Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ మహా భారతంలో మంచి కథలు-20

[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]

51. సావిత్ర్యుపాఖ్యానం!

శ్వపతి అను రాజు మద్ర దేశాన్ని పాటిస్తుండేవాడు. సంతానానికై సావిత్రి దేవిని గూర్చి పద్దెనిమిది సంవత్సరాలు తపస్సు చేశాడు. సావిత్రి దేవి ప్రత్యక్షమై “నీకు పుత్రిక పుడుతుంది. ఆమె ద్వారా వందమంది కొడుకులు కలుగుతారు” అని చెప్పి అంతర్ధానమైనది. అశ్వపతి మాధవి దంపతులకు కూతురు పుట్టింది. ఆమెకు సావిత్రి అని పేరు పెట్టారు. ఆమె దేవతా స్త్రీల కంటే సౌందర్యవతి యైనది. ఆమె సాళ్వ దేశాధిపతి కుమారుడైన సత్యవంతుడిని వరునిగా ఎంచుకున్నది. అయితే సాళ్వ దేశాధిపతియైన ద్యుమత్సేనుడు రాజ్యాన్ని, చూపును కోల్పోయి అడవులలో నివసిస్తున్నాడు. ఒకనాడు నారదుడు అశ్వపతి వద్దకు వచ్చాడు. సావిత్రిని చూసి, వివాహం చేయమన్నాడు. అశ్వపతి నారదుడిని సత్యవంతుని గూర్చి ఆరా తీశాడు.

అశ్వపతితో “ఎల్లప్పుడు సత్యమే పలుకువాడు కాబట్టి అతడు సత్యవంతుడు. అతనికి ‘చిత్రాశ్యుడు’ అని మరొక పేరు. తేజస్సులో సూర్యుడిని, బుద్ధిలో బృహస్పతిని, పరాక్రమంలో ఇంద్రుడిని, అందంలో అశ్వినీ దేవతలను పోలి ఉంటాడు. అయితే అతడు ఈనాడు మొదలుకొని ఒక సంవత్సరంలో చనిపోబోతాడు” అని నారదుడు తెలిపాడు. అప్పుడు అశ్వపతి సావిత్రితో, ఈ అల్పాయుష్కుడిని వదిలి వేరే వాడిని వివాహం చేసుకోమన్నాడు.

అపుడు సావిత్రి “మనో వాక్కాయకర్మలలో మనసు ప్రధానమైనది. ఆ మనసులతో ప్రేమించిన వ్యక్తిని మరచుట ధర్మమా? అతడిని తప్ప మరొకడిని కోరను” అన్నది. దానితో అశ్వపతి నారదుని వైపు దీనంగా చూశాడు. అప్పుడు నారదుడు “నీ కూతురు సుగుణాల రాశి. ఆమె పుణ్యాల చేత భర్త చిరాయువు కాగలడు” అని పలికాడు.

అశ్వపతి ద్యుమత్సేనుని దగ్గరికి వెళ్ళి, తన కూతురును కోడలిగా స్వీకరించమని కోరాడు.

“రాజ్యం కోల్పోయి అడవులలో అష్టకష్టాలు పడుతున్న మాతో ఆ సుకుమారి కష్టాలకు ఓర్చుకోగలదా?” అన్నాడు ద్యుమత్సేనుడు.

“కలిమిలేములు కలకాలం ఉండేవి కావు. కలిమికి పొంగటం, లేమికి క్రుంగడం ధీరుల స్వభావం కాదు. నా కూతురు వయసులో చిన్నదైనా తెలివితేటలులలో ధీమంతురాలు. దయచేసి ఈ సంబంధానికి అంగీకరించాలి” అని అశ్వపతి ప్రార్థించగా, ద్యుమత్సేనుడు అంగీకరించాడు. ఆశ్రమవాసులైన మునుల సమక్షంలో సావిత్రీ సత్యవంతుల వివాహం జరిగింది. భర్తకు, అత్త, మామలకు సేవలు చేస్తూ, వారిని సంతోష పెట్టసాగింది.

నారదుడు చెప్పినట్లుగా ఇంకా నాల్గు దినాలలో భర్త చనిపోతాడని తెలిసిన సావిత్రి ఎల్లరు వారించినా, శుభకరమని తెలుపుతూ త్రిరాత్రోపవాసం ప్రారంభించింది. నాలుగవ రోజు సావిత్రి నిదుర లేచింది. ఆ రోజు భర్త మరణిస్తాడని తెలిసి సంతాపం చెందింది. అత్తమామలకు ఆశ్రమ విప్రులకు నమస్కరించి, సుమంగళిగా ఉండేట్టు దీవనలు పొందింది.

