Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-27

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

తృతీయాశ్వాసము:

401.
ఆ.వె.:
మిమ్ము సతము గొల్చు మేమిట్లు మిక్కిలి
భంగపడెడునట్టి పాడు కాల
మదియ దాపురించె మాధవా! వినుమయ్య
సిగ్గు తోడ మనసు చితికెనయ్య!

402.
ఉ.:
వాని గదావిఘాతముల వాడిన మా శిరముల్ ఇవి చూడు కేశవా!
వాని విశేష తర్జనము బారిన పారిన మమ్ము బ్రోవుమా!
దానవ సేవలన్ కమిలి తప్పిన కాంతుల చేతులివ్వె, ఓ
దీన సముద్ధరా! కనుము తేజము వీడిన దేవతా తతిన్

403.
కం.:
మా రాజ్యము మా సంపద
మా రంజిలు వైభవమ్ము మా భాగ్యములున్
ఈ రీతి కోలుపోతిమి
ఘోరాసుర దుష్ట ధాటి క్రుంగెను మనముల్

404.
ఉ.:
నీవే మాకిక దిక్కు శౌరి ఇకపై నీ పైన భారంబు, మా
కీవే నిర్భయ దివ్యభవ్య పదమున్ నీరేజపత్రేక్షణా
నీ వాత్సల్యమె మమ్ము గాచు వరదా! నీ ప్రాపు నిశ్చింత గాన్
చేవన్ తప్పిన మేము సాంత్వనముకై చేరన్ కటాక్షింపవే!

405.
కం.:
అని విన్నవింప నమరులు
విని మధు దమనుండు తగిన విధమున సురలన్
అనునయమున నోదార్చెను
తన కృప ప్రసరింప జేసి తనియగ మనముల్

406.
వచనము:
అనుకంపాపూరితుడైన అబ్జనాభుండు సురలతో నిట్లు పలికెను.

407.
ఉ.:
వింటిని దైత్యు దుర్మదపు వికృత చేష్టలు, దుష్టకృత్యముల్
మింటను భాస్కరోదయము మించిన చీకటి బాపునట్లు, నా
కంటకు పాపముల్ పగిలి కర్మఫలంబది పండువేళ, మీ
కంటిన వాని పీడ తొలగన్ వధియించెద, నోర్పు పట్టుడీ!

408.
తే.గీ.:
వివిధ రీతుల వానికి చావు లేని
వరము పరమేష్ఠిచే బొంది సురల నిటుల
చిత్రహింసల పాల్జేయు భాతృ ద్రోహి
మడియునట్లుగ నూహను పన్నినాడ

409.
మ.కో.:
వాని వ్రేలితో వాని కన్నులు భగ్నముల్ యొనరించగా
నేను దాల్చెద నారసింహుని మేను భీకర రూపమున్
నా నఖంబుల సంజె వేళను మట్టుబెట్టెద దైత్యునిన్
దానవాధము నంక పీఠిని దారుణంబగు రీతినిన్

410.
తే.గీ.:
కాన వీడుడు దుఃఖంబు కనుడు శాంతి
అశ్రితావన సంస్ఫూర్తి యసురు ద్రుంచి
అమరజాతిని రక్షింతునని వచించి
అదితి సుతులకు నభయంబు హరి యొసంగె

411.
తే.గీ.:
నన్ను ఒకసారి తలచినన్ మనమునందు
భక్తి మీరగ; కరుణింతు, వారి నేను
వారి వెతలెల్ల నాకిట్టె ప్రకటమగును
ఆర్త పరిపాలనంబు నొనర్తు నేను

412.
చం.:
గుణముల కీర్తనంబుననె కోరిన కామ్యము లిత్తు నేను, నా
ఘనతర సుప్రభావమున కాచితి వేదము లెల్ల, శాస్త్రముల్
కని విని, యంతరార్థముల గ్రాహ్యము నేనని గొల్చు వారి నన్
మననము చేయువారి వెత బాయగ జేతు నఖండమౌ కృపన్

413.
తే.గీ.:
గూఢమైనట్టి తత్త్వము కోరి తెలియ
అలవి కాదని ఇది యెల్ల సకలురకును
కరుణ నరసెడు విధమును కాంచ జేతు
నేన దెల్పుదు భువనాల మేలు గోరి

414.
ఉ.:
నేను సమస్త భూతముల నెల్ల సమంబుగ జూచువాడ, నన్
పూనిక, ధర్మచింతనను పొందిన వారిని గాతు తప్పకన్
కాని, యధర్మచార ఘన తామస గర్వ మదానుశీలురన్
నేనతి ఘోర శిక్ష సమయింతును లోకహితార్థమై వెసన్

415.
వచనము:
అని విష్ణుభగవాను డానతిచ్చిన..

416.
సీ.:
దుష్ట తామసులను ద్రుంపంగ శౌరికి
చెప్పవలసినది యొప్పు కాదు
శిష్ట తాపసులను చేరి రక్షింపంగ
పద్మనాభుని గోర బనియె లేదు
సాత్త్విక చిత్తులౌ స్వర్గవాసుల బ్రోవ
పుండరీకాక్షుడే పూనుకొనియె
హేమకశ్యపు జంప భీమ రూపము దాల్చి
నరసింహుడై వచ్చు సరసిజాక్షు
తే.గీ.:
డని మనంబున ముదమది సందడింప
భావి నరసింహ రూపము భావనమున
నిలువ సురనాథుతో గూడి నిర్జరాళి
హరికి కైమోడ్చి వెడలిరి హరితభయులు
~

లఘువ్యాఖ్య:

పద్యాలు 401, 402, 403 లో కూడా దైత్యునిచే తాము పడుతున్న హింసలను దేవతలు వివరిస్తారు. పద్యం 404 లో నీవు తప్ప మాకు వేరే గతి లేదని ప్రార్థిస్తారు. పద్యం 405 నుండి మహావిష్ణువు వారిని ఓదార్చి, తానున్నానని భరోసా కల్పించే పద్యాలున్నాయి. పద్యం 407లో ‘వాని దుర్మదపు వికృత చేష్టలు నేనూ విన్నాను, వాడి పాపం పగిలి, కర్మఫలం పండితే, వాడిని చంపి, వాడి పీడ మీకు తొలగిస్తాన’ని అంటాడు దేవదేవుడు. పద్యం 409లో బ్రహ్మ వరాలకు విరుధ్ధంగా, నృసింహావతారమెత్తి, గోళ్లతో, సంధ్యాసమయంలో, తొడల మీద, వానిని చంపుతానని స్వామి వాగ్దానం చేస్తాడు. పద్యాలు 410, 411, 412, 413, 414 లలో స్వామి తన తత్త్వాన్ని, ఆర్తత్రాణ పరాయణత్వాన్ని వివరిస్తాడు. తాను సమదర్శినని, కాని అధర్మవర్తనులను సహింపనని చెబుతాడు. పద్యం 416 లో సర్వజ్ఞుడైన స్వామికి తాము చెప్పవలసిన పని లేదని సాంత్వన పొందిన దేవతలు, నరసింహరూపములో స్వామి అవతరించి హిరణ్యని పీడ తొలగిస్తాడని సంతోషంతో వెనక్కు మరలుతారు.

(సశేషం)

Exit mobile version