[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
చతుర్థాశ్వాసము:
600.
వచనము:
అంత హిరణ్యకశిపుడు, గదాశూల ఖడ్గ ప్రహారములు తనమేను నంటక, చిరునవ్వుతో నిల్చిన ఆ చిన్ని పాపని గాంచి, ఆశ్చర్యచకితుడై యిట్లు తలపోసెను.
601.
ఉ.:
ఏమిది యబ్బురంబు? ఘనభీకర శస్త్రములన్నియున్ సుతున్
ఏమియు చేయలేక, ఫలమివ్వక, వ్యర్థములయ్యె, దీనినే
నేమనియందు? వీనిదగు నిశ్చల ధైర్యము జూడ నయ్యహో!
ఏమఱినారొ రాక్షసులు? ఏమి విచిత్రము? వీడు చావడే?
602.
వచనము:
అని వితర్కించి, తన సైనికుల కివ్విధంబున పుత్ర వధోపాయములనుపదేశించెను.
603.
సీ.:
మదపు టేనుగులను నదయత తెప్పించి
ఈ దుష్టుద్రొక్కించి ఈల్గజేయు
డతిఘోర విషసర్ప తతిదెచ్చి ఈ తుల్వ
కరిపించి చంపుడు కరుణమాని
పర్వతంబుల నుండి పడద్రోయుడీ ఖలున్
లోతు లోయలలోకి భీతికలుగ
నవరంధ్రములనెల్ల నవరోధమును జేయు
విషభోజనంబుల వీనిజంపు
తే.గీ.:
డన్నపానము లేకుండ అలమటింప
జేసి, నశియించునట్లుగ జేసి, ఇతని
ప్రాణముల దీసి, బాలుని, నాకుముదము
శాంతిగూర్పుడు వెసనాకు శాశ్వతముగ
604.
కం.:
అనువిభు బల్కుల నసురులు
అనురాగము లేక పుత్రునంతము జేయన్
యానతి జేయును, పాపము!
కననౌనే యిట్టి తండ్రి గరుణారహితున్
605.
శా.:
కనగన్, ఏలికయాజ్ఞ మీరగలమే? కార్పణ్యమున్ బూనియా
ఘనదైత్యుండు తనంత తానె స్వసుతున్ ఖండిరపగా కోరినన్
మనమేలా మది జింత చేయవలె, మా ప్రావీణ్యమున్ జూపి, ఈ
తని మర్దించి శవంబు జూపి, విభు సంతాపబు బాపందగున్
606.
చం.:
అని మనమందు రాక్షసులు అవ్విధి నిశ్చయమందినన్, కడున్
వినయము, గౌరవంబులను వీడక సుస్మితుడౌచునిల్చునా
చిన చిరు కూన జంపగను చేతులు రాక, బలీయమౌ విధిన్
గని, తమభృత్యధర్మమును గాచుచు, బాలుని జంప చేకొనన్
607.
సీ.:
దనుజ విభునివైన దంతి శాలలనుండి
పర్వతంబుల బోలు మదగజముల
మావటీడుల సాయమంది తోడ్కొనివచ్చి
ప్రహ్లాదకుమరుని మధ్యనుంచి
ఉరుగజంబుల మీదకు నుసినిగొలుపగ
తొక్కింప జూడగ మిక్కిలిగను
కరులు నేలను యున్న యా చిరుత శిశువును
మేనును మర్ధింప పూనుకొనగ
తే.గీ.:
భక్తవర్యుడు నిర్భయశక్తితోడ
అంబుజాక్షుని స్మరియించె నంతనపుడు
బాలువదనము సింహము బోలిగజము
లన్ని మరలెను వెనుకకు, అబ్బురముగ
608.
