[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
ఇది కథ కాదు. ఇది ప్రాచీన భారతదేశంలో పతిపత్నుల మధ్య ఎలాంటి సంబంధాలుండేవి, సమాజంలో భార్యాభర్తలు ఎలా ఉంటే సఖపడతారో అప్రత్యక్ష్యంగా సూచించిన సంభాషణం. ప్రతి ఒక్కరు చదివి ఆలోచించి ఆచరించాల్సిన విషయం. మహా పతివ్రతలైన కృష్ణార్జునుల భార్యలు మాట్లాడుకోవటం ద్వారా తెలపబడిన ఈ అంశాలు సంసార జీవనానికి ఆలంబనమైనవి.
ఒకనాడు కృష్ణుడు సత్యాసమేతంగా పాండవుల గృహానికి విచ్చేశాడు. అతిథి మర్యాదలు, భోజన భాజనాలు అయిన తరువాత సత్యా ద్రౌపదులు ద్రౌపదిదేవి మందిరంలో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు.
సత్యాదేవి ద్రౌపదితో “నీకు తేజస్సు, శీలం కలవారైన అయిదుగురు భర్తలు. వారందరూ ఎల్లప్పడూ నీపై అమిత ప్రేమను ప్రదర్శిస్తారు. ఇది చాలా వింత. ఇంతటి మహిమను ఎలా పొందావు. నోములు నోచావా? మంత్రతంత్రాలు అభ్యసించావా? మందులూ మాకులూ పెట్టావా? వస్త్రాద్యలంకారాలలో తెలివితేటలు కారణమా? వయ్యారాలలో నేర్పు కలదానివా? భర్తల అనురాగాన్ని నీవు చూరగొనటానికి కారణమేమిటి? భర్త ప్రేమను చూరగొనే ఆ కిటుకులను, లోగుట్టును నాకు తెలిపితే నా భర్తయైన శ్రీకృష్ణుని ప్రేమను చూరగొంటాను!” అన్నది.
సత్య అడిగిన ప్రశ్నకు ద్రౌపదికి కోపం వచ్చింది. కాని అణుచుకున్నది. ఇలా చెప్పింది. ద్రౌపది చెప్పిన మాటలు నేటి యువతులు ఇళ్ళు తప్పక వినవలసినది, ఆచరించవలసినది.
“సత్యా! నన్ను తక్కువ స్థాయి ఆడువారితో జమకట్టి ఇట్లా మాట్లాడటం న్యాయమా? ఇట్లా నీవు పలుకగలవని నేనూహించలేదు. శ్రీకృష్ణుడికి భార్యగా ఉండే అర్హత నీలో లేదు సుమా” అని మెత్తగా చీవాట్లు పెట్టి హాస్యగర్భితమైన మాటలలో, ఆమె తెలివితక్కువతనం తేటతెల్లం చేస్తూ ఇట్లా అన్నది:
“ఓ సత్యా! మంత్రతంత్రాలతో, మందులు మాకులతో భర్త వశుడవుతాడని అనుకోవడం తెలివితక్కువతనం మాత్రమే. దాని వలన భార్యపై భర్తకు అనురాగం నశిస్తూంది. పైగా అట్టి వారితో కాపురం చేయటం పాముతో చెలిమి చేయటంలా భావిస్తారు. ఒక వేళ భర్తకు మందులూ, మాకులూ పెట్టినా, వశీకరణ మంత్రాలు ప్రయోగించినా, భర్తకు మూగతనం, మనసు, శరీరం మొద్దుబారటం మున్నగు జబ్బులు వస్తాయి తప్ప మంచి జరుగదు. అట్టి భార్య స్వయంకృతాపరాధానికి అపకీర్తి మూటగట్టుకుంటుంది. తుదకు నరకయాతన పొందుతుంది. నా భర్త ప్రేమను ఎలా పొందానో తెలుతుతాను వినుము. భర్తలు అన్యకాంతల యెడ ప్రేమ చూపినా కోపించను. స్వాతిశయం చూపక భర్తకు నేవ చేస్తాను. ఎంత పనులు చేయను. ఎంతగా మాటాలాడను, పరపురుషులు దేవతలైనా, యక్షులైనా వారిని గడ్డపోచగా చూస్తాను. స్నాన, భోజన, శయనాలు ముందుగా భర్తకు