శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
తృతీయాశ్వాసము:
హిరణ్యకశిపుని వైభవము
417.
సీ.:
మూడు జగముల గెల్చి భోగముల దేలుచు
నిచ్చ వచ్చిన రీతి పెచ్చుమీరి
తన సాటివారలు కనరారు ఇకయంచు
నిక్కినీల్గి పొగరు మించిపోవ
భార్యతో వేడ్కల పరిపరి విధములు
దేలుచు యానందహేల దనర
జంకు గొంకును లేక జగదేకవీరుడై
లోకపీడకుడౌచు రాక్షసపతి
తే.గీ.:
వరుణ దేవుని చెంతను వనిత లెల్ల
నలకూబరుని యువతులు నతని జేరి
రాస క్రీడా విలాసములో రంజిలంగ
పోయి, దైత్యుని కమ్ముడుపోయి రకట
418.
వచనము:
కిన్నర ప్రముఖులను, తుంబుర విశ్వావసులును హిరణ్యకశిపు కళామందిరమున తమ తమ సంగీత ప్రదర్శనములచే ఆ దైత్యాధిపుని రంజింప చేయసాగిరి.
419.
సీ.:
వీణ వాయించుచున్ తనియించునొక లేమ
వేణువు వినిపించు ప్రియసఖి యును
వివిధ నాట్యములందు విన్నాణమును జూపి
రాక్షసుని మనము రంజిలగను
జఘనోరు కుచకుంభ సౌభాగ్యసంపద
దైత్యనాథుని మ్రోల దనరు భామ
మధుసేవనా రక్తమానసున్ సురవైరి
పానపాత్రలనిచ్చు పడతి యొకతి
తే.గీ.:
ఈ విలాసపు చర్యలే ఇష్టమవగ
నిరత సువినోదశీలుడై నిష్ఠ మరచి
విషయ సుఖములు దగులుచు వెర్రిగాను
హేమకశిపుడు మరచెను తనను తానె
420.
మ.:
విహరించెన్ సతతంబు దైత్యపతి తా బ్రీతుండు, దివ్యాంగనా
సహితుండై సుధచిందు రమ్యవనముల్, సౌందర్య పుష్పావళుల్
నీహారంబుల సౌరుదాల్చెడు మహా శోభాయమానంబులై
లేహంసల్ తిరుగాడు దివ్యనదముల్ లీలన్ సముత్సాహియై
గ్రీష్మ రుతువర్ణనము
421.
కం.:
రాతిరిపవలను భేదము
మతి వీడుచు రాక్షసుండు మగువల మధువున్
కుతి దీర్చుకొనుచునుండెను
అతి ఎప్పుడు వర్జనీయ మనునది మరచెన్
422.
వచనము:
అంత, వసంతం బంతంబు కాజొచ్చెను. వేసవి ప్రవేశించి తన ఋతుధర్మమును నిర్వర్తింప సాగెను.
423.
కం:
తేటులు లతలను వీడెను
పాటలముల నాశ్రయించె మధువది కరవై
దీటగు యమ్ముల పోలిక
కోటిగ కనిపించె మల్లెకొమ్మల మొగ్గల్
424.
పంచచామరము:
నిదాఘ తప్తులైనవారు నీటి జల్లు కోరగాన్
సదా వసింప రక్తులైరి చన్నుదోయి చల్లగాన్
సుదేహరాజి తేలికైన శుభ్ర శ్వేతవస్త్రముల్
కదా యివెల్ల తాపశాంతి కల్గజేయు పద్ధతుల్
425.
చం.:
మలయపు గాలి వీచెనటు మంద్రముగా ఘనతాళవృంతమల్
అలసిన గాలి సేదగనునట్లుగ తోచుచు, వేడి వేసవిన్
తలనటు దాచుకొన్న గతి దాని ప్రవాహము కొంతమేరకున్
సులలిత శీత భావనను సొంపుగ గల్గ, జనంబు మెచ్చగన్
426.
