[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
46. మధుకైటభుల కథ!
పూర్వం ముల్లోకాలు ఒక సముద్రమై యున్నపుడు, విష్ణుమూర్తి శేషశయ్యపై శయనించి యోగనిద్రలో నున్నాడు. అప్పుడు మధుకైటభులు అను రాక్షసులు విజృంభించి, లోకాలను చికాకుపరచసాగారు. ఒకనాడు విష్ణువు నాభి కమలంలో నున్న బ్రహ్మదేవుని కొట్టనారంభించారు. బ్రహ్మదేవుడు కాపాడమని విష్ణువుకు మొరపెట్టుకున్నాడు. విష్ణువు మధుకైటభుల అత్యాచారము ఆత్మలో గ్రహించి, దారుణ పరాక్రమము కల మధుకైటభులకు దర్శనమిచ్చి “మీ ధైర్య సాహసాలకు సంతోషించాను. వరం కోరుకోండి ఇస్తాను” అన్నాడు.
భుజబల గర్వ పీడితులైన మధుకైటభులు నవ్వి, “నీవు ఇచ్చేదేమిటి? మేమే వరాలిస్తాము. కోరుకో” అన్నారు. బుద్ధిః కర్మనుసారిణి కదా.
“లోక కల్యాణంకై మిమ్మల్ని చంపాలనుకుంటున్నాను. మీరు నా చేత చావండి” అంటూ ఈ వరమిమ్మని రాక్షసులను విష్ణువు అడిగాడు. దాని ఆంతర్యం గ్రహించిన వారు కలత చెందక “ఆడిన మాట తప్పేవారము కాదు. కాలగతిని ఎవరము మార్చలేము. అయితే నీవు మమ్మల్ని చంపదలిస్తే నీరు లేని చోట చంపాలి. ఇది మా నియమం” అన్నారు.
అప్పుడు విష్ణుదేవుడు తన తొడలనే వేదికగా చేసి, వారి తలలను వాటిపై నుంచి, తన పరుషమైన సుదర్శన చక్రము చేత వారిని చంపివేశాడు.
మూర్ఖులు భగవంతుడే ఎదురుగా నిలబడినా గ్రహించలేరు. తమకు ఏమి కావాలో కోరుకోలేరు. బలపరాక్రమ గర్వం, అజ్ఞానం అటు వంటిది.
మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పినది.
అరణ్యపర్వం చతుర్థాశ్వాసం లోనిది.
~
మూర్ఖస్య నాస్త్యౌషధం – There is no cure for the headstrong.
మూర్ఖస్య మూర్ఖగతి – A Pool’s refuge is a fool.
47. ఉత్తమ ఇల్లాలి కథ!
పూర్వం కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఒక పల్లెటూరిలో నివసిస్తుండేవాడు. అతడు గొప్ప తపస్వి, ధర్మాత్ముడు. నిరంతర వేదాధ్యయనశీలి – అయితే క్రోధనుడు. ఒకనాడు చెట్టు క్రింద కూర్చొని వేదాలు వల్లె వేస్తుండగా, చెట్టు పైనున్న కొంగ అతడిపై రెట్ట వేసింది. దానికి కోపించిన కౌశికుడు, దానిని కోపంగా చూశాడు. వెంటనే పక్షి ప్రాణాలు కోల్పోయింది. అతడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు.
మనుషులలో చాలా మంది అంతే ఆవేశపడతారు. ఆనక పశ్చాత్తాప పడతారు. ‘ఎంత ఘోరానికి ఒడిగట్టాను, నాకు శాంతి ఎలా లభిస్తుంది?’ అని దుఃఖించాడు. అప్పటికే మిట్టమధ్యాహ్నం కావడంతో, ఏతత్ కాలకృత్యాలైన సంధ్యావందనాదికాలు నిర్వర్తించి, పొరుగున ఉన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఒక పవిత్ర బ్రాహ్మణ గృహస్థు యింటికి వెళ్ళి, మిక్కుల క్షుద్బాధతో “భిక్షాం దేహి” అంటూ పిలిచాడు. ఆ ఇంటి ఇల్లాలు భిక్ష సమర్పించేందుకు పాత్రను కడుగసాగింది.
