[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
ద్వితీయాశ్వాసము:
314.
వచనము:
సురగురు వర్యుండైన భార్గవుడు నిర్దేశించిన సుముహూర్తంబున దైత్యపతి రత్నపురీ మహానగరంబున ప్రవేశించెను. పిమ్మట
315.
ఉ.:
చేసిరి గొప్ప పండుగలు చేసిరి రాజ్యమహోత్సవంబులన్
వాసిని బొంది హేమకశిపాసురుడా పరమేష్ఠి సత్కృపన్
గాసిల జేసె లోకముల గర్వసమున్నతి విక్రమ ధృతిన్
ఆశలు క్రుంగె దేవతల కాయసురాగ్రణి పెంపు మీరగన్
316.
కం.
సమరములె వినోదంబుగ
నమితంబగు బలము తోడ నమరుల నెల్లన్
సమయింపగ ధీర పరా
క్రముడై చెలరేగె మిగుల రభసము తోడన్
317.
చం.:
గజములు, స్యందనంబులును, కాల్బలమున్ హయముల్, మహోగ్రమౌ
నిజ ఘన సైన్య వైభవము నిర్జర శ్రేణికి భీతి గూర్పగా
గజగజలాడి యెల్లరు కకావికలై వెస బారి పోవగా
విజిత సమస్త లోకుడయి వెల్గె హిరణ్యుడు దుర్నిరీక్ష్యుడై
318.
వచనము:
విస్తార భీకర సైన్య సమేతుడై స్వర్గ రాజధాని అమరావతీ నగరమును ముట్టడించిన ఆ బ్రహ్మవర గర్వితుండు
319.
సీ.:
వజ్రాయుధంబును స్వర్గాధినాథుండు
వదలగా దానిని బట్టి విరిచె
భయమున పరుగెత్తు బలహీను నింద్రుని
వెంబడించుచు వాని వేడ్కబట్టె
నగరమంతయు తిరిగి నవలామణుల జేరి
చెరబట్టె వారిని కరుణ మాని
దోచె రత్నసుమేరు దోర్బలంబున తాను
అమరవిభు విడిచె నాశ్రితుడుగ
తే.గీ.:
కామధేనువు బంధించి కల్పవృక్ష
మును ఐరావతంబును గొనెను బలిమి
పారిజాతము, సంతానవృక్షములను
తన పురానికి తరలించె ధాటి జూపి
320.
కం:
ఆగ్నేయంబున కధిపతి
అగ్నికి నిజ శిఖల నడచి హరియించె ప్రభన్
మగ్నుడుగా హవి భాగము
అగ్నికి లేకుండ జేసే నతి గర్వమునన్
321.
మహా స్రగ్ధర:
యమలోకాధీశు గెల్చెన్ అతి ఘన
సమరోత్సాహ స్ఫూర్తిన్
యమ సైన్యంబు వధించెన్ అతి భయ
గతులై వారు పారన్
యమవాహంబును కుమ్మెన్ అనితర
ఘన శృంగాలు ద్రుంచెన్
యమ పాశంబు నశింపన్ యముడధి
పతిగా నంతమొందన్
322.
తే.గీ.:
అసురుడగుచును అమరుల అండ జేరి
నైఋతికి రాజుగా నుండు నిరృతి నచట
ఘోర గద దునిమె మిక్కిలి క్రోధమునను
రాక్షసాధిపుడా దిక్కు రభస బట్టె
323.
చం.:
వరుణుని పైకి బోయి ఘన వారధు లందలి రత్నరాశులన్
అరయుచు దోచి, సర్వ జలచారులు, మత్య్య మహోరగంబులన్
వరమకరంబులన్ కమఠవ్రాతము హింసల పాలు చేయుచున్
తిరముగ పాశబద్ధత విధించెను దానవనాథు డెంతయున్
324.
కం.:
వాయవ్యాధిపు నడచెను
వాయువు, నిజవేగ చలిత ప్రాభవదక్షున్
నియమించెను బానిసగా
రయమును విడె గాలి గర్వరహితుండగుచున్
325.
