఆకలితో నకనకలాడుతున్న, నక్కలు ఒక్క ఉదుటున ఆ ఒంటె పీకను పట్టుకున్నాయి. అవి నెత్తురు త్రాగుతూ, మాంసము ముక్కలు క్రమక్రమంగా మ్రింగుతూ ఉండగా ఒంటెకు మెలుకవ వచ్చింది. అది మెడను త్రిప్పుకుంటుండగానే ఆ నక్కలు మెడ నరాలు తెగిపడేటట్లు పట్టకుని కొరికాయి. పట్టు తప్పి ప్రాణం విడిచింది ఒంటె.
అంటే మనము ఎప్పుడు జాగరూకులమై అహంకారాన్ని విడిచి, సాటి వారి సాయాన్ని అందుకుంటూ వెళ్ళాలి అన్న సత్యము ఈ కథ మనకు తెలుపుతుంది. మనము ఎలా నడుచుకుంటే సుఖపడతామో అన్న ప్రశ్నకు ఏమరుపాటు లేకుండా ఉంటూ ఇతరుల సహాయాన్ని అందుకున్నప్పుడు సుఖపడతాము అని తెలుపు కథ.
భీష్ముడు ధర్మరాజుకు చెప్పినది.
శాంతి పర్వము తృతీయాశ్వాసము లోనిది.
Small things amuse small minds – Doris Lessing.
68. సముద్ర సరిత్సంవాదము!
సముద్రానికీ, నదికీ మధ్య ఒక చక్కని సంవాదము జరిగింది. నదులతో సముద్రము ఆనందంగా సల్లాపాలు సాగిస్తూ “మీరు మంచి ఉరవడితో పొంగి పొరిలి పాగేటపుడు మీ గట్ల మీది చెట్లు కూడా పడిపోతుంటాయి కదా. మరి ప్రెబ్బలి చెట్లు పడిపోవడమేమిటి? అవి మీకు యేమైనా ఒరగబెట్టాయా? మిమ్మల్ని ఏమైనా సంతృప్తి పరిచాయా? లేక వాటిని పెల్లగించక పోవడము మీ వలన కాకపోవటం వలననా? యే కారణం చేత ప్రెబ్బలి చెట్లు మొదళ్ళు పెకిలించబడటం లేదు?” అన్నప్పుడు గంగానది ఇలా అన్నది.
“బిగు వెడలక నిలిచి పడున్
నగములు వేతసచయంబు నమ్రంబై పె
ల్లగు మా వేగము గడపి యె
సఁగు బూర్వస్థితిన బ్రదుకు సమకూరంగన్!!” (12-3-88)
“సముద్రుడా! మా గట్ల మీది చెట్లన్నీ తమ బింకము సడలనీయకుండా నిలబడుతాయి. అందువలన నీటి వేగానికి తట్టుకోలేక నిట్టనిలువునా కూలి పోతుంటాయి. ప్రబ్బలి చెట్లు ఆ విధంగా కాకుండా నీటి వేగాన్ని బట్టి వంగి ఉండి, ఆ ఉరవడి తగ్గినాక ఎప్పటి వలె సజీవంగా నిలబడి ఉంటాయి” అని సమాధానం చెప్పింది.
బలహీనుడైన వాడు తన బలాన్ని, ఎదుటివాడి బలాన్ని అంచనా వేసుకోవాలి. మొండిగా పోరుకు దిగకూడదు. పగవాడి మిడిసి పాటును యుక్తిగా తొలగించుకోవాలి. అప్పుడే ప్రతివాడు చెడుపు లేకుండా నిలబడతాడు. అంటే సమయానుకూలంగా పని చేసుకునే వాడికి ఎట్లాంటి ఆపదలు రావని భావం.
ఎదుటి వాడు అధిక బలం కలవాడైతే అల్పబలం కలవాడు కాస్తా ఆపద గట్టెక్కేంత వరకు తల వంచుకొని ఉండడంలో తప్పు లేదు. అనువుగాని చోట అధికుల మనరాదు, కొంచెముండు టెల్ల కొదవ గాదు. శతృరాజు అధిక బలం గలవాటైతే, అల్ప బలం గల రాజు ఆపదల నుండి ఎట్లా గట్టెక్కుతాడు అన్న ధర్మరాజు ప్రశ్నకు భీష్ముడు చెప్పిన వారి వాదమిది.
