[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
112. దత్తగీతి: భక్తజన రక్షకుడు భాసిలుచు నుండన్ రక్తకిరణుండు తన రశ్మి వెలయింపన్ సిక్త కమలంబులవి శీర్షములు విచ్చన్ వ్యక్తము శరత్తదియె ప్రాభవము జూపెన్
113. ఉ: శీతగభస్తి, చందురుడు, శ్రీకర సుందరపాంచజన్యమున్ శ్వేత సువర్ణ కాంతులను శేముషి మీరగ తేజరిల్లగాన్ ఆతతమా సరస్సులను హాయిగ హంసలు నీదులాడగా కోతల కొచ్చె పంటలును కూడుచు చల్లదనంబు నుల్లమున్
114. తే.గీ.: భావి నరసింహుడాతని బలపుగోళ్ళు హేమకశిపుని యుదరపు సీమ జీల్చ చిందు రుధిరంబు పగిదిని మోదుగములు యెర్రయెర్రని వెలుగులు నెలమి జూపె
115. కం.: నళినము లన్నియు విరిసెను కలువలు వికసించె మధుప గానము గవిసెన్ తెలి తెలి ఱెల్లును బోలిన వెలుగులు ప్రసరించె, ఋతువు, వీడిన తమమై
శ్రీమహా విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొనుట
116. శా.: భోగీంద్రుండు సుతల్పమై హరికి సంపూర్ణంపు నిద్రన్, మహా యోగా కీర్ణము సర్వలోక సుఖసంతోషా నుసంధాయిగన్ రాగాలింగిత పద్మనేత్ర సిరియున్ లాలిత్యపుం గౌగిలిన్ భోగాతీతుని చేరియుండ నిదురన్ పోయెన్ ప్రశాంతంబుగన్
117. కం.: జలధి తరంగపు మ్రోతలు అలమంగళ మృదు మృదంగ మధుర ధ్వనులై మెలకువ యయ్యెను శౌరికి నలినాక్షుడు కండ్లు తెరిచె నయములు కురిసెన్
118. ఉ.: ముందుగ లేచినట్టి సిరి ముద్దుగ స్వాగతమిచ్చె నెంతయున్ పొందిక యైన చన్నులవి పూర్ణసుకుంభములట్లు తోచగాన్ అందపు కంటి వెల్గులవి హారతి పట్టిన రీతి, నవ్వులున్ చిందిన పూలకైవడి రచించెను మేల్కొలుపట్లు, ప్రేమమై
119. తరువోజ: నలుపగు తనువున నమిరెను భుజగ విలసిత శిరమున వెలిగెడు మణులు నలుపుల నగముల నలరగ నినుడు వెలుగుల గురిసిన విధమది యనగ చెలువపు సిరియును చిలిపిగ గనగ సులలిత కరమున సుఖముగ నిముర చెలగెను మురహరి సిరులను విరియ నళిన నయనముల ననఘుడు తెరిచె
120. పద్మనాభము: వారాశి ఘోషంబు వారించు నాదాన్ని ఆ పాంచజన్యంబు వేమారు మ్రోయన్ నారాయణంబైన మాహత్మ్య చక్రంబు మార్మారు గావింప జేజేల చాలన్ తీరైన నృత్యాల తేలేటి కౌముది ధీరత్వమున్ జూప మోదంబు తోడన్ శూరంపు ఖడ్గంబు సోకైన చందాన స్తోత్రంబు చేయంగ మ్రోలన్ వసింపగన్
121. తే.గీ.. గరుడు డాతని రెక్కల కాంతి పరువ భోగితల్పము పైనుండి యోగనిద్ర వీడె విష్ణువు లోకాల బేర్మి గనగ జగతి కల్యాణ కారకుడగుచు, నగుచు
122. వ.: అట్లు నిద్ర మేల్కాంచిన నీరజనాభుండు చిరునవ్వులు మోము విరియ, సిరితోడ కొంత సమయము సరస సల్లాపములతో గడుపుచుండె. అత్తఱి,
123. ఉ: ఆ సతి ముగ్ధమోహన విలాసము మాధవు మానసంబునున్ చేసెను మోదపూరితము, శ్రీసతి కన్నుల సొంపు, కన్బొమల్ వ్రాసిన విల్లులో యనగ, వారిజనేత్ర వసించు రీతులున్ కాసెను పండు వెన్నెలలు, కాముని తండ్రికి, బ్రేమ రాశికిన్
124. కం.: జగదేక పతిని జాడగ నగణితముగ సురలు మునులు నరుదెంచిరి, చే యగ స్తుతి పరమాత్ముని, చా లగ భక్తియు కౌతుకంబు రాజీవాక్షున్
125. చం.: సమయము వచ్చు, మీరు హరి సన్నిధి జేరగ, నంతదాకనో యమర వరేణ్యులార! కకుబాధిపులార! మునీంద్రులార! మీ సమధిక కౌతుకంబులను చక్కని భక్తి యెఱుంగు మాధవుం డమరిక తోడ నిల్వుడని అత్తరి బల్కిరి ద్వారపాలకుల్
126.
