[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
460. కం.: తేటుల గీతములన్, శుక పాటవములు హంసతతుల మంజుల రవముల్ దీటుగ సరసుల నిండెను మేటిగ వరచక్రవాక మిథునపు లీలల్
461. సీ.: బాలసూర్యుని కాంతి చెలువొందె కెంపుల కొత్త సొంపుల బోలె హత్తుకొనుచు దిగ్వధూటీ కర్ణ దీప్తి నొందెడు నట్టి లేచిగుళ్లను బోలె లేత యెరుపు మోదుగ వృక్షాల మొగ్గలన్ భ్రాంతిని కలిగించె దినకరు కిరణచయము తిమిరాన్ని పోగొట్టు దీపశిఖలవోలె విశ్వసౌధమునకు మెరుగుదిద్ది తే.గీ.: ఉదయమనియెడు నభినయ చతురుమోము పూసుకున్నట్టి యెర్రని పులుముయనగ బాలభానుడు ఉదయించె భాస్కరుండు సర్వజీవుల కాశ్రయుడుర్వి భువిని
462. ఉ.: అంతట దైత్యుపత్ని నిజనాథున కాకల జెప్ప, నాతడున్ ఎంతయు సంతసించి, గురుశ్రేష్ఠుడు శుక్రుని పిల్వనంపగాన్ శాంతగభీరుడైన భృగుసద్వరవంశజుడేగుదెంచి, దే వాంతకుడైన దైత్యవిభుపత్నికి దీవెనలందజేయగన్
463. వచనము.: రాక్షసవిభు పట్టపురాణి, వినయగౌరవములు మదిని సందడింప, గురువర్యుని ఉచితాసన మలంకరింపజేసి, పాదముల నర్చించి, కల్యాణరూపిణియై నిల్చి, కరకమలంబులు మోడ్చి, ఆ మహాభాగునితో నిట్లు పలికె.
464. చం.: మునివర! నిన్న రాత్రినిన పూర్వమునౌ కలగాంచి లేచితిన్ ఘనతర శౌర్యశాలియగు కాంతుని చిత్తము గూడ దానితో దనిసెను, మీరు మాకు తలిదండ్రియు దైవము మార్గదర్శియున్ అనయము మాదు క్షేమమునయంబునుగోరెడు వారు, కావునన్
465. ఉ.: మీరు వినుండు రాత్రినొక మేఘమువంటి శరీరకాంతితోన్ తీరగు శంఖచక్రముల దీప్తి భుజంబుల దాల్చి, పువ్వులన్ పేరుగ, కౌస్తుభంబు తన మేనున, ఫుల్లసరోజనేత్రుడై సౌరుగ పీతవస్త్రముల, సజ్జనుడౌ నొక బ్రాహ్మణుండు తాన్
466. కం.: ఆనతినిచ్చెను వర సం తాన ఫలమునాకొసంగి దరహాసముతోన్ నేను ధరించిన సూత్రము తానటు వెసలాగి త్రెంచి తనగతి బోయెన్
467. కం.: దీని ఫలంబును తెలియక నేనెంతయు వ్యగ్రమతిని మెండగు భీతిన్ నా నాథుని తో చెప్పక నీ నిర్ణయము మును దెలియ నెంచితి యనఘా!