“మూడు రాత్రులు గడిచాయి. ఇకనైనా పారణ చేయి తల్లీ” అని అత్తమామలు చెప్పినా ప్రొద్దుగుంకే వరకు ఉపవాస దీక్ష వహిస్తానని చెప్పింది. ఇక సత్యవంతుడు సమిధలు, దర్భలు, ఫలాలు తేవటానికి అడవికి బయలుదేరాడు.

అతని వెంట సావిత్రి బయలుదేరింది. అడవిలో ఫలాలు సేకరిస్తూ ఒక చెట్టు వద్దకు వెళ్ళి కట్టెలకై గొడ్డలితో కొమ్మను నరకబోయాడు. అంతే. ముఖం వెలవెలబోయింది. శరీరం వశం తప్పింది. మనసు భ్రమ చెంది, సావిత్రి ఒడిలో తల ఉంచి పవళించాడు. క్రమంగా సోలిపోయి నిశ్చేతనుడయ్యాడు. సావిత్రి అంతా గమనిస్తుంది. తన తనస్సుకు, దీక్షకు, పరీక్ష ప్రారంభమైనదని తలచింది.

అప్పుడు సావిత్రి ఎదుట నీల మేఘం వలె నల్లపైన వాడు, కోరలతో, ఎర్రని చూపులతో, బంగారు వస్త్రాలతో, ప్రళయాగ్ని వలె జ్యలిస్తూ, పాశధరుడైన ఒక పురుషుడు వచ్చాడు. సత్యవంతుడిని సమీపించాడు. సావిత్రి భయపడింది. కాసీ కొద్దిసేపే. ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా దృఢచిత్తంతో “అయ్యా! మీరెవరు? ఇక్కడికి మీరేమి చేయాలని వచ్చారు?” అన్నది

“అమ్మా! నేను కాలుడను. నేను ఇతరులకు కానరాను. పతివ్రతవు కావున నన్ను చూడగలిగావు. నీ భర్త పుణ్యాత్ముడు కావున స్వయంగా వచ్చాను. అతడికి అంత్యకాలం వచ్చింది. స్వయంగా నేనే ఇతడి ప్రాణాలు తీసుకొని పోతాను” అంటూ సత్యవంతుడి జీవుడిని దేహం నుండి బయటికి లాగి భయంకర పాశంతో గట్టిగా బిగించి దక్షిణ దిశగా పయనం సాగించాడు యముడు.

సావిత్రి భర్త శవాన్ని రహస్య స్థలంలో దాచి ఉంచింది. యముని వెంట నడిచింది.

“అమ్మా! ఇక ముందు ఈ బాట నడవ శక్యం కానిది. ఎందుకు వస్తున్నావు?” అన్నాడు యముడు. “పతులతో పాటు సతులు మహానుభావా! నీ దయవలన నా పతి భక్తి వలన నేను వెళ్ళలేని చోటు ఉంటుందా? అన్ని మార్గాలలోను ధర్మమార్గం ప్రధానం. అటువంటి ధర్మానికి సజ్జనులే ఆధారమని పెద్దలంటారు. సజ్జనులలో ఉత్తముడవు నీవు. నీ దర్శనం కలిగిన తరువాత పరమశుభం కలుగకుండా ఎలా పోతాను?” అన్నది సావిత్రి. దానికి యముడు సంతోషించి, “నా మనసు ప్రసన్నమైనది. నీ భర్త జీవితం తప్ప యేదైనా కోరుకో” అన్నాడు. “గుడ్డివాడై నా మామ అడవులలో తిరుగుతున్నాడు” అని సావిత్రి అనగానే, “అతడికి చూపును ప్రసాదించాను” అన్నాడు యముడు. మరలా యముడి వెంట సావిత్రి నడవసాగింది. యముడు “ఇక నా వెంట రావద్దు” అన్నాడు. “దేవా! ఉత్తములైనవారు త్రికరణ శుద్ధిగా ఎప్పుడూ ఎవరికీ ఎగ్గు చేయరు. దీనులను దయతో కాపాడాలని చూస్తారు. ఇవ్వదలుచుకుంటే ఎదుటి వారి కోరికలు తీరేటట్లుగా నిండుగా, దండిగా ఇస్తారు. ఆశ్రయించిన వారి మనసులకు ఆనందం కలిగిస్తారు” అని సావిత్రి పలుకగా “దప్పిక గొన్నవారికి చల్లని నీరిస్తే ఎలా సంతోషం కలుగుతందో, అట్లా నీ నిష్కల్మషమైన వాక్యాలు నన్ను సంతోషపెట్టాయి. కాబట్టి భర్త ప్రాణం తప్ప ఏ కోరికైనా అడుగుము” అన్నాడు యముడు. “దేవా! ద్యుమత్సేనుడు శత్రువుల వలన రాజ్యాన్ని కోల్పోయాడు. అతడు రాజ్యం తిరిగి పొందేట్లు అనుగ్రహించుము” అనగా, “అట్లే అగుగాక! ఇక నీవు రారాదు. నీవడిగిన వన్నీ ఇచ్చాను” అన్నాడు యముడు.

