[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
55. నహుషుడి వృత్తాంతం!
ఇంద్రుడు వృత్రుడిని చంపాడు. ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. రాజ్యశ్రీ నశించింది. నీచస్థితికి వచ్చి నిషద పర్వతానికి వెళ్ళి దాగుకున్నాడు. దేవలోకానికి రాజు ఎవరూ లేకపోవడంతో మునులు, దేవతలు ఆ పదవికి తగినవాడు నహుషుడని నిర్ణయించుకొని, అతడి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు. తొలుత ఆ పదవికి తాను అర్హుడిని కాదని అన్నా, ఆ పదవిపై మమకారంతో పదవిని చేపట్టాడు. దేవతలు, మునులు సంతోషించారు. సుర, యక్ష, కిన్నర, సిద్ధ, గరుడ, గంధర్వుల తేజస్సు, అంశాలు పుచ్చుకుని నహుషు పట్టాభిషిక్తుడై, అనతికాలంలో దేవలోక సౌఖ్యాలలో మునిగిపోయి, మదం అతిశయించిన వాడయ్యాడు.
ఒకనాడు నహుషుడు ఇందుని భార్యయైన శచిని చూశాడు. మన్మథవశుడై, ‘స్వర్గ రాజ్యాధిపతియైన నన్ను కూడుటకు ఈమె రాకపోవుట యేమిటి?’ అనుకొని ఆమెను పిలిపించాడు. కాని ఆమె భయపడి దేవతల గురువైన బృహస్పతి శరణు జొచ్చింది. “నహుషుడి దుష్ప్రవర్తన నుండి నిన్ను కాపాడుతాను. ఇంద్రుడిని వెనక్కు రప్పిస్తాను” అని శచికి, బృహస్పతి అభయమిద్చాడు. దానితో నహుషుడు బృహస్పతిపై కోపగించాడు. ఇతర మునులు ఇంద్రునితో “పరస్త్రీని కూడాలనే తలంపు మీ ఘనతను తగ్గిస్తుంది” అని తెలిపారు. “ఇంద్రుడు అహల్యను కూడినపుడు పలకనివారు, నేడు నాకు సలహా ఇస్తున్నారా? వెంటనే శచీదేవిని పట్టుకొని రండి” అని మునులను నహుషుడు ఆజ్ఞాపించాడు. మునులు వచ్చి నహుషుడి ఆజ్ఞను బృహస్పతికి తెలిపారు. బృహస్పతి వారి మాటలను ఆక్షేపించాడు.
‘శరణు సొచ్చిన రక్షింపఁ జాలియుండి
కడపి పుచ్చిన నూర్ధ్వలోకములు దప్పుఁ,
బుణ్యకర్మంబు లఫలతఁ బొందు ననఁడె
కమలగర్భుండు దొల్లి జగద్ధితముగ?’ (5-1-161)
“పూర్వం బ్రహ్మ లోక శ్రేయస్సు కాంక్షించి, శరణన్న వారిని కాపాడ గలిగి ఉండీ పొమ్మని పంపిస్తే పుణ్యలోకాలు ఉండవనీ, పుణ్యక్యాలు ఫలించదనీ అనలేదు?” అని పలికి, శచితో “నీవు నహుషుడి దగ్గరకి వెళ్ళి, తగిన విధంగా ప్రవర్తిల్లి, కొంత వ్యవధిని కోరుము. త్వరలోనే ఇంద్రుడిని తీసుకొని వచ్చి దేవలోకానికి శుభం కలిగిద్దాం” అని బృహస్పతి తెలిపాడు.
శచీదేవి నహుషుడి దగ్గరికి వెళ్ళి అతడితో “ఇంద్రుడు ఉన్నాడో లేదో తెలుసుకొని నిర్భయంగా ఇక్కడికి రావటం మంచిది. నా మనసు శంకతో ఉంటే మీరు తొందరపడితే యెలా? నాకు కాస్త వ్యవధిని ఇవ్వండి” అని పలికింది, అతడు ఒప్పుకున్నాడు. శచి తిరిగి వచ్చింది.
