Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ మహా భారతంలో మంచి కథలు-21

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

53. యక్ష ప్రశ్నలు!

హాభారతంలోని అరణ్యపర్వంలో వచ్చే యక్ష ప్రశ్నలకు సంబంధించిన వృత్తాంతం ఆధ్యాత్మిక, వేదాంత, తార్కిక రహస్యాలతో కూడుకొని ఉన్నది. ధర్మరాజును జ్ఞానిగా, వేదాంతిగా, ఉత్తమ నాయకుడిగా నిలిపే సంఘటన ఇది. అజగరోపాఖ్యానంలో యక్ష ప్రశ్నలలో ధర్మరాజు చూపిన ప్రజ్ఞావిశేషాలు, ధర్మాధర్మ విచక్షణ జ్ఞానముతో తన తమ్ములను కాపాడుకొనేలా చేసింది. ‘యక్ష ప్రశ్నలు’ మానవకోటికి వచ్చే అనేక సందేహాలకు సమాధానాలను యివ్వడమే కాక, మానవ జీవనమును ఉత్తమ పథ ప్రయాణము వైపుకు తీసుకు వెళుతుంది. ఈ రెండు ఘట్టాలలో తాను తమ్ముళ్ళను కేవలం ధర్మ నిబద్ధమైన సమాధానాలు యివ్వడం ద్వారా కాపాడుకోగలిడిగాడు ధర్మరాజు. ధర్మచింతన, సాధువర్తన, ధీర గాంభీర్యంతో పాటు ధీశక్తి, సమయస్ఫూర్తి చూపుతూ మహాభారత కథకు తిరుగులేని నాయకుడిలా నిరూపించుకున్నాడు.

పాండవుల అరణ్యవాస కాలం ముగియనున్న సమయంలో, మార్కండేయ మహర్షి నుండి అనేకమైన పుణ్యకథలు విన్నారు. వారు మరలా ద్వైతవనానికి వచ్చారు. అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకనాడు అక్కడికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఒక మృగము. తన ఆరణిని కొమ్మును తగ్గించుకొని పోయిందని, అది లేకపోతే నిత్యానుష్ఠానం ఆగిపోతుందని, దానిని తెచ్చి ఇచ్చి ధర్మస్థితిని కాపాడుమని వేడుకున్నాడు. ఆరణిని తీసుకురావడానికి ధర్మరాజు తన తమ్ములతో కలిసి బయలుదేరాడు. వారు చాలా దూరం ప్రయాణించి దానికై వెదికారు. మృగం వారికి చిక్కకుండా పారిపోయింది. వారంతా అలసిపోయారు. పాండవులకు దాహం వేసింది. వారంతా చెట్టు క్రింద విశ్రమించారు. నీటి తెరవుకై చూడసాగారు.

అంతలో నకులుడు “ఉత్తమ కులశీలాలతో, దయాగుణంతో బ్రతికే మనకు ఇన్ని కష్టాలు రావడానికి కారణమేమిటి?” అని ప్రశ్నించాడు. “పుర్వకృతమే మన సుఖదుఃఖాలకు కారణమని ప్రాజ్ఞులంటారు” అని ధర్మజుడు అన్నాడు. “అదేమి కాదు, నాడ నిండుసభలో ద్రౌపదికి అవమానం జరిగినపుడు, కౌరవులను మట్టుపెట్టనందుకే ఈ ఆపదలు” అని భీముడు అన్నాడు. “ఔను తమ్ముడా! నాడు కర్ణుడి గర్వోక్తులను సహించి, కోపగించుకోకుండా సామాన్య జాడుని వలె అడవికి వచ్చినందునే యీ ఇక్కట్టు” అని అర్జునుడు అన్నాడు. “కపట ద్యూతపరుడు, దుష్టుడు అయిన శకునిని చంపకపోవడం వలననే ఇన్ని అగచాట్లు” అని సహదేవుడు పలికాడు. ధర్మరాజు నకులుడిని పిలిచి “తమ్ముడా! నాకు దాహంగా ఉన్నది. దగ్గరలో నీటి కొలను ఉంటే నీరు తీసుకొనిరా” అని అన్నాడు. నకులుడు ఒక చెట్టును ఎక్కి, దగ్గరలో నున్న ఒక కొలనును చూచి, అక్కడికి వెళ్ళాడు. నకులుడు ఆ కొలనులోకి వెళ్ళి నీరు తాగబోగా ఒక అశరీర భూతము అతడిని వారించింది. తటాకము తనదని, జలాలు త్రాగాలంటే తానడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని హెచ్చరించింది.

