[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
239. ఉ.: వారల గూడి యామనియు వచ్చెను తా శిశిరంబు ద్రోసి, ప క్షీరవముల్ పదంపడిగ, క్రేంకృతులై శిఖిరాళి నిండగన్ సౌరభపూర్ణ పుష్పములు సౌఖ్యము గూర్చగ, స్వీయభూతి యే పారగ, వృక్ష సంతతియు పచ్చని కాంతులు వెల్గ, దివ్యమై
240. తే.గీ.: సాగె దక్షిణమున నుండి చల్లగాలి చైత్రమాసపు ప్రతినిధి చందమగుచు వచ్చెను వసంతుడను వార్త నిచ్చె, వనము విచ్చె కుసుమపు శోభల విశదమగుచు
241. మ.కో.: ఎండుటాకులు రాలిపోయెను ఎన్నొ మొగ్గలు తొడ్గగన్ పండె చెట్లవి లేత కొమ్మలు పారి జీవము నిండగన్ గుండె నిండుగ పాడు కోకిల గొంతు విప్పగ, పూపొదల్ మండిత ప్రసవంబులై తమ భాగ్యమున్ వెలయింపగా
242. కం.: మోదుగ మొగ్గల చెలువము మోదముతో నెరుపు జిలుగు యున్నతి జూపన్ అది మరకతపు తివాచిని వెదజల్లిన కెంపులట్లు వెలుగును జిమ్మెన్
243. తే.గీ.: క్రొత్త పూలైన సంపెంగ లత్తఱి తమ మధుర నెత్తావులను వెలయు విధము చూడ చిత్తజుండగు రతిపతి శ్రీకరముగ కామపట్టంబు గట్టిన గతియ తోచె
244. ఉ.: ఆ వనమెల్ల మొగ్గలవి అందము చిందగ పూచి, దివ్యమై జీవన సౌరభంబు వికసించగ, గాఢపు రాగముల్ సతుల్ ఆవహమంద మన్మథుడు ఆ వనమందున సంగ్రహించెనాన్ ఆ విరి తోటలున్ విరిసె నచ్చపు కోరిక లుప్పతిల్లగాన్
245. తే.గీ.: క్రొత్త చివురులు చవిగొన్న కోకిలమ్మ చొక్కి, తన గొంతు సవరించి చూతమందు తీయతీయని పాటల తేనెలూర వనిని సంగీత గనినిగా వరల చేసె
246. కం.: సరసిని హంసలు నీదుచు వరషట్పద భంభరములు వనమును నింపన్ సరసము లాడగ పొదలను వరియించెను చక్రవాక పక్షుల జంటల్
247. కం.: విరజాజులలో మధువును నరయుచు కడుపార త్రావి, నల్లని తేటుల్ చరియింపగ కాననమున తరులను చీకటులు క్రమ్మె తామసకరులై
248. ఉ.: పూచెన శోకవృక్షములు పువ్వులు నిండిన బుట్టలోయనన్ ఏచెను తుమ్మెదల్ మిగులు నింపగు ఝుమ్మను నాద మెల్లెడన్ వేచిన చైత్రమెల్ల తన విస్తృత వైభవ దర్శనంబునన్ నోచిన భాగ్యమో యనగ నున్నతి బ్రకృతి జూపె, యామనిన్
249. మ.కో.: గాలి తాకిడి పూలు రాలుచు గట్టులన్ పడియుండగా నేల తోచెను చంద్రకాంతపు నీలరత్నుల కాంతులన్ పూలశయ్యను బోలి ఏర్పడి మోదమున్ కలిగించగా లీలమైథున క్రీడ గోరెడు లేత జవ్వని తీరునన్
250. తే.గీ.: గుబురు వృక్షాలు మేఘాల గుంపు యనగ వాటి ఫల రసంబులు కారి వారిధార లుగను శోభించి వర్షర్తు భోగమనగ యచట కనిపించెను వసంత రుచిర శోభ
251. కం.: మత్తుగ పాడెడు కోకిల లత్తఱి మన్మథుని మంత్ర మధుర ధ్వనులై చిత్తుజు నాజ్ఞలనంగను నెత్తావులు యూర్పులనగ నింపెను ఇంపున్
252. తే.గీ.: తుమ్మెదల బారు నారిగ ఝమ్మనంగ పూలవిల్లుకు సంధించి పుష్పశరము లెన్నొ పాంథుల హృదయాలు ఛిన్నమవగ వేసె రతిరాజు వలరాజు వేడ్కతోడ
