[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
59. షోడశ రాజచరిత్రము!
మహాభారత యుద్ధములో అభిమన్యుడు అధర్మంగా చంపబడినాడు. దానికి ధర్మరాజు మిక్కిలి దుఃఖితుడయినాడు. అప్పుడు ధర్మరాజులకు వ్యాసులవారు మృత్యువు అనివార్యం అని తెలుపుతూ అనేక కథలు తెలిసినారు. అందులో భాగంగా నారదుడు సృంజయునకు సువర్ణష్టీవి మరణానంతరము షోడశ రాజుల చరిత్రనిట్లు వినిపించెనని, ఆ చరిత్రమును ధర్మరాజుకు వ్యాసుడు తెలిపెను.
1. మరుత్తరాట్చక్రవర్తి:
మరుత్తను రాజు, దేవగురువైన బృహస్పతిపై ఈర్ష్య వహించిన సంవర్తునిని యాగద్రష్టగా నియమించుకొని హిమాలయ పర్వత పాద ప్రాంతమందున బంగారముతో నిర్మించబడిన యాగశాలలు, యాగసాధనాలతో మహావైభవంతో వస్త్రములు, ఆజ్యము, పయస్సు, ఫలములు మొదలగు వస్తు సంపదలతో అనేక అశ్వమేధాలు చేశాడు కాని భూమిపై నిత్యుడు కాలేదు.
2. సంహత్సుడు:
సన్మార్గములో బ్రాహ్మణులను పూజించి, వ్రతములతో సంతుష్టి గావించాడు. ఇంద్రుడు అతడి రాజ్యంలో బంగారు వానలు కురిపించాడు. అలా బంగారు వానలు కురుస్తుండడంతో బంగారు చేపలు, ఎండ్రలు, తాబేళ్ళు పడినాయి. ఆ మహారాజు స్వర్ణమయములైన వస్తువులను అర్హులకు దానమిచ్చాడు. అనేకములైన అశ్వమేధ యాగాలు చేశాడు. అతడు భూమిపై నిత్యుడు కాలేదు.
3. అంగ మహారాజు:
బంగారు నగలచే అలంకరింపబడిన ఏనుగులను, జవసత్వాలు కలిగిన, సకలగుణములు కల గుర్రములను, బంగారు కొమ్ములు గల లక్షల కొలది గోవులను, బలిష్ఠమైన పెక్కగొర్రెలను, పొట్టేళ్ళను, అలంకరింపబడిన కన్యలను దానాలుగా ఇచ్చాడు. పెక్కు యాగాలు చేశాడు. జీవించి లేడు.
4. శిబి చక్రవర్తి:
సప్తద్వీపములందు నిరాటంకంగా తన రథంపైకెక్కి విహరిస్తూ, వెళ్ళి శత్రువులను మాట లేకుండా చేశాడు. ప్రజలను మెప్పించాడు. పరమేశ్వర కృపకు పాత్రుడయ్యాడు పెక్కు అశ్వమేధాలు నిర్వహించాడు. వృష్టిధారలను లెక్కించ వచ్చును కాని, దానమొసగిన గోవులను లెక్కించజాలము. సత్యం, అహింసా ధర్మములలో నడిచి, ఇంద్రాగ్నులను మెప్పించాడు. ఆ అపార త్యాగదానశీలి నేడు లేడు.
5. శ్రీరామ చంద్రుడు:
పితృవాక్య పరిపాలన, సత్యపాలన, ఏకపత్నీవ్రతము, ధర్మనిష్ఠ, సుపరిపాలన, దుష్టశిక్షణ చేసి రామరాజ్యం స్థాపించి ప్రజలను సుభిక్షంగా పాలించిన రాముడు కాల వశుడైనాడు.
6. భగీరధుడు:
తన పూర్వీకుల పాపాలను తొలగించి వారికి సద్గతులను కలిగించాలని, ఆకాశం నుండి నేలకు గంగను దింపిన మహానుభావుడు. అశ్వమేధ యాగములు చేయునపుడు వేలకొలది రథములందు అలంకరింపబడ్య కన్యలను కూర్చుండబెట్టి, ఒక్కొక్క రథమునకు నూరేసి యేనుగులు, ఒక్కొక్క యేనుగుకు వేయ్యేసి గుర్రములు, ఒక్కొక గుర్రానికి వేయ్యేసి గోవులు చొప్పున స్వర్ణం దక్షిణతో పాటు దానమిచ్చెను.
