Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము-14

[శ్రీ పాణ్యం దత్తశర్మ గారి పద్య కావ్యం ‘శ్రీ లక్ష్మీనృసింహ మాహాత్మ్యము’ పాఠకులకు అందిస్తున్నాము.]

నా ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీనరసింహుని మహత్తును వస్తువుగా తీసికొని, పూర్తి కావ్య లక్షణాలతో ఈ పద్య కావ్యము అందిస్తున్నాను.

***

ద్వితీయాశ్వాసము:

హిరణ్యకశిపుండు తపస్సుచేయుట

192.
వచనము:
“అమరుల జనని కంటే నా తల్లి పెద్దది. కాబట్టి త్రిలోకాధిపత్యము, స్వర్గ భోగములు నాకు అనుభవ యోగ్యంబులు గాని, వారికెట్లగు?
కావున, అస్మదీయ దేశికుండైన శుక్రాచార్యా దేశంబున, ఘోరతపంబు జేసి, పరమేష్ఠి దివ్య వరముల బడసి, దేవతలనందరి నిర్జించి, ఎల్ల భువనంబులు పరిపాలించెద” అని వితర్కించిన దైత్యప్రభుండు

193.
మ.:
తపమే ఈయగ జాలు నింద్రపదమున్ తద్భోగ సంపత్తియున్
తపమే కేవల సప్తమౌని పదమున్ తానిచ్చు, ధన్యంబుగన్
తపమే సాధన మెల్ల కామములకున్ ధర్మంబుకున్, కావునన్
తపమున్ జేసెద సృష్టికర్త మదిలో ధ్యానించి, ఏకాగ్రతన్

194.
కం.:
మెచ్చించెద వాణీపతి
నచ్చిన వరములను బడసి మరలెద, జగముల్
అచ్చెరువు నొంది జూడగ
మచ్చరమున సురలు గ్రాల, మహితార్థుడనై

195.
చం.:
అని చనె గంధమాదన వరాద్రికి భీకర కాననోర్వికిన్
తన వర భూషలన్ విడిచి, తాపసి వేషము దాల్చె, శాంతుడై
ఘనజట వల్కలాజిన ప్రకార విలక్షణ శోభితుండునై
మనమున బ్రహ్మ నిల్పి, గుణవర్జితుడై, స్థిరచిత్తుడై, వెసన్

196.
సీ.:
నలుదిక్కులను అగ్ని కీలలు జ్వలింపంగ
మునివేలిపై నటుల మేను నిలిపె
దినకరుపై దృష్టి తేకువతో బెట్టి
ఏకాగ్రతా స్ఫూర్తి వికసనమున
వడి వేడిగాలుల బడ నిప్పురవ్వలు
ఏ మాత్రమును జంకక మితమైన
నిశ్చలత్వము మేన నెఱి మనమునన్ గూడ
ధ్యానయోగము నందు దనరుచుండె
తే.గీ.:
ఉరు తరంబగు నుల్కలు ఊడిపడిన
విడిచి దేహభిమానంబు విహితమతిని
పరమ తపమును సల్పెను ఘోరగతిని
హేమకశిపుడు, దితిసుతుడ హీన యశుడు

197.
దత్తగీతి:
వానలవి మేనునను వారి గురిపింపన్
దానవుని తాపమున తాను జలమింకెన్
మానక వియత్తలము వర్షగతి బెంపన్
మాన ధనుడైన దితి పట్టి తగ నిలిచెన్

198.
కం.:
స్థిర పద్మాసనమందున
విరహిత విషయ ప్రపంచ విశృతుడు నగుచున్
సురవైరి నిలిచి యుండగ
కురిసెను ఘన కుంభవృష్టి, క్రోధము తోడన్

199.
వచనము:
అయినను అణుమాత్రము చలింపక, దానవేశ్వరుండు తన తపస్సును కొనసాగించుచుండె.