ఇంతలో ఆ ఇల్లాలి భర్త ఇంటికి వచ్చాడు. వెంటనే ఆ ఇల్లాలు భర్తకు కాళ్ళకు నీళ్ళు ఇచ్చి, స్నానం చేయించింది. మిక్కిలి అనురాగముతో భోజన పానీయాలు సమర్పించింది. అటుపై మెత్తని శయ్యను సమకూర్చింది. తాంబూలాదులిచ్చింది. పాద సేవనం చేసింది. ఇంతలో వాకిలి వద్ద భిక్షకు నిలిచిన బ్రాహ్మణుడు గుర్తుకువచ్చి పాత్రలో భిక్ష తీసుకొని వచ్చింది.
అతడు “ఏమమ్మా గృహిణీ, నేను నీ గుమ్మం ముందుకు వచ్చి చాలా సేపయింది. ఇంత ఆలస్యం ఎందుకు చేశావు. పొమ్మంటే అపుడే పోయేవాడిని కదా, దుర్బుద్ధితో, గర్వముతో నన్ను అవమానించావు కదా” అన్నాడు.
ఆమె “అయ్యా నా భర్త ఆకలితో వచ్చాడు. ఆ మహాత్ముడికి సేవలు చేస్తూ మిమ్ము స్మరింపలేకపోయాను. దీనికి మీరు కోపగించరాదు” అన్నది. దానికి ఆ బ్రాహ్మణుడు “నీ భర్తయే గొప్పవాడా? విప్రులు అంత తక్కువ వారా? ఇంద్రుడు సహితం బ్రాహ్మణులను భక్తితో పూజిస్తాడు కదా. బ్రాహ్మణులు అవమానింపబడితే పుడమియే దహించబడుతుందని నీవెరుగవా?” అన్నాడు.
అపుడు ఆ పతివ్రతా శిరోమణి, “అయ్యా! బ్రాహ్మణుల గొప్పతనం నాకు తెలియదా? ఒక బ్రాహ్మణుడు సముద్రజలాలను త్రాగరానివిగా శపించలేదా. ఒక బ్రాహ్మణుడు (శుక్రుడు) దండకారణ్యాన్ని దహింప చేయలేదా? ఒక బ్రాహ్మణుడు (అగస్త్యుడు) రాక్షసుడిని జీర్ణించుకోలేదా? బ్రాహ్మణులను అవమానించి, కొరివితో తలగోక్కొనగలనా? అయినా నాకంటూ ఒక మార్గం ఉంది. అదేమిటీ అనగా
‘పతియచూవె నాపాలికిఁ బరమదైవ; | మేను వాఙ్మనఃక్రియలఁ దద్ధితమ యెపుడుఁ
గోరి యొనరింతు; దీని మిగులఁగ నొండు | ధర్మువులు గాన నెందును దలఁచి చూచి.’ (3-5-21)
నా దృష్టిలో నా పాలికి భర్తయే గొప్ప దైవము. నేను త్రికరణ శుద్ధిగా నా పతి శ్రేయస్సును కాంక్షిస్తాను. ఆ విధంగా నా ఆచరణను తీర్చిదిద్దుకుంటాను. ఇంతకంటే గొప్ప ధర్మము నాకు కనిపించలేదు. నీకు కోపమెక్కువ. దానితో కొంగ చనిపోయింది. నా పాతివ్రత్య మహిమచే ఈ విషయం తెలుసుకున్నాను. కోపం మంచిది కాదు సుమా.
‘క్రోధ మోహ నామకు లైన ఘోరశత్రు | లిరువు రెరియించుచుండుదు రెపుడు నంత
రంగ మయ్యుభయంబు నడంగకున్నఁ | గలదె యూరక బ్రాహ్మణ్యగౌరవంబు?’ (3-5-23)
మానవుల హృదయాలతో కోపం, మోహం అనే పేర్లు గల ఇద్దరు భయంకరమైన శత్రువులు నివసిస్తుంటారు. వారిని అణచివేయకపోతే గౌరవం ఎలా కలుగుతుంది? ఇంతకీ బ్రాహ్మణుడు ఎవరు? ఎవరికి బ్రహ్మణ్యగౌరవం చెందుతుందో, చెబుతాను వినుము.