అమర్చి, తదుపరి నేననుభవిస్తాను. భర్తలు ఇంటికి వచ్చినపుడు కాళ్ళు కడుగు కొనడానికి నీరు, కూర్చొవడానికి ఆసనాలు సమకూరుస్తాను. ధాన్యం, ధనం వృధి చేయను ఇళ్ళు, వాకిళ్ళు, పాత్రలు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతాను. మరుపు, ఏమరుపాటు లేకుండా సదా కాచుకొని చూచుకుంటాను. చుట్టాలందరికీ సంతోషం కలిగిస్తాను. పలుమార్లు ఇంటి గుమ్మం దగ్గర, వాకిలి దగ్గర తిరుముతూ ఉండటం, చెడ్డవారితో స్నేహం చెయ్యటం, వాదులాడటం, హాస్యపు మాటలతో మితిమీరి నవ్వటం మున్నగునవి చేయను. అట్టి పనుల జోలికి ఎప్పుడు పోను. భర్తలు గ్రామాంతరం వెళితే పువ్వులు ముడువను. పరిమళపు పూతలు పూసుకోను. ఆభరణాలు ధరించను. భర్తల పట్ల మనసు లగ్నం చేసుకుని వారికై ఎదురు చూస్తాను. అత్తగారి యెడ పూజ్యభావం కలిగి, ఆమె చెప్పిన రీతిగా నడుచుకుంటాను. బ్రాహ్మణులు, అతిథులు విచ్చేసినపుడు వారి సేవలు నేనే స్వయంగా చేస్తాను. సంప్రీతి, క్షమ, వినయం, మంచితనం అనే శుభగుణాలను ఎప్పుడూ విడువను. పాండవులు ఎంత మెత్తనివారో అంత కఠినులు. వారు మెత్తటివారైనా వారి పట్ల భయభక్తులలో ఉంటాను. నిర్లక్ష్యం చేయను. భయంతో సేవలు చేస్తాను. మా అత్తగారైన కుంతీదేవికి స్వయంగా సేవలు చేస్తాను. ధర్మరాజు ప్రతి దినము భోజన సమయంలో తన సహపంక్తిని ఎనిమిది వేల మంది బ్రాహ్మణలకు బంగారు కంచాలతో అన్న సంతర్పణ చేస్తాడు. సన్యాసులు పదివేలమందికి భోజనం పెడతాడు. వారికి స్వయంగా వంట వండి వడ్డిస్తాను. బట్టలు, ఆభరణాలు సమకూరుస్తాను. అందరికీ సంతోషం సమకూర్చటం నా కర్తవ్యంగా భావిస్తాను. అథిథులకు, అభ్యాగతులకు ఆహార పానీయాలు సమకూరుస్తాను. ధర్మరాజు సేవకులు ఎట్టి జాగరూకతతో ఉన్నవారో, ఏ ఉపచారాలు, అపచారాలు చేస్తున్నారో కనిపెడుతుంటాను. కోటలో కల లక్షలాది ఏనుగులు, గుర్రాలకు ఆహారం పెట్టడానికి, సంరక్షించడానికి తగిన వారిని నియమిస్తాను. బొక్కసం తాలూకు ఆదాయ వ్యయాలు పరిశీస్తుంటాను. సేవకుల జీతభత్యాలు నేనే సరిచూస్తుంటాను. పాండవులు సంసారం బరువు నాపై మోపి ఇష్టమైన తావులలో విహరిస్తుంటారు. కుటుంబం అంతా ఈదే దానిని కావున అన్ని వైపులా జాగరకత వహిస్తాను. తెల్లవారుటకు ఇంకా ఒక జాముండగా నిదురపోతాను. నాకు కడుపు నిండా తిండి తినటానికి, కంటినిండా నిద్రించడానికి సరియైన తీరిక ఉండదు. ఇలా ఉండటం వల్ల భర్తల ప్రేమను పొందుతాను. ఇలా చేస్తేనే యే భర్తలైనా భార్యలను ప్రేమించేది. ఇది నా స్వీయానుభవం. నీవు, నీలాంటి వారు గ్రహించవలసినది” అని తెలిపింది.
సత్య ద్రౌపదిని క్షమించమని కోరి, తాను అలాగే చేస్తానని పలికింది.
ఇక ఈ సంభాషణకు యే భాష్యమూ అవసరం లేదు.