“ధర్మాత్ములు దమ సలిపెడు ధర్మక్రియ దప్ప రెట్టి దశలందును మో

హోర్ములుఁ దాపముఁ బుట్టవు ధార్మికహృదయములఁ బ్రథమధర్మాధ్యక్షా!” (3-7-237)

ధర్మపీఠ మెక్కిన వారిలో మొదటివాడా! ఎట్టి దురవస్థలోనైనా ధర్మాత్ములు, ధర్మంతో కూడిన తమ కర్తవ్యాలను వీడజాలరు. ధార్మికుల హృదయాలలో పరితాపం, భ్రాంతి ఉండదు. కాబట్టి భర్తను ఎలా విడిచి వెళ్ళేది. అట్లా వదలటం న్యాయమా? ఏ విధంగానైనా ఉద్వేగాన్ని వదిలి అచంచలమైన నిష్ఠతో ధర్మాన్ని నిలపాలి కదా!” అని పలికింది సావిత్రి. “నీవు ధర్మవిశేషాలు తెలిసినదానవు. కావున భర్త ప్రాణాలు తప్ప మరేదైనా కోరుకొనుము” అని యముడు పలుకగా “నా తండ్రికి మగ సంతానం లేదు. వందమంది కొడుకులను వరముగా ప్రసాదించుము” అని సావిత్రి కోరింది. ఆ వరాన్ని కూడా ఇచ్చాడు యముడు. “చాలా దూరం వచ్చావు ఇక వెనక్కు తిరిగిపో” అని చెప్పాడు యముడు. “నాకు దప్పిక లేదు. నా భర్త చరణంపై భక్తితో ఉన్నదానిని కాబట్టి నా మదికి అలసట లేదు. భర్తను ఆశ్రయించుట తప్ప నాకు మరో ధర్మం లేదు. ఆత్మ ధర్మంతో కూడిన పుణ్యాత్ములు, పుణ్యతీర్థాల వలె పవిత్రమూర్తులు, వారిని దర్శిస్తే పాపాలు శాంతిస్తాయి. వారి వల్లనే సూర్యచంద్రులు గతులు తప్పరు. కులపర్వతాలు క్రుంగిపోవు. సముద్రాలు పొంగవు. భూమి స్థిరంగా ఉంటుంది. మరొక మాట, ఏడు మాటలాడితే ఎవరైనా మంచి బంధువులవుతారని లోక ప్రసిద్ధి. కాబట్టి నేను నీకు బంధువును. బంధువుల మనసులోని కోరికలను తీర్చటం, నీవంటి మహానుభావులకు అవశ్య కర్తవ్యం” అని సావిత్రి పలికింది.

అప్పుడు యముడు ప్రసన్నుడై, “నీ మనసులో ఉన్న కోరికను ఒకదానిని వరంగా కోరుకొమ్ము, ఇస్తాను” అన్నాడు. “ఇంతవరకు సత్యవంతుడి జీవితం తప్ప ఏదైనా వరం కోరుమన్నావు. ఇప్పుడా మాట పలుకలేదు అయ్యా! సతికి వైధవ్యం భరించరానిది. భర్త లేని వనిత శుభకార్యాలన్నింటిలో దూరంగా ఉంచబడుతుంది. నా సతిధర్మం సురక్షితంగా నిలిచేటట్లు సుగుణశాలి అయిన నా భర్తను నాకు అనుగ్రహించుము” అని సావిత్రి పలికింది.

