[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]
నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.
***
ద్వితీయాశ్వాసము:
206.
మ.:
ఘన దైత్యుండు వహించె ఘోర తపమున్ కామ్యార్థియై, బ్రహ్మదే
వుని ప్రత్యక్షము గోరి, దాని కతనన్ పొంగెన్ మహా వార్ధులున్
విను భూ స్వర్గము లెల్ల కంపితములై వేగెన్, మమ్ము కాపాడుమా!
మన సద్గౌరవ కీర్తులీ పగిది భగ్నం బౌను దేవర్షిరో!
207.
కం.
మన సురలకు రాక్షసులకు
జనకుడు ఒకడే యటంచు, జననులు వేరున్
తనకును సురవర గౌరవ
మును పూజ్యత గోరు యసుర ముఖ్యుడసూయన్
208.
తే.గీ.:
తనిసి పరమేష్ఠి యాతని తపము చేత
దివ్య వరముల నొసగిన, తిరుగులేక
దివిజ రాజ్యము నోడించు, తేజమునను
మమ్ము గాసిల చేయును మౌనివర్య!
209.
ఉ.:
నీవును మాకునన్నియు, వినీతులమై నిను వేడగా, దయా
ప్లావిత మానసంబునను ఆపదలెన్నియో గాచినావు, మా
భావికి నీవె దిక్కు, గురుపావన! యోగ తపో విరాజితా!
కావున దైత్యు చర్యకు వికర్షక మార్గము చూపి బ్రోవవే!
210.
వచనము:
అని వినయ భూషణుడై వేడ, సురాచార్యుండు మందహాసము చేసి, ఇంద్రునితో నిట్లు పలికె.
211.
కం.:
భయమేల నీకు సురపతి?
నయముగ దేవేంద్ర పదవి నారాయణుడే
ఈయగ, నీకది లేదని
నియమంబును మీర బ్రహ్మ మెచ్చునె జగముల్?
212.
వచనము:
మరియును, నీవు పరమాత్మయైన శ్రీమన్నారాయణుని ఆశ్రయించి ఉన్నావు. ఆ పరాత్పరుండు,
213.
మ.కో.:
ఆది అంతము లేని దేవుడు ఆత్మరూపుడు శౌరియే
వేదవేద్యుడు బ్రహ్మకైనను విశ్వపూజ్యుడు విష్ణుడే
ఆదిలక్ష్మికి ప్రాణనాథుడు అంబుజాక్షుడు శ్రీహరిన్
పాదపద్మము లాశ్రయించితి ప్రాపు నీకవె నిత్యమున్
214.
సీ.:
సతతంబు మాధవ సంస్తుతి చేయుచు
పారవశ్యంబున బరగువారి
నిరతంబు కేశవ వరనామమును ధ్యాన
మొనరించుచును ధన్యులైన వారి
అనిశంబు గోవింద పాదారవిందాల
మనమును నిగిడించి మనెడు వారి
అనయంబు శ్రీధరు నాత్మలో నిలుపుచు
జ్ఞాన యోగముచేత గనెడువారి
తే.గీ.:
సర్వ దుఃఖాలు దరిచేర సాధ్యమగునె?
దైన్యమది గుల్గునే మది, దైత్యరిపుడ?
ఘోర దుర్దశ తొలగించు హరిని దలప
సర్వశుభములు గల్గు నఖర్వము గను
215.
మ.:
తను నెబ్భంగి తలంతురో జనులటుల్ తానట్లు భావించుచున్
ఘనవిస్తార కృపాకటాక్షములతో గాపాడు వారి నేవేళలన్
తనువున్ మానస మెల్ల నాతని పయిన్ ధ్యానంబు గావించినన్
చనవే శీఘ్రమె ఎల్ల యాపదలు నా చంద్రాక్షు సేవించినన్
216.
కవిరాజ విరాజితము.:
హరి తపమే తపమాతని నామమె
అంచిత పుణ్య సుహర్షమగున్
హరియను రెండు మహాక్షరముల్ మన
హానిని ద్రుంచు నిరంతరమున్
హరి జపమే జపమాతని ధ్యానము
ఆశ్రిత ధామము అందరికిన్
వర భవ బంధపు వార్ధిని దాటుట
మాధవ సేవతొ ప్రాప్తియగున్
217.
