Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ కృష్ణలీలాతత్త్వము

[16 ఆగస్టు 2025న కృష్ణాష్టమి సందర్భంగా ‘శ్రీ కృష్ణలీలాతత్త్వము’ అనే రచనని అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]

“పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతామ్!
ధర్మసంస్థాపనర్థాయ సంభవామి యుగేయుగే!!”

దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం పరమాత్మ ప్రతి యుగంలో అవతరిస్తాడు. ద్వాపరయుగంలో మహావిష్ణువు శ్రీకృష్ణునిగా అవతరించాడు. శ్రీకృష్ణుని లీలలు గురించి, పుట్టుకను గురించి భాగవతంలో చెప్పబడింది. భారతంలో శ్రీకృష్ణుని గురించి ఉన్నప్పటికీ భాగవతము కృష్ణ భక్తి తత్వాన్ని గురించి విపులముగా చెప్పింది.

లలిత స్కంధము కృష్ణ మూలము శుకాలాపాభి రామంబు మం
జు లతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరో
జ్జ్వలవృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్వ్దిజశ్రేయమై!

అని భాగవతాన్ని కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష సమానంగా వర్ణించారు పండితులు. భాగవత పఠనము జీవుని తరింపజేసే మహత్తర కావ్యరాజము. భాగవతం, భాగవతం అన్నా బాగుపడతారని లోకోక్తి. భాగవతంలో పరమాత్మ జననమే ఒక అద్భుతము.

యాదవ రాజైన వసుదేవునకు దేవకికి వివాహం జరిగిన తరువాత కంసుడు సోదరిని, బావమరిదిని రాజ్యానికి తీసుకొని వెళ్లు సమయంలో దేవకి అష్టమగర్భమున జన్మించిన శిశువు కంసుని సంహరించునను ఆకాశవాణి పలుకులను విన్న కంసుడు సోదరి అష్టమగర్భం తన మరణానికి కారణమవుతుందన్న క్రోధంతో సోదరిని, బావమరిది చెరసాలలో బంధిస్తాడు. అందువలన శ్రీకృష్ణ జననం చెరసాలలో జరిగింది. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు శ్రావణమాసం బహుళ అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో ఎనిమిదవ అవతారంగా జన్మించాడు. కృష్ణుడి జన్మిస్తూనే దేవకీవసుదేవులకి చతుర్భుజుడిగా కనిపించాడు. దేవకీ వసుదేవులు ఆ అర్థరాత్రి సమయమున

సుతుగనె దేవకి నడురే
యతి శుభగతి దారలును గ్రహంబులు నుండన్
దితిసుత నిరాకరిష్ణున్
శ్రిత వదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్!

అందాలుచిందు పుత్రుని కన్నులారా దర్శించెను. వీరిరువురు పూర్వజన్మలో వసుదేవుడు సుతపుడను ప్రజాపతి దేవకి ఆతని ఇల్లాలు పృశ్ని. వీరు మహావిష్ణువుని గురించి తపస్సు చేసి పరమాత్మ తమకు జనియించునట్లుగా వరాన్ని పొందారు. అందువలన దేవకి జన్మనిచ్చిందే కానీ వాని ఆటపాటలు, ముద్దుముచ్చటలు చూడలేకపోయింది. యశోదాదేవి ఆ ఆనందాలన్నింటిని అనుభవించింది. వసుదేవుడు కంసునికి భయపడి దేవకి అష్టమగర్భాన జన్మించిన పరమాత్మను వ్రేపల్లెలోని యశోదానందుల వద్దకు చేరుస్తాడు.

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం! దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం!! అని ఆ పరమాత్మను ప్రార్థిస్తారు. లేకలేక జన్మించిన యశోదా నందుల పుత్రుని చూడటానికి గోపికలందరూ బయలుదేరి వస్తారు.

ఏమి నోము ఫలమో
ఇంత పొద్దొక వార్త వింటి మబల లారా
మన యశోద చిన్ని మగవాని
కనెనట చూచివత్తమమ్మ సుదతులారా!
అని సందడి చేస్తూ ఆ పరమాత్మను దర్శించిన గోపికల భాగ్యమే భాగ్యము కదా. భాగవత మందలి కృష్ణుని బాల్య క్రీడలన్నీ శ్రీకృష్ణ లీలలుగా ప్రసిద్ధమైనవి.

