[‘శ్రీ మహా భారతంలో మంచి కథలు’ అనే పేరుతో మహాభారతంలోని కథలను అందిస్తున్నారు శ్రీ కుంతి.]
43. పరీక్షితుడను రాజు కథ!
పూర్వం అయోధ్యను కీర్తిమంతుడైన, పరాక్రమవంతుడైన పరీక్షితుడను రాజు పరిపాలించుచుండెడి వాడు. అతడు ఒకనాడు అడవికి వేటకై వెళ్ళాడు. అక్కడ వేటలో అలసిపొలసి ఉండగా, ఒక అందగత్తెను చూచాడు. ఆమెను మోహించాడు. మోహించి ఆమెతో, “ఎవ్వరి దానవు? అడవిలో ఎలా ఒంటరిగా తిరుగుతున్నావు?” అన్నాడు. ఆమె, “రాజా, నేను పెండ్లి కాని కన్యను. పెండ్లి కొడుకును అన్వేషిస్తూ తిరుగుతున్నాను” అని పలికింది. ఆమె అందానికి, వాచ్చాతుర్యానికి రాజు మురిసిపోయాడు. “నన్ను వివాహం చేసుకో” అని అన్నాడు. ఆమె “నన్ను జలవిహారానికి నిర్బంధం చేయరాదు. అలా అయితేనే వివాహం” అన్నది. రాజు అంగీకరించాడు. వివాహం జరిగింది. కొంతకాలం తరువాత రాజు తన విడిది గృహంలో, అలసినవాడై చెమట బిందువులతో తడిసిన దేహం కలవాడై, అక్కడే ఉన్న కొలనులో స్నానానికి వెళ్ళాడు. స్నానం చేస్తూ, “నీవు కూడా ఈ కొలనులో స్నానం చేసి, నీ శరీరంలోని చెమటను పోగొట్టుకొనుము” అని భార్యను ఆహ్వానించాడు. ఆమె కొలనులోకి దిగింది. అంతే, ఆమె నీటిలో అదృశ్యమయింది.
రాజుకు తన ఒడంబడిక గుర్తుకు వచ్చింది. అయినా ఆమె వెళ్ళిపోవడంతో నిరాశానిస్పృహలకు లోనై కొలనులోని నీటి నంతటిని చిమ్మివేశాడు. కొలనులోని నీరు పూర్తిగా బయటపడగా అక్కడ రాజు కప్పలను చూశాడు. తన ప్రేయసిని కప్పలే మింగాయని తలచి, భటులను పిలిచి, “ఈ భూలోకంలో ఉన్న కప్పలన్నిటిని సంహరించండి” అని ఆజ్ఞాపించాడు.
అంతలో కప్పల నాయకుడు, ఒక ఋషి రూపంలో రాజు వద్దకు వచ్చి “రాజా! యిది కప్పుల పాపము కాదు. ఆగ్రహం మానుకొనుము. జాలి చూపి కప్పలను చంపకుము” అన్నాడు. రాజు “ఈ కప్పులు నా ప్రేయసిని చంపాయి. కాబట్టి నేను ప్రతీకారం తీర్చుకుంటున్నాను” అన్నాడు. రాజు మాటలకు బాధపడిన ఆ ముని “ఓ రాజా! నేను ఋషిని కాను. కప్పల దొరను. నా పేరు ఆయువు. నీ ప్రేయసి నా కూతురు. ఆమె ఎందరినో మోసగించింది. నీవు ఆమెకు ఒక లెక్కా” అని తన కూతురును రప్పించి, రాజుకు అర్పించి, కూతురును చూసి “నీవు ఎందరినో మోసగించావు. కావున, నీకు పుట్టే కొడుకులు మోసగాండ్లు ఆగుదురు గాక” అని శపించి వెళ్ళిపోయాడు. రాజు తనకు అంచాల భార్య మళ్ళీ దొరికినందుకు సంతోషించాడు.
ప్రేమా, మోహం ఎంత గుడ్డివో, అవి ఎంతటి అఘాయిత్యాలకు ఒడిగట్టేలా చేస్తాయో తెలిపే కథ.
అరణ్యపర్వం చతుర్థాశ్వాసం లోనిది.
మార్కండేయ మహాముని ధర్మరాజుకు చెప్పినది.