అప్పుడు యముడు సత్యవంతుడిని పాశ విముక్తుడిని చేసి, “ఓ కోమలీ! ఇదిగో నీ మనోనాథుడిని గ్రహించుము. ఇతడు నాలుగు శతాబ్దాలు జీవిస్తాడు. వందమంది పుత్రులను క్రమంగా కంటాడు. అనేక యజ్ఞాలు చేసి మీ వంశానికి వన్నె తెస్తాడు” అని చెప్పి అదృశ్యమయ్యాడు.

సత్యవంతుడు పునర్జీవుతుడై, యువరాజు అయ్యాడు. ఆ విధంగా సావిత్రి తన భర్తను, అత్తమామలను, తల్లి దండ్రులను, వంశాన్ని ఉద్దరించింది.

సావిత్రి పతివ్రత. ధర్మాత్మురాలు. నారీ లోకానికి ఆదర్శమూర్తి, ఈ కథ కేవలం ఒక పతివ్రత తన భర్త ప్రాణాల కోసం వెంపర్లాడినది కాదు. భావోద్వేగాలకు సంబంధించినది అంతకంటే కాదు. ఒక స్త్రీ, అచంచలమైన సత్యనిష్ఠతో, ఏ మాత్రం కోపతాపాలు, భావోద్వేగాలు ప్రదర్శించకుండా తాను అనుకున్న ధ్యేయాన్ని సిద్దించుకోవడానికై ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ లక్ష్యాన్ని చేరిన కథ.

తన భర్త చనిపోతాడని తెలిసి కూడా దైవాన్ని, ధర్మాన్ని, తనను నమ్మి వ్రతాలు, ఉపవాసాలు చేసి, భర్త చనిపోయిన తరువాత విధిని తన దురదృష్టాన్ని నిందించకుండా, ఏడుపులు, పెడబొబ్బలు పెట్టకుండా మొక్కవోని దీక్షతో, సమయస్ఫూర్తితో యముడంతటి వాడిని అతడిలోని ఉన్నత గుణసంపదను శ్లాఘించి, అతడి మెప్పును, అనుగ్రహాన్ని పొంది మానవులకు తప్పనిదైన మృత్యువును, యమపాశాన్ని అతడి చేతనే విప్పేలా చేసి, భర్త ప్రాణాన్ని, తల్లిదండ్రులు, అత్తమామల ఆనందాన్ని వెనక్కి తెప్పించిన కార్యసాధకురాలు.

కార్యసాధన ఎలా ఉండాలి, కార్యసాధకులు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎలా ఒక్కొక్క అడ్డునూ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఆచంచల ప్రయత్నశీలురు ఎలా అవ్వాలి అని మానవలోకానికి చాటి చెప్పిన ధీర గంభీర యువతి సావిత్రి.

పతివ్రత, భర్తను పూజించి పతి ప్రాణాలు యముడి నుండి దక్కిచుకున్నది అన్న సామాన్య కోణంలో కాకుండా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ఒక యువతి పడ్డ శ్రమ, దానికై ఆమె ఎన్నుకున్న పంథా, నిర్మలమైన పటిష్టమైన ఆలోచనా, ఆచరణా ఈ కథకు వన్నెలద్దాయి. మానవలోకానికి ఆదర్శ ప్రాయమయ్యాయి.

సంభాషణా చాతుర్యం, సమయస్ఫూర్తి, పెద్దల పట్ల వినయం, ముందరి కాళ్ళకు బంధం వేసేలా మాట్లాడగలగటం సావిత్రిలో గల మరికొన్ని సద్గుణాలు.

ఆరణ్యపర్వం సప్తమాశ్వాసం లోనిది. మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పినది.

– నిశ్చితార్థం వదలరు నిపుణమంతులు

– ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్

– Fortune favours the brave.

52. కర్ణుడి ఔదార్యం!

కర్ణుడు లేనిదే మహాభారతం లేదు. దానకర్ణుడిగా ప్రసిద్ధి చెందిన ఈ కుంతీ సూర్యపుత్ర్యుడి ఔదార్యమునకు హద్దులు లేవు. అందుకే అతని యశస్చంద్రికలు త్రిలోకాలు ఆక్రమించాయి.

