[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
57. గాలవుడి కథ!
నేనీ పని తప్ప మరే పని చేయను అని మొండి పట్టు పట్టే వారికి ఎక్కుడైనా ఆపదలే కలుగుతాయి. గాలవుడి కథ ఇందుకు ఉదాహరణ.
గాలవుడు విశ్వామిత్రుడి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు. గురువుతో “మీకేమి గురుదక్షిణ కావాలో కోరుకోండి” అన్నాడు. “నాకేమి వద్దు” అన్నాడు కౌశికుడు. మరలా మరలా గాలపుడు యేదైనా కోరుకొండని విశ్వామిత్రుడిని విసిగించాడు. దానితో కోపగించిన విశ్వామిత్రుడు శరీరమంతా తెల్లగా ఉండి, ఒక చెవి మాత్రమే నల్లగా నున్న ఎనిమిది వందల గుర్రాలను కానుకగా తెచ్చి యివ్వమని కోరాడు. గాలవుడు గురువు కోరికను తీర్చుటకు బయలుదేరాడు. కాని అట్టి గుర్రాలను ఎక్కడా గాలవుడు సంపాదించ లేకపోయాడు. విచారభారముతో ఆహార నిద్రలు మానివేశాడు. ప్రాణాంతము చేసుకుంటానని అనుకుంటుండగా, చిన్ననాటి మిత్యుడు గరుత్మంతుడు కలిశాడు. అతడితో తన బాధను చెప్పుకున్నాడు.
గరుత్మంతుడు “తూర్పుదిక్కున దేవతలుంటారు. దేవతలు తప్ప ఇతరులు ఇలాంటి కార్యాలు సాధించలేరు. కావున మనమటు వెళదాము” అని గాలవుడికి ధైర్యము చెప్పి, తన మూపు పైన ఎక్కించుకొని ఆకాశ మార్గంలో వెళుతుండగా, గాలవుడు చేష్టలుడిగి శ్రమచేత నిలువలేక ప్రక్కకు ఒరుగుతుండగా ఒక కొండపై దించాడు. అతడి బడలిక పోగొట్టాడు. అక్కడ శాండిలిని కోపానికి గురై తన రెక్కలు ఊడిపడగా గరుత్మంతుడు ఆ మునిని ప్రార్ధించి, తన రెక్కలను తిరిగి మొలిపించుకొని, తూర్పు దిక్కనకు కాకుండా, తిరిగి గాలవుడిని భూమండలానికి కొనివచ్చాడు.
ప్రతిష్ఠానపుర రాజైన యయాతి తన చిన్ననాటి చెలికాడు కావటం చేత గాలవుడిని అక్కడికి తీసుకొని వెళ్ళాడు. అతడికి గాలవుడి వృత్తాంతమంతా తెలిపాడు. యయాతి “నా దగ్గర అలాంటి గుర్రాలు లేవు. కానీ నాకు మాధవి అనే కూతురుంది. ఆమెను తీసుకొని వెళ్ళుము. ఈ కన్నెక కొరకైనా యే రాజైనా గుర్రాలను ఇవ్వక పోతాడా” అని గాలవుడికి మాధవిని సమర్పించాడు.
మాయాతి కూతురైన మాధవిని వెంట బెట్టుకొని గాలవుడు అయోధ్య రాజైన ఇక్ష్వాకు రాజు దగ్గరికి వెళ్ళి ఆయనను సందర్శించి, తన వృత్తాంతము చెప్పాడు. ఆయన నాదగ్గర రెండు వందల గుర్రాలు ఉన్నాయి. అంతకు మించి లేవు అన్నాడు. అప్పుడు మాధవి “ఒకానొక ముని వర ప్రభావం వలన నేను చడ్డలను ఉన్నప్పటికీ కన్యగానే ఉంటాను. కావున నన్ను ఇతడికి భార్యగా సమర్పించండి. నన్ను ఇక్ష్వాకుడికి పత్నిగా నిచ్చి వచ్చిన గుర్రాలను వచ్చినట్లుగా పుచ్చుకొమ్ము” అని సలహా యిచ్చింది. అందుకు గాలవుడు సమ్మతించాడు.
సంతానం లేని ఇక్ష్వాకు సంతోషించి, ఒక కుమారుడు కలిగే దాకా మాధవి తనకు భార్యగా ఉంటుందని పలికి కన్యాశుల్కంగా రెండు వందల గుర్రాలను ఇచ్చుకున్నాడు. ఇక్ష్వాకు మాధవి యందు సుమనస్సుడు అనే కుమారుడు పట్టిన తరువాత తిరిగి ఆమెను గాలవునికి ఇచ్చివేశాడు. ఇదే పద్ధతిలో గుర్రాలను సంపాదించుకొమ్మని తెలిపి గరుత్మంతుడు వెళ్ళిపోయడం. గాలవుడు గుర్రాల కోసం మాధవితో పాటు భూమండలమంతా తిరుగుతున్నాడు.