వ.:
అటువంటి సమ్మర్ద సమయంబున
~
ఈ భాగంలో కావ్యలక్షణమైన ప్రకృతి వర్ణనమున్నది. శరదృతువు ఎంత మనోహరంగా ఉందో కవి వివరిస్తున్నారు.
పద్యం 112 ‘దత్తగీతి’. ఇది కవి స్వంత సృష్టి! ఛందో వైవిధ్యం! పద్యం 114 లో భావి కార్యార్థసూచన ఉంది. హిరణ్యకశిపుని నరసింహుడు వధించబోతున్నాడన్న సూచన అది. ప 116 లో స్వామివారి యోగనిద్ర, పద్యం 117 లో స్వామి మేల్కొనడం జరిగాయి. సముద్ర ‘తరంగముల ధ్వనులు మంగళమృదు మృదంగ ధ్వనులై’ స్వామికి మెలకువ అయింది. ఇందులో చక్కని రూపకాలంకారం (metaphor) ఉంది. పద్యం 118 లో అమ్మవారు ముందే లేచి, తన వక్షోజములు పూర్ణ కుంభాలుగా, తన కంటి వెలుగులు హారతులుగా, తన నవ్వులు పువ్వులుగా, స్వామికి మేలుకొలుపు పలికింది.
పద్యం 119లో ‘తరువోజ’ అనే దేశీ ఛందస్సును కవి ఉపయోగించారు. ప్రతి పాదంలో 30 అక్షరాలు, రెండు యతి స్థానాలు ఉంటాయి. దీనిలో విశేషం, అన్నీ లఘువులే! సర్వలఘు వృత్తం ఇది.
పద్యం 120 ‘పద్మనాభము’ అన్న విభిన్న ఛందస్సు. దీనితో కూడా రెండు యతి స్థానాలు. పద్యాలు 124, 125 లలో స్వామి వారి దర్శనం కోసం దేవతలు, మునులు, యోగులు ఎంతోమంది రాగా, దిక్పాలకులు కూడా రాగా ద్వారపాలకులు, “స్వామి ఇప్పడే లేచారు. అమ్మవారితో సంభాషిస్తున్నారు. మీరంతా క్రమశిక్షణతో నిరీక్షించాలి” అని చెప్పడం సముచితంగా ఉంది!
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
You must be logged in to post a comment.
ప్రేమ పరిమళం-7
మహాప్రవాహం!-12
దివ్యాంగ సాహిత్య సభ
సంచిక – పద ప్రతిభ – 134
మరుగునపడ్డ మాణిక్యాలు – 43: ద లాస్ట్ డ్యుయెల్
పూల రెక్కల పులకరింతలు
మా శివకోటి తాతయ్య
అలనాటి అపురూపాలు – 212
శ్రీవర తృతీయ రాజతరంగిణి-44
నే నెక్కడి కెళ్ళానూ?
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®