దేవతలు, మునులు రహస్యంగా విష్ణువు దగ్గరికి వెళ్ళి, ఇంద్రుని పాపం పోగొట్టమన్నారు. “అశ్వమేధయాగం చేసి నాకు ప్రీతి కలిగిస్తే మీకు మేలు కలుగుతుంది” అని తెలిపాడు. వారు ఇంద్రుని దగ్గరికి వెళ్ళి కథనంతా చెప్పారు. ఇందుడు వచ్చాడు. కాని నహుషుడు తేజో విశేషానికి భయపడి ఎక్కడికో వెళ్ళిపోయాడు. దానితో శచీదేవి ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి రాత్రివేళలలో ఉపశ్రుతిని పూజించింది. శచీదేవి పూజలకు ఉపశ్రుతి సంతోషించింది. ఆమెను తీసుకొని వెళ్ళి హిమవంత పత్వతానికి ఉత్తరంగా ఉన్న ముంజు పర్వతం దగ్గర ఉన్న కొలనులో తామర తూడులలో దాగి యున్న ఇంద్రుడిని చూపి అదృశ్యమయింది.
శచీదేవి ఇంద్రునికి, తాను అక్కడికి ఎలా వచ్చింది, నహుషుడి దౌర్జన్యాలు ఎలాంటివో వివరించింది. “వెంటనే నన్ను రక్షించకపోతే ఆపద సంభవిస్తుంది” అని పలికింది. “శత్రువు ఉద్ధతిని సమయం వచ్చే వరకూ సహించాలి. అదే రాజనీతి. నీవు ఎప్పటిలాగే అతనితో ఉంటూ, నన్ను పొందాలని ఉంటే ‘మునులను వాహనంగా చేసుకొని రమ్ము’ అని నహుషుడిని ఆదేశించుము. అంతటితో అతడి పని అయిపోతుంది” అని తెలిపాడు.
శచీదేవి భర్త దగ్గర సెలవు తీసుకొని నహుషుడి దగ్గరికి వచ్చింది. నహుషుడు మళ్ళీ తన కోరిక వెలిబుచ్చాడు. అప్పుడు శచీదేవి, “మనం ఏర్పరుచుకున్న సమయానికి ఇంకా కొంచెం వ్యవధి ఉంది.. సమయం వచ్చినపుడు నిన్ను వరిస్తాను. నీవు మహర్షుల వాహనంగా కలవాడవు కావాలి. అది నాకు ఇష్టం . నీకు తేజోవృద్ధి కలుగుతుంది” అని పలికింది. దానికి నహుషుడు సంతోషించాడు. “నాకు తప్ప ఇతరులకు సాధ్యం కానీ విధంగా, సప్తర్షులు పల్లకీ మోస్తుండగా నీ దగ్గరికి వస్తాను” అన్నాడు. అన్నట్లే మునులను వాహనంగా చేసుకొని సంకోచం లేకుండా అన్ని చోట్లూ తిరిగాడు.
ఇంతలో మునులు, దేవతలు ఇంద్రుడిని అణ్వేషించే పనిని అగ్నికి అప్పచెప్పగా, ఎక్కడో నీళ్ళలో తామర తూడులో దాక్కున్న ఇంద్రుడిని అగ్ని కనిపెట్టాడు. దేవతలు ఇంద్రుడికి నహుషుడి వృత్తాంతం తెలిపి, అతడు ఏ విధంగా అహంకరించి ధర్మచ్యుతుడయ్యాడో తెలిపి, మరలా అతడికి రాజ్యాభిషేకం చేశారు. ఇంద్రుడు, “నహుషుడు తన బలం, తేజం ఎలా కోల్పోయాడు?” అని అడుగగా, మునిశ్రేష్ఠుడు అగస్త్యుడు; నహుషుడిని పల్లకిలో మోసి బాధపడుతున్న మునులు నహుషుడితో – “బ్రాహ్మణములయిన మంత్రాలు గోసంప్రోక్షణలో చెప్పబడినాయి. నీవు వానిని నమ్ముతావా?” అని అడుగగా,
నహుషుడు “ఆ మంత్రాలు నాకు ప్రమాణాలు కావు” అని పలికాడు. దానితో అగస్త్యుడు “పూర్వ గురువులు అభినందించే మంత్రాలను నిందించావు. అదేగాక నన్ను అవమానించావు. కావున ఇంద్రలోక భ్రష్టుడవై పెక్కేళ్ళు భూలోకంలో సర్పరూపములో పడి ఉండుము. తిరిగి ధర్మరాజు చేత ఆ శాపమును పోగొట్టుకొనుము” అని శాపమిచ్చి, “శాపవిమోచనం కూడా చేసాను” అని పలికాడు. దానితో నహుషుడు స్వర్గలోక భ్రష్టుడై దుర్గతి చెందాడు.