7. దిలీపుడు:
ఇతడు చేసిన యజ్ఞయాగాలలో గంధర్వులు, అప్సరసలు ఆడి పాడినారు. దివ్య మునులు యాగములను ప్రశంసించిరి. జనులు అన్న, వస్త్ర, స్వర్ణ భూషణముల చేత సంతృప్తులయిరి. మరి నేడు కలరా?
8. మాంధాత:
పుట్టినది మొదలు దేవేంద్రుడి చేతి నుండి కారే నెయ్యిని, పాలను త్రాగి, పన్నెండు సంవత్సరాల ప్రాయము కలవాడై రాజ్యపదవి పోయి, భూమండల భారము వహించి, అగ్ని పర్వతములతో, ఆజ్య నదులతో విప్రులకు భోజనము పెట్టి, రాజసూయ, అశ్వమేధ యాగాలు చేశాడు. కాని నేడు లేడు.
9. యయాతి:
దేవతలకు యుద్ధమున సహాయమొనర్చెను. వర్ణాశ్రమాలు నెలకొలిపెను. అగ్నిష్టోమము, అశ్వమేధము, వాజపేయము, అతిరాత్రము, పౌండరీకములనెడి యాగములు పెక్కు గావించెను. తనికేమి నిలుపుకోక దానం చేసెను. శుక్రుడి అల్లుడైన ఈ రాజు శాశ్వతుడు కాలేడు.
10. అంబరీషుడు:
శత్రువులందరు మూకుమ్మడిగా దాడి చేయగా, వారందరిని ఓడించి, ప్రాణభిక్ష నర్థించిన వారిని విడిచిపెట్టెను. పాయసము, అపూపము, మోదకములతో మణి దక్షిణలతో దానం చేసెను.
11. శశిబిందుడు:
లక్షమంది కన్యలను పెండ్లాడి, ఒక్కొక్క భార్యయందు పది వేలమంది పుత్రుల చొప్పన పది కోట్ల మంది పుత్రులను బడిసెను. అతడు, అతడి పుత్రులు కర్మనిపుణతతో అనేక భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసిరి. మృత్యువు వదలలేదు.
12. గయుడు:
అగ్నిదేవుని అనుగ్రహము చేత బ్రహ్మచర్యము, దమము, వేద పరిజ్ఞానము, అహింస, పాత్ర, దానము, శమము అను వానిని వరముగా పొందినాడు. ముప్పదియారు యోజనముల పొడవు, అంతే వెడల్పు కల బంగారం వేదికపై యజ్ఞములు చేశాడు. దక్షిణలు, దానములు ఇచ్చినాడు. అతడం యజ్ఞం చేసిన చోట ఒక వటవక్షం వెలిసినది. మృత్యువు మన్నించలేదు.
13. రంతిదేవుడు:
సత్ర యాగం నిర్వహించాడు. ఇరవయి అయిదు వేల పాచీకులతో వంటలు చేయించి రేయింబవళ్ళు, అభ్యాగతులకు ఇష్టమున్న భోజనాలు పెట్టాడు. ఉత్తమగతిని కోరి, తమకై తాము వచ్చు పశువులను మాత్రమే యజ్ఞమున హింసించెను. దేవతలు హవిర్భాగముల స్వీకరించి, దీవించిరి. లోకాంతరం తప్పలేదు.
14. పృథు చక్రవర్తి:
నేలను సమతలంగా చేసెను. భూమికి పృథివి యను పేరు పృథువు పేర కలిగినది. గోరూపమును ధరించిన భూమిని దేవతలతో పితికించి ఔషధులను, రత్నములను పొంది లోకములను పోషించెను. స్థిర శరీరం పొందలేదు.