శాంతి పర్వము తృతీయాశ్వసము లోనిది.
Patience and perseverance overcome mountains – Gandhi
69. శీలము కథ!
సత్ప్రవర్తన కలవారు సంపదతో తులతూగుతారు. మాంధాత, నాభాగుడు మొదలగు మహారాజులంతా శీలం వల్లనే లోకంలో గౌరవం పొందారు. శీలం మూలంగానే ఒకప్పుడు ప్రహ్లాదుడు ఇంద్రుడి రాజ్యాన్ని లోబరుచుకున్నాడు. ధర్మబద్ధంగా ముల్లోకాలను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. దీనికి ఇంద్రుడు కినుక చెందాడు. బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు.
“నాకు మేలు జరిగే ఉపాయమును చెప్పుము” అన్నాడు. బృహస్పతి “శుక్రాచార్యుడి వలన నీకన్నీ తెలుస్తాయి, వెళ్ళుము, అతడు దయకలవాడు” అన్నాడు. ఇంద్రుడు శుక్రాచార్యుడి వద్దకు వెళితే శుక్రాచార్యుడు ప్రహ్లాదుని దగ్గరకు వెళ్ళమన్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషములో వెళ్ళి, ప్రహ్లాదునికి శిష్యుడిగా చేరి శుశ్రూషలు చేయసాగాడు. కొంత కాలం గడిచింది. ప్రహ్లాదుడికి శిష్యుడిపై వాత్సల్యం కలిగింది.
ఇంద్రుడు “మూడు లోకాలు మీ ఏలుబడి కిందికి ఎల్లా వచ్చాయో తెలుసుకోవాలని ఉన్నది” అన్నాడు. దానికి ప్రహ్లాదుడు “నేను పాలకుడినని చెప్పుకోను. అహంకారంతో, ఈర్ష్యతో ఇతరులను నొప్పించను. మహనుభావులకు ధనము, ద్రవ్యము దానంగా ఇస్తుంటాను. నా నడవడిని బ్రాహ్మణులు, సజ్జనులు మెచ్చుకుంటారు కావున ఇంత వాడినయ్యాను” అన్నాడు.
అప్పుడు ఇంద్రుడు “నీ ధర్మ శీలాన్ని నాకు దయతో ఇప్పించవలసినది. అయినా పుణ్యాత్ములను ఆశ్రయించిన వారు బ్రతకవద్దా?” అన్నాడు. ప్రహ్లాదుడు అతడి తీరును చూచి ‘ఇతడు బ్రాహ్మణుడు కాదు’ అని తెలిసినా తన శీలాన్ని దానం చేశాడు. మాట నిలుపుకోవడం, ఆశ్రితులను ఆదరించటం, పాలకులై పాలితులను అక్కున చేర్చుకోవడం శీలవంతుల లక్షణం కదా. తన శీలాన్ని దానం చేసి మరింత గుణశీలడయ్యాడు ప్రహ్లాదుడు.
ప్రహ్లాదుడి శీలాన్ని పొంది ఇంద్రుడు వెళ్ళగానే ప్రహ్లాదుని శరీరంలో నుండి అందంగా మెరిసిపోతున్న పురుషాకారం బయలుపడింది. ఆ పురుషుడిని “నీవెవడవు?” అని ప్రహ్లాదుడు ప్రశ్నించాడు. “నేను శీలాన్ని. నీవు దానం చేసిన బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళిపోతాను” అని చెప్పి వెళ్ళిపోయాడు. వరుస పెట్టి ప్రహ్లాదుడి శరీరం నుండి తేజోమయ రూపాలు వెళుతుంటే ప్రహ్లాదుడు వారి పేర్లు అడిగి తెలుసుకున్నాడు.
