[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
చతుర్థాశ్వాసము:
519.
కం.:
సుతనికి నయమున భయమున
హితబోధను జేసె తండ్రి హేమకశిపుడున్
చేతము హరితోనిండిన
సుతుడది పెడచెవిన బెట్టె సూక్ష్మవిదుండై
520.
వచనము:
“పుత్రా! ప్రహ్లాదకుమార! ఆ శ్రీహరి మనకు ఆగర్భశత్రువు. కపటి, నక్క జిత్తులవాడు. మీ పినతండ్రి హిరణ్యాక్షుని మాయోపాయమున వధించెను. వాని కొరకు సకల లోకములను గాలించుచున్నాను. దొరికిన యెడల వానిని చిత్రహింసల పాలుజేసి చంపెదను. నాకు భయపడివాడు ఎక్కడో దాగియున్నాడు. వాడా నీకు పూజనీయుడు! నాకు దివ్య వరప్రదాతయైన ధాతనారాధింపుము. లేదా కైలాసవాసియైన పరమేశ్వరు గొలువుము. అంతియగాని, నావైరియైన హరిని మాత్రము స్మరింపకము. దైత్యకుల దీపకుడగు నీవు మన వంశమునకు మచ్చ తీసుకురావలదు నాయనా! నీ తండ్రినైన నేను ఈ పదునాల్గు భువనములను శాసించుచున్నాను. అష్టదిక్పాలకులు, పంచభూతములు, నాకూడిగము చేయుచున్నారు. త్రిలోకములో ‘నమో హిరాణ్యాయ’ అని అందరును నన్నే స్తోత్రము చేయుచుండ, ఈ వెర్రి నీకేల?” అని తండ్రియుపన్యసింప, ప్రహ్లాద కుమారుడు వినయముతో నిట్లనెను.
521.
ఉ.:
సత్యము నీవెరుంగక విశాల జగత్పరిపాల దక్షునిన్
దైత్యవిరోధియంచు నను ధ్యానము చేయక నిల్పుచుంటివే?
కృత్యము నాకు విష్ణుపదగానము, రాక్షస శ్రేష్ఠ! తండ్రి! నే
భృత్యుడ శౌరికిన్ విడను పావనుడౌ హరినెంత చెప్పినన్
522.
వచనము:
అని జంకక, గొంకక, స్థిరచిత్తుడై బదులు పల్కిన తనయుని గాంచి, పుత్రవాత్సల్యము తనయహంకృతికి అడ్డురాగా, ‘సరియైన శిక్షలేక వీడిటు పెడదారి త్రొక్కుచున్నాడు. వీని, మా కులగురువులైన చండ అమర్క బోధకుల వద్దకు బంపి, విద్యార్థిని గావించెద. వారే వీనికి సద సద్వివేకము నేర్పి, సన్మార్గములోనికి మరల్పగలరు’ అని భావించి,
523.
కం.:
తనయులు శుక్రమహర్షికి
అనయము శృతిశాస్త్రపఠన మధ్యయనము, బో
ధనముల చండామర్కులు
ఘనకీర్తిని గన్నవారు, కాదగు గురువుల్
524.
తే.గీ.:
అనితలంచిన దైత్యుడు అసురగురుని
సుతుల రప్పించి నిజసుతుమతిని దిద్ద
వారి వద్దకు పనిచెను వైరిభజన
మానజేయగ వారికి నప్పగించె
525.
వచనము:
గురుపుత్రులైన చండుడు, అమర్కులతో రాక్షసవిభుండిట్లని అభ్యర్థించె.
526.
ఉ.:
విప్రకులావతంసులగు మీరు మదీయసుతున్ సమస్తమౌ
సక్రమ విద్యలందు, శృతిశాస్త్రములందును, శిక్షసేయుడీ!
విక్రమ సర్వలోకజితు భిన్న ప్రవర్తన, నన్ను వీడు, తా
నక్రమమైన త్రోవ రిపుమంత్రము బల్కుచు, క్షోభ పెట్టెడిన్
క్షిప్రముగా మతిన్ మరల జేయుడు, మీరు గురుత్తముల్ తగన్
527.
వచనము:
అని కోర, వారు
528.
సుగంధి:
దానవేశ! మీరు మాకు త్రాత, పోషకుల్, మహా
రాణిగారి బాధ మమ్ము లావు చింత జేసె, మీ
కూనవీడు, పిల్లవాడు, కొంచెమైన మొండితో
కానలేడు జ్ఞానదీప్తి, గర్విగాడు చూడగన్
529.