ఆ సమయంలో కాశీశ్వరుడైన దివోదాముడు, భోజాధీశుడైన దేశీనరుడు మాధవికి రెండేసి వందల గుర్రాలనిచ్చి అనేక బలవంతులైన కుమారులను పరమ సంతోషంతో పొందారు. మాధవి దివోదాసుడికి ప్రతర్ధనను; దేశీనరుడికి శిబిని కన్నది. అయినా కన్యాత్వం కోల్పోని ఆమెను వెంటబెట్టుకోని గాలవుడు భూసంచారం చేస్తుండగా, గరుత్మంతుడు వచ్చి, “ఇంక నీవు శ్రమపడ వద్దు. భూమి మొత్తం మీద ఆరు వందల గుర్రాలే అట్టివి ఉన్నాయి. అవి నీకు
లభించాయి. ఇంక అట్టి గుర్రాలు లభించవు. ఈ ఆరువందల గుర్రాలు మీ గురువుకు సమర్పించి, తక్కువ పడిన రెండు వందల గుర్రాలకు బదులుగా ఈ తరుణి అయిన మాధవిని కూడా వారికి సమర్పించు” అని సలహా ఇచ్చాడు. గరుత్మంతుడు తాను కూడా గాలవుడితో వెళ్ళి, విశ్వామిత్రుడిని దర్శించి ఆరు వందల గుర్రాలను పొందిన విధమెరిగించి “ఇతడు పసివాడు. మీరు కృపాస్వభావులు. ఇతడిని గురు బుణము నుండి విముక్తి కావించండి” అని వేడుకున్నాడు.
విశ్వామిత్రుడు మాధవిని స్వీకరించి అష్టకుడనే కుమారుడిని కని మాధవిని గాలవుడికి అప్పగించాడు. మాధవి తపస్సు చేసుకోవటానికి వెళ్ళిపోయింది. గాలవుడు బ్రతుకుజీవుడా అంటూ, గురుఋణ విముక్తుడయ్యాడు. తన మొండి పట్టువల్ల వచ్చిన కష్టాలకు పొందిన దుఃఖానికి విచారిస్తూ తన పురానికి తిరిగి వెళ్ళాడు.
ఇదే కథలో ఒక భాగమైతే, ఒక స్త్రీని కావలసిన వారు కావలసిన విధంగా పుత్రులను పొందటానికి ఉయయోగించే యంత్రంగా వాడుకొనే వాళ్ళని, స్త్రీలు ఇతర ప్రయోజనాలు నెరవేర్చడంలో ఉపయోగింపబడే వారని కన్యాశుల్కం పద్ధతి ఉండేదని తెలుస్తుంది.
ఈ కథల వెనుక ధార్మిక మర్మాలు, ఆధ్యాత్మిక రహస్యాలు ఉంటే ఉండవచ్చు
గాక కాని స్థూల దృష్టికి కొంత దోషైక దృష్టిని చూపుతుంది.
నారదుడు దుర్వోధనుడికి చెప్పినది.
ఉద్యోగ పర్వము తృతీయాశ్వాసం లోనిది.
– మూర్ఖస్య నాస్త్యౌషధం
– There is no cure for the headstrong.
58. అకంపనుని కథ!
మహాభారత యుద్ధమునందు అధర్మంగా అభిమన్యుడు చంపబడ్డాడు. దానితో ధర్మరాజు శోక వ్యాకులుడైనాడు. అప్పుడు చెంతనే ఉన్న వ్యాసభగవానుడితో ధర్మరాజు “మునీంద్రా! ప్రాణికోటికి మృత్యువు తప్పదా?” అని అడుగగా, వ్యాసుడు “ప్రాణికోతికి మృత్యువు అనివార్యము” అని తెలుపుతూ, తత్సంబంధితమైన ఒక కథను వినిపించాడు.
పూర్వము అకంపనుడను రాజు యుద్ధమున పట్టుపడెను. అతని కుమారుడగు హరి యనువాడు శత్రువులతో భీకరముగా పోరాడి, తన తండ్రిని విడిపించెను. అతడు అంతటితో నూరకుండక శత్రువులను తరుముతూ వెళ్ళి, వారికి చిక్కబడి సంహరించబడెను. జయము సిద్దించియు పుత్రుడు మరణించుటతో అకంపనుడు శోకచిత్తుడాయెను. అపుడు నారదుడు అక్కడికి వచ్చి “మృత్యువెంతటి వారికైనా తప్పదు, చనిపోయి స్వర్గ మలంకరించిన వారికై దుఃఖించుట తగదు” అని ఓదార్చెను. మరియు మృత్యువకు సంబంధించిన ఒక కథను తెలిపెను.