ఎవడు సర్వభూతముల పట్ల దయాపరుడో, ఎవడు కోరికలు విసర్జిస్తాడో, ఎవడు షట్కర్మలను (యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం) ఒనరుస్తారో, అట్టి వాడే పుణ్యాత్ముడు. అతడినే దేవతలు స్తుతిస్తారు. ఆర్జవ, ఇందియ నిగ్రహ, వేదాద్యయనాలు బ్రాహ్మణుడికి గొప్ప ధనాలు. అవియే ధర్మ పథ సాధనాలు. వేదవిహిత కర్తవ్యాలు. ధర్మం మిక్కిలి సూక్ష్మమైనది. స్థూలకృష్ణకి ఒక రకంగా, సూక్ష్మదృష్టికి మరొక రకంగా కనిపిస్తుంది. నీవు వేదాలను చదివావే తప్ప ధర్మ సూక్ష్మతను గ్రహించే విచక్షణ ఉన్నవాడివి కావు. అవి తెలియాలంటే మిథిలా నగరంలో ఉన్న ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళుము. నీ సంశయాలు పోగొట్టి, విచక్షణా జ్ఞానము నివ్వగలడు. నాబోటి ఆడవారికి విజ్ఞానం ఉండదు కదా. కావున నాలాంటి వారు ఎట్టి నేరములు చేసినా క్షమించవలెను” అన్నది.
దానికి బ్రాహ్మణుడు “అమ్మా! నీవు కేవలం ఆడదానివి కాదు. ఇల్లాళ్ళలో మేలుబంతివైన కర్మయోగివి. నాకు జ్ఞానోదయమైనది. నా మనసుకు శాంతి లభించినది. నీకు మేలు కలుగు గాక. సెలవు” అంటూ మిథిలా నగరానికి వెళ్ళిపోయాడు. భర్త సేవలో యిష్టాన్ని కనబరిచే పతివ్రతలకు సమస్త యజ్ఞ, తప, దాన పుణ్యఫలాలు లభిస్తాయి. ఈ విషయాన్ని రూఢీ చేసే యీ కథని మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పాడు.
మూర్ఖత్వంతో కూడిన కోపంతో కర్మయోగియైన సాధారణ ఇల్లాలు దగ్గర మహా తపస్వి బేలయైన విధము, ఎట్టివాడు సద్బ్రాహ్మణుడో తెలిపే విధము, ఇల్లాలికి కుటుంబం, భర్త ఎంతటి ప్రధానమో తెలిపే విధము, తద్వారా గ్రహస్థాశ్రమములో ఇల్లాలి పాత్ర ఎట్టిదను అంశాలు ఈ కథలో తెలుపబడి, మనకు మార్గదర్శకత్వం చేస్తాయి.
అరణ్యపర్వం పంచమాశ్వాసం లోనిది.
~
పాతివ్రత్యం తు యోషితాం – Chastity is the beauty of women
యే వనిత మెలంగు భర్తృవశవర్తినియై యది సత్కళత్ర.
48. ధర్మవ్యాధుడి కథ!
పూర్వం కౌశికుడను ముని కోపితుడై విచక్షణ కోల్పోయి, పచ్చగా కళకళలాడుతున్న పక్షి యొక్క నిండు ప్రాణాలు తీశాడు. ఆపై పతివ్రతయైన ఇల్లాలి ఇంటికి వెళ్ళాడు. ఆమె ద్వారా సద్బ్రాహ్మణుడెట్టివాడో, క్రోధమెట్టిదో తెలుసుకొని, ధర్మాధర్మ విచక్షణా జ్ఞానము నెరుగుటకు మిథిలా నగరమున నున్న ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళాడు.
కౌశికుడు మిథిలా నగరం చేరుకున్నాడు. అది ఒక మాంసపు అంగడి, మహా రోతగా నున్నది. అతడు ఒక చోట నిలబడి ఉన్నాడు. పతివ్రత ద్వారా పంపబడిన కౌశికుడి రాకను, మనోశక్తి ద్వారా ఎరిగిన ధర్మవ్యాధుడు, కౌశికుడి చెంతకు చేరి, వందనాలు పలికి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. కౌశికుడు “అయ్యా! ధర్మ మెరిగిన వాడవు. జీవహింస తగునా?” అన్నాడు. అపుడు వ్యాధుడు “ఎవరికి అనువైన ధర్మాలు