‘దుష్టాత్ములకున్ దౌర్గత్యము, సుజనులకు న నర్గళ సద్గతియు నగుట యరుదే యెందున్?’ (5-1-202)
ఎక్కడైనా దుర్మార్గులకి దుర్గతి, సన్మార్గులకు సద్గతి కలుగడం ఆశ్చర్యము కాదు కదా..?
అత్యుచ్ఛ్రాయః పతనహేతుః
Too great exaltation is the cause of a downfall! Ruin follows speedy exaltation.
~
ఆజ్ఞాభంగం బయినం
బ్రాజ్ఞేతరునట్లు దుఃఖపడి యుండఁడె? తా
నజ్ఞాతవాసమును గా
లజ్ఞతఁ జలుపండె? యన్యులకు వగపేలా? (5-1-207)
“తన అధికారానికి భంగం వాటిల్లినప్పుడు పామరుడి వలె ఇంద్రుడు దుఃఖం అనువభవించలేదా? తన కాల ప్రభావాన్ని గుర్తించి అజ్ఞాతవాసం చెయ్యలేదా? ఇతరులకు దుఃఖమెందుకు?” అని అరణ్యవాసాది అవమానాలకు, రాజ్యభ్రష్టతకు క్రుంగిపోయి దుఃఖిస్తున్న ధర్మరాజును చూసి శల్యుడు చెప్పిన కథ ఇది.
అల్పుడికి అధకారమిస్తే వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకుండా దొడ్డవారి నెల్ల తొలగగొట్టునన్నట్లుగా, నహుషుడికి దేవతలు ఇంద్ర పదవినిస్తే పరనారిని ఆశించి, ప్రాజ్ఞులను అవమానించి శాపగ్రస్థుడు అయ్యాడు. అధికార మదం ఎంతట వాడినైనా అణచి వేస్తుందని, అల్పునికి అధికారమిస్తే ప్రమాదకరమని ఈ కథ తెలుపుతుంది.
ఇంద్రుడంతటివాడు రాజ్యభ్రష్టుడై అడవులకుపోయాడు. కాలం ఎవరినీ విడిచిపెట్టదు. సమస్యలు వచ్చినప్పుడు ధీరత్వం వహించాలి. సమయానికై వేచియుండాలని తెలుపుతుంది. స్త్రీలను, ఉత్తములను హింసిస్తే అధోగతేనని ఈ కథ తెలుపుతుంది.
ఉద్యోగ పర్వం ప్రథమాశ్వాసం లోనిది.
56. గరుత్మంతుడి పరాభవ గాథ!
తన శక్తిని, ఎదిరి శక్తిని గమనించిక ధిక్కరించడం మూర్ఖుల లక్షణం. ఒక్కొకసారి అది ఎంతటి వారికైనా గౌరవహాని కలిగిస్తుంది. అది వజ్రాయుధాన్నైనా లెక్కచేయని బలశాలి గరుత్మంతుడిపైనా సరే!
దేవేంద్రుడి రథసారథియైన మాతలి గుణకేశి అను తన కుమార్తెకు, ఆర్యకుడు అనే సర్ప నాయకుడి మనుమడు, చికురుడు అనే వాడి తనయుడు అయిన సుముఖుడిని భర్తగా నిర్ణయించాడు. ఆర్యకుడి దగ్గరికి వెళ్ళి ప్రీతితో సుముఖుడిని కోరాడు. ఆర్యకుడు, “గరుత్మంతుడు, వీని తండ్రియైన చికురుడిని చంపివేశాడు. ‘నెల రోజులలో సుముఖుడిని కూడా చంపి వేస్తాన’ని పంతగించి వెళ్ళిపోయాడు. ఈ దశలో వివాహానికి ఒప్పుకోలేము” అన్నాడు. ఆ మాటలు విన్న మాతలి వారిని చూచి వచ్చిన కార్యము ఇంద్రునికి నివేదించాడు. అందుకే సురసతి విష్ణుదేవుడికి చెప్పి, చేయించదలచి గరుత్మంతుడి విషయంలో చాలుదునని భావించి, సుముఖుణ్ణి దీర్ఘాయుష్మంతుడిని చేశాడు.