– “It is impossible to love and be wise” – Francis Bacon
44. వామదేవుని కథ!
పూర్వం పరిక్షిత్తు అను రాజుకు, సుశోభన యందు శలుడు, నలుడు, వలుడు అనే ముగ్గురు కొడుకులు. వీరి తల్లి మోసగత్తె. వీరి తల్లి మోస కృత్యాలకు కోపించిన వీరి మాతామహుడు వీరి తల్లిని, “నీకు పుట్టబోయే వారు మోసగాళ్లుగా పుడతారు” అని శపించాడు. పరీక్షిత్తు ముసలిడివాడు కావడంతో శలుడికి మాతామహుడు పట్టం కట్టి, తపోవనానికి పోయాడు. ఒకనాడు నలుడు వేటకు వెళ్ళాడు. ఒక జంతువును బాణంతో కొట్టాడు. కాని అది తప్పించుకొని పారిపోయింది. శలుడికి కోపం వచ్చింది. సారథితో “ఆ జంతువును వేగంగా వెంబడించు” అన్నాడు. “మన గుర్రాలు అంత వేగంగా పరుగెత్తలేవు. వామ్యజాతి గుర్రాలయితే ఆ మృగాన్ని పట్టుకొనే వారము” అని సారథి బదులిచ్చాడు
“అవి ఎవరి దగ్గర ఉన్నాయి?” అడిగాడు రాజు.
“ఆ వామ్య అశ్వాలు వామదేవుడి దగ్గర ఉన్నాయి” అని సారథి తెలిపాడు. వెంటనే రాజు వామదేవుని ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు ఆ ముని దగ్గర వెళ్ళి, “మునీంద్రా! నేనొక మృగాన్ని వేటాడాను. అది తప్పించుకున్నది. నీ దగ్గర ఉన్న గుర్రాలు ఇచ్చినట్లైతే నా పని పూర్తవుతుంది. దయచేసి గుర్రాలను ఇయ్యుము” అన్నాడు. దానికి ఆ ముని, “నీ పని పూర్తి అయిన తరువాత తిరిగి అప్పగించాలి” అని చెప్పి, తన గుర్రాలను ఇచ్చాడు. రాజు ఆ గుర్రాలను తీసుకొని, పారిపోయిన మృగాన్ని పట్టుకొని, దానిని సంహరించి, వామ్య అశ్వంతో రాజధానికి వెళ్ళిపోయాడు.
పేదవాడి దగ్గర గొప్ప వస్తువులుండటం రాజుకు నచ్చదు. కాబట్టి ఇంత గొప్ప వేగం, బలం కల గుర్రాలు పేద బ్రాహ్మణుడి దగ్గర ఎందుకు, నాలాంటి వాడికి యోగ్యమైనవి మివి అనుకొని, వామదేవుడి అశ్వాలను తన అంతఃపురంలో ఉంచమని భటులకు ఆజ్ఞనిచ్చాడు
శలుడు తన గుర్రెలను వెనక్కు ఇవ్వకపోవడంతో, ‘రాజపుత్రుడు, బలవంతుడు, అహంకారి, మదగర్వితుడు – గుర్రాలను వెనక్క యివ్వాలని ఎందుకు అనుకొంటాడు!’ అని విచారించి, శిష్యుడైన ఆత్రేయుడని పిలిచి, “శలుడు నెల రోజుల క్రింద మన గుర్రాలను తీసుకు వెళ్ళాడు. తనంతట తాను తిరిగి ఇచ్చేట్టు లేడు. కావున నీవు వెళ్ళి మన గుర్రాలను అడిగి తీసుకొని రమ్ము” అన్నాడు.