అరణ్యపర్వం పంచమాశ్వాసం లోనిది.
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ। భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ॥
In work, a slave; in business, a minister; in form a Lakshmi; In patience, (like) the earth; in (providing) food, a mother; in conjugal enjoyments, Rambha;- is not she who possesses these six qualities a dutiful wife.
స్వర్గలోకము సిద్ధించినా చేరటానికి నిరసించిన ఉదాత్తుడు ముద్గలుడు. ముద్గలుడు ఒక పుణ్యాత్ముడు. తన యింటికి వచ్చిన అతిధి అభ్యాగతులను అన్నపానాది సౌకర్యాలతో ఆదరించేవాడు. అతడు తన భార్యాపిల్లలతో కలిసి ‘ఉంఛ వృత్తి’ (పొలాలలో రాసిన ధాన్యాన్ని ఏరుకోవటం) తో కురుక్షేత్రంలో నివసించేవాడు. వారు పదిహేను రోజులు నిరాహారంతో ఉండేవారు. పాడ్యమి తిథి నాడు వడ్లు ఏరడం మొదలు పెట్టేవారు. ఆ ఉంఛవృత్తిలో ఒక్కొక వరిగింజను ఏరి ‘తూమెడు’ (అనగా నాలుగు కుంచాలు) ధాన్యం ప్రోగు చేసేవారు. అట్లా వండిన అన్నముతో దేవతలకు, పితరులకు నివేదనం చేసి, అతిథులకి పెట్టి, మిగిలిన దానిని భార్యాపిల్లలతో భుజించేవాడు.
ఈ విధంగా ‘శరీరధారణ’కు మాత్రమే ఆహారం స్వీకరిస్తూ పక్షోపవాసవ్రతము నిర్వహిస్తుండేవాడు. ఒక రోజు వారింటికి ముక్కోపి దుర్వాస ముని వచ్చాడు. అతడి ఆకారం పిచ్చివాడివలె ఉన్నది. వస్త్రాలు చిరిగి ఉన్నాయి. అనగారుడి వలె నోటికి వచ్చినట్లు మాట్లాడసాగాడు. ముద్గలుడు దుర్వాస మునికి స్వాగతం పలికి, అర్ఘ్యపాద్యాదులు యిచ్చి, అర్థసత్కారాలు చేశాడు. అటుపై ముద్గలుడు మునికి భోజనం పెట్టాడు. దుర్వాసుడు ఆ అన్నాన్ని ఆరగించి, మిగిలిన అన్నాన్ని తన శరీరానికి పూసుకొని, తన ఇష్టం వచ్చిన చోటకు వెళ్ళిపోయాడు. దుర్వాసుడు ఇలా పర్వపర్వానికి వస్తూనే ఉన్నాడు. ముద్గల మహర్షి తాను నిరాహారుడై యుండి కూడా దుర్వాసుడికి అతిథి మర్యాదలతో సగౌరవంగా, సంప్రీతితో అన్నం పెడుతుండేవాడు. ఈ విధంగా ఆరు పర్వదినాలలో దుర్వాసుడు ముద్గలుని పరిక్షించాడు. కాని ముద్గలుడిలో ఏ లోపం కనిపించలేదు.
దానితో దూర్వాసుడు సంతోషించి “ఓ ముద్గల మహర్షీ, నీవు మహానుభావుడవు. పవిత్రుడివి. అన్నదానం చేయటంలో నీకు గల నిష్ఠ సాటిలేనిది. అన్నదానం చేసేటప్పుడు ఇంచుక కూడా నీ మనుసులో ఏవగింపు కానరాలేదు. కోపతాపాలు లేవు. మరుగు లేదు. అతిథులను స్వచ్ఛమైన భక్తితో పూజించావు. అన్నదానం, ప్రసన్నత, సత్యం, ధైర్యం, ఇంద్రియనిగ్రహం, ఇతరుల సొమ్మపై ఈషణ్మాత్రం కోరిక లేదు. నీవు అన్నీ ఉన్నవాడవు. నాలుక ఎప్పుడూ రుచులు అనుభవించడానికి ఉవ్విళ్ళూరుతుంది. ఓర్పును, ధర్మాన్ని ఇంద్రియనిగ్రహాన్ని ఆకలి నాశనం చేయగలదు. పై రెండింటి యందు నీవు ఆసక్తుడవు కావు. నీవు బ్రతుకు తెన్నును తీర్చిదిద్దే అన్నాన్ని, బ్రతుకవలెననే నీ కోరికను కూడా వదిలితివి. నిన్ను ఎంతని పొగడను?”