ఆ మాటలు లెక్కచేయక నకులుడు నీరు త్రాగి సరోవర తీరములలో నిశ్చేష్టితుడై పడిపోయాడు. నకులుడు ఎంతకూ రాకపోవడంతో ధర్మజుని ఆజ్ఞ మేరకు సహదేవుడు వెళ్ళాడు. అతడూ నకులుడి మాదరిగా ప్రవర్తించి సరోవర తీరంలో పడిపోయాడు. ఆపై భీమార్జునులు కూడా వెళ్ళి, తమ్ముళ్ళ లాగే ప్రవర్తించి వారిలాగే సరోవర తీరంలో పడిపోయారు. తమ్ములందరూ అటే వెళ్ళడంతో ధర్మజుడు వెళ్ళాడు. అక్కడి పరిస్థితిని గమనించి విషణ్ణుడయ్యాడు. క్రమంగా ధైర్యం తెచ్చుకొన్నాడు. తమ్ముళ్ళ శరీరాలపై గాయాలు లేవు. యుద్ధం జాడ లేదు. తమ్ముళ్ళ ముఖాలు వివర్ణం కాలేదు. అంటే సరోవర జలాలు విషతుల్యం కావని నిశ్చయించాడు. ‘ఇదేదో కౌరవులను పన్నాగమ’ని తలపోశాడు. మహావైభవంతో జీవించాల్సిన తమ్ముళ్ళు అనాథలుగా పడి ఉన్నందుకు విచారించాడు. హస్తినకు వెళ్ళి బంధువులకు ఏమని చెప్పాలో తెలియక బిగ్గరగా శోకించాడు.

మనుషులకు ఎన్ని బాధలున్నప్పటికి దాహము, క్షుద్బాధలు అంతకంటే పెద్ద బాధలు కాబట్టి, దప్పికకు ఆగలేకపోయాడు. మడుగులోకి దిగాడు. ఎప్పటిలాగే అశరీర భూతం “ఓ ధర్మరాజా! నేను కొంగను. ఈ కొలను నాది. నా మాట వినక నీ తమ్ముళ్ళు ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. నేనడిగిన ప్రశ్నలకు సమాధానములు చెప్పి, నీరు త్రాగితే నీకు మేలవుతుంది” అని హెచ్చరించింది.

“నీవెవరివో నాకు తెలియదు. నాకు భయకౌతుకాలు కలుగుతున్నాయి. కుల పర్వతాల వంటి నా తమ్ముళ్ళను పడద్రోశావంటే నీవు సామాన్యుడివా? దేవాసుర యక్ష గంధర్వులకు తలవంచనివారు నేడు నీ చేత పడిపోయారు. నీవు రుద్రుడివో, అగ్నివో, వాయువువో.. ఇంతకీ నీవెవరు? నీ ఉద్దేశమేమిటి?” అని ధైర్యంగా ధర్మరాజు ప్రశ్నించాడు.

అప్పుడు తాటి చెట్టంత పొడవున్న యక్షుడు ప్రత్యక్షమై, “ఎవరైనా ఈ కొలనులో నా అనుమతి లేకుండా నీరు త్రాగితే చనిపోతారు. నీవు విచారశీలుడివి కాబట్టి ఆలోచించగలిగావు. నా ప్రశ్నలకు నీవే సమాధానం చెప్పవలసినది” అన్నాడు.

“నాకు తెలిసిన విధంగా చెబుతాను, అడుగుము” అన్నాడు ధర్మరాజు.

యక్షుడు: సూర్యుడిని నడిపే శక్తి యేది?