వారు ఆచరించాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు – వేదాద్యయనం, శిష్టరక్షణ, వ్యవసాయ వర్తకం, పరిచర్య వంటి ధర్మాలను ఆచరించాలి. మా జనక మహారాజుగారు యేయే వంశవృత్తులు వారే నిర్వహించాలని తెలిపాడు. అది తప్పితే, కొడుకునైనా సరే దండిస్తాడు. ఆ కారణాన నేను నా స్వధర్మమైన మాంసవిక్రయం చేస్తున్నాను. నా అంతట నేను జీవులను చంపను, ఇతరులు చంపి తెచ్చిన మాంసాన్ని కొని, కొద్ది లాభానికి అమ్ముతాను. ఆ ధనంతో జీవిస్తాను. ఆ ధనం, వలన నాకు మనశ్శాంతి కలుగుతుంది. అంతేకాదు, నేను ఎక్కువ అణకువతో గురువులను, పెద్దలను, బ్రాహ్మణులను, అతిథులను, దేవతలను పూజిస్తాను. సత్యమును పాటిస్తాను. పరిశుభ్రతను మరువను. సేవకులకు దానాలిస్తాను. బంధువులను మన్నిస్తాను. తీర్పును వహిస్తాను. అసూయ చెందను. కోరికలు పెంచుకోను. ఇతరుల దోషాలను గూర్చి వినను. ఆహారవిహారాలలో నిష్ఠానియమాలు పాటిస్తాను. ఉపవాస వ్రతాలు చేస్తాను. ఏకపత్నీవ్రతుడను. ఋతుకాలాలను అనుసరించి సంభోగిస్తాను. దూషణ, భూషణలకు లొంగను. అందుచేత తక్కువ కులము వాడినైనా శీలాన్ని ఏర్పరచుకోగలిగాను. నా గొప్పదనం చెప్పాలని చెప్పలేదు. సందర్భవశాన చెప్పాను
‘తనకులధర్మము విడువక | మనుట పరమధర్మ మండ్రు మాన్యులు; చిత్తం
బునఁ గృప గలుగుట ముఖ్యపుఁ | బని; సైరణ వలయు నఖిలభావములందున్’ (3-5-37)
పెద్దలు చెప్పేదేమిటంటే, తన కులానికి చెందిన ధర్మం విడువకుండా ఆచరించటం మంచిది. మనసులో దయాభావం ఉండాలి. తన అభిప్రాయం మంచిది, ఇతరుల అభిప్రాయం చెడ్డది అన్న భావం మంచిది కాదు. అన్ని భావాల యెడ సహనం ఉండాలి. ఇంద్రియ సుఖాలపై కోరికలు వీడాలి. త్యాగం చేసేవారికి అసాధ్యమనేదే లేదు. కావున త్యాగ భావం పెంచుకోవాలి. ఎల్లప్పుడు మంచివారిని పూజించాలి. కోరికలు సందడి చేసినా ధర్మము తప్పరాదు. శుభాశుభాలకు పొంగి క్రుంగిపోరాదు. అపకారికి సహితం ఉపకారం చేయాలి. ‘అన్యదోషకారి దనపాపమునఁ దాన కాలిపోవు; వేఱ వానికిఁ గీడు గావింప నేల?’ పాపాత్ముడు తన పాపం చేత తానే కాలిపోతాడు. తాను తవ్వుకున్న గొయ్యిలో తానే పడవాడు. వాడికి వేరే హాని అనవసరం. నాస్తికులు ధర్మాత్ములను నిందిస్తారు. బుధుడు వారి పద్ధతులు అంగీకరించరాదు. ధర్మం పట్ల అభిమానం విడువరాదు. మరియు వినుము.
‘మది మఱపునఁ బాపము దన | కొదవుటయును బిదప వగచి యొక సగమును నే
నిది సేయ నింక ననియెడు | మదిఁ బెఱసగమును నరుండు మలుఁగు నఘంబున్’ (3-5-41)
ఆలోచించకుండా తనకు సంప్రాప్తమయినపుడు తాను చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందితే చేసిన పాపంలో సగభాగాన్ని, అట్టి పాపాన్ని తాను చేయనని అనుకోవటం వలన మిగిలిన సగభాగాన్ని నరుడు తొలగించుకొనవచ్చును.
‘పాపముల కెల్ల నెక్కుడు పాతకములు | సువ్వె క్రోధలోభంబులు సువ్రతాత్మ!