ఆ తేజోమయ రూపాలు ఉత్తమ ధర్మం, సత్యం, సద్వర్తనం, బలం కావటం విని ప్రహ్లాదుడు ఎంతో దుఃఖించాడు. అంతలో ఒక మంచి రూపవతి అతడి శరీరం నుండి బయటపడింది. బయలుపడ్డ స్త్రీని చూచి “నీవెవరవు?” అని ప్రహ్లాదుడు అడిగాడు. “నేను సిరిని. బలం ఎక్కడికి పోతుందో నేను అక్కడికే పోవాలని బయలుదేరాను” అన్నది. అది విని ప్రహ్లాదుడు భయపడ్డాడు. “ఓ దేవీ ! నన్ను సేవించింనదెవరు?” అని అడిగాడు. “అతడు ఇంద్రుడు నీ రాజ్య సంపద కొల్లగొట్టిడానికి వచ్చాడు. నీవు నీ శీలాన్ని అట్లే పోగొట్టుకున్నావు. శీలం వలన ధర్మం, రాణిస్తుంది. ధర్మం వలన సత్యం, ఆ సత్యం వలన ప్రవర్తన, ఆ ప్రవర్తన వలన బలం, ఆ బలం వల్ల సంపత్తి వెంటనంటి ఉంటాయి. కనుక అన్నిటికీ మూలం శీలమే” అని చెప్పి, ధర్మం మైదలైన వాటితో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయింది.
ఆ వృత్తాంతం ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి చెప్పాడు. అపుడు దుర్యోధనుడు “ఇంతకీ శీలం ఎలాంటిది ? ఎవరైనా తమకు తెలియని తమ దగ్గర లేని దానిని గూర్చి అడగడం సహజమే కదా?” అన్నాడు.
అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా చెప్పాడు:
“పరహితము సిగ్గుపాటుం
బొరయక యుండంగ నెదిరి బోధించుటయున్
నరసముదయంబు వొగడెడు
చరితము శీలమున కంగసంపద వత్సా!” (12-3-148)
మనసూ, మాటా, శరీరం ఈ మూడింటి చేత అన్ని ప్రాణాలుకు ఎల్లాంటి హాని చేయకుండా ఉండటమే శీలం. ఇది చాలా మేలు కలిగిస్తుది. దీనిని మనసులో పెట్టుకొనుము.
సాటివారికి తోడు పడటం, సిగ్గుపాటు పనులు, చేయకూడదని ఎదుటి వాళ్ళకు తెలియ చెప్పటం, జనం ఇష్టపడేటట్లు నడుచుకోవటం శీలానికి అవయవసంపద” అని ధృతరాష్ట్రుడు తెలిపాడు.
కావున సత్ప్రవర్తన/శీలము వలన సిరి కలుగుతుంది. అది లేనినాడు సంపదలు తొలిగిపోతాయి. మనుజుడు అట్టి సత్ప్రవర్తన మనసులో అలవరచుకోవాలి. ఈ కథ స్థూలంగా శీల నిర్మాణం, శీల పరిరక్షణ, శీల సంపద అను విషయాలను తెలియ చేస్తుంది. వినే వారుంటే ధృతరాష్ట్రుల లాంటి వారు కూడా శీలం గురించి చెబుతారు. ధృతరాష్ట్రుల లాంటి వారు చెబుతుంటే దుర్యోధనుడి లాంటి వారు శీల నిర్మాణం గూర్చి ఎలా అర్థం చేసుకుంటారో పఠితులే అర్థం చేసుకోవాలి.
అనుష్ఠింపబడని విషయాలను బోధిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటుంది. మంచి విషయాలు మంచి వారు చెబితే అది సమాజంలో చూపే ప్రభావం వ్యర్థులు చెబితే ఉండదు.
భీష్ముడు ధర్మరాజుకు చెప్పినది
శాంతి పర్వము తృతీయాశాస్వము లోనిది.
Honor itself is wealth to great man
సర్వగుణ భూషణ మెన్నగ శీలమే సుమీ.
All your scholarship would be in vain; of at the same time you do not build your character and attain mastery over your thoughts and actions – Mahatma Gandhi.
(ఇంకా ఉంది)
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు.
‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు.
వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు.
హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి.
కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