200.
తే.గీ.:
నీటిధారలు తెరలుగా ధాటి జుట్ట
మేఘగర్జంబు లవి లోక భీకరముగ
వాటి రాపిడి మెరుపులు భాసురిల్ల
నిశ్చలాత్ముడు దైత్యుడు నిలిచెనచట

201.
శా.:
హేమంతంబది వచ్చి శీతలము తా హేలన్ భువిన్ నిండగన్
సామంతంబుగ చల్లగాలులవి విస్తారంబుగా వీచగాన్
ఏ మాత్రంబు సహించరాని చలితో నిండన్ తను వ్రాతముల్
ఏ మాత్రంబు చలించుకుండ నిలిచెన్, ఏ రీతి సైరించెనో?

202.
తే.గీ.:
అచట నున్న సరసి నందలి కలువలు
అసురనాథు తపము నమిత శ్రద్ధ
చూచుచున్న విధము తోచగ, వికసించి
విచ్చినట్టి కనులతో వేడ్క దనరె

203.
కం:
గాలిని ఆహారముగా
తేలికయైనట్టి తూండ్ల, తీసిన వేర్లన్
జలమును గైకొని నిలిచెను
విలసితుడై ఎల్ల జనులు విస్మయమందన్

204.
చం.:
గడచెను ఏండ్లు పూండ్లు, నురగంబులు చేరెను చుట్టు పుట్టలన్
విడిచెను దేహ భావమును ప్రీతుడుగాగ హిరణ్యగర్భుడున్
పొడిచెను శల్యముల్ తనువు, పూనిక తప్పక దైత్య భర్త, తా
నిడుముల లెక్కచేయక, సునిష్ఠను వీడక నిల్చె, ధీరతన్.

205.
వచనము:
ఇట్లు ఘోర తపమాచరించుచున్న హిరణ్యకశిపుంగని, సురనాథుండైన సహస్రాక్షుండు, నెంతయు భయంబు నొంది, తన స్వర్గాధిపత్యమునకు నెగ్గు దలంచి, సురగురుడైన బృహస్పతి కడకు జని, నమస్కరించి ఇట్లు పలికెను.
~

లఘువ్యాఖ్య:

ఈ భాగములో హిరణ్యుడు ఘోరతపస్సు బ్రహ్మను గురించి చేయడం కవి వర్ణిస్తారు. వచనం 192లో తన తల్లి దితి, దేవతల తల్లి అదితి కంటే పెద్దది కాబట్టి, త్రిలోకాధిపత్యం తనకే రావాలని ‘తర్కం’ ఉంది. పద్యం 193లో తపస్సు యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పారు కవి. పద్యం 195 లో తాపసి రూపంలోని రాక్షసపతిని వర్ణిస్తారు. పెద్ద జడలు, నారచీరలు మొదలగునవి ధరిస్తాడు. పద్యం 196 లో దారుణ తపస్సు వర్ణన ఉంది. అందులో నాలుగవ పాదంలో తపస్సు యొక్క పరిపూర్ణత సూచించబడింది. “నిశ్చలత్వము మేన నెఱి మనమునన్ గూడ ధ్యానయోగము నందు దనరుచుండె”. పద్యం 197లో కవి సృష్టించిన స్వీయ ఛందస్సు ‘దత్తగీతి’ ఉంది. వర్షం కురిసినా అది దానవుని తపోష్ణం వల్ల ఇంకిపోయిందట. ఋతువులు మారుతున్నా ఈ తపస్సు ఆగడం లేదు. హేమంతం వచ్చింది (పద్యం 201). పద్యం 202 లో అక్కడ సరస్సు లోని కలువలు రాక్షసరాజు తపస్సును అమిత శ్రద్ధతో చూస్తున్నాయోమో అన్నట్లు, వికసించి, విచ్చిన కనులతో చూస్తున్నాయట. ఇది చక్కని ఉత్ప్రేక్ష! పద్యం 204లో హిరణ్యుడు కృశించడం, శరీరం శల్యావశిష్టం కావడం, శరీరం చుట్టూ పుట్టలు ఏర్పడి వాటిల్లో పాములు చేరటం. దేహం అనే భావాన్ని విడనాడి దైత్యుడు నిష్ఠతో, ధీరత్వముతో నిలిచాడు. వచనం 205 లో అతని ఘోర తపస్సు తన సింహాసనానికి ఎసరు పెడుతుందని భయపడి ఇంద్రుడు దేవ గురువైన బృహసృతి వద్దకు వెళ్లి తన గోడు వినిపించబోతాడు.

(సశేషం)

Exit mobile version