ఆత్రేయుడు అయోధ్యకు వెళ్ళాడు. రాజుతో, “నీవు లోగడ తీసుకొనిన మా గుర్రాలను దయచేసి స్నేహపూర్వకముగా తిరిగి మాకు యివ్వవలసినది” అని అడిగాడు. “ఆయన పంపటం, నీవు రావటం పో.. పో..” అని దురుసుగా పలికి తిప్పి పంపినాడు. ఆత్రేయుడు జరిగినది వామదేవునికి విన్నవించినాడు. వామదేవుడికి మిక్కిలి ఆగ్రహం వచ్చింది. శలుడి దగ్గరికి వెళ్ళాడు. “ఓ రాజా! నీ పని నెరవేరినది కదా! దురాశలతో పరుల సొత్తును హరిస్తే, అది నీకు చేరుతుందా? ఎరువుగా పచ్చుకున్నది ఎల్ల కాలము ఉంచుకోవచ్చునా?” అన్నాడు . దానికి రాజు సమాధానము పలుకలేదు. అప్పుడు మళ్ళీ ముని,
“పరధనహరణము దురితము పరికింపుము; వరుణుచేతిపాశంబుల ని
ష్ఠురముగఁ గట్టువడకు; నిర్భరనరకకృశాను శిఖలఁ బడకుము మీదన్” (3-4-347)
“ఇతరుల సొత్తును హరించటం పాపం. అట్టి పాపాత్ములు వరుణ పాశం చేత బంధింపబడతారు. పిదప నరక లోకంలోని అగ్నిజ్వాలలో పడిపోతారు” అని హెచ్చరించాడు. దానికి రాజు బెదరక “బ్రాహ్మణుడికి గుఱ్ఱాలు ఎందుకు, కావలిస్తే రెండు ఎద్దులను లేదంటే రెండు కంచరగాడిదలను ఇస్తాను. వ్యర్థమైన కోరికలు కోరకు” అంటూ వేళాకోళం చేశాడు. దానికి ముని “బ్రాహ్మణుల సొత్తును ఆసహరించటం పాపం. ఒక దానికి మరొకటి ఇస్తాననడం హాస్యాస్పదం, ఇదెక్కడి న్యాయం” అన్నాడు. రాజు కోపించి, భటులతో “ఈ మునిని పట్టి బంధించి, శూలాలతో సంహరించండి” అని ఆజ్ఞాపించాడు. దీనితో వామదేవుడు ఆగ్రహించాడు. అంతలో పెక్కు రక్కసులు ఉద్భవించి రాజును చంవివేశారు.
ఆ తరువాత రాజు తమ్ముడు సింహాసనాన్ని అధిష్టించాడు. మరలా వామదేవుడు రాజు వద్దకు వెళ్ళి తన గుర్రాలను అడిగాడు. నలుడు కూడా తన అన్న వలె కృతఘ్నుడు, అహంకారియై, విచక్షణ కోల్పోయి, భటులతో “విషం పూసిన అమ్మును తెండు, ఇతడిని సంహరిస్తాను” అన్నాడు. దానికి వామదేవుడు నవ్వుతూ “రాజా! ఆ అమ్ము నీ కొడుకునే సంహరించగలదు” అన్నాడు. అన్నట్లుగానే బాలుడు మృతుడైనట్లుగా అంతఃపుర పరివారం వచ్చి చెప్పారు. కుపితుడైన రాజు, వామదేవుని సంహరించబోయి విల్లు సంధించాడు. అంతే, అతడి రెండు చేతులు స్తంభించి పోయాయి.
రాజుకు బుద్ధి వచ్చింది. “నేను అధిక ప్రసంగం చేశాను. అంతా వ్యర్థమై పోయింది. ఉపకారికి అపకారం తలపెట్టటం, సహాయం చేసిన వారి పట్ల కృతఘ్నత చూపటం, ఎరువు సొమ్మును నాదిగా భావించటం, అన్నిటికిమించి బ్రాహ్మణ తపోధనుల శక్తిని ఎరగకపోవడం నేను చేసిన తప్పులు. నేను సత్యం తెలుసుకున్నాను. నేను ఓడిపోయాను. వామదేవుడు గెలుపొందాడు” అని ముని చరణాలను ఆశ్రయించాడు.
ముని ప్రసన్నుడై రాజును స్వస్థునిగా, రాజకుమారుడిని సజీవుడిగా చేశాడు. రాజు గుర్రాలను మునికి అప్పగించాడు. అంటే, ఇంత జరిగితే కాని రాజుకు జ్ఞానోదయం కాలేదు.