468. కం.: అని లీలావతి బలుకగ అనితర తపయోగశీలి అసురగురుండున్ తన మనమున తర్కించుచు కనిపించిన వాని రాక కర్థము తెలిపెన్
469. శా.: పాతివ్రత్యమునందు నీవు పడతీ! భావింపగా శ్రేష్ఠవై నీతిన్ తప్పక యుందు, వాతడటులన్ మేలైన సంతానమున్ ప్రీతిన్ బొందు వరంబునివ్వగ కలన్ వీక్షించి ధన్యాత్మవై చేతంబున్ పులకింపజేసె విడుమా! చీకాకుయున్ చింతయున్
470. వచనము.: కావున మహారాజ్ఞీ! అనవసరమైన శంకలు విడనాడుము. నీకు శుభమే జరుగ బోవుచున్నది. వచ్చినవాడు విప్రుడు కాడు. సాక్షాత్తు పరమాత్మయే. నీకు పుత్రోదయమగును. సౌభాగ్యవతీ భవ! అని శుక్రాచార్యుడు లీలావతిని ఆశీర్వదించెను. సర్వజ్ఞుడైన ఆ మహర్షి, కేవలము శుభమునే సూచించి, ఆమె స్వప్నములోని అశుభమును అనగా ఆమె మెడలోని హారమును త్రెంచుకొనిపోవుట, భావిహిరణ్యహననమును, ఆమెకు తెలుపలేదు. విజ్ఞులిటులే ప్రవర్తింతురు కదా! హిరణ్యకశిపుని పరోక్షమున అసురాచార్యుండు ఈ ప్రసక్తి తెచ్చెను. ఏలయన
471. చం.: అనయము శ్రీహరిన్ మనమునందున ద్వేషము తోడజూచు నా దనుజవిభుండు, వచ్చినది తామర సాక్షుడు విష్ణువంచు తా వినిన, ననంత క్రోధమున వెర్రిగ నెట్లు చరించునో కదా! యని అనిదితిపుత్రుకున్ గురుడు అవ్విషయంబును దాచె నేర్పునన్
472. శా.: ఆ లీలావతికిట్లు చెప్పెను గురుండా నీలవర్ణుండె, తా నీ లీలన్ కృప జూపె నీ పయినిటుల్ నీ భాగ్యమున్ పండె నీ వాలోచింపక ప్రాణనాథు వరమౌ యత్యంత తేజోనిధిన్ బాలున్ బొందుము వహ్నిలోన జననంబౌ పద్మమన్ పోలికన్
473. ఉ.: కావున నీవు సంతతము కారుణ చిత్తుని పద్మనాభునిన్ జీవితలక్ష్యమంచు, దనుజేశ్వరుడేమి యెరుంగకుండగన్ భావన జేయుమా! పరమపావను, దైత్యులవంశరక్షవై నీవలనన్ జనించునొక నిర్మల భక్తియుతుండు బాలికా!
474. తే.గీ.: దనుజవంశంబు చివరకు తానెయటుల కానియట్టుల నిర్వంశ మమలగాత్రి మాధవుని ధ్యానమెప్పుడు మనమునందు చేయుచుండుము శుభములు చేకురంగ
~
పద్యాలు 460, 461 లో కవి సూర్యోదయాన్ని వర్ణించినారు. సూర్య కిరణాలు లేతచిగుళ్లులా ఉన్నాయి. మోదుగ మొగ్గల్లా ఉన్నాయి. దీపశిఖలవలె ఉన్నాయి. పద్యం 461 (తే.గీ.) లో ఉదయం- ఒక నటుడు పూసుకున్న ఎరుపులా ఉందనే ఉత్ప్రేక్ష ఉంది. పద్యాలు 464, 465లో లీలావతి శుక్రాచార్యునికి తన స్వప్నవృత్తాంతము తెలిపింది. పద్యం 469లో ఆయన ఆమెకు ధైర్యం చెపుతున్నాడు. వచనం 470లో ఆమెకు కొడుకు పుడతాడని చెప్పాడు. కాని వచ్చినవాడు ఆమె మంగళసూత్రం తెంచుకొని పోవుట (కలలో) అశుభమని చెప్పలేదు. అది విజ్ఞుల లక్షణం అంటున్నారు కవి. ఎందుకంటే (పద్యం 471 లో) దానవపతికి ఇది తెలుస్తే కోషంతో రగిలి పోతాడని. 473, 474 పద్యాలలో నీవు నిరంతరం, నీ భర్తకు తెలియకుండా, విష్ణువును ధ్యానిస్తూ ఉండమని సలహా యిస్తాడు శుక్రాచార్యుడు.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
You must be logged in to post a comment.
తానొకటి తలిస్తే..-2
2024 పాలమూరు సాహితి అవార్డుకు కవితా సంపుటాలకు ఆహ్వానం
జ్ఞాపకాల తరంగిణి-71
నా బాల్యం కతలు-12
పదసంచిక-44
మా కిష్టం – మా కిష్టం
ది డెస్ట్రక్షన్ ఆఫ్ నేచర్ ఇన్ ది సోవియట్ యూనియన్ – పుస్తక పరిచయం
సంచిక – పద ప్రతిభ – 149
కలలో అశరీర ఆమె
నూతన పదసంచిక-104
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®