[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
330. సీ.: కిన్నరులను దెచ్చి కినిసి గుర్రపుశాల దాణాను తినిపించె దైత్యుడకట! ఉరగ విభుల బట్టి శిరముల పైనున్న మణులను పెకలించి బాధపెట్టె గంధర్వగతమైన కమనీయ వీణలు లాగి పిశాచంబులకు నొసంగె సిద్ధుల ఖడ్గాలు చెలువొందు పాదుక లపహరించుచు వారి రాచె మిగుల తే.గీ.: అట్టహసము లొనరించి యఖిల లోక ములను చీకాకు పరిచెను మోదమునను అమిత బల గర్వ మదమున అసురవిభుడు ఘన విశృంఖల మద కరి యనగ నపుడు
331.
మ.కో.: యాగశాలల హోమకుండపు నగ్ని వేల్చెడు మంత్రముల్ భోగశీలు హిరణ్యకశ్యపు పుణ్యనామము చేరగన్ ఆగమంబుల మాని వేత్తలు అతడే తమ కర్తగా సాగుచుండిరి నిస్సహాయత శాస్త్రముల్ వికటించగాన్
332. వచనము: హవిస్సులు వ్రేల్చు సమయంబున ‘ఓం హిరణ్యకశిపవే స్వాహా’ యను మంత్రము మాత్రము ఉచ్చరింపవలెనని దైత్యపతి కఠినముగా నాదేశింప, యజ్ఞములన్నియు నాతని పేరుననే జరుపబడుచుండెను.
333. కం.: నేనే బ్రహ్మను విష్ణువు నేనే శివుడంచు నాదు నిర్ణయముననే నేనే జననము, స్థితియును నేనే లయమంచు తానె మించెను మిగులన్
334. తరువోజ: దినకరు పనిచెను తెరువరి వగుచు దితిసుత తతిగని తెలుపుము ఘనత కనిశశి ననియెను కరములు మిగుల కలిమిని యసురులు కలుగగ ముదము అనలుని పిలిచెను ననయము నసురు లను తన జవమున అతిశయులవగ ఘనశృతులను తన గణుతిని సతము కనుచును వినతుల కడుసిరులొలుక
335. వచనము: ఇట్లు సర్వప్రకృతిని తన యాజ్ఞాబద్ధను జేసి, దైత్యప్రభుడు చెలరేగుచుండె..
336. తే.గీ.: తానె యముడౌచు కర్మల దాల్చుచుండె తానె చలియును నుష్టంబు తానె వృష్టి నొనర చేయుచు పురుషార్థములను తనకు బానిసలు గాగ దైత్యుండు బలము చూపె
337. ఉ.: మేదిని, పర్వతంబులును, భీతిలి దిక్కులు నంబరంబునున్ కాదనలేక దీవులును, గర్వము బాసి సముద్రముల్, క్రియల్ మోదము తప్పి గాడ్పులును, బోరున నేడ్చుచు నగ్నులున్, మహా ఖేదము తోడ దైత్యవిభు కింకరులై చరియించె నక్కటా!
338. కం. ఇవ్విధి నసురేంద్రుండతి క్రొవ్వున పది వేల ఏండ్లు కుమతిని ఏలెన్ ఎవ్విధి వీని భరింతుము యవ్వారము శ్రుతిని మించెయని సురశ్రేష్ఠుల్
339. కం.: సురపతిని గూడి వెడలిరి సురగురు గర్తవ్యమడుగ, సురగురుడపుడున్ విరళమతి యానతిచ్చెను సురరిపు నాశంబు గలుగు సురుచిర విధమున్
340. సుగంధి: నీతి తప్పి రెచ్చిపోవు నీచులెల్ల తప్పకన్ నీతిమారి చచ్చిపోదు రేది భీతి మీకికన్ ధాత తోడ సిద్ధి బొంది దైత్యుడిట్లు చేయగన్ చేతగాదు మీకు వాని చేవ తోడ చంపగన్
341. ఉ.: చాలదు సామమా ఖలుని చంపగ, దానము చేయలేమికన్ చాలదు దండ మాతడు సుశౌర్య సమన్వితుడట్లు ఓడడే! చాలదు భేదమాతనికి సర్వులు భృత్యులు, సంధి చేయగన్ చాలరు ఎవ్వరున్, కనుక సార్థకముల్ అవి గావు చూడగన్
342. తే.గీ.: పురుషకారము మనకును పూన తగదు దైవ బలమది యొక్కటే తగును నిపుడు ఆరు శత్రువులందరు నతని గూడ పతనమది తధ్యమని పల్కె పరమ గురుడు
343. కం.: కామ క్రోధ మదాదులు. నేమము మీరంగ చెలగు నీ దుష్టాత్మున్ ఆ మాధవు దయ పొందుచు సమయింపగ వచ్చునదియ సాధ్యము మనకున్
344. ఉ.: సర్వము శ్రీహరే మనకు శాశ్వత సౌఖ్యప్రదాత, ధాతకున్ పూర్వుడు, కన్నతండ్రి, జగముల్ తన సత్కృప నిల్పు యాతనిన్ గర్వితుడైన దైత్యువధ కంకుర మర్పణ చేయ కోరగన్ ఖర్వము చేయు దుష్టుని యఖండ మదంబును తానె తప్పకన్
345. వచనము: “కావున మనమందరము వైకుంఠవాసుడైన విష్ణుని పాదపద్మంబుల నాశ్రయింతము. మన దుస్థితి యంతయు నా కేశవునకు విన్నవింతము. ఆయన చెప్పిన తెఱంగున నడచుకొందము” అని బృహస్పతి దివిజులకు ఎఱింగించెను. ఇట్లు దేవశ్రవుని వలన గాలవుండు సకలంబును తెలిసికొని సంతోషము పొందెను.