“మనమున నింద్రియముల వ | ర్తనమును సరిగా నొనర్చు ధర్మంబు దపం బని చెప్పుదు; రట్టి తపం | బనఘా! నీయంద కలిగె నభినవభంగిన్.” (3-6-124)
“చిత్తాన్ని ఇంద్రియాల నడవడిని సరిగా ఉండేటట్లు చేసే ధర్మమే తపస్సు” అని పెద్దల నిర్వచనము. ఆ నిర్వచనానికి అనువైన తపస్సు నీయందు మాత్రమే వ్యక్తమైనది. నాలోను, ఇతర ఋషులలోను లేని మనోధర్మము నీలో చూశాను. నీ తపో వైభవాన్ని కీర్తిస్తున్నాను. సశరీరంగా దేవవిమానంలో స్వర్గానికి వెరగలవు!” అని దీవించి వెళ్ళిపోయాడు.
అంతలో దేవతలు ముద్గలుడిని స్వర్గానికి తీసుకొని వెళ్ళడానికి విమానంలో వచ్చారు. దేవతలు “అయ్యా నీవు చేసిన పుణ్యకర్మల వలన నీకు స్వర్గం సిద్ధించింది. దయచేసి విమానాన్ని శీఘ్రంగా ఎక్కు” అన్నారు.
ముద్గలుడు దేవతలతో “మహాత్మా! స్వర్గలోకము ఎట్టిది? అందలి మంచి చెడులు వివరించండి” అన్నాడు.
దేవతలు, ముద్గలుడితో, “స్వర్గలోకం భూభాగానికి పైన ఉంటుంది. దేవతలు నడయాడే స్థలమిది. తపస్సిద్ధులు, మహాయజ్ఞాలు చేసే ఋషులు, సత్యవ్రతులు, యుద్ధములో పరాక్రమము చూపిన వారు స్వర్గలోకములో ఉంటారు. అక్కడ అస్పరసలు, సాధ్యులు, దేవర్షులు, మరుత్తులు, వసువులు ఉంటారు. ఆ లోకంలో మేరు పర్వత శిఖరం, నందనోద్యానం ఉన్నవి. దాహం లేదు. చలి, వేడి వలన పీడ లేదు. జరావ్యాధులు లేవు. ఎటు చూసినా మనోహర దృశ్యాలే. స్వర్గలోకానికి పోవడానికి అర్హులైన పుణ్యవ్రతులు ఆయుష్షు తీరిన తరువాత మనుష దేహాలు విడనాడి తేజోమయ శరీరాలు ధరించగలరు. వారు కోరిన వస్త్రాలు, అలంకారాలు, ఆభరణాలు, వాడిపోని పూలదండలు, పసిడి విమానాలు సమకూర్చబడతాయి. వారికి దుఃఖాలు, అలసటలు ఉండవు. నిరంతర సౌఖ్యాలు అనుభవిస్తుంటారు. స్వర్గలోకం పైన బ్రహ్మలోకం ఉంటుంది. స్వయంప్రకాశమైనది. మనువులు, బ్రహ్మలు, ఋషులు, బ్రహ్మలోకంలో ఉంటారు. అక్కడ లోభం, పాపం, దుర్దశ, ఆవేదన, పునర్జన్మ లుండవు. అన్నిలోకాలు ప్రళయకాలంలో నాశనమవుతాయి. సత్యలోకం శాశ్వతంగా ఉంటుంది. ఇంద్రుడు సహితం ఈ లోకం కోరుకుంటాడు. భూలోకంలో చేసిన పుణ్యాలకు స్వర్గలోకములో మనుజుడు అనుభవించగలడు. స్వర్గంలో నుండి ఎట్టి పుణ్యాన్ని ఆర్జించలేడు. కేవలం తన పుణ్యం ఖాతాను ఖర్చు చేసుకొంటాడు. మనుజుడు చేసిన పుణ్యాలు అనుభవించిన తరువాత స్వర్గలోకంలో ఉండటానికి వీలులేదు. అతడిని భూలోకములోకి తోసి వేస్తారు. భోగాలు అనుభవించన వాటిని విడనాడడం అంటే ఆవేదన పొందడమే కదా. స్వర్గలోకములో ఉండేవారు కూడా మనసులో పరితాపం చెందుతారు. తాము హీనస్థితిలోనుండటం, మరొకడు హెచ్చుస్థాయిలో నుండటం వారికి తాపం కలిగిస్తుంది. బ్రహ్మలోకానికి, తక్కిన లోకాలకున్న తేడా అదే. పుణ్యం క్షీణించిన పిదప స్వర్గలోకం నుండి త్రోసివేయబడిననాడే తిరిగి భూలోకములో సౌఖ్యాలను అనుభవించే స్వభావం కలవాడిగా జన్మిస్తాడు. భూలోకం కర్మభూమి. స్వర్గలోకం పుణ్యభూమి. భూలోకంలో చేసిన కర్మలకనువైన పుణ్యానికి తగిన స్వర్గ భోగాల అనుభవిస్తాడు” అని చెప్పారు.