కర్ణుడు సహజ కవచకుండలాలతో జన్మించాడు. అతడు అలా సహజ కవచ కుండలాలతో ఉంటే పాండవులకు విజయం లభించదు. కావున ఇంద్రుడు వారికి మేలు చేయాలని భావించాడు. అందుకే, వాటిని హరించాలనుకున్నాడు. ఇంద్రుని అభిప్రాయాన్ని తెలుసుకొని లోక బాంధవుడైన సూర్యుడు, తన కుమారుడైన కర్ణుడికి, ఈ విషయం చెప్పాలనుకున్నాడు. బ్రాహ్మణ వేషం ధరించాడు. కర్ణుడి దగ్గరికి వచ్చాడు. అప్పుడు కర్ణుడు ఏకాంతంగా ఉన్నాడు. “కర్ణా! నీ మేలు కోరి వచ్చాను. నా మాటలు సావధానంగా వినుము. దేవేంద్రుడు పాండవ పక్షపాతి. మోసం చేసి నీ కవచకుండలాలను హరించగలడు. నీకు బ్రాహ్మణులంటే భక్తి. వారేదడిగినా యిస్తావు. దేవేంద్రుడు విప్రుడి రూపంలో వస్తాడు. అతడికి మణులనూ, బంగారాన్ని యివ్వుము: కవచకుండలాలను మాత్రం యివ్వకుము. అలా యిస్తే నీవు మృత్యుముఖంలోకి వెళ్ళినట్లే” అన్నాడు. మరలా అతడే “కర్ణా! నీ కవచకుండలాలు అమృత తుల్యాలు, అవి నీతో ఉంటే శత్రు సమూహం నిన్ను చంపజాలదు. సుఖసంతోషాలతో ఉంటావు. జాగ్రత్త మోసపోవద్దు” అని విప్రుడు పలికాడు. అప్పుడు కర్ణుడు ఎక్కువ అణుకువతో “నీవు సామాన్య బ్రాహ్మణుడివి కావు. అసలు నీవెవరో తెలుప ప్రార్థన” అన్నాడు.

అపుడా విప్రుడు “నేను సూర్యుడను. నీపై గల మక్కువతో కర్తవ్యాన్ని ఉపదేశించ వచ్చాను” అన్నాడు. అప్పుడు కర్ణుడు “దేవా! నీ కరుణా ప్రేమలకు కృతజ్ఞుడని, నీవు నా శ్రేయస్సు కోరేవాడవు. నేను ధన్యుడను. కానీ నాదొక విన్నపము. బ్రాహ్మణులు ఆర్థిస్తే నా ప్రాణాలు సహితం సమర్పించుకోవాలన్నది నా ప్రతిజ్ఞ. ఇది లోక విదితము. మరి దేవేంద్రుడంతటి వాడు ‘దేహి’ అని వస్తే, కవచకుండలాలు ప్రియమవుతాయా? అవి నాకు తృణప్రాయాలు కదా.

జగముల నెల్లను నిండిన పొగడిత గడు వెలితి సేసి, పొల్లయొడలికై

తగవే జన్మవ్రత మిటు దిగవిడువఁగ నేఁడు నాకుఁ ద్రిభువనదీపా! (3-7-291)

మూడు లోకాలు వెలుగొందజేసే సత్కీర్తికి కొఱత కలిగించి, ఏ మాత్రం విలువలేని ఈ పొల్లు శరీరంకై యావజ్జీవిత దీక్షతో పరిపాలించే నోమును నేడు నేను విడవటం పాడి కాదు కదా. రాక్షస సంహారుడు, శత క్రతుకర్త ఇంద్రుడు యాచకుడై వస్తే, అదే అతడి కీర్తికి లోటు. నా కీర్తి ముల్లోకాలలో వెలుగుతుంది. ఏ విధంగా చూచిన సుకృత విశేషమే కదా. నేను యశస్సును విడువజాలను. పేరు ప్రతిష్ఠలతో బ్రతికేటప్పుడు మరణం ప్రాప్తించినా నాకు సమ్మతమే. లోకంలో అపకీర్తి కంటె మరణమే మేలు అన్న మాట వినలేదా?