పరధనాపహరణం చేయడం, ఉపకారికి అపకారం చేయడం వంటి దుష్టలక్షణాలు గలవారు తమ తప్పు లెరుగక బ్రహ్మజ్ఞానులు, మునిపుంగవుల శక్తి యెరగకుండా బ్రదుకుతుంటారు. గట్టిగా బుద్ధి చెబితే కాని మారరు. తమ కుటుంబంలో ఒకరు చేసిన కీడును చూసైనా మరొకరు మారరు. తమ దాకా వస్తే కాని మంచీ చెడు గ్రహించరు అని తెలిపే కథ.
ధర్మరాజుకి మార్కండేయ ముని చెప్పినది.
అరణ్యపర్వం చతుర్థాశ్వాసం లోనిది.
అకరుణత్వమకారణ విగ్రహః పరధనే పరయోషితి చ స్పృహా।
సుజన బంధుజనేష్వసహిష్ణుతా ప్రకృతి సిద్ధమిదం హి దురాత్మనామ్॥
45. ఇంద్రద్యుమ్నుని కథ!
పూర్వం ఇంద్రద్యుమ్నుడు అను గొప్ప మహారాజు, చిరకాలం స్వర్గంలో నివసించాడు. అతని కీర్తి తరిగిపోవటం చేత దేవతలు “ఇక నీ పుణ్యం తరిగిపోయింది. ఇక నీవు స్వర్గంలో ఉండజాలవు” అని అతడిని భూలోకానికి నెట్టారు. అపుడు ఇంద్రద్యుమ్నుడు మార్కండేయుడి వద్దకు వచ్చి.. “అయ్యా! ప్రకాశించే పుణ్యంకల నన్నెరుగుదువా?” అన్నాడు.
అపుడు మార్కండేయుడు “అయ్యా! నేను నిన్ను తెలుసుకోలేకపోయాను. కాని హిమాలయ వాసియైన ప్రావారకర్ణుడు (ఉత్తరీయం వంటి చెవులు కలవాడు) అను గుడ్లగూబ వయసులో చాలా పెద్దది. అతడు నాకంటే నిన్ను గూర్చి నిశ్చయముగా తెలుపగలడు. అతడి దగ్గరికి వెళ్ళము” అన్నాడు. అపుడు ఇంద్రద్యుమ్నుడు “మీరు కూడా నాతో పాటు రావలసినది” అని అన్నాడు.
అప్పుడు మార్కండేయుడు, “అయ్యా! ముసలితనంలో శక్తి నొసగే మాత్రను సేవించాను. దానితో దేహము తాపముతో నున్నది. కదలలేకుండా ఉన్నాను” అన్నాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు గుర్రం రూపం ధరించి మునిని వీపుపై ఎక్కించుకొని, గుడ్లగూబ దగ్గరికి వెళ్ళి, అదే ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ గుడ్లగూబ “అయ్యా! నిన్ను ఎరుగను. ఇంద్రద్యుమ్నం అనే పేరు గల కొలను తెలుసు. అందులో నాళీకజంఘుడు అను కొంగ కలదు. అది నా కంటే వయసులో పెద్దది. దానిని అడుగుము” అన్నది. ఇంద్రద్యుమ్నుడు మునిని, గుడ్లగూబను వీపు పైన ఎక్కించుకొని నాళీకజంఘుడి దగ్గరికి వెళ్ళి అదే ప్రశ్న వేశాడు.
నాళీకజంఘుడు “నేను నిన్ను ఎరుగను. ఇదే కొలనులో తాబేలు కలదు. అది వయసులో చాలా పెద్దది. దానిని అడుగుము” అన్నది. వారు ఆ తాబేలు దగ్గరికి వెళ్లారు. కొంగ తాబేలును పిలిచింది. కొంగ, గుడ్లగూబలు “నీవు ఇంద్రద్యుమ్న మహారాజు నెరుగుదువా?” అని ప్రశ్నించాయి. అప్పుడు ఆ తాబేలు జ్ఞాపకం తెచ్చుకొని, గద్గదకంఠంతో, “అయ్యో! నేను వీరిని మరిచిపోవటమా, ఇతడు ఎంతటి మహాత్ముడు, ఎన్ని యజ్ఞయాగాలు, దానధర్మాలు చేశాడు. ఈ మహాత్ముడు దానం చేసిన వేన వేల గిట్టుల రాపిడే కదా – లోకం పొగడే ఈ ఇంద్రద్యుమ్నం అను మడుగు ఏర్పడుటకు కారణం” అని పలికింది. తాబేలు మాటలు విన్న దేవతలు, అమరవిమానం తీసుకొని వచ్చి “మహాత్మా! నీ యశస్సు లోకంలో ఎప్పుడూ ఉంటుంది. నీకు శాశ్వత స్వర్గ సౌఖ్యం లభిస్తుంది. దయచేసి ఈ విమానమెక్కి స్వర్గానికి రావలసినది” అని ఆహ్వానించారు.