యోగమాయ పలుకులను స్పురణకు తెచ్చుకున్న కంసుడు పసిబాలురలునందరినీ అంతము చేయటానికి నలుదిక్కులకు రాక్షసులను పంపిస్తాడు. అలా పంపగా వచ్చిన వారిలో పూతన ఒకతి. పసి బాలుడైన కృష్ణునికి పాలివ్వ వచ్చి విషమిచ్చి చంపటానికి ప్రయత్నించినప్పటికీ దానికి కూడా మోక్షమిచ్చాడు పరమాత్మ. ఈ విధంగా అఘాసురుడను సర్పమును, తృణావర్తుడనువానిని, దావాగ్నిగా వచ్చిన రాక్షసుడు మొదలుగాగల రాక్షసులందరికీ మోక్షమిచ్చినాడు. బలరాముడు వచ్చి కృష్ణుడు మన్ను తిన్నాడని యశోదకు చెప్పగా నోరు తెరవమని దండించబోగా నోరు తెరిచి తల్లికి 14 భువన బాండములను చూపినాడు.చివర కామె

“కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్ధమో! యశోదా దేవి గానో” అని తనను తాను అనుమానించుకున్నది. కానీ అది క్షణకాలము మాత్రమే విష్ణు మాయ తొలగగానే మరలా పూర్వపు స్థితిని పొందింది. కాళీయుని గర్వ మణచుట, గోవర్ధనోధ్ధరణము కావించి ఇంద్రుని అహంకారంను త్రుంచి వేయుట వ్రేపల్లెలోగల గోపాలకులందరి ఇళ్ళలో తానే నర్తించుట మొదలుగాగల ఎన్నో లీలలు భాగవతంలో మనకు కనిపిస్తాయి. గోపికలందరూ ఆ వచ్చినది పరమాత్మే అని సంభావించుసరికి వారికి వారి మాయతొలగి సామాన్య బాలకుడన్న భ్రాంతిని కలిగించును. గోపికలతో చేసిన రాసలీలలను జీవాత్మ పరమాత్మ లీలలుగా వర్ణించి చెబుతారు. భాగవతంలో “శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం! అర్చన వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం!” అని నవవిధభక్తి మార్గములు చెప్పబడినవి. ఈ తొమ్మిది మార్గములలో ఏ భక్తి మార్గం ద్వారా ఎవరైనా పరమాత్మను సేవించి తరించునట్లుగా భాగవతంలో చెప్పబడింది. దధి భాండము వికలము చేసిన కుమారుని కవ్వపుత్రాటితో కట్టి వేయడానికి యశోద ప్రయత్నించును. కానీ ఆతడు పరమాత్మకదా అందుకే

చిక్కడు వ్రతముల క్రతువుల
జిక్కడు దానముల శౌచశీలతనములం
జిక్కడు యుక్తిని భక్తిని
జిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధముసుండీ!

ఎవ్వరికీ చిక్కని శ్రీకృష్ణుడు యశోద వాత్సల్యమునకు దొరికి బందీకృతుడయినాడు. పరమాత్మను భక్తితో సేవించినచో ముక్తిని పొందవచ్చు.

శ్రీకృష్ణుని బాల్య లీలలు అనంతము. లీలాశుకుడు శ్రీకృష్ణలీలా తరంగణిలో

దేవకీతనయపూతః పూతనారి చరణోదః ధౌతః
యద్యహం స్మృత ధనజ్ఞయ సూతః కింకరిష్యతి యమదూతః

పూతనను చంపిన వాని పాద జలముతో స్నానం చేసిన వారిని, అర్జునుని రథసారధిని స్మరించు వానిని అయిన నన్ను యమదూతలు ఏమి చేయగలరు అని పలికెను. శ్రీకృష్ణుని బాల్య క్రీడలు అంత మహిమాన్వితమైనవి. అట్టి ఆ బాలకృష్ణుని భజించిన ముక్తినందుట సులభతరమని భాగవతము మనకు చెబుతున్నది. అదే కృష్ణ తత్త్వము.

Exit mobile version