అప్పుడు ముద్గలుడు “నాకు స్వర్గ భోగాలు అవసరం లేదు. అవి వేల్పులే అనుభవించు గాక. మీరు వెళ్ళిపోండి. ఏ చోటకి చేరితే జీవుడు తిరిగి ఈ భూలోకంలోకి రాకుండా శాశ్వతంగా ఉండగలడో, అట్టి గొప్పస్థాయికి చేరటానికై నేను ఏ మార్గంలో చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయగలను” అని వారికి మర్యాదతో వీడ్కోలు పలికాడు.
ముద్గలుడు ఉంఛవృత్తిని విడిచి గొప్ప, నిర్వికార చిత్త ప్రశాంతిని పొంది గొప్ప జ్ఞాని అయ్యాడు. అతడికి పొగడ్తలు, తెగడ్తల పట్ల సమభావం ఏర్పడింది. మట్టి పెళ్ళ, రాయి, బంగారాలకు అతడి దృష్టిలో భేదం లేనట్లే. ఆ విధంగా జీవన్ముక్తుడయ్యాడు.
జితాత్మనః ప్రశాన్తస్య పరమాత్మా సమాహితః। శీతోష్ణసుఖదుఃఖేషు తథా మానాపమానయోః॥ (భగవద్గీత, అధ్యాయం 6, శ్లోకం 7)
మనసును జయించినవాడు, మనశ్శాంతితో గూడిన వాడైన మనుజునకు శీతోష్ణసుఖదుఃఖాల యందును, మానవమానములందును పరమాత్మానుభవము చెక్కు చెదరకనే యుండును.
జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థః విజితేన్ద్రియః। సమలోష్ఠాశ్మకాంచనః యోగీ యుక్తః ఇతిఉచ్యతే॥ (భగవద్గీత, అధ్యాయం 6, శ్లోకం 8)
శ్వాసజ్ఞాన, అనుభవజ్ఞానములచే తృప్తి నొందిన మనసు గలవాడు, నిర్వికారుడు, ఇంద్రియములను జయించినవాడు, మట్టిగడ్డ, రాయి, బంగారం మూడింటిని సమంగా చూచు యోగి అనబడును.
దుఃఖ కారకములు, అశాశ్వతములైన స్వర్గసౌఖ్యములు వాంఛించక, పరమాత్మ సన్నిధిని చేరుటకై ద్వంద్వాతీతుడై, నిర్వికార చిత్తముతో ప్రయత్నించాలి అన్నది ఈ కథ సారాంశాము.
అరణ్య పర్వం లోని షష్టమాశ్వాసం లోనిది. వ్యాసుడు ధర్మరాజుకు చెప్పినది.
(ఇంకా ఉంది)
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు. ‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు. వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు. హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి. కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
You must be logged in to post a comment.
జ్ఞాపకాల తరంగిణి-6
అమ్మ కడుపు చల్లగా-5
ఉదార చరితానాంతు..
మసకలీ మనసులు
“గెలుపు కాదు.. ఎలా గెలిచాం అన్నది ముఖ్యం” అని చెప్పే నవల THE BESTSELLER SHE WROTE
లోకల్ క్లాసిక్స్ – 7: ఏ కాలానికైనా సందేశం!
ప్రేమించే మనసా… ద్వేషించకే!-4
99 సెకన్ల కథ-33
గోమాలక్ష్మికి కోటిదండాలు-6
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®