ధర్మరాజు: బ్రహ్మము

యక్షుడు: సూర్యుడిని సేవిస్తూ తిరిగేదెవరు?

ధర్మరాజు: సురకోటి

యక్షుడు: సూర్యుడు దేని వలన అస్తమిస్తాడు? సూర్యునికి ఆధారమేది?

ధర్మరాజు: ధర్ముని చేత ఆస్తమిస్తాడు. సత్యమే ఆధారం.

యక్షుడు: శ్రోత్రియుడని ఎవరిని అంటారు?

ధర్మరాజు: శ్రుతము వలన శ్రోత్రియుడగును.

యక్షుడు: పురుషుడు దేని వలన మహత్యం పొందుతాడు? దీని చేత సహాయం పొందుతాడు? దేని చేత బుద్ధిమంతుడవుతాడు?

ధర్మరాజు: తపస్సు చేత, ధృతి చేత, బుధులను సేవించులు చేత

యక్షుడు: బ్రాహ్మణుడు దేని వలన మహత్యం, దేవభావాన్ని పొందుతాడు? అతడికి సాధుభావము, అసాధుత్వము ఎట్లా కలుగుతుంది?

ధర్మరాజు: అధ్యయనం వలన, అధిక వ్రతశీలం వలన. శిష్ట వృత్తి వదులుట వలన.

యక్షుడు – బ్రాహ్మణుడు దేని వలన మనుష్యుడవుతాడు?

ధర్మరాజు: మృత్యుభయం వలన

యక్షుడు: జీవన్మృతుడెటువంటి వాడు?

ధర్మరాజు: దేవ, అతిథి, పితృ, భృత్యుజనములకు అన్నం పెట్టుకుండా తాను తినేవాడు.

యక్షుడు: భూమి కంటె గొప్పది? ఆకాశం కంటె పొడుగైనది ఎవరు?

ధర్మరాజు: తల్లి తండ్రి

యక్షుడు: గాలికంటే వేగం కలిగినది యేది? గడ్డిపోచకంటే హీనమైనది యేది?

ధర్మరాజు: మనసు, చింత.

యక్షుడు: నిద్రిస్తూ కూడా కన్ను మూయనిది యేది? పుట్టి కూడా చేతనత్వం పొందనిదేది?

ధర్మరాజు: చేప, గుడ్డు

యక్షుడు: రూపముండి హృదయం లేనిది యేది? వేగం వలన ప్రకాశించేది ఏది?

ధర్మరాజు: రాయి, యేరు

యక్షుడు: బాటసారికి, రోగార్తుడికి, గృహస్థుడికి, మృతుడికి మిత్రులెవరు?

ధర్మరాజు: సార్ధము, వైద్యుడు, భాగ్యము, చేసిన ధర్మము.

యక్షుడు: ధర్మువునకు కుదురు, కీర్తికి ఆధారం, స్వర్గానికి అనువైన మార్గం, సుఖాలన్నిటికీ ఆశ్రయమేది?

ధర్మరాజు:
‘అమరఁగ దాక్షిణ్యము ధర్మమునకుఁ గుదు రండ్రు; కీర్తిమహిమ నెలవు దా
నము; సత్యము సురపురిమార్గము; శీలము సంశ్రయంబు సుఖముల కెల్లన్‌’ (3-7-442).
దాక్షిణ్యము, దానము, సత్యము, శీలము.

యక్షుడు: నరుడికి ఆత్మ ఎవరు? మానవునికి దైవికమైన చుట్టమెవరు?

ధర్మరాజు: పుత్రుడు, భార్య

యక్షుడు: మానవుడి జీవిక దేని వలన కలుగుతుంది? మానవుడు దేనిని కొనియాడి వృద్ధిలోకి వస్తాడు?

ధర్మరాజు: పర్జన్యుడు, దానం

యక్షుడు: ఉత్తమ ధర్మమేది? ఏది శతతం పరిపక్షంగా ఫలితాన్ని ఇస్తుంది? ఏది నిగ్రహిస్తే ప్రయోజనం కలుగుతుంది ? ఎవరితో చెలిమి ఎప్పుడు చేడదు?