చం.:
దయను గజేంద్రమోక్షమును దైన్యముబాపుచు, నక్రబంధమున్
రయమున వీడ జేసిన పరాత్పరు మాధవు లీలతోడ, ని
ర్భయుడగు బాలు చుట్టు కరిబృందము నిల్చి మహోగ్రతుండముల్
జయజయ యంచు నెత్తి తమ జాతికి రక్షకుడైన విష్ణుకున్
ప్రియడగు దైత్యసూను పయి ప్రేమను జూపెను బాష్పయుక్తమై
609.
తే.గీ.:
దానవేశ్వరువీరులు దక్కి చేష్ట
లబ్బురంబును భయమును నుబ్బమదిని
మావటీలును దిగి బాలు మహిత భక్తి
వందనంబుల నొనరించి పాదములకు
610.
వచనము:
ప్రహ్లాద కుమారుని, రాక్షస యోధులు, ఏన్గులను శాసించు మావటీవారు, ఇట్లు స్తుతించిరి.
611.
ఉ.:
బాలుడ వీవు గాదు వర భక్తవరేణ్యుడ వయ్య, ధీరతన్
గ్రాలుచు, సత్కరీంద్రములగారవమున్ యనురాగమున్, తగన్
లీలగ బొందినావు, హరిగమ్యుడవైతివి, మాదుజన్మలున్
చాలను సార్ధకంబగుచు సన్మతి బొందితిమిప్డు నీదయన్
612.
కం.:
అని ప్రహ్లాదుని భుజముల
తనియుచు మోయుచును నాథుదరి దోడ్కొనుచున్
వినయంబు మెరయవచ్చిరి
ఘనదైత్యుడు విస్మయంబు గలుగగ జూడన్
~
లఘువ్యాఖ్య:
పద్యం 601 (ఉ) లో హిరణ్యుడు – తనయుడు ఘనభీకర శస్త్రాల నన్నింటిని ఎదుర్కొని, నిశ్చలుడై నిలిచాడే, వీడు చావడం లేదే? అని ఆశ్చర్యపోతున్నాడని అన్నారు కవి. పద్యం 603 (సీ)లో ప్రహ్లాదుని రకరకలుగా వధించమని, ఏనుగులతో తొక్కించి, పాములతో కరిపించి, కొండలమీది నుండి క్రిందికి తోసి, విషం పెట్టి, ఎలాగైనా సరే వీనిని చంపి నాకు సంతోషము, శాంతి కలిగించమని రాక్షసులను ఆదేశించినాడని కవి చెప్తున్నారు. పద్యం 604 (కం) లో రాక్షసులు, ‘కన్నకొడుకునే చంపమనే తండ్రి ఎక్కడైనా ఉంటాడా’ అని అనుకుంటున్నారు, పద్యం 605 (శా) ‘ఐనా రాజుగారి ఆజ్ఞ మీరలేము కదా! అయినా మన కెందుకు?’ అనుకుంటున్నారు. పద్యం 607 (సీ) లో రాజు గారి ఏనుగు శాలల నుండి మత్తగజాలను తెచ్చారు మావటివారు. వాటిని బాలుని మీదకు ఉసిగొలుపగా, అతడు నారాయణుని ధ్యానించి, చిరునవ్వుతో నిలిచాడు. అతని ముఖం సింహముఖమువలె తోచి గజములు వెనక్కు మరలాయి. పద్యం 608 (చం) లో తమ జాతిని రక్షించిన మాధవుని లీల అనుకొన్నాయి. ప్రహ్లాదుని చుట్టూ చేరి తొండాలనెత్తి జయ జయ ధ్యానములు (ఘీంకారాలు) చేశాయి. వాటి కన్నుల్లో నీళ్ళు పద్యం 611 (ఉ)లో రాక్షస యోధులు, మావటీలు, ప్రహ్లాదునితో, “నీవు బాలునివి కాదు. పరమ భక్తాగ్రేసరునివి. మా జన్మలు సార్థకం” అని చెప్తారు. పద్యం 612 (కం)లో అతనిని భుజముల మీద సంతోషంతో మ్రోయుచు, రాజు దగ్గరికి తెచ్చినారని వివరించారు కవి.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.