253. కం.: ఆమని రాత్రులు వెలిగెను కోమలమగు కప్పురంబు గుప్పను రీతిన్ ఈ మహి నిండిన వెన్నెల కాముని ప్రతినిధి యనంగ కనిపించె వనిన్
~
ఈ భాగంలో కవి వసంత ఋతు శోభను మనోహరంగా వర్ణించారు. పద్యం 239లో శిశిరాన్ని త్రోసి, ఆమని వచ్చిందట. పద్యం 241 లో మత్తకోకిలా వృత్తంలో ఆకులు రాలి కొమ్మలు చివురులు వేసి, కోకిలలు గొంతెత్తి నిండుగా పాడతాయి. పూపొదలన్నీ పూలు పూసి వెలుగుతున్నాయి. పద్యం 242లో చక్కని ఊహ ఉంది. మోదుగ మొగ్గలు ఎర్రని కాంతులు వెలువడ జేయగా, పచ్చని పచ్చికపై అవి ఎలా ఉన్నాయంటే, మరకతపు (ఆకుపచ్చని) తివాచీపై వెదజల్లిన కెంపులలా ఉన్నాయట. చక్కని ఉత్ప్రేక్ష. పద్యం 245 లో కోకిల తన గొంతు సవరించి ‘వనిని సంగీత గని’గా వరల చేసింది. పద్యం 246 లో హంసలు సరస్సులలో ఈదుతున్నాయి. తుమ్మెదల ఝంకారాలు వనాన్ని నింపాయి. చక్రవాకాల జంటలు సరసాల కోసం పొదల్లో చేరాయి. 247లో నల్లని తుమ్మెదల వల్ల అడవిలో చీకట్లు కమ్మినట్లుందట. 248లో ‘చైత్రము తన విస్తృత వైభవ దర్శనంబునన్ నోచిన భాగ్యమోయనగ’ అంటారు కవి. 249లో పూలు రాలి గట్టు మీద దట్టంగా పడి, పూలపాన్పుల వలె ఉండగా, శృంగారాభిలాషియైన నవజవ్వని వలె ఉన్నాయట. 253లో కప్పురము (కర్పూరం) గుప్పుమన్న విధంగా వసంతరాత్రులలో వెన్నెల, భువి అంతా నిండి, మన్మథుని ప్రతినిధి ఏమో అన్నట్లు ప్రకాశించింది. ఇవన్నీ ఉత్ప్రేక్షలే. ప్రబంధ/కావ్య లక్షణాలలో ప్రకృతి/ఋతు వర్ణన ముఖ్యమైంది. దాన్ని కవి పాటించి, పండించారు.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.
You must be logged in to post a comment.
‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -26
హైదరాబాదులో ఉగాది కవిసమ్మేళనంలో పాలమూరు జిల్లా కవులు – వార్త
అన్న!
ప్రేమించే మనసా… ద్వేషించకే!-23
బతుకు తెరువు సంక్షోభంలో బతుకులు
‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-32 – ఫైలీ హుయీ హై సపనోం కీ బాహే
కొరియానం – A Journey Through Korean Cinema – ప్రకటన
సామెత కథల ఆమెత-32
సరికొత్త అనువాద ధారావాహిక ఆరంభం…. అతి త్వరలో!!!!!
అసూయ
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *👏👏 Keep moving the story..*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Best wishes to you & your friends and supporters..🙌*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: * Your episodes are going very nice .👍*
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *Your story is moving consistently. keep it up 👍.*
ఇది జబీనా గారి స్పందన: * Prasuna ne vidyardi jivetam gurtu pettukoni yenta baga rasavamma 👌👏 *
All rights reserved - Sanchika®