సీ.:
శశికాంత నిశలను సాంద్రముగా సాగి
చంద్రకాంత శిలల మీద కురిసి
రత్నవేదికలవి రమ్యముగా కరిగి
మధురమైన జలము బయటపెట్టె
వెన్నెల కరిగిన వేదిక జలముల
కేళీవనము లోని గ్రీష్మ తరులు
పీల్చి తృప్తిని బొందె వేడిమి గోల్పోయి
శోభను గోల్పోక సుంతయైన
తే.గీ.:
వరసుధాకరు కరములు వనము నందు
చల్ల వెన్నెల కురిపించి సకల తరుల
దాహమును బాపి పచ్చనితనము నిలిపె
తనకు తానుగ తరుతతి తాపముడిగె
427.
కం.:
ప్రియ పరిపీడిత జఘనము
పయిగల వస్త్రంబు తొలిగి పటు నఖక్షతముల్
నయమగు ఎర్రని తారల
చయముగ కనిపించె వేడ్క చానల సొబగుల్
428.
సీ.:
చైత్రమాసపు శోభ చెన్నొంది వివిధమౌ
వింత పోకడలెన్నొ పెంపుగాచె
మనసిజ హితుడైన మాసశ్రేష్ఠుడు మిత్రు
గూడగ చెలరేగె క్రొత్త పొలుపు
లోకమంతయు గ్రీష్మ రోష తాపంబది
ఫాలనేత్రు నయన భంగి గ్రాలె
జడిసిన రతిపతి జవ్వని యలకలన్
దిరిసెన పూల కేసరము దాగె
తే.గీ.:
సఖ్యమయ్యెను తరువర ఛాయ పగలు
నిశిని వీచెడు చల్లని మేలు గాలి
ఆరుబయటను వెన్నెల అదరించ
జరుగు వేసవి జనులకు సహ్యమయ్యె
~
లఘువ్యాఖ్య:
ఈ భాగములో వరగర్వితుడైన హిరణ్యకశిపుడు మద మోహలోభములు సందడించగా, విలాస కేళీరతుడై ఎట్లు ప్రవర్తించుచున్నాడో కవి వర్ణించుచున్నారు! పద్యం 417లో అతని లోక పీడనాపరాయణత్వము వివరింపబడినది. దేవతల వద్ద గల యవతులు అతనికి ఆధీనమైనారు. కిన్నర, తుంబురాదులు తమ సంగీతంతో రాక్షసరాజును రంజింప చేయుచున్నారు. 419 లో వివిధ విలాసినులు రకరకాలుగా అతనిని ఎలా సేవించుచున్నారో కవి వర్ణించారు. 423లో కావ్యలక్షణాలలో ఒకటైన గ్రీష్మ ఋతువర్ణనమున్నది. పద్యం 424 పంచచామరమనే ఛందోవైవిధ్యము. ‘నిదాఘము’ అంటే వేసవి. జనులు నీటి జల్లులు కోరారు. తెల్లని పలుచని వస్త్రాలు ధరించారు. పద్యం 425 లో సాయంత్రం మలయపు గాలి వీచి చల్లగా తాటి చెట్ల గుబురులో దాగింది. వేసవి అక్కడ తలచుకున్నదేమోయని కవి పద్యం 425 లో ఉత్ప్రేక్షాలంకారము నుపయోగించారు. పద్యం 427 లో చంద్రోదయ వర్ణన. వెన్నెల చంద్రకాంత శిలలపై కురిసింది. రత్నవేదికలు కరిగి మధుర జలాలను వెలువరించాయి. ఆ చల్లదనంతో గ్రీష్మము లోని చెట్లు సేద దీరాయి. పద్యం 428 లో చైత్ర మాసపు శోభను కవి వర్ణించారు. గ్రీష్మ తాపం శివుని మూడో కన్ను తెరిచినట్లుగా లోకాన్ని మండించిందట (పద్యం 440). వచనం 422 లో ఇదంతా సహజమని, ఋతు ధర్మమని కవి చెప్పుచున్నారు. కానీ జనం, ప్రతి వేసవిలో ‘ఈసారి ఎండలు మండిపోతున్నాయ’ని వాపోతుంటారు!
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.