[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
254.
వచనము:
అట్లు దివిజపతి యానతిని గంధమాదన వనమును చేరుకున్న అప్సరోగణము తమ విధిని నిర్వర్తింపసాగిరి. ఆ కాననము ఎందరో మునులకు, యోగులకు, సిద్ధులకు నాలవాలము. ఆ దేవకాంతల సౌందర్యాతిశయమును వర్ణింప నెవరికైనను శక్యంబు కాదు. వారు..
255.
శా.: పూలన్ గోయు నెపంబునన్ దిరుగు పూబోండ్లు పూలంబలెన్ హేలన్, సుందర హస్త పల్లవములన్, ఇంపారు చిర్నవ్వులన్ కేళీకల్పిత నృత్యగాన విధులన్, క్రీడించుచున్, తుళ్లుచున్ ఆ లేమల్ వనశోభ బెంచిరి వసంతానందముల్ మిక్కిలిన్
256.
మ.కో.: వారి నవ్వులు వారి చేష్టలు వారి ముద్దుల మాటలున్ వారి యూర్పులు దివ్యగంధపు వాయువుల్ కమనీయముల్ వారి కౌనులనుండు భూషలు వారి సౌరుకు రక్షణల్ వారు రూపము దాల్చు చైత్రపు ప్రాతినిధ్యపు శోభలున్
257.
చం.: గదిసిరి దైత్యనాథుని వికల్పమనస్కుని చేయబూనుచున్ ముదమున నాటపాటలను పూల రథంబుల పోలి సల్పుచున్ సుదతులు పెక్కుభంగులను సోయగముల్ ప్రసరింప జేసి, పెం పొద వెడు రీతి, తాపసుని పూనిక భగ్నము చేయ రక్తులై
258.
సీ.: జక్కవలను బోలు చనుదోయి కదలంగ నొక కాంత కొంగ్రొత్త సోకు చూపే జఘన భాగం బది చక్కగా కనిపింప నొక లేమ సువిలాస వికసి యయ్యె చెలువంపు వదనాన చిరుచెమట గ్రమ్మంగ నొక భామ చెలరేగె ముగ్ధ గరిమ మందగమనము తోడ నందములు నడయాడ నొక యింతి రాయంచను కడు మించె తే.గీ.: పాదుకాంతులు మేదినిన్ పల్లవింప బాహుమూలపు కాంతులు పోహళింప మధుర కరతాళధ్వనులవి యధరములను పలుకు పాటల దరువులై చెలగెనచట
259
చం.: తడిసె మనోహరాంగి నిజపల్లవ గాత్రపు సోన కాననం బుడుపతి వెన్నెలన్ కురియు నోయన, శ్రావ్యత సందడింపగా నడిచె వసంత గీత నవమాధురి ఆయమ పాట పాడగా కడలి సుధాకరున్ గనిన కైవడి పొంగె నరణ్య శోభలున్
260.
తే.గీ.: ఇటుల సకలంబు లైన విశేష విధుల అప్సరాంగన లెల్లరు నతిశయింప వారి చేష్టల నణుమాత్రమైన సరకు చేయకుండగ నిలిచె నజేయుడగుచు
261.
ఇట్లు స్థిరమనస్కుడై అసురవిభుండు, ఎవ్విధి మనో వికారంబును బొందక, బ్రహ్మదేవుని యందు మనస్సును నిలిపి, తపస్సను హవిస్సును హృదయ హోమములో వ్రేల్చుచుండెను. అత్తఱి, ఆ దేవ విలాసినులిట్లు భావించిరి.
262.
కం.: జీవము లేని విధంబున ఏ విధి చలియింపకుండ నీ తాపసి తా నీవని రూపము గనిన త రువు పోలిక నిలిచె నిఖిల లోకము పొగడన్
263.
చం.: మన లయలన్నియున్ హొయలు పారవు ఈతని మ్రోల నెంతయున్ మనవగు నవ్వులున్ మధురమై సుధజిందెడు పల్కులన్నియున్ ఘన తప శీలియై తిరముగా నిలిచెన్ అతిలోక ధీరుడై యనుచును సిగ్గు జెందిరట యప్సర భామిను లెల్ల నా తరిన్
264.
కం.: గర్వము ఖర్వము నయ్యను సర్వము తమ దాసులనెడు శాస్త్రము ముగిసెన్ పూర్వము లేని విధంబున నిర్వేదము చూపె తపసు నిష్ఠ చెలంగన్
265.
అహంకారము నశించిన ఆ అమర కాంతలు, అనవత శిరస్కులై ఆ మహా తాపసి పాదములకు ప్రణమిల్లి, వెనుకకు మరలిరి.
~
254 నుండి దేవకాంతల లీలా విలాసాలు వర్ణించబడ్డాయి. పద్యం 255లో పూబోండ్లు పూల వలె తిరుగుతున్నారని అన్నారు కవి. పద్యం 256లో మత్తకోకిలా వృత్తములో వారి ప్రతి చర్య మనోహరమే నన్నారు! పద్యం 258లో వారు హిరణ్యకశిపుని తపస్సు భగ్నం చేయడానికి ఎంత సుందరంగా శ్రమించారు అన్నది కవి చెబుతున్నారు. వారి నాట్యాలు, పాటలు, అలా ఉన్నాయి. వచనం 261లో రాక్షసపతి స్థితప్రజ్ఞతను వివరించారు. 263-265 లో అప్సర కాంతల లయలు హొయలు అన్నీ వ్యర్థం కావడాన్ని వర్ణించారు కవి.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
You must be logged in to post a comment.
రామం భజే శ్యామలం-55
జ్ఞాపకాల పందిరి-120
తందనాలు-25
సూర్య భగవానుడు
వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-15
పల్నాటి వైభవం
నా దేశం
సంభాషణం: శ్రీ కస్తూరి మురళీకృష్ణతో ముఖాముఖి
జిజ్ఞాసువు – పద్య కవిత
అలనాటి అపురూపాలు- 180
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®