ధర్మరాజు:
‘విను మహింస మేటి యనఁజను ధర్మంబు; యాగకర్మ మెపుడు నమరఁ బండి
యుండు; మనసుక్రొవ్వు ఖండింపఁగా మోద మెసఁగు; సుజనసంధి యెడల దెందు’ (3-7-448)
అహింస, యాగకర్మ, మనోహంకారం, సజ్జనమైత్రి

యక్షుడు: లోకానికి దిక్కెవరు?

ధర్మరాజు: సజ్జనులు

యక్షుడు: దేని వలన అన్నం, జలము సంభవిస్తాయి్?

ధర్మరాజు: భూమి, ఆకాశం, జలం

యక్షుడు: విషము వంటిదేది?

ధర్మరాజు: విప్ర ధనం

యక్షుడు: శ్రాద్ధ విధికి సమయం?

ధర్మరాజు: బ్రాహ్మణుల రాక

యక్షుడు: మానవుడు దేనిని వదిలిపెడితే సర్వజన సమ్మతుడు, నిశ్శోకుడు, అర్థవంతుడు, సుఖి కాగలడు?

ధర్మరాజు:
‘సర్వజనసమ్మతుం డగు గర్వ ముడిగి; క్రోధ మడఁచి శోకమునకుఁ గుదురు కాఁడు;
వినవె యర్థాఢ్యుఁ డగు లోభ మొనర విడిచి; తృష్ణ వర్జించి సౌఖ్యంబుతెరువుఁ గాంచు’ (3-7-452)
గర్వము, క్రోధము, లోభము, వృష్ణ వదిలితే.

యక్షుడు: పురుషుడు, సర్వధని ఎవడు?

ధర్మరాజు: భూమ్యాకాశాలను ఆవరించి ఎవరి కీర్తి వైభవం వెలుగుతుందో అతడే పురుషుడు.
ప్రియము నప్రియంబుఁ బెల్లగు సౌఖ్యదుః ఖములు భూతభావికార్యములును
నెవ్వనికి సమంబు లివి సర్వధనియనఁ బరఁగుఁ జువ్వె యట్టి భవ్యుఁ డనఘ!’ (3-7-455)
ప్రియం, అప్రియం, సుఖం, దుఖం జరిగిన, జరగబోయే కార్యాలు ఎవరికి సమానములో ఆ మహానుభావుడు సర్వధని.

యక్షుడు ధర్మరాజు సమాధానాలకు సంతోషించి, “నీ నలుగురు తమ్ముళ్ళలో ఒకడిని బ్రతికిస్తాను, కోరుకో” అన్నాడు. ధర్మరాజు నకులుడిని బ్రతికించమన్నాడు. “అదేమిటి? భీమార్జునులైతే నీకు సహాయకులుగా ఉండి, అండదండలందించే మేటి వీరులు కదా, నకులుడినేల కోరావు?” అన్నాడు. “కుంతిపుత్రులలో పెద్దవాడిని నేమన్నాను, మాద్రి పుత్రులలో నకులుడు బ్రతకడం న్యాయం” అన్నాడు. ధర్మరాజు సమబుద్ధికి సంతసించిన యక్షుడు నలుగురిని పునరుజ్జీవితులను చేశాడు.

ధర్మజుడు “అయ్యా! నీవు యక్షుడవు కావు. ఇంద్రుడవో, కుబేరుడినో, ఆగ్నివో, వాయువువో లేదా మా తండ్రి ధర్మదేవతవో దయతో తెలుపుము” అన్నాడు.

అపుడా మహాత్ముడు “ఓ రాజా! నేను ధర్ముడను. సత్యం, శోచం, దానం, తపస్సు, శమం, దాంతి, యశస్సు, జ్ఞానం అనేవి నా మూర్తులు. నీవు ఉత్తమ ధార్మికుడవు. నిన్ను చూడాలని వచ్చాను. నన్నాశ్రయించినవారు దుర్గతిని పొందరు. వరము కోరుకో” అన్నాడు. “బ్రాహ్మణుడికి ఆరణి ఇప్పించి కర్మలోపం, ధర్మలోపం రాకుండా కరుణించు” అన్నాడు.