346. అంబురుహ వృత్తము: ఆవల నీవల నంతయు గాచెడి ఆర్తబంధు! పరాత్పరా! నీ వలనన్ సకలంబును నిల్చును నీవె దిక్కు, నిరంజనా! కావుము దేవతలందరి నీ దయ కార్యకారణహేతువై చావుయె లేని వరంబును బొందిన శత్రు దున్ముము మృత్యువై
347. కం.: నిర్జిత దుర్మతి వైరిని గర్జిత హర్యక్షు హరిని కరుణాపూర్ణున్ ఊర్జిత దివ్యయశోయుతు నిర్జర తతి గాచు ప్రభుని నిత్యము తలతున్
348. భుజంగ ప్రయాతము: మహానందమున్ తేలు మౌనుల్ తపింపన్ సహాయంబు చేయంగ సంప్రీతి తోడన్ మహామోహమున్ ద్రుంచి మాకీవు తోడై అహోరాత్రముల్ గాచి పాలించు శౌరీ
349. మ.కో.: దీనబాంధవ! ముక్తి సాధన! తీరుతెన్నులు చూపవే! గాన తన్మయ, జ్ఞాన పారమ, కర్మబంధము బాపవే మానసంబున నిన్ను నిల్పిన మా వెతల్ సమయింపవే ధ్యాన నిర్జిత! భక్త పోషణ! దారుణాఘము లార్పవే!
350. వసంత తిలకము: ప్రేమాను రాగ జిత పేశల! శ్రీనివాసా! నామంబు పల్కినను కాచెడు నట్టి దేవా! ఏమైనగాని నిను వీడను నిత్యసత్యా! రామా! నృసింహ! పరిపాలయ! రావె! బ్రోవన్
351. గద్యము: ఇది శ్రీ లక్ష్మీనృసింహశాస్త్రి పుత్ర, అహోబల నారసింహ కరుణాలబ్ధ పాండిత్య విబుధ జన విధేయ, దత్తశర్మ నామధేయ ప్రణీతంబైన ‘శ్రీలక్ష్మీనృసింహ మాహత్మ్యము’ నందు ద్వితీయాశ్వాసము. ~
ఈ భాగములో కావ్యములోని రెండవ ఆశ్వాసము పూర్తి అవుతుంది. దీనిలో కూడ హిరణ్యుని ఆగడాలు, ఎల్లలు లేని అహంకారాతిశయము, వర్ణించబడ్డాయి. పద్యం 330లో కిన్నరులను, నాగులను, గంధర్వులను, సిద్ధులను అతడు ఎలా పీడించాడో కవి వర్ణించారు. గొలుసులు తెంపుకుని జనం మీద పడిన మదపుటేనుగులా ఉన్నాడట అసురపతి. పద్యం 331లో యజ్ఞయాగాదులలో వ్రేల్చబడే హవిస్సులన్నీ, హిరణ్యుని పేరనే జరుగుతున్నాయి. వచనం 332లో మంత్రం కూడా అతని పేర మారింది! పద్యం 333 అతని అహంకారం పరాకాష్ఠకు చేరి తానే త్రిమూర్తులని, తానే జనన, స్థితి, లయములని విర్రవీగుతున్నాడు! పద్యం 334లో దేశీ ఛందస్సులోని తరువోజ వృత్తాన్ని వాడారు కవి. ఇది సర్వలఘు సహితమై, ప్రతి పాదానికి 30 అక్షరాలు, 3 యతిస్థానాలు కలిగి ఉంటుంది. పద్యం 337లో భూమి, పర్వతాలు, దిక్కలు, ఆకాశము, దీవులు, సముద్రాలు, క్రియలు, గాలులు. అగ్నులు సమస్తం, నిస్సహాయంగా దైత్యభృత్యులై పనిచేస్తున్నారని తెలిపారు. పద్యం 338లో ఇలా పది వేల సంవత్సరాలు ఆ దుర్మార్గుడు పరిపాలించాడు. 339, 340, 341 పద్యాలలో దేవతలు బృహసృతిని కలిసి తమ గోడు విన్నవింప, ఆయన, “వానిని సామదానభేదదండోపాయాలతో చంపడం మీ వల్ల కాదు. దైవబలమొక్కటే శరణ్యము” అని బోధిస్తాడు. పద్యం 344 లో మన రక్షకుడు శ్రీహరే కాబట్టి ఆయనను ఆశ్రయిద్దామని హితవు చెబుతాడు.
ఆశ్వాసము చివర కావ్య లక్షణాలకు అనుగుణంగా కవి విభిన్న ఛందస్సులైన అంబురుహ వృత్తము (353), భుజంగప్రయాతము (348), మత్తకోకిల (349) వసంతతిలకం (350) మొదలగు అరుదైన పద్యాలను, కృతిపతియైన నరసింహుని స్తుతిస్తూ వాడారు. ఆశ్వాసాంత గద్యం (351) లో తన వినయాన్ని చాటుకున్నారు కవి.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
You must be logged in to post a comment.
భాష – భవిత
తమసోమా జ్యోతిర్గమయ-2
మహా ప్రస్థానం
99 సెకన్ల కథ-38
వైకుంఠపాళి-1
దేశ విభజన విషవృక్షం-21
ఆకాశవాణి పరిమళాలు-20
క్షణం, క్షణం
పిజ్జా అమ్మాయికొక లేఖ
మాంటిస్సోరి విద్యావిధాన రూపశిల్పికి అభివందనం
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®