[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
తృతీయాశ్వాసము:
లీలావతీ దేవి కడుపు పండుట
475.
సీ.:
కలగన్న నెలదాట కన్పట్టె యువిదకు
గర్భధారణ యైన తీరు సరిగ
అతిలోకభక్తుడై హరిని జేరు నలుసు
లీలావతీ దేవి లీనమయ్యె
పొట్టలోపలి కుర్ర భూరితేజము వెలసె
నాయను రీతిని నాతి మేను
తెలుపువారె కనులు వెల్లబారెను చాల
ఉదరమందున నున్న బుడుత వోలె
తే.గీ.
లలితగర్భస్థ శిశువు విరక్తి బోలె
తల్లికప్పుడు రుచులవి తగ్గె మిగుల
నాభి విచ్చెను నెలతకు జ్ఞానపూర్ణు
డైన తనయుని క్రమమైన ఎదుగుదలగ
476.
శా.:
నాకేలా ఇక భూషణంబులు ననున్ మన్నింప విఖ్యాతుడై
లోకాతీతుడునైన పుత్రుడు వెసన్ రానుండ, సన్మార్గుడై
శోకాతీత సునిర్మలాత్మ జనితా స్తోకంబు నానందమున్
రాకాపూర్ణ శశిప్రభల్ వెలయు శ్రీలక్ష్మీశునంశంబుతోన్
477.
ఉ.
ఉల్లమునందు సంతతము యోగముతో హరి నిల్పి, ధ్యానమున్
అల్లన యోగనిద్ర, నిజయాకృతి దోచగ, విష్ణునామమున్
మెల్లగ నుచ్చరించు సుతుబ్రీతిగ గర్భమునందు మ్రోయునా
తల్లికి, సర్వకార్యముల దగ్గెను శ్రద్ధ, కుమార స్ఫూర్తితోన్
478.
తరళము:
దనుజ పత్నికి నిత్యమున్ హరిధ్యానమున్ తగజేయగాన్
వినుతి జేయగ విష్ణుదేవుని వేడ్కగొల్చెడు భావముల్
కనగమాధవు దివ్యరూపము కాంచి ధన్యత బొందగాన్
వినగ కేశవు భవ్యగాధలు వేనవేలుగ భక్తితోన్
479.
వచనము:
లీలావతీదేవి, హరిమగ్నమానసుండైన తనయుని గర్భంబునందు దాల్చుటచేత నిరంతరము తన ప్రాణమును, శరీరమును, హృషీకేశు చరణకమలములకు నర్పింపవలయునని భావించు చున్నను, తనపతి నిరంతర హరిద్వేషాంతర్గత మానసుండగుట చేత, తన భక్తి భావంబులను మనసులోనే అణచుకొనియుండి, పుత్ర జననముకై నిరీక్షించుచుండెను.
ప్రహ్లాద కుమారుని జననము
480.
కం.:
దినదిన గర్భభరాలస
తన సతిగని దనుజవిభుడు దద్దయు బ్రీతిన్
ఘనముగ పుంసవనంబును
అనువుగ సీమంతవిధిని నటు జరిపించెన్
481.
ఉ.:
బాలుడు పుట్టె లేమకు విభాసితక్షీరపయోధి చంద్రునాన్
గ్రాలెడు సూర్యుడోయనగ కాంతకు ప్రాచికి, భూమి కాంతకున్
మేలగు రత్నమట్లు, సుమమే సిరితీవకు పూచినట్లుగన్
లాలిత సర్వలోక నిజ లక్షణ శోభితుడై, పరాత్ముడై
482.
సీ.:
పుత్రోదయమ్మున పొంగిన సురవైరి
సకలలోకంబుల జయము మరచె
పూలవాన కురిసె పుణ్యశిశువుపైన
సర్వవిశ్వమెల్ల సంతసించె
నగరమంతయు పుష్ప మాలికలను వేడ్క
తీర్చిరిదైత్యులు దేవతలును
దివ్య దుందుభినాద దీప్తి ఆకసమొప్ప
అప్సరోభామినులాడిరపుడు
తే.గీ.:
సౌధముల మీద నెగిరెను కేతనములు
శిశువు పుట్టిన వేడుక చెలగగాను
పర్వదిన మౌచు భాసించె పురమదెల్ల
రాకుమారుడు పుట్టిన రమ్యదినము
483.
శా.:
వ్యాపించెన్ శుభవర్తమాన మటులన్ పాతాళ భూమండలా
వాపంబై, సురనాథ బ్రహ్మ ప్రముఖావాసంబులన్ శీఘ్రమే
ఆ పుణ్యాత్ముడు భక్తశ్రేష్ఠుడు, సురారాతీశు ఇల్లాలికిన్
కాపాడంగ సమస్త లోకముల తాకాన్పైన సద్వార్తయున్
484.