ధర్మరాజు ధర్మబుద్ధికి సంతసించి, ఆ మాయ తాను కల్పించినదేనని తెలిపి, ఆరణిని ధర్మజుడికి ఇచ్చాడు.

అంతేకాక, “ధర్మజా! మీ అరణ్యవాసం ముగిసి, అజ్ఞాతవాసంలోకి వెళ్ళబోతున్నారు. మీరు ఏ రూపంలో తిరగాలనుకుంటే ఆ రూపాలు యేర్పడుతాయి. మిమ్మల్ని పాండవులని ఎవరూ గుర్తుపట్టకుండా వరమిస్తున్నాను. ఇంకా ఏమైనా వరం కోరుకో” అన్నాడు యక్షుడు.

“దేవా! ధర్మదేవతవు నీవు ప్రత్యక్షమయ్యావు. ధన్యుడనైనాను. నా మనను ధర్మమునందు స్థిరమై ఉండేట్లు అనుగ్రహించు” అన్నాడు ధర్మజుడు. ధర్మదేవత అనుగ్రహించాడు.

పాండవులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. బ్రహ్మణుడికి ఆరణినిచ్చి ఆశీస్సులు పొందారు.

ఆ విధంగా ధర్మాత్ముడని ప్రజల చేత పొగడబడే ధర్మరాజు ధర్మహాని ఓర్వడని నిరూహించుకున్నాడు. అందుకే అతడు సార్థక నామధేయుడు. మహాభారత నాయకుడు.

“నా మనసు ధర్మమునందు స్థిరమై ఉండేటట్లు అనుగ్రహించు” అన్న ధర్మరాజు వాక్యం ప్రతి మనిషి మనసులో స్థిరపడి, అది ఒక వ్రతంగా, ఆచరణగా చేసుకొన్ననాడు ప్రతి ఒకడు ధర్మజుడిగా, ధర్మరాజుగా కాగలడు. తను నివసించే చోటును ధర్మభూమిగా చేయగలడు.

అరణ్యపర్వము సప్తమాశ్వాసంలోనిది.

‘యత్ర తిష్ఠతి ధర్మాత్మా తత్ర దేవూపతిష్ఠతి’ – ‘where there is a virtuous man, there is also God.’

54. ధర్మరాజు సంభాషణా చాతుర్యం!

పాండవులు అరణ్యవాసం ముగించారు. అజ్ఞాతవాసం విరాట ప్రభువు కొలువులో తమ ఉనికిని ఇతరులు గుర్తు పట్టని విధంగా వివిధ రూపాలు ధరించి ఉండసాగారు. ధర్మరాజు కంకుభట్టుగా, భీముడు వలలుడుగా, అర్జునుడు బృహన్నలగా, దామగ్రంధి, తంత్రీపాలుడిగా కవలలు, మాలినిగా ద్రౌపదీ మారి ప్రచ్ఛన్న నామాలతో, వివిధ వృత్తులతో జీవితం వెళ్ళబుచ్చుతున్నారు. మనిషికి కష్ట కాలం ఆవరించినప్పుడు ఊరు మార్చినా, ఉనికి మార్చినా ప్రశాంతత చిక్కదు. అడవి లోంచి నగరానికి వచ్చిన పాండవులకు, నగరంలోకూడా భీకరమైన అరణ్యమృగము వంటి కీచకుడు ఎదురయ్యాడు.

కీచకుడు ఆ రాజ్యానికి పట్టు మహిషియైన సుధేష్ణగారికి తమ్ముడు. అతడి భుజబలం పైనే రాజ్యం నడుస్తుంది. విరాటరాజు కీచకుడి చేతిలో ఉత్త కీలుబొమ్మ. మాలిని పేరుతో రాణి దగ్గర సైరంధ్రిగా కుదురుకొని, రాణిగారికి వస్త్ర, భూషణ, లేపన, కేశ పోషణాది సౌందర్య సంబంధ సేవలను చేస్తున్నది. కాలం బాధిస్తున్న సైరంధ్రిపై కాలం దాపూరించిన కీచకుడి కన్ను పడింది.

