[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
చతుర్థాశ్వాసము:
578.
చం.:
గురువులు నీకు చెప్పని నిగూఢపు జ్ఞానము ఎట్లు గల్గెరా
సురరిపువంశనాశక! యశుద్ధపు మాటలు నేర్చి, శత్రువున్
తరతమ భేదమున్ మరచి, ధైర్యముతోనుతియింతు, నీదు దు
ర్భరమగువైరి కీర్తనము మానసమున్ వికలంబు జేయగన్
579.
వచనము:
అనవుడు భక్తాగ్రేసరుండంగు ప్రహ్లాదుడు, జంకును గొంకును లేక, తండ్రి నేత్రములలోనికి నేరుగా చూచుచు, తల్లిని తన ప్రేమైక దృక్కులతో లాలించుచు, స్థిరచిత్తుడై, ఇట్లునుడివె.
580.
చం.:
కలుగదు భక్తి తండ్రి! మునిగమ్యునిపై, పరబోధనంబునన్
కలుగదు భక్తి తాత! యరగాధిపశాయిపయిన్ గురుత్తముల్
పలికిన, లౌకికంబులగు బంధములన్ బడి క్రుంగువారికిన్
కలుగదు స్వీయజ్ఞానమున, కల్గుట పూర్వసుకర్మ జన్యమే.
581.
చం.:
విషయసుఖాల రక్తులకు విష్ణువు దగ్గరకాడు, ఆత్మలోన్
విషయముగా వెలింగెడు, విభిన్న విశిష్ట సుసూక్ష్మజ్యోతిగా
ధిషణను ధిక్కరించి, తనదైన యహంకృతి స్వామి మ్రోల, దా
భృశమున నేకరూపతగ, పూర్తి సమర్పణ చేయ, వశ్యుడే!
582.
ఉ.:
చప్పుడు, దృశ్యమున్, బయట సంగతులన్ నిజమంచునమ్ముచున్
అప్పుడు నిప్పుడెప్పుడును అంతట విశ్వము నిండియున్న, ఆ
యప్పడు నీరజాక్షుని రయంబుగ జేరగలేని మూఢులన్
చొప్పడునే పరాత్పరుడు? శోధన జేసిన గాని చిక్కడే!
583.
ఆ.వె.:
అంధులైన వారు అంధుల నడుపగ
నందరట్లు వెళ్లి అంధకార
కూపమందు బడుచు కుమిలెడు రీతిని
శ్రేష్ఠగురులు లేక చెడుదురనఘ
584.
కం.:
పరమేశ్వర తంత్రంబగు
వరబ్రాహ్మణ ములను వేదమను రజ్జువునన్
నిరతము బద్ధుల, మురహరి
దొరకడు కనబడడు వినడు దుర్లభుడగుచున్
585.
సీ.:
ప్రాగ్దిశాగాములౌ పాంధతతికి నెట్లు
పశ్చిమదిశలోని వస్తువరయ
శక్యంబు గాదొ ఆ సర్వేశుసాధింప
విషయలంపటులకు వీలుకాదు
దొడ్డభక్తుల పాద ధూళి గైకొనచాలు
హరికృపవారికి దొరుకునిజము
ప్రాపంచికంబగు భావజాలము గల్గ
ప్రాప్తించునే శౌరి భవ్యపథము
తే.గీ.:
నాల్గు పురుషార్ధముల తాను నళిననయను
నిశ్చలం బైన భక్తితో నియతి గలిగి
విష్ణుభక్తుల సహవాస మగ్నులగచు
సర్వ శరణాగతిని బొంద సాధ్యుడగును
~
లఘువ్యాఖ్య:
పద్యం 578 లో, ప్రహ్లాదుడనితో, హిరణ్యుడు, “గురువులు నీకు నేర్పని ఈ నికృష్టపు జ్ఞానము ఎలా వచ్చిందిరా, రాక్షస వంశనాశకా!” అని గద్దింపగా ప్రహ్లాదుడు తన తండ్రికి, విష్ణుతత్త్వాన్ని (పద్యం 580లో) అద్భుతంగా వివరిస్తాడు. తండ్రి కనులలోకి నేరుగా చూస్తూ “తండ్రీ! ఇతరులు చెబితే, గురువులు నేర్పిస్తే, హరిభక్తి కలుగదు. సొంతంగా కలిగిందంటే అది పూర్వజన్మ సుకృతమే” అని అంటాడు. పద్యం 581 (చం) లో విషయ సుఖాలకు లోలైన వారికి హరి బద్ధుడు కాడు. సంపూర్ణ శరణాగతి వల్లనే వశమవుతాడని అంటాడు. పద్యం 583 (ఆ.వె.) లో గుడ్డివాడి నాయకత్వంలో గుడ్డివారందరూ వెళ్ళి, చీకటి కూపంలో పడినట్లు, సరైన గురువు లేకపోతే చెడిపోతామని అంటాడు. పద్యం 584 (కం) లో వేద పఠనం అనే తాడుతో ఆయనను కట్టిపడవేయలేమని అంటాడు. పద్యం 585 (సీ) లో – తూర్పు దిశ వైపు వెళ్ళేవారికి పడమటి దిక్కు లోని వస్తువులు కనిపించవు. అదే విధంగా లౌకిక లంపటాలు తగిలించుకున్న వారికి నారాయణుడు కనిపించడని ప్రహ్లాదుడు తండ్రికి చెప్తాడు. ఇదే పద్యంలోని తేటగీతిలో, నాలుగు పురుషార్థములు (ధర్మార్థ కామ మోక్షములు) సాధనములుగా, విష్ణుభక్తుల సహవాసము చేస్తూ ఆయనను పొందాలి అని ప్రహ్లాదుడు వివరిస్తాడు.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.