కం.:
పాపపు జీకటి బాపెడు
దీపము, దురితాటవులకు తీవ్రాగ్ని, మహా
కోపిత యురగ తతులకును
రూపిత యముడైన ఖగవ రుండును వినుమా!
218.
చం.:
పవనుడు, కిల్బిషంబులుగ పట్టిన యంబర మేఘ రాశికిన్
అవిరళ కాలకూట దురితాళికి నీశుడు, మోహశైలమున్
చివరకు ద్రుంచు వజ్ర గతి, శ్రీకరుడా కరుణాలవాలు, డా
భవహరు నామమే యొసగు భావిత కామము దేవశేఖరా!
219.
తే.గీ.:
వేద వేదాంగములు చాల, మదిని, మిగుల
మథన మొనరించి సంవాద మార్గములను
యోగివర్యులు గ్రహియించి భోగిశయను
సర్వ పరమార్థ సాధక వరము యనిరి.
220.
కం.:
నారాయణ మంత్రంబును
సురపతి కుపదేశమిచ్చె సురగురుడపుడున్
నిరతము నియతాత్ముడవై
హరి ధ్యానము చేయు మీవు అతడె గాచున్
221.
వచనము:
“ఇమ్మహా మంత్రంబు మహత్తర ప్రభావవంతము. అసమాన శక్తిదాయి. బ్రహ్మాది సకల దేవతలును దీని పరమార్థము నెఱిగినవారు. కావున దీనిని స్వీకరించి ధన్యుడవు గమ్ము” అని బృహస్పతి గురూత్తముండు వృత్రాసుర విరోధికి తెలిపెను. మరియును..
222.
ఉ.:
దానవ వైభవం బది చిరంబున నిల్చునె స్వర్గ నాయకా?
పూనిక మాధవున్ ఘన విమూఢ విమూహపు మత్సరంబునన్
తానటు శత్రుభావమున తల్చిన యున్నతి గల్గ నేర్చునే
మాననిదౌ స్వభావమది మానునె విష్ణుని ద్వేషమెమ్మెయిన్
223.
కం.:
కావున నిర్భయుడవుగా
నీవును తగ హేమ కశిపు నిష్ఠను చెరుపన్
కావింపు వివిధ యత్నము
లే విధి యసురుండు తపము వీడెడు విధముల్
224.
ఆ.వె.:
అనిన గురుని మాట కానందమును బొంది
గురుని పాదములను శిరసునుంచి
వీడుకోలు నంది వేడ్క జనె నింద్రుండు
స్వర్గపురికి మిగుల సాంత్వనమున
~
లఘువ్యాఖ్య:
పద్యం 206 లో ఇంద్రుడు, “దేవతలకు రాక్షసులకు తండ్రి ఒకడే గాని తల్లలు వేరు కాబట్టి స్వర్గాధిపత్యం కోరుతున్నాడు హిరణ్యుడు” అని వాపోతాడు. అప్పుడు దేవగురువు అతనికి ధైర్యం చెబుతాడు. 211 నుండి 221 వరకు నారాయణుని దివ్య మాహాత్మ్యాన్ని వర్ణిస్తాడు బృహస్పతి. పద్యం 213 లో కవి మత్తకోకిలా వృత్తాన్ని రాశారు. నారాయణుడు ఆద్యంతములు లేనివాడు, వేదవేద్యుడు. 214లో మహావిష్ణువును ఆరాధించేవారికి దుఃఖాలు తొలగుతాయి. దైన్యం వీడిపోతుందని అన్నారు. పద్యం 216లో ‘కవిరాజ విరాజితము’ అనే విభిన్న ఛందస్సును కవి ప్రయోగించారు. అది ఎంతో లయాన్వితం. హరి జపం, హరి తపం, హరి నామం, హరి ధ్యానం ఎంత గొప్పవో చెబుతారు. కంద పద్యం 217 లో ఒకేసారి మూడు రూపకాలంకారాలున్నాయి. పద్యం 220 లో మహామహిమాన్వితమైన శ్రీమన్నారాయణ మంత్రాన్ని బృహస్పతి దేవేంద్రునికి ఉపదేశిస్తాడు. పద్యం 221లో దాని ప్రభావాన్ని వివరిస్తాడు. ఇంద్రుడు నిర్భయుడై గురువుకు వందనం చేసి వెళ్లిపోతాడు (పద్యం 224).
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.