పరనారి, పరదార అన్న మాట మరిచి కామోద్రేక్తుడై, మదనప్రేరితుడై, మంచీ చెడులను, సమయ సందర్బములను, ఉచితానుచితములను మరచి ద్రౌపదిని మోహించి ఆమె వలపుకై తహతహలాడుతూ వెంటాడి వేధించసాగాడు. సుదేష్ణ తన తమ్ముడితో, “ఆ అమ్మాయి పలువ్రత. ఆమెకు అయిదుగురు భర్తలు. పరాక్రమవంతులు. ఆమెపై వలపు, తలపు మృత్యువుకు సంకేతం” అని చెప్పింది. కామాతురుడైన వాడికి లజ్జాభయాలు ఉండవు. ఇతరులు చెప్పే హితం తలకెక్కదు. కర్రలో చేరిన అగ్ని కర్రను కాల్చినట్లుగా, మనిషిలో నున్న పాపాగ్ని మనిషిని దహించక మానదు. కాని కామాంధులకు ఇవేవి కనిపించవు

కీచకుడు తన అక్కకు నయాన భయాన చెప్పి, ఆ మాలినిని తన మందిరానికి ‘మదిరను తెచ్చే నిమిత్తము’ వచ్చేలా చేసుకున్నాడు. లేడి పిల్ల కనబడితే మృగం చెలరేగినట్లుగా ద్రౌపదిని చూడగానే కీచకుడు చెలిరేగిపోయాడు. “నా సంపదకంతటికీ నిన్ను రాణిని చేస్తాను, నీకు అందమైన మణిహారాలు, విలాసగృహలు, వేశ్యా సమూహాలను సమకూరుస్తాను. నా భార్యలను దాసీలుగా చేస్తాను” అంటూ పలువిధాలుగా వదరుతూ, ఆశలు చూపుతూ, పలవరిస్తూ మోహపరవశుడై తన ఒడలు తాను మరిచి పైరంధ్రిని ఒడిసిపట్టాడు. ఆమె కీచకుడి చేతిని విదిలించి వేగంగా ఇంటి నుండి బయటకి వచ్చింది.

సైరంధ్రి విదిలించి వెళ్ళిపోతుండగా కీచకుడు ఆమెను వెంబడించాడు. ఆమె భయంతో పరుగులు పెడుతూ, పెడుతూ విరాట రాజు కొలువులోకి ప్రవేశించింది. అప్పడు సభ జరుగుతుంది. ద్రౌపది సభలో నిలిచింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన కీచకుడు తన గుట్టు రట్టువుతుందనే విషయం మరిచిపోయి, మదపుటేనుగు తీగను పట్టుకోబోయేటట్లు, పెద్ద గ్రద్ద ఆడ పామును ఒడిసిపట్టబోయినట్లు, గండుపిల్లి గోరువంక మీదికి దూకినట్లు కీచకుడు మిక్కిలి కోపంతో కోమలాంగి అయిన ద్రౌపది వెంటపడి, పరుగిడి, ఎగసి, జుట్టు ముడి పట్టి లాగి, ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా నేలబడద్రోశాడు. భగవంతుడిని సంపుర్ణంగా విశ్వసించే వారిని భగవచ్ఛక్తి ఆపత్కాలంలో నీడలా వెన్నంటి కాపాడుతుంది. అలాగే సూర్యశక్తి ప్రేరితమైన ద్రౌపదిని వెంటనంటి ఉండే శక్తి కీచకుడిని నేల పడదోసింది. ద్రౌపదీ సంరక్షుడైన రాక్షసశక్తి చేత కొట్టబడిన కీచకుడు తన దైన్యత కనబడనీయకుండా వెనుదిరిగి బుసలుకొడుతూ, ఉడికిపోతూ మొక్కవోయి ఉన్నాడు.