15. పరశురాముడు:
జమదగ్ని పుత్రుడు. తండ్రి మాటలపై తల్లిని చంపి, తండ్రిని వరమడిగి తల్లిని బ్రతికించుకున్నవాడు. క్షత్రియులపై పగ బూని ఇరవది యొక్క సార్లు దండెత్తి వారిని వధించాడు. గర్విష్టి అయిన కార్తవీర్యుని సంహరించినవాడు. భూమిని ఏలుతూ, రాజోచిత, బ్రాహ్మణోచిత యజ్ఞాలు చేశాడు. భూమిని కశ్యపునకు దానమొసగినాడు. అతడు లేదు నేడు.
16. భరతుడు:
బాల్యముననే క్రూరమృగాలపై విహరిస్తూ, వాటితో క్రీడించాడు. సర్వ సత్వములను దమింప చేసి సర్వదముడయ్యాడు. యజ్ఞయాగాదులు చేశాడు. భూరి దక్షిణలు ఇచ్చాడు. మృత్యువును దాటలేదు.
ఈ కథలన్నీ సృంజయుడికి నారదుడు చెప్పినవి. వ్యాసులవారు ధర్మజునికి వినిపించి సుస్థిరుడవై యుండవలసినదని హితవు పలికి వెడలిపోయెను. ధర్మరాజు కొంత శాంతించెను. ద్రోణ పర్వములోనిది. “Time is stronger than all things, Death emit it’s all”.
60. ఒంటె కథ!
పూర్వం ఒక ఒంటె మరెవరికీ అలవి కానంత తపస్సు చేసింది. దానికి బ్రహ్మ మెచ్చుకొని “నీకే వరం కావాలో కోరుకో” అన్నాడు. చాలామందికి చాలావరకు తమకు యేమి కావాలో, యేది కోరుకుంటే జీవితం ఆనందభరితం అవుతుందో తెలియదు. మూర్ఖంగా వ్యవహరించి, అర్థం పర్థం లేని కోరికలు కోరుకోని ఆపదల పాలు అవుతుంటారు. ఒంటె అటువంటిదే.
బ్రహ్మగారితో “నా మెడ నూరామడల దాకా సాగాలని కోరిక” అన్నది. బ్రహ్మ తనలో తాను నవ్వుకొని “తథాస్తు” అన్నాడు. వరం పొందిన ఒంటె అహంకారంతో సాటివాడి సహాయాన్ని ఆశించక సోమరితనంతో ఉన్నది. ఒక రోజున కావాలని మరీ తన మెడకాయను పొడిగించి అడవిలో చక్కగా మేత వేస్తున్నది. అంతలో గాలి వాన వచ్చింది. వాన బాగా పడుతుండడంతో ఒంటె తన మెడకాయను చాచి ఒక గుహలోనికి తలను పెట్టింది. ఆదమరిచి హాయిగా నిద్ర పోయింది.
అంతలో ఒక నక్క తన భార్యతో అటుకేసి వచ్చింది గుహలో ఉన్న ఉంటె తలము నక్కు దంపతులు చూశాయి. ఆకలితో నకనకలాడుతున్న, నక్కలు ఒక్క ఉదుటున ఆ ఒంటె పీకను పట్టుకున్నాయి. అవి నెత్తురు త్రాగుతూ, మాంసము ముక్కలు క్రమక్రమంగా మ్రింగుతూ ఉండగా నక్కకు మెలకువ వచ్చింది. అది మెడను త్రిప్పుకుంటుండగానే ఆ నక్కలు మెడ నరాలు తెగిపడేటట్లు పుటుక్కున కొరికాయి. పట్టు తప్పి ప్రాణం నడిచింది ఒంటె.
అంటే మనము ఎప్పుడూ జాగరూకులమై అహంకారాన్ని విడిచి, సాటివారి సాయాన్ని అందుకుంటూ వెళ్ళాలి అన్న సత్యము ఈ కథ మనకు తెలుపుతుంది. మనము ఎట్లా నడుచుకుంటే సుఖపడతాము అన్న ప్రశ్నకు ఏమరుపాటు లేకుండా ఉంటూ యితరుల సహాయాన్ని అందుకున్నప్పుడు సుఖపడతాము అని తెలుపు కధ.
భీష్ముడు ధర్మరాజుకు చెప్పినది.
శాంతి పర్వము తృతీయాశ్వాసము లోనిది
Small things amuse small minds – Doris Lessing
(ఇంకా ఉంది)
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు.
‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు.
వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు.
హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి.
కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.