ఉ.:
యక్షపతిన్ కుబేరుని యనంత పరాక్రమ స్ఫూర్తి గెల్చె తా
నక్షయమైనవౌ నిధుల, నవ్య విమానము దోచె బల్మినిన్
బిక్షము నెత్తువానిగ కుబేరుని యట్లొనరించె, మిత్రుడున్
భిక్షపతీశుడే గనుక, పెన్నిధి దక్కెను దైత్యనాథుకున్
326.
చం.:
వృషభము వాహనంబు, నెలవైనది కొండయు జీవనంబు యన్
మిష, తను బిచ్చమెత్తుకొను, సౌరులుయస్థులు, భూతి బూది, ఏ
విషయము చూచినన్ శివుడు పెద్ద బికారి, ఇతండు చూచినన్
విషధరుడెట్లు సాటియగు? వీనిని మాత్రముపేక్ష చేదగున్
327.
వచనము:
అని వైరాగ్య సంపదాధీశుడగు ఈశానుని మినహాయించె.
328.
మ.:
సహనంబన్నది లేక గర్వయుతుడై, సైరింపకే మాత్రమున్
మహితాద్రింబలె వార్ధులన్ గలచుచున్, బాధించు సూర్యున్, శశిన్
సహితంబైన బలోద్ధతిన్ గిరుల తా స్వాధీనముల్ గాగ, ఖే
మహి పాతాళ రసాతలంబుల దివిన్ పాలించె గర్వాంధుడై.
329.
కం.:
మునులను బలిమిని తెచ్చుచు
తన దాస్యము లోని దేవతా భామినులన్
అనువుగ పెండ్లిని చేసెను
తన మనమది పొంగ మునుల ధైర్యము క్రుంగన్
~
లఘువ్యాఖ్య:
ఈ భాగములో హిరణ్యకశిపుడు వరబల గర్వముతో చెలరేగి, లోకాలను పీడించడం వర్ణించబడింది. 314 వచనంలో – అతడు రత్నపురమహానగరంలో ఒక శుభ ముహూర్తాన ప్రవేశించాడని చెప్తారు కవి. పద్యం 316 అతనికి యుద్ధాలే వినోదాలయినాయని చెప్తుంది. పద్యం 317లో అతని సైన్య శక్తి దేవతలను ఎలా భయభ్రాంతులను చేసిందో కవి వర్ణించారు. పద్యం 319లో హిరణ్యడు, దేవతల స్త్రీలను చెరబట్టడం, వారి సంపదను దోచుకోవడం చేస్తాడు. పద్యం 320లో అగ్ని అహంకారాన్ని అణుస్తాడు హిరణ్యుడు. పద్యం 321లో యముని అధికారాలను కత్తిరించుతాడు. పద్యం 322లో, రాక్షసుడైనా దేవతల పంచన చేరిన నిరృతిని చంపుతాడు. పద్యం 323లో వరుణుని పాదాక్రాంతుని చేసుకుని సముద్రం లోని రత్నరాశులను దోచుకొని, అందులోని జలచరములనీ పీడిస్తాడు. పద్యం 324లో వాయవ్య దిక్కుకు అధిపతియైన వాయువు ప్రాభవాన్ని నియంత్రిస్తాడు. పద్యం 325 లో యక్షపతి ఐన కుబేరుని గెల్చి, బిక్షం ఎత్తుకునేలా చేస్తాడు. కుబేరుని మిత్రుడు శివుడు బిచ్చం ఎత్తుకున్న వాడే గదా! అని కవి చమత్కరిస్తారు. పద్యం 326 లో ఒక విశేషం ఉంది. వైరాగ్య సంపదకు అధీశ్వరుడైన ఈశానుని జోలికి రాక్షసపతి పోలేదట. ఎందుకంటే ఆయన పెద్ద బికారి కనుక. పద్యం 329లో హిరణ్యుని శాడిజం తారాస్థాయికి వెళ్లింది, మునులను పట్టి తెచ్చి, తన అధీనంలో ఉన్న దేవతా స్త్రీలతో వారికి బలవంతపు పెళ్లిళ్ళు చేస్తాడు. “పవర్ కరప్ట్స్ అండ్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ” అని జాన్ ఆక్టన్ ఊరికే అన్నారా?
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.