వాని రెంటి జయించినవాఁడు గాని | యెందుఁ బరమధార్మికుఁ డని యెన్నఁబడఁడు’ (3-5-42)
పాపాలలో మిక్కిలి చెడ్డవైన పాపాలు కోపం, లోభం. వీటిని జయించని వాడిని ఎవరూ మహాత్ముడు అనరు. సజ్జనులు పాటింపని కొన్ని మార్గాలు పైకి ధర్మంగా కనిపించవచ్చు. దట్టంగా మొలిచిన గడ్డి చేత కప్పబడిన నూతులు పైకి నేల మాదిరే కనిపించినా లోపల లోతైన గోతులుగా ఉంటాయి. కావున కపట ధర్మములు త్యజించాలి. శిష్టాచారాన్ని స్వీకరించాలి.” అన్నాడు
అప్పుడు కౌశికుడు శిష్టాచారాలను తెలుపమన్నాడు. అపుడు ధర్మవ్యాధుడు “ఉపకారార్థం ఉన్న ద్రవ్యాన్ని ఇవ్వటం, ఎల్లప్పుడు సత్యం పలకటం, ఇంద్రియాలను, మనసును నిగ్రహించటం, విశ్వశ్రేయస్సుకై క్రతువులూ చేయటం, ఇతరులను మోసగించనట్టి నిర్మల శీలం అలవరుచుకొనటం, షడ్రిపుల నణచటం, తల్లి, తండ్రి, ఉపాధ్యాయులను సదా మన్నించటం, వేదాద్యయనం చేయటం, సదా వినయం కలిగి ఉండటం, నాస్తికులను చేరక పోవడం, శీల పరిరక్షణ, తీర్థయాత్రా సేవనం, భూతదయ, హిత, మితభాషణం, ఆశ్రితరక్షణ చేయడం వంటివి శిష్టాచారాలు” అని చెప్పి, “ఇట్టి లక్షణాలు అలవరుచుకుంటే లభించే సంతోషం మరే ఇతర మార్గాలలో లభించదు కదా. కావున ఓ కౌశికా! ఇంకా వినుము.
‘విను మహింస ధర్మవితతి కెల్లను మేటి; | యదియు సత్యయుక్త మైన వెలయు
ననఘ! శిష్టచరితలందు సత్యమ కడు | నధిక మనిరి శ్రుతుల నరసి బుధులు’ (3-5-48)
పుణ్యాత్ముడైన ఓ కౌశికా! అన్ని ధర్మములలోకి అహింస గొప్పది. ఆ అహింస సత్యంతో కూడి వెలుగుతుంది. శిష్టాచారములలో సత్యమే గొప్పది. ఇక నేను చేస్తున్న మాంస విక్రయం హింసాయుతం కాదా? అని ప్రశ్నించావు. నిజానికి హింసాహింసలు ఎవరూ స్పష్టంగా నిర్వచించలేరు. ప్రాణులు క్షయం పొందడానికి మూలకారణం ఆయా ప్రాణులు చేసియున్న కర్మమే. చంపేవాడు కేవలం వ్యాజ్యం మాత్రమే. పండ్లు, వేళ్ళు, ధాన్యాలు, వివిధ జింతు మాంసాలు ప్రాణులకు ఆహారంగా బ్రహ్మదేవుడు ఏర్పరిచినాడు కదా. కావున మాంసాహారము కేవల హింసగా చెప్పలేము. అంతేకాదు శ్రాద్ధ కర్మలలో పితృదేవతలకు మాంసాహారం నైవేద్యముగా సమర్పించి, మిగిలిన దానిని ప్రసాదంగా స్వీకరించాలని ఋషుల అభిప్రాయం కదా. దైనందిన జీవితంలో ప్రతి చోట తెలిసియో తెలియకనో హింస జరుగుతునే ఉంది. హింస అసలు చేయక మానవ జీవితం సాధ్యం కాదు. ఈ విషయాన్ని గుర్తించక తాము అహింసాపరులమని ఎంచుట భ్రమ. చివరకు అడవుల్లో నివసిస్తూ కందమూలాలు తింటున్నా, కందమూలాలలో కూడా ప్రాణం ఉంటుంది కదా.
‘హింస సేయనివాఁడు లేఁ డిజ్జగమున | నొక్కఁడైనను, దమతమ, యోపినట్లు
హింసతెరువున కెడఁగల్గి యేఁగవలయు | నదియ చూవె యహింసనా నతిశయిల్లు’ (3-5-60)
ఈ లోకంలో హింస చేయనివాడు ఒక్కడైనా ఉండడు. అయినప్పటికీ వీలయినంత వరకు హింస చేయక, జీవయాత్ర సాగించాలి. యథాశక్తి ప్రాణి పీడన చేయకపోవుట అహింస” అని తెలిపాడు.
ధర్మాలు విన్న కౌశికుడు, కులవృత్తులు, పురుషప్రయత్నం, కర్మ, పాపపుణ్యాలు, బ్రహ్మవిద్య, త్రిగుణాలు మొదలగు అనేక ఇహపరాంశాలకు సంబంధించిన ధర్మాధర్మములను అడిగి తెలుసుకున్నాడు.