మరియు,
“తన కీర్తి యెంతకాలము | వినఁబడు నిజ్జగమునందు వెలయఁగ నందాఁ
కను బుణ్యలోకసౌఖ్యం | బున నెంతయు నుల్లసిల్లుఁ బురుషుం డనఘా!” (3-4-369)
“పాపరహితుడా! ఈ లోకములో తన యశస్సు ఎంతకాలం విలసిల్లుతూ వినబడునో అంతకాలము నరుడు స్వర్గలోకాల సౌఖ్యాలను అనుభవిస్తాడు” అని పలికారు.
అప్పుడు ఆ రాజు దేవతలతో, ఈ పుణ్యమూర్తులైన ముదుసతి మహర్షి, ముసలిపక్షి, నా సాయానికై ఇంతదూరం వచ్చారు. ముందు వారి నెలవుల్లో వారిని ఉంచి, ఆనక వస్తాను” అని పలికాడు.
ఆపై వారిని యథాస్థానాల్లో ఉంచి, వారికి వందనములు అర్పించి స్వర్గానికి వెళ్ళాడు. నరుడు పుణ్యం చేస్తే స్వర్గ సౌఖ్యాలు లభిస్తాయి. ఆ పుణ్యక్షయం కాగానే భూలోకానికి రావలసినదే. పుణ్యకార్యాల కీర్తి ఎందుకాలం నిలుచునో అంత కాలం పురుషుడు స్వర్గ సౌఖ్యాలను అనుభవిస్తాడు.
“తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి।
ఏవం త్రయిధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభన్తే॥ (భగవద్గీత, 9-21)
విశాలమగు స్వర్గలోకమును అనుభవించి, పుణ్యం క్షయింప తిరిగి మనుష్య లోకమున జన్మించుచున్నారు. ఈ ప్రకారముగా వేదోక్త ధర్మమును అనుష్ఠించినట్టి ఆ భోగాభిలాషులు రాకపోకడలను పొందుచున్నారు.
ఈ కథ ద్వారా తెలిసేదేమంటే పాపపుణ్యాల చక్రంలో పడి రాకపోకలు పొందుచున్న మానవుడు, పరమాత్మ చరణాలను శాశ్వత నివాసంగా పొందే ప్రయత్నం చేయాలి. అప్పుడే అతడికి శాంతి. కావున మనిషి ఆవాగమములతో కూడిన సంసారం కొరకు కాక, మోక్షము కొరకు వినియోగించు వాడు ధన్యుడు. ఈ ఆధ్యాత్మిక రహస్యములను తెలుపునది ఈ కథ. అంతేకాక తనకు సహాయపడిన వారిని తన పని అయిన తరువాత విడిచిపెట్టక, వారిని స్వస్థలమునకు చేర్చిన ఇంద్రద్యుమ్నుడి మర్యాద ప్రశంసనీయం. గ్రహించవలసి అంశం.
మనుషుల్లో దీర్ఘాయుర్దాయం అరుదు. అయినా మార్కండేయుడు దీనికి అపవాదంగా కనబడతాడు. గుడ్లగూబ, కొంగ, తేలు దీర్ఘాయువులని కూడా తెలుస్తుంది.
ధర్మరాజు మూర్కండేయుడిని, “అయ్యా మీకంటే వృద్ధులు ఈ లోకంలో ఉన్నారా?” అని ప్రశ్నించినపుడు చెప్పబడిన కథ.
అరణ్యపర్వం చతుర్థాశ్వాసం లోనిది.
క్షీణే పుణ్యే మర్యలోకం విశంతి
When the reward of good deeds is ended, (souls) come back to the world of men
కీర్తిర్యస్య సజీవతి
He lives, who has acquired fame
(ఇంకా ఉంది)
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు.
‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు.
వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు.
హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి.
కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.