తే.గీ.:
దైత్యవంశము పొందెను ధన్యతనుచు
అసురలెల్లను మురియగ నమరులపుడు
దైత్యవిభునకు కాలము దాపురించె
ననుచు దనిసిరి పసిబాలు డవతరింప
485.
ఆ.వె.:
విష్ణుదేవుడుండు వేశ్మమునందున
వేడ్క జరిగెనపుడు విస్తృతముగ
నిత్య వైభవములనేకోత్సవంబయ్యె
దనుజపతికి సుతుడు జననమంద
486.
సీ.:
సుశ్లోకబాలుండు శోభించ వేదాలు
స్వరగతి పెంపొంది సాగె మిగుల
మునుపు చల్లారిన ఘనయజ్ఞకుండాల
నవహుతాశన కీలలావహించె
తొల్లిలుప్తంబైన ధర్మార్థకామమో
క్షాలు మెల్లగ తాము చలనమందె
పెనగురాక్షసభీతి పెంపదియడగుచు
శాంతంబు లోకాల సంక్రమించె
తే.గీ.:
హేమ కశిపుడు నిదియెల్ల గమనమునకు
రాక, పుత్రోదయోత్సాహ రక్తుడగుచు
నెచట చూచిన శుభములె రచితమవగ
సతికి లీలావతికి ప్రేమ సౌరుజూపె
487.
కం.:
వాయువు వీచెను పరిమళ
మయమై, దినకరుడు వెల్గె, పావకుడును తా
రయమున శిఖల వెలార్చెను
జయధ్వానము లుప్పతిల్లె సర్వము శుభమై
488.
చం.:
జరిపెను జాత కర్మలను సద్గురు శుక్రుడు మార్గదర్శిగా
విరివిగ దానముల్ సకల విప్రులకిచ్చెను దైత్యరాజు, స
ద్వరులగు బంధువుల్ ముదము దాల్చిరి, చక్కని పేరు పెట్టగన్
అరయగ పండితోత్తములనప్పుడు గోరెను భక్తియుక్తుడై
489.
ఉ.:
ఆదివరాహరూపుడగు కంజదళాక్షుడు విష్ణువే కృపన్
మేదిని స్వర్గమున్ సకలమెల్లను హ్లాదము కూర్చు బాలకున్
ఆదరమొప్ప నిచ్చె; నిది కారణ మీశిశువున్ జగంబు, బ్ర
హ్లాదుడటంచు బిల్వ; నది యంచిత నామము యౌను మిక్కిలిన్
490.
వచనము:
అని విబుధోత్తములు నవజాత శిశువునకు ప్రహ్లాదుడను అన్వర్థనామమును నిశ్చయించిరి.
~
లఘువ్యాఖ్య:
పద్యం 475 లో లీలావతి గర్భవతి అయినది. లోపల విరక్తుడైన మహా భక్తుడైన ప్రహ్లాదుడున్నాడు. కావున ఆమెకు కూడ విరక్తి కలిగి రుచులు పట్ల విముఖత కల్గింది. అలంకారాలపై శ్రద్ధ తగ్గింది. వచనం 479లో ఆమె తన భక్తిభావాన్ని, భర్తకు వెఱచి, తన లోనే దాచుకోంది. పద్యం 480లో లీలావతికి హిరణ్యుడు శ్రీమంతం జరిపించాడు. కొడుకే పుట్టాలని ‘పుంసవనం’ అన్న క్రతువును జరిపించాడు. పద్యం 481లో శిశువు ఉదయించాడు. ప్రాక్ దిక్కుకు సూర్యుడు ఉదయించినట్లు, భూమిలో రత్నం వలె, తీగకు పూవు పూచినట్లు, ప్రహ్లాదుడు పుట్టాడు. పద్యం 482లో అతని పుట్టుక వల్ల సకల విశ్వం సంతసించింది. పుష్పవర్షం కురిసింది. నగరమంతా అలంకరించారు. దేవతలు, రాక్షసులు, ఇరువర్గాలూ సంతసించాయి. పద్యం 483లో ఈ శుభవార్త లోకాలన్నింటిలో వ్యాపించింది. పద్యం 485లో వైకుంఠంలో కూడా వేడుక జరిగిందని చెబుతున్నారు కవి. పద్యం 486లో వేదాలు మళ్లీ మ్రోగసాగాయి, యజ్ఞాలు పునః ప్రారంభమయ్యాయి. లోకాల్లో శాంతి నెలకొంది. రాక్షసపతి ఇదంతా గుర్తించక పుత్రోత్సాహంతో మునిగిపోయాడు. పద్యం 488లో శుక్రాచార్యుల ఆధ్వర్యంలో శిశువుకు జాతకర్మలు జరిగాయి. పద్యం 489లో అందరికీ హ్లాదం (సంతోషం) కూర్చువాడు కాబట్టి ‘ప్రహ్లాదుడు’ అని ఆ పిల్లవాడికి నామకరణం చేశారని తెలిపారు కవి.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.