బ్రహ్మ లోకములను సృష్టించగా సంహారము లేక లోకములనంతములుగా వృద్ధి చెందుచుండెను. దానితో భూమికి భారమధికమయ్యెను. బ్రహ్మకు జీవులను తగ్గించుటమెట్లో తెలియక కోపము వహింపగా అతని శరీరము నుండి అగ్ని జ్వాలలు వెడలి జీవరాసులు దహింపజొచ్చెను. అప్పుడు పరమేశ్వరుడు లోకహితము కోరి బ్రహ్మ కడకు వచ్చి, “నీవే చరాచర భూతములను సంహరించుచున్నావు. అట్లు గాక తగిన పద్ధతిని ఆలోచింపుము” అనెను. ప్రజాపతి అందులకు సమ్మతించెను
బ్రహ్మశరీరం నుండి నల్లని అంగములు, ఎఱ్ఱని ముఖముగల ఒక స్త్రీ ఉద్భవించెను. బ్రహ్మ ఆమెను చూచి జీవులను సంహరించుమని ఆదేశించెను. ఆమె బ్రహ్మతో సంహారమను క్రూరకర్మము చేసి, పాపమునకు ఒడిగట్ట లేనిని తెసిపినది. బ్రహ్మదేవుడు ఆమెను అతికష్టంపై అంగీకరింప చేసి, రాగద్వేషములు లేని, చిత్త వికారములు పొందునని అనుగ్రహించెను. మృత్యుదేవత విధి నిర్వహణ యట్టిదియని యెరిగిన అకంపనుడు దుఃఖము విడిచెను.
అంటే పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదని, మరణం సంభవించేటపుడు అప్పటి సంఘటనలు మరణానికి కారణాలుగా కనబడతాయి తప్ప నిజానికి మరణం ఎపుడో నిర్ణయించడమైనది. కాబట్టి కారణాలు చూసి గాని, మృత్యువును చూసి గాని దుఃఖించరాదు. అనివార్యమైన మృత్యువుకు మనమెవరము కారణము కాదు అని గ్రహించాలి.
ద్రోణ పర్వములోనిది.
– మృత్యుర్వై ప్రాణినాం ధ్రువం
– Death is certain to all leaving creatures.
59. సువర్ణష్ఠీవి కథ!
అభిమన్యుడు యుద్ధమునందు అధర్మముగా చంపబడెను. పుత్రుడి మరణానికి దుఃఖిస్తున్న ధర్మరాజుకు ‘మృత్యువు’ అనివార్యమనుచు తెలుపబడినది సువర్ణష్ఠీవి కథ.
పూర్వం సృంజయుడను మహారాజు మహావైభవంతో సంపూర్ణ దక్షిణలతో పెక్కు యాగములు చేసెను. సృంజయునికి అపారమైన రాజ్యసంపద కలదు. కానీ సంతానం లేకపోవటం చేత మిక్కిలిగా దుఃఖించుచుండెను. సృంజయునికి నారదముని మిక్కిలి సన్నిహితుడు. మిత్రుడి బాధ తొలగించుటకై నారదుడు, సృంజయునికి కొడుకును అనుగ్రహించెను. ఆ బాలుడు గావించు మలమూత్ర విసర్జనములన్నియు సువర్ణమయములుగా నుండుటచే అతనికి సువర్ణష్ఠీవి యను పేరు కలిగెను. బాలుడి సర్వ విసర్జనల వలన లభించు సువర్ణములచే రాజు పెక్కు దానధర్మములు గావించెను. ఆ వింత బాలుని వృత్తాంతము విన్న దొంగలు దురాశచే అతడిని అపహరించి, సంహరించిరి. అతడి అవయవములన్ని వెదికిననూ వారికి బంగారం దొరకలేదు. సృంజయుడు తన కుమారుడిని కోలుపోవుటతో దురంత దుఃఖమును పొందుచుండెడివాడు. అప్పుడు నారదుడు సృంజయుడి వద్దగా వచ్చి, మృత్యువు అనివార్యమని, మహా ప్రభావశీలురు, దానశీలురు, పరాక్రమవంతులు, శీలవంతులైన షోడష చక్రవర్తులు కూడా భూమిపై శాశ్వతంగా జీవించజాలక పోయినారని, సామాన్య మానవులెంతటి వారని, మృత్యువు సమయం వచ్చినప్పుడు అందరినీ అక్కున చేర్చుకుంటుందని, కావున తప్పక జరుగవలసిన, జరిగే మృత్యు సంఘుటనకు చింతించరాదని నారదుడు అతడిని ఊరడించెను. సృంజయునికి వివేకము కలిగి దుఃఖము విడిచెను.
మహాభారతం ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము లోనిది.
– ఋణాను బంధ రూపేణ పశుపత్నీ సుతాలయాః
ఋణక్షయే క్షయంయాంతి కాతత్ర పరివేదనా
– Cattle, a wife, children, and a house are the cause of debt;
if the debt is cleared, they get ruin – what sorrow is there in that.
– ప్రాప్త కాలో న జీవతి – He whose time has come, lives not.
(ఇంకా ఉంది)
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు.
‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు.
వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు.
హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి.
కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.