ధర్మవ్యాధుడు అన్నిటికీ సవివరంగా సమాధానములు చెప్పాడు. ఆ పై, “ఓ కౌశికా! నాకింత విజ్ఞానం సంక్రమించుకు మూలమైన ధర్మం ఒకటి ఉన్నది. అది నీకు కంటికి కనిపించేలా ఎరిగించగలను” అని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ఆ ఇంట్లో ఉన్నతాసనాలపై కూర్చొని ఉన్న, చక్కని వస్త్రాలతో పూలతో, నగలతో అలంకరింపబడి ఉన్న, కోరిన ఆహారాన్ని భుజించి సంతృప్తిగా సేద తీరుతున్న తన తల్లిదండ్రులను కౌశికునకు చూపించి, వారి యోగక్షేమాలను తెలుసుకున్నాడు.
ధర్మవ్యాధుడి తల్లిదండ్రులు తమ తనయుడితో “నీ వల్ల మా జన్మ, వంశం పావనమైనవి. నీవు మానవమాత్రుడివి కావు. దేవతలకే దేవతవు. త్రికరణశుద్ధిగా మమ్మల్ని సేవిస్తున్నావు. నీవు ఉత్తమ పుత్రుడిగా చెప్పబడే పరశురాముడి కన్నా గొప్పవాడివి. నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఆచంద్రతారార్కం, సుఖసంపదలతో, యశస్సుతో వర్ణిల్లుదువు గాక” అని దీవించారు. ఆ పై ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులకు కౌశికుని పరిచయం చేసి, అతిథి మర్యాద చేశాడు.
ఆస్తికుడైన ధర్మవ్యాధుడు “నా తల్లిదండ్రుల పరిచర్య, సేవల వల్ల, నాకు విజ్ఞానం లభించింది. అందరూ తమ కోరికలు నెరవేర్చుకోవడానికి తల్లిదండ్రులను పూజిస్తారు. నాకు మా తల్లిదండ్రులే ఆరాధ్య దేవతలు. నాకు వేరే దేవతలు లేరు. నేనూ నా శ్రీమతి, నా పిల్లలు నా తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటాము. వారి అవసరాలను అనుక్షణం గమనించి అన్నీ నెరవేరుస్తాము. ఇదే నేను చేసే యజ్ఞం, తపం. ఇదే వేదం. పుణ్యం కోరే గృహమేధి తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మను అర్చించి సంతోషపరచాలి. అతడే పుణ్యాత్ముడు. పతివ్రత నిన్ను ఇక్కడికి పంపించింది. నీవు జిజ్ఞాసువై ధర్మాన్ని ప్రదర్శించావు. నాకు తెలిసింది చెప్పాను. అయితే నీ యందు ఇంకా నాకు ప్రీతి ఏర్పడలేదు. నీ మీదనే ప్రేమ పెట్టుకున్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశావు. ఇక్కడికి వచ్చే ముందు వారి అనుమతిని తీసుకోలేడు. ఎంత జ్ఞానమున్నా, తల్లిదండ్రుల పరిచర్య లేకపోతే వ్యర్థమే” అని అన్నాడు.
అప్పుడు కౌశికుడు, ధర్మవ్యాధుడి మాటలు కనువిప్పు కలిగించగా, “మిత్రమా నీతో సఖ్యం కలుగటం నా అదృష్టం. నీవు నా పాలిట దేవుడవు. నేను నీ దారిలో నడిచి సద్వర్తనుడనై, ధర్మశీలుడనై వెలుగొందుతాను” అని పలికి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయూడు.
జ్ఞానం, తపస్సు, యజ్ఞం, వ్రతం ఇలాంటివి ఎన్ని ఉన్నా తల్లిదండ్రులను సేవించని నాడు అవి వ్యర్థమని, ప్రతి ఒక్కరు క్రోధానికి, అధర్మవర్తనకు దూరంగా ఉండాలని, నిర్దేశించబడిన విధిని దైవకార్యంగా భావించాలని చెబుతుంది ఈ కథ. నిజానికి ఈ కథ అనేక సందేశాల సమ్మేళనం. ధర్మసందేహాలను నివృత్తి చేయు సంకలనం. మానవ జాతికి మానవతా మూల్యాలు నేర్పే కరదీపం.
అరణ్యపర్వం పంచమాశ్వాసంలోనిది.
మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పినది.
అహింసా పరమోధర్మః Non-injury is the highest duty.
(ఇంకా ఉంది)
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు.
‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు.
వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు.
హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి.
కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.