Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-17

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

ద్వితీయాశ్వాసము:

వసంత ఋతు శోభ

239.
ఉ.:
వారల గూడి యామనియు వచ్చెను తా శిశిరంబు ద్రోసి, ప
క్షీరవముల్ పదంపడిగ, క్రేంకృతులై శిఖిరాళి నిండగన్
సౌరభపూర్ణ పుష్పములు సౌఖ్యము గూర్చగ, స్వీయభూతి యే
పారగ, వృక్ష సంతతియు పచ్చని కాంతులు వెల్గ, దివ్యమై

240.
తే.గీ.:
సాగె దక్షిణమున నుండి చల్లగాలి
చైత్రమాసపు ప్రతినిధి చందమగుచు
వచ్చెను వసంతుడను వార్త నిచ్చె, వనము
విచ్చె కుసుమపు శోభల విశదమగుచు

241.
మ.కో.:
ఎండుటాకులు రాలిపోయెను ఎన్నొ మొగ్గలు తొడ్గగన్
పండె చెట్లవి లేత కొమ్మలు పారి జీవము నిండగన్
గుండె నిండుగ పాడు కోకిల గొంతు విప్పగ, పూపొదల్
మండిత ప్రసవంబులై తమ భాగ్యమున్ వెలయింపగా

242.
కం.:
మోదుగ మొగ్గల చెలువము
మోదముతో నెరుపు జిలుగు యున్నతి జూపన్
అది మరకతపు తివాచిని
వెదజల్లిన కెంపులట్లు వెలుగును జిమ్మెన్

243.
తే.గీ.:
క్రొత్త పూలైన సంపెంగ లత్తఱి తమ
మధుర నెత్తావులను వెలయు విధము చూడ
చిత్తజుండగు రతిపతి శ్రీకరముగ
కామపట్టంబు గట్టిన గతియ తోచె

244.
ఉ.:
ఆ వనమెల్ల మొగ్గలవి అందము చిందగ పూచి, దివ్యమై
జీవన సౌరభంబు వికసించగ, గాఢపు రాగముల్ సతుల్
ఆవహమంద మన్మథుడు ఆ వనమందున సంగ్రహించెనాన్
ఆ విరి తోటలున్ విరిసె నచ్చపు కోరిక లుప్పతిల్లగాన్

245.
తే.గీ.:
క్రొత్త చివురులు చవిగొన్న కోకిలమ్మ
చొక్కి, తన గొంతు సవరించి చూతమందు
తీయతీయని పాటల తేనెలూర
వనిని సంగీత గనినిగా వరల చేసె

246.
కం.:
సరసిని హంసలు నీదుచు
వరషట్పద భంభరములు వనమును నింపన్
సరసము లాడగ పొదలను
వరియించెను చక్రవాక పక్షుల జంటల్

247.
కం.:
విరజాజులలో మధువును
నరయుచు కడుపార త్రావి, నల్లని తేటుల్
చరియింపగ కాననమున
తరులను చీకటులు క్రమ్మె తామసకరులై

248.
ఉ.:
పూచెన శోకవృక్షములు పువ్వులు నిండిన బుట్టలోయనన్
ఏచెను తుమ్మెదల్ మిగులు నింపగు ఝుమ్మను నాద మెల్లెడన్
వేచిన చైత్రమెల్ల తన విస్తృత వైభవ దర్శనంబునన్
నోచిన భాగ్యమో యనగ నున్నతి బ్రకృతి జూపె, యామనిన్

249.
మ.కో.:
గాలి తాకిడి పూలు రాలుచు గట్టులన్ పడియుండగా
నేల తోచెను చంద్రకాంతపు నీలరత్నుల కాంతులన్
పూలశయ్యను బోలి ఏర్పడి మోదమున్ కలిగించగా
లీలమైథున క్రీడ గోరెడు లేత జవ్వని తీరునన్

250.
తే.గీ.:
గుబురు వృక్షాలు మేఘాల గుంపు యనగ
వాటి ఫల రసంబులు కారి వారిధార
లుగను శోభించి వర్షర్తు భోగమనగ
యచట కనిపించెను వసంత రుచిర శోభ

251.
కం.:
మత్తుగ పాడెడు కోకిల
లత్తఱి మన్మథుని మంత్ర మధుర ధ్వనులై
చిత్తుజు నాజ్ఞలనంగను
నెత్తావులు యూర్పులనగ నింపెను ఇంపున్

252.
తే.గీ.:
తుమ్మెదల బారు నారిగ ఝమ్మనంగ
పూలవిల్లుకు సంధించి పుష్పశరము
లెన్నొ పాంథుల హృదయాలు ఛిన్నమవగ
వేసె రతిరాజు వలరాజు వేడ్కతోడ

253.
కం.:
ఆమని రాత్రులు వెలిగెను
కోమలమగు కప్పురంబు గుప్పను రీతిన్
ఈ మహి నిండిన వెన్నెల
కాముని ప్రతినిధి యనంగ కనిపించె వనిన్

~

లఘువ్యాఖ్య:

ఈ భాగంలో కవి వసంత ఋతు శోభను మనోహరంగా వర్ణించారు. పద్యం 239లో శిశిరాన్ని త్రోసి, ఆమని వచ్చిందట.  పద్యం 241 లో మత్తకోకిలా వృత్తంలో ఆకులు రాలి కొమ్మలు చివురులు వేసి, కోకిలలు గొంతెత్తి నిండుగా పాడతాయి.  పూపొదలన్నీ పూలు పూసి వెలుగుతున్నాయి. పద్యం 242లో చక్కని ఊహ ఉంది. మోదుగ మొగ్గలు ఎర్రని కాంతులు వెలువడ జేయగా, పచ్చని పచ్చికపై అవి ఎలా ఉన్నాయంటే, మరకతపు (ఆకుపచ్చని) తివాచీపై వెదజల్లిన కెంపులలా ఉన్నాయట. చక్కని ఉత్ప్రేక్ష. పద్యం 245 లో కోకిల తన గొంతు సవరించి ‘వనిని సంగీత గని’గా వరల చేసింది. పద్యం 246 లో హంసలు సరస్సులలో ఈదుతున్నాయి. తుమ్మెదల ఝంకారాలు వనాన్ని నింపాయి. చక్రవాకాల జంటలు సరసాల కోసం పొదల్లో చేరాయి. 247లో నల్లని తుమ్మెదల వల్ల అడవిలో చీకట్లు కమ్మినట్లుందట. 248లో ‘చైత్రము తన విస్తృత వైభవ దర్శనంబునన్ నోచిన భాగ్యమోయనగ’ అంటారు కవి. 249లో పూలు రాలి గట్టు మీద దట్టంగా పడి, పూలపాన్పుల వలె ఉండగా, శృంగారాభిలాషియైన నవజవ్వని వలె ఉన్నాయట. 253లో కప్పురము (కర్పూరం) గుప్పుమన్న విధంగా వసంతరాత్రులలో వెన్నెల, భువి అంతా నిండి, మన్మథుని ప్రతినిధి ఏమో అన్నట్లు ప్రకాశించింది. ఇవన్నీ ఉత్ప్రేక్షలే. ప్రబంధ/కావ్య లక్షణాలలో ప్రకృతి/ఋతు వర్ణన ముఖ్యమైంది. దాన్ని కవి పాటించి, పండించారు.

(సశేషం)

Exit mobile version