మాతలి తన పుత్రికను సుముఖుడికిచ్చి వివాహం జరిపించి ఉండగా, ఈ సంగతి నెరిగిన గరుత్మంతుడు క్రోధావేశపరుడై, నారాయణడి సమక్షంలో ఇంద్రుడితో, “నీవు అదితి పుత్రుడవు. నేను వినతా పుత్రుడను. మనిద్దరికీ కశ్యపుడు తండ్రి. ఏ విషయంలో నేను నీకంటే తక్కువ? నా వియషంలో నీవెందుకు అడ్డు పడ్డావు” అన్నాడు.
అప్పుడు ఇంద్రుడు, “నీ ఈ గొప్పతనానికి విష్ణువు తప్ప మరొకడు కారణం కాదు” అన్నాడు.
అప్పుడు గరుడుడు, “నీవు నా శక్తి సామర్థ్యాలు ఎట్టివో వాస్తవంగా గ్రహించ లేక నాకు హీనత్వం కలిగేట్లు ప్రవర్తించావు. అదితి గన్న సమస్త దేవతా కులాన్ని ఒక సన్నని ఈకపై ధరించగలను సుమా. ఇలాంటి బలాఢ్యుడిని నన్ను నీవీ రకంగా చిన్నబుచ్చుతావా” అని ఇంద్రుడిపై గుడ్లురుమగా, నారాయణుడు వెటకారంగా నవ్వుతూ, “అవివేకి! నీవు ఏపాటి భారం మోయగలవురా? నా సామర్థ్యంతో నిన్ను నడుపుకొని వస్తుంటే నీకెంత పొగరు?” అంటూ తన ముంజేతిని అతడి వీపుపై మోపాడు. విష్ణువు ముంజేయి గరుడుని వీపుపై మోపగానే, ఆ బరువుకు గరుత్మంతుడు రెక్కలు చాస్తూ, నోరు తెరుస్తూ, నేల మీద కూలి ఒడలు తెలియక ఆక్రందన చేశాడు. అప్పుడు శ్రీహరి “భయపడవద్దు!” అని అతడిని లేవదీసి, “గర్వము విడిచి, బుద్ధికలిగి ఉండుము” అని సెలవిచ్చి పంపాడు.
‘బలవంతుల బలములు న
నగ్గలమగు బల మెదురఁ గలుగఁగాఁ గీడ్పడు నే
కొలఁదుల వారికి గర్వము
నిలుచునె నయమార్గ వృత్తి నిలిచిన భంగిన్.’ (5-3-303)
బలవంతుల యొక్క బలాల ఎదుటా అంతకంటే మిక్కుటమైన బలాలు కలిగినపుడు అవి క్రింద పడిపోతాయి. ఎంత శక్తి సంపన్నులకయినా ధర్మమార్గ ప్రవర్తనం తలఎత్తి నిలబడినట్లుగా అహంకారం నిలబడలేదు.
భుజబలాఢ్యులకు, శక్తిశాలురకు ఏదో ఒక సందర్భములో తమను తాము ఎక్కవగా అంచనా వేసుకోవడం కద్దు. అక్కడి నుండి వారు మదగర్వాలకు లొంగడం కద్దు. అలాంటప్పుడు. ఇలాంటి సంఘలున ఎదురయితే మళ్ళీ నేలమీద నడుస్తాం. కళ్ళు తెరుచుకొని ప్రవర్తిస్తాం.
కృష్ణ రాయబారానంతరం కురుసభలో నున్న మహామునులు దుర్యోదనుడికి బుద్ధి చెబుతున్న సందర్భంలో కణ్వుడు దుర్యోధనునికి చెప్పిన కథ.
ఉద్యోగ పర్వం తృతియాశ్వాసం లోనిది.
He that is proud eats up himself – Shakespeare.
(ఇంకా ఉంది)
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు.
‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు.
వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు.
హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి.
కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.