ఆ సభలో రాజుగారితో పాటు మహామహులు ఉన్నారు. ధర్మరాజు ఉన్నాడు. భీముడు కూడా ఉన్నాడు. చల్లని చెట్టుక్రింద ప్రశాంతంగా ఉన్నవారికి పిడుగుపాటు వంటిది ఆ సంఘటన. ఇంతకంటే గొప్ప శత్రువులను, సవాళ్ళను వారు ఎదుర్కున్న వారే. కాని వారిని వారిలా ఉండనీయక, ప్రవర్తిల్లనీయక అజ్జాతవాస కాలం వారి ముందు కరాళ నృత్యం చేస్తుంది. మౌనంగా ఉంటే తమ భార్యకు పరాభవం, ఎదురు తిరిగితే తమ భవిష్యత్తుకు ప్రమాదం. ముందు నుయ్యి వెనుక గొయ్యి. తాము ఎదుర్కొనే ప్రస్తుత సంఘటనలను బట్టి స్పందించాల్సిన విషయం కాదిది. ఆ అవమానకరమైన, అసభ్యకరమైన, గుండెను వేయి వ్రక్కలు చేయగలిగే సన్నివేశాన్ని చూచి, నిలబడి, తట్టుకోవాలంటే భూదేవి అంతటి ఓర్పు, మేరుపర్వతమంత దైర్యం, సముద్రమంత గాంభీర్యం, సమయంకై వేచి అదను చూసి శత్రు సంహారం చేయగల నేర్పు కావాలి. ఆ పని చేయగల వాడు ఎవరు? ధర్మరాజు.

అయితే అందరూ ధర్మజుడిలా ఉండలేరు. కీచకుడి మదవిజృంభణ చూసి భీముడి కనుల నిప్పులు రాలాయి. శరీరం ఉడికిపోయింది. దట్టంగా చెమట బిందువులు క్రమ్మాయి. పండ్లు పటపట కొరకసాగాడు.

నేలనూ, ఆకాశాన్నీ తాళాలుగా చేసుకొని పేట్రేగి వాయించి ఆడినట్లుగాను, కుల పర్వతాలను పడగొట్టి ఒకటి మీద ఒకటి పడేటట్లు తన్ని ఆడినట్లుగాను, ఏడు సముద్రాలను అటునిటు చేసి నీరు పోగా మిగిలిన పలుచని బురదను శరీరం నిండా పూసుకొన్నట్లుగాను, నాలుగు దిక్కులను పంపి ఒక చోట చేర్చి ముద్ద చేసి మింగబోతున్నట్లుగాను, బ్రహ్మండమనే భాండాన్ని పగులగొట్టాలని జబ్బలు చరుస్తూ ప్రళయ కాలంలోని మహాగ్ని పుట్టి మానవరూపం దాల్చిందా అన్నట్లు భీముడు మిక్కిలి భయం గొలుపుతూ ప్రకాశించాడు. అయితే కోపం ప్రళయాన్ని సృష్టిస్తుంది. విచక్షణ కోల్పోయేలా చేస్తూంది. తాము ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితులలో ఉన్నామో మరిచి పోయేలా చేస్తూంది. తమ అజ్ఞాతవా ప్రతిజ్ఞ మరిచిపోయి కీచకుడిని మట్టుబెట్టాలని దగ్గరలో ఉన్న పెద్ద చెట్టును ఎగాదిగా చూచి మొగం ఎర్రబారగా ధర్మరాజు వైపు చూశాడు. భీముని ఆకారాన్ని చూచి, రాబోయే పెను ప్రమాదాన్ని పసిగట్టి ధర్మరాజు కనుసైగలతో వారించి ఇలా అన్నాడు.

‘వలలుం డెక్కడఁ జూచె నొండెడ నసేవ్యక్ష్మాజముల్‌ పుట్టవే?
ఫలితంబై వరశాఖ లొప్పఁగ ననల్పప్రీతి సంధించుచున్‌
విలసచ్ఛాయ నుపాశ్రిత ప్రతతికిన్‌ విశ్రాంతి గావింపఁగాఁ
గల యీ భూజము వంటకట్టియలకై ఖండింపఁగా నేటికిన్‌?’ (4-2-136)

వంటల వాడైన వలలుడు ఎక్కడ చూచాడో కాని అక్కడకాక మరొక చోట పనికి మాలిన చెట్లు పుట్టవా? పండ్లు బాగా పండిన పెద్ద కొమ్మలతో గూడి, విశాలమైన నీడ నిచ్చే ఆశ్రయించిన వారికి శ్రమను పోగొట్టే ఈ చెట్టును వంటకట్టెల కొరకు నరికివేయటం దేనికి?

