Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-24

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

తృతీయాశ్వాసము:

352.
శా.:
నిత్యానంద ప్రదాయి! నిశ్చల మనః స్నిగ్ధానువర్తీ! హరీ!
ప్రత్యూహంబుల దుంచి కావుము సదా, వైరాగ్యసత్సంపదన్
సత్యాన్వేషణ చేయు బుద్ధినిడి, నిన్ సాధించు సన్మార్గమున్
అత్యంతంబుగ జూపవే! నరహరీ! ఆముష్మికానందమున్

353.
తే.గీ.:
రోమహర్షణు డిటుపల్కె ఋషుల తోడ
దేవగురు వచనములను తీరి సేద
సురలు ఏకాభిప్రాయమున్ చేరి, ముందు
ఇంద్రునిడుకుని వెడలిరి విష్ణు కడకు

354.
ఉ.:
చూచిరి దారిలో జలధి శోభను, కచ్ఛప నక్ర మత్స్యముల్
ఏచి, తరంగ ధ్వానములు హెచ్చగ, ఘూర్ణిలు వారి కోశమున్
రోచిత రత్నరాజియుత రోషభుజంగ శిరోవిభూతి యున్
యాచిత సర్వ సంపదల యాశ్రయమైన మహోదధిన్, అటన్.

355.
వచనము:
“శ్రీమహావిష్ణునకు నెలవైన ఆ క్షీరాబ్ధి ఆ పరాత్పరునకు ఎంతో ప్ర్రీతిపాత్రమైనది కదా! ఈ సముద్రమును విడిచి, ఏనాడైనను, హరి యుండలేదు. ఆయనకు ఇల్లయి ఈ వారాశి ఎంత పుణ్యము చేసుకున్నదో!” అని వితర్కించుకొనుచు, శ్రీహరికి, సింధురాశికి గల అనుబంధమును దేవతలిట్లు గుర్తు చేసుకొనిరి.

356.
చం.:
తిరిగెను సూకరంబుగ సుదీర్ఘపు కల్పము పూర్తి కాగ, తా
బరచిన మర్రియాకునను పండెను పాపగ, యోగమాయతోన్
విరిచెను సోమకున్ తన యమేయపు మత్స్య సురూప శక్తి తోన్
అరయగ దేవ దానవుల నక్షయమౌ సుధ జిల్క జేయుచున్

357.
వచనము:
మరియును

358.
సీ.:
లోకాలన్నియు నేకాత్మ యౌచును
కానుపు బొందిన కన్నతల్లి
అంతమే లేనట్టి అంభు రాశికి తాను
గారాల కూతురై పరగు దేవి
వారిజనాభుని వక్షంబు వాసమై
నిత్యంబు చెన్నొందు నీరజాక్షి
తన విభుపాదాల తగ నొక్కుచును సేద
తీర్చు వర గృహిణి దివ్యగాత్రి
తే.గీ.:
ఇచట వసియించుటన్నది ఎంత భాగ్య
మనుచు క్షీరాంబురాశిని ప్రస్తుతించి
సురలు దేవేంద్ర సహితులై సుప్రభావు
కమలనాభుని దర్శింప నమలభక్తి

359.
కం.:
అమరులు వార్ధిని దాటిరి
తమ కన్నులు పండ గనిరి ధవళద్వీపం
బు, మహిత వైకుంఠంబును
గమనించుచు సాగిరపుడు కార్యోన్ముఖులై

360.
సుగంధి:
తెల్లదీవి సంద్రమందు దీప్తినొందు నిత్యమున్
నల్లనయ్య సంచరించు నట్టిదౌ వికుంఠమున్
ఫుల్ల పద్మమందు వెల్గు పుణ్య కర్ణికోయనన్
ఉల్లముల్ జ్వలింప జూచి ఉత్సహించి రాసురల్

361.
ఉ.:
చేతులు మోడ్చి సాగిరి నశించిన మోహము తోడ దేవతల్
ఏ తపమాచరించినను ఎన్నగ సాధ్యము కాని దర్శనం
బీతరి మాకు కల్గునని మిక్కిలి సంతస మందుచున్, మహా
భీతిని పారద్రోలి తము బ్రీతిగ బ్రోచెడు విష్ణు చూడగన్

362.
కం.:
శ్వేత ద్వీపంబునకును
వీతాఖిల దుఃఖకారి వైకుంఠముకున్
జోతలు పెట్టి రనిమిషులు
చేతములో శౌరి నిలిపి స్థిరమగు భక్తిన్