మ.:
నిరతంబున్ సకలంబులైన చదువుల్ మేమీతనిన్ శ్రద్ధగా
నరయంజేసి త్వదీయమైన మహిమన్ మాశక్తియుక్తుల్ సదా
ఎఱుకన్ చేయుచు తీర్చిదిద్ది యసుర శ్రేష్ఠుండుగా మల్చి, మా
గురునైపుణ్యము జూపి తెత్తుమసురుల్ కేల్మోడ్చి శాబాసనన్
530.
కం.:
అని వాగ్దానము జేయుచు
వినయము తో వెంటరాగ బ్రీతిని గురువుల్
దానవపతిడిరభకు తమ
కోనకు గొంపోయిరపుడు గురుతరశ్రద్ధన్
531.
ఉ.:
దానవబాలకుల్ గురుల దగ్గర పాఠములన్ని నేర్చుచున్
గానము చేయుచున్ యసుర గమ్యుడు రాక్షసరాజు నామమున్
ధీనిధులైన యొజ్జలు విధిన్ సువిధానము బోధజేయగన్
జ్ఞానము బొందుచుండిరదె జ్ఞానముగా దలపోసి, గుడ్డిగన్
532.
వ.:
ఆచండుడు, అమర్కుడు, ప్రహ్లాద కుమారునికి
533.
సీ.:
నీతిశాస్త్రములెల్ల నిష్ఠతో బోధించి
సురవైరిసుతునికి శోభగూర్చి
దండనీతిని నేర్పి చండ తర శత్రులన్
పరిమార్చు విద్యను పడయజేసి
తర్క మీమాంసముల్ తగవ్యాకరణమును
పిల్లవానికి చెప్పి విబుధుజేసి
వేదార్థములనెల్ల విశదంబు జేయుచు
ప్రహ్లాదు శిక్షణలతిశయింప
తే.గీ.:
సర్వవిద్యల బోధించి, శాశ్వతమగు
సకల పరమార్థసారంబు, సర్వరక్ష
హేమకశిపుడె, విశ్వంబు తన యధీన
మనుచు తన విభఘనతను యమితరీతి
534
వచనము:
కీర్తించుచు, సకల జగదాశ్రయుడు హిరణ్యకశిప మహాప్రభువే గాని, పరులు గాదను పాఠమును, నిరంతరము ప్రహ్లాదునికి బోధింపసాగిరి. అతడు సర్వవిద్యలను వారు నేర్పినట్లే నేర్చినను, ఇదియంతయు నిజము కాదని గ్రహించినవాడై, స్వపర భేదము జూపు చదువు చదువుకాదని, మనములో పక్షివాహనుడైన పరాత్పరుని ధ్యానించుకొనుచుండెను.
లఘువ్యాఖ్య:
పద్యం 519 లో (కందం) హిరణ్యుడు నయమున భయమున హరిభక్తి మానమని చెప్పి చూస్తాడు. కాని బాలుడు వినడు. 520 (వచనం)లో సుదీర్ఘమైన హిరణ్యుని హితోక్తులు, స్వోత్కర్ష ఉన్నాయి. తర్వాత పద్యం 521 లో ప్రహ్లాదుడు తండ్రికి బదులిస్తాడు. హరి మాత్రమే జగద్పరిపాల దక్షుడని, అయినకు మాత్రమే తాను సేవకుడనని, ఎంత చెప్పినా విననని స్పష్టం చేస్తాడు. తరురాత 522 (వచనము)లో హిరణ్యుడు చండ, అమరులునే గురువుల వద్ద కొడుకుకు విద్యాభ్యాసం చేయించాలని నిర్ణయిస్తాడు. వారు శుక్రుని కుమారులు. పద్యం 526 (ఉత్పలమాల) లో రాజు వారితో, ప్రహ్లాదుని ఒక దారిలో పెట్టమని అర్థిస్తాడు. పద్యం 528 (సుగంధి వృత్తం) లో వారు రాజును అయినయించి, పిల్లవానికి గర్వం లేదు. కొంచెం మొండి, అంతేనని చెప్తారు. పద్యం 529 (మత్తేభం) లో వానిని మేము తీర్చిదిద్దుతామని చెబుతారు. పద్యం 530 (కందం) లో ప్రహ్లాదుని తమ గురుకులానికి తీసుకుని పోతారు. పద్యం 533 (సీసం) నీతిశాస్త్రము, దండనీతి, తర్కము, మీమాంసము, వేదార్థములు గురువులు ప్రహ్లాదునికి బోధించి, సర్వ రక్షకుడు, విశ్వపతి హిరణ్యాక్షుడే అని బోధ చేస్తారు. అతడు అది నిజము కాదని నారాయణుని ధ్యానిస్తుంటాడని అన్నారు కవి.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.