భీముడు కోపంతో పెద్దచెట్టుని పెరికి అటు కీచకుడిని, ఇటు విరాటుడిని వధించడానికి యత్నిస్తూ ఆ చెట్టు వైపు చూచి గురి నిలిపాడు. దానికి ధర్మరాజు అనుమతి కావాలి. అందుకే. అటు చూచాడు. అతడు కనుసైగలతో, అతడి ప్రయత్నాన్ని మాన్పాడు. ఇక్కడ ధర్మరాజు భీముడితో సూటిగా మాట్లాడరాదు. దేని మీదనో పెట్టి అన్యాపదేశంగా చెప్పాలి. గూఢంగా ఉండాలి. భీముడికి తప్ప ఇతరులకు అర్థం కాకూడదు. ఈ నిగూఢ భాషణం, ధర్మరాజు వంటలవాడి చిత్తవృత్తి పైన అన్యాపదేశంగా పలికే గూఢోక్తి, సరసోక్తి, సభాసమ్మతంగా, సందర్భోచితంగా, సమస్యా పరిష్కారంగా ఉండాలి. ఇది ఒక సన్నివేశం. కథ కాదు. కానీ మనకెన్నో విషయాలు నేర్పుతుంది.

ఇక్కడ వంటలవాడు కట్టెల కొరకు కూల్చడానికి చెట్టు వైపు చూస్తాడు. భీముడు చూచిన వృక్షం కీచకుడినీ, విరాటుడినీ చంపటానికి ఉపయోగించదలుచుకున్న ఆయుధం. ధర్మరాజు ఆ చెట్టును విరాటుడికి అన్యాపదేశం చేశాడు. ఆది పండ్లు పండిన వర శాఖలున్న పచ్చని చెట్టు. విస్తారమైన నీడతో ఆశ్రయమిచ్చి వారి అజ్ఞాతవాస వ్రతాన్ని ఫలవంతం చేస్తున్న విరాటుడు వరఫల వృక్షం. దానివైపు కష్టాల కొరకు చూస్తే, మరొకవైపు అసేవ్య వృక్షాలు, అంటే సేవలు కోల్పయి, అజ్ఞాతవాస వ్రతం భంగమైన పాండవ వృక్షాలు కట్టెలకు సిద్ధమౌతాయి. కాబట్టి ఆ చెట్టును పెరికితే తమ అశ్రయాన్ని తామే నాశనం చేసికొన్నట్లు, పాండవులు రెండిటికి చెడ్డ రేవడులు కాగలరని సూచన.

ఇక్కడ భీముడికి మాత్రమే తెలిసే కనుసైగలు, గూఢోక్తులు ధర్మరాజు మాట్లాడుతాడు. అవి సభలో ద్రౌపదికి మాత్రమే అర్థం కావటం విశేషం.

ఆపత్కాలంలో, అనువుకాని కాలంలో అవమానాలు దిగమింగుకోవాలని, విచక్షణ కోల్పోరాదని, తమ కష్టకాలలో తోడ్పాటుగా ఉండే చిన్న ఆసరాలను తెలివితక్కువతనంతో కోల్పోరాదని ఈ కథ సన్నివేశం తెలియజేస్తుంది. మరియు ఔచిత్యభరితమైన సంభాషణా చాతుర్యము ఎలా ఉండాలో, అభివ్యక్తి వైపుణ్యము ఎలా ఉంటే కార్యసాఫల్యం అవుతుందో కూడా ఈ సంఘటన తెలుపుతుంది.

విరాటపర్వము ద్వితీయాశ్వాసం లోనిది.

– “The most important thing in communication is to hear what isn’t being said.” – Peter F. Drucker

(ఇంకా ఉంది)

Exit mobile version