‘కీర్తియ యిచ్చుఁ బుణ్యగతిఁ; గీర్తియ తల్లియుఁబోలెఁ బ్రోచు; స

త్కీర్తియ యాయువున్‌ సిరియుఁ; గీర్తివిహీనుఁడచూ శవంబు; దు

ష్కీర్తను నెల్లచేటులును గిట్టి హరించు’ ననండె తొల్లి భ

క్తార్తిహరుండు నాఁబరఁగు నంబుజసూతి జగద్ధితంబుగన్‌ (3-7-294)

కీర్తియే పుణ్యగతి ప్రసాదిస్తుంది. కీర్తియే కన్నతల్లి వలె కాపాడుతుంది. మంచి కీర్తిమే ఆయువు. కీర్తియే సంపద. కీర్తిలేని వాడు హీనుడే. అపయశస్సు కలవారిని అన్ని కీడులు ఆవహించి నశింపజేస్తాయని బ్రహ్మదేవుడు పలికాడు. దేవా! వినుము. నాకు కొన్ని ప్రతిజ్ఞలు కలవు. బ్రాహ్మణులు ఏది అడిగితే అది దానం చేయడం, శత్రువులను సంహరించడం, శరణార్థిని రక్షించడం, స్త్రీ, బ్రాహ్మణ, వృద్ధులు ఆపదలో ఉంటే రక్షించడం. వీటిలో ఏ ఒక్కటి తప్పినా, చెక్కలైన కీర్తి కలవాడిని అవుతాను. ఇవన్నీ స్పష్టమయ్యేటట్లు ఇంద్రునికి కవచకుండలాలు ఇస్తాను” అన్నాడు.

అప్పుడు సూర్యుడు కోపించి, “నీకు మేలు చెబుతున్నాను. నేను చెప్పినట్టు నడుచుకో.. నీకు నీ కుటుంబానికి మేలు చేయని కీర్తి ఎందుకు? నీవు బ్రతికి ఉంటే – కీర్తితో పాటు సంపదలు, చక్రవర్తిత్వం లభిస్తుంది. మరణించిన పిదప మానవుడు బూడిదగా మారతాడు. అతని యశస్సు యొక్క గొప్పతనాన్ని చూడలేడు, పొందలేడు. మరణించిన వాడి యశస్సు చచ్చిన వాడి కళేబరానికి అలంకారము అవుతుంది. నీకొక దేవరహస్యం చెబుతున్నాను. నీకు అర్జునుడికి యుద్ధం జరుగుతుంది. నీవు కవచకుండలాలతో ఉంటే అతడిని జయించగలవు. లేకుంటే మిక్కిలియైన ఆపద యేర్పడుతుంది” అన్నాడు.

దీనికి కర్ణుడు “నీకు ఎదురు చెబుతున్నందుకు మన్నించు. అసత్యానికి భయపడినట్లుగా నేను యముడికి కూడా భయపడను. వ్రతాన్ని చెరుపుకోను. నన్ను సద్వ్రతం నుండి మరల్చరాదు. పరశురాముడు, ద్రోణుడు నాకు ఇచ్చిన దివ్యాస్త్రాలు తక్కువైనవి కావు. నేను అర్జునుడిని చంపుట తథ్యము. నన్ను ఆశీర్వదించు” అన్నాడు.

కర్ణుడి శీల సంపదను మెచ్చుకొని, “కానున్నది కాకమానదు” అని సూర్యుడు వెళ్ళిపోయాడు. సూర్యుడు చెప్పినట్లుగా ఇంద్రుడు విప్రవేషియై వచ్చాడు. కర్ణుడిని కవచకుండలాలు యాచించాడు. కర్ణుడు ఇచ్చాడు. మహాభారత యుద్ధములో కర్ణుడు అర్జునుడి చేతిలో చంపబడ్డాడు. అర్జునుడు విజయం సాధించాడు. కర్ణుడి కీర్తి ప్రతిష్ఠల ముందు, ఔదార్యం ముందు అర్జునుడి విజయం చిన్నబోయింది.

“అసత్యానికి భయపడినట్లుగా యమునికైనా భయపడను. ఎవరు ఏది అడిగినా యిస్తాను. ఇది నా వ్రతం” అని నిశ్చయించుకున్న కర్ణుని జీవితం, దానం, త్యాగం వంటిగుణాలతో నిండినది. అందుకే అతడు దుష్ట పక్షములో ఉన్నా, అతడిని విలక్షణుడిగా మార్చింది.

కర్ణుడు అంటే ఇవ్వడంలోని గొప్పతనాన్ని మానవ జాతికి నేర్పినవాడు.

అరణ్యపర్వం సప్తమాశ్వాసం లోనిది.

– ఉత్తమా మానమిచ్ఛంతి. Good Man Seek Honour.

– He is more blessed to give than receive.-  Bible

– The Charitable man is loved by all; his friendship is prized highly – Lord Buddha.

(ఇంకా ఉంది)

Exit mobile version