363.
చం.:
అమరుల జాచె మాధవుడు నవ్విధి రాజ సుమార్గమందునన్
తమ తమ విష్ణు నామ జయ ధ్వానములన్ తన ప్రోలు నిండగా
కమలిన మోములన్ నడచు కష్టవినష్ట వరిష్ట తేజులన్
సుమహితమైన నేత్రయుగ శోభిత సత్కృప జాలు వారగన్

364.
కం.:
పుత్తెంచె పక్షినాథుని
నత్తరి యాదీన బంధు డాసురలవెసన్
మొత్తముగా కొని తెమ్మని
చిత్తజునికి కన్నతండ్రి చెప్పెను దయ తోన్

365.
వచనము:
అంత గరుత్మంతుండు వినయాంతరంగుండై వారికి ఎదురేగ

366.
ఉ.:
బంగరు వన్నె కాంతిగల పక్షములన్, అమరాభిమానమున్
రంగరినట్టి దెందమున, రాజితమౌ హరిచందనంబు తోన్
అంగము వెల్గ, భూషణచయంబు చలింప ప్రియంపు మాటలన్
ఇంగిత మొప్ప వారి హరి జేరగ దోడ్కొని పోయె, బ్రీతుడై

367.
తరువోజ:
కనులవి వెలుగగ కని రట సురలు
ఘనుడగు మురహరి కరుణను వెలుగు
అనితర మహిమము అభయపు కరము
అమరుల వెత గని అతి దయ గనగ
మనమున గలిగిన మహితపు దిగులు
అనుదిన మునుగను యసురుల పొగరు
చనగనుమతి, తమ సకలము హరియె
యనునొక తలపది, అతిశయముగను

368.
సీ.:
మహిత కాంతుల సభా మందిరంబును జొచ్చి
కనులార పరమాత్మ గనిరి సురలు
అత్యున్నతంబైన ఆదిశేషుని సెజ్జ
పవళించి యున్నట్టి పద్మనాభు
హిమశైల శిఖరాన సుమనోహరంబైన
వరఘనాఘనముల వన్నెవాని
నవ పారిజాతము నవలీల ధిక్కరిం
చెడు పాదయుగమున చెలగువాని
తే.గీ.:
వేద ఘోషల పాపిట వెలుగు నరుణ
దివ్య సిందూర కాంతుల తేజరిల్లు
ననఘు వైకుఠవాసుని ఆదిదేవు
ధాతకే తాత, జగముల త్రాత, హరిని
~

లఘువ్యాఖ్య:

ఈ భాగములో దేవతలు వైకుంఠవాసుని దర్శిస్తారు. పాలకడలిని, శ్వేత ద్వీపాన్ని కవి మనోజ్ఞంగా వర్ణించారు. పద్యం 354లో పాలసముద్ర శోభని చూస్తారు. శ్రీహరితో దానికి గల అనుబంధాన్ని (వచనం, 355) గుర్తు చేసుకుంటారు. పద్యం 356 లో విష్ణువు, వరాహరూపంతో, వటపత్రశాయిగా, మత్స్యావతారంలో ఈ సముద్రంలోనే లోకాలనుద్ధరించాడని భావిస్తారు. పద్యం 358 లో ఈ సముద్రంలోనే పుట్టిన లక్ష్మీదేవి వర్ణన ఉంది. ఆమెను తల్లిగా, కూతురిగా, గృహిణిగా కవి ఆవిష్కరించారు. పద్యాలు 359, 360, 361, 362 లలో దేవతలు వార్ధిని దాటి, శ్వేతద్వీపం చేరుకున్న ప్రయాణం వర్ణించబడింది. 363లో వారిని విష్ణుదేవుడు చూచి, వారిని సగౌరవంగా ఎదురేగి తోడ్కొని రమ్మని గరుత్మంతుని పంపుతాడు (పద్యం 363). పద్యం 366 లో మళ్లీ దేశీ తరువోజ వృత్తంలో దేవతలు వైకుంఠపతి దివ్యదర్శనం పొందడాన్ని కవి వర్ణిస్తారు. పద్యం 367లో ఆ పరాత్పరుడైన శ్రీహరి మాహత్మ్య వర్ణన ఉంది. ఆయన ధాతకే తాత, అంటే బ్రహ్మకి తండ్రి. ‘తాత’ అంటే సంస్కృతంలో తండ్రి! జగముల త్రాత! అంటే రక్షకుడు.

(సశేషం)

Exit mobile version