[9 సెప్టెంబర్ శ్రీ కాళోజీ జయంతి సందర్భంగా ఈ కవితని అందిస్తున్నారు సముద్రాల హరికృష్ణ.]
నిత్య సమాజి,
ప్రజాహిత సోమయాజి
ఆట అతనికి రాజ్యంతో ఆజి
ప్రశ్న, అతని చేత కత్తి,
కలం, అక్షరాగ్నికణాల ఝరి!
నిర్బంధాల పుట్టువిరోధి
స్వేచ్ఛకు నిత్య పూజారి!
నియతి గల స్వేచ్ఛ
జీవన విధాన స్వేచ్ఛ,
భావ ధారల స్వేచ్ఛ,
బతుకుల దిద్దెడు స్వేచ్ఛ!
అచ్చపు హృదయ స్పందనలె
ఆతని కవితలు
వెచ్చటి కన్నీటి భాషా లిపులె
ఆ అనుభూతులు
చిత్తము కదిల్చిన గొడవలన్ని
లోకపు గొడవలె!
ఆపన్నుల అన్నార్తుల కష్టాలకు
కన్ను వర్షామేఘమైనవాడు
అశ్రు పరిష్వంగము వలచిన
వెన్నపూసల మనసువాడు!
జనుల బాధల, వేదనల
కరిగిపోయిన గుండె తడి,
హక్కులకై ఉద్యమించిన వేడి
నిప్పు మంచుల వింత జోడి!
అసమానతల కనిపెట్టి
కసిగట్టి తూర్పార పట్టినవాడు
అన్నరాశు లొకచోటా, ఆకలిమంట లొకచోటా
అని పేదసాదల పక్షం నిలచిన జోదు!
ప్రజారాజ్యపు నిరత స్వాప్నికుడు
ప్రజాస్వామ్య నిర్వచన చతురుడు
ప్రజాస్వామ్యమంటే-
“సౌజన్యాల రక్ష, సామరస్యాల రక్ష
ప్రతిభకు సరి వెల, రసములు చిలికెడు జల
ఆర్ద్రత ఆరని తడి, అమ్మ కడుపు దాచిన ఒడి”
సూత్రీకరించిన మార్గదర్శి, సమదర్శి!
తెలుగు నుడుల పలుకుబళ్ళ
కాణాచి ఈ కాళోజి!
తెలుగు రాదను తెగులు తెల్గుల
“చావవెందుకుర?” అనిన మహదావేశి!
చలనశీలం జీవనం
సంఘర్షణల పయనం జీవనం
“తొలగి త్రోవెవ్వ రిచ్చెదరు
త్రోసుకొని పోవలయు” అను జీవనవేది!
ఆవేగంలో ఆ వరద గోదావరి
ఆలోచనలో సర్వజన హితకారి
సంభాషణలో బహు చమత్కారి
చెప్పండిక, ఎవరయ కాళోజీ సరి?!
‘నా గొడవ’నునది కాళోజీ యను నది
పల్కిన లోకసాగర ఘోషల అనునది!
కాళోజీ, కలం పట్టిన తెలంగాణ భీష్ముడు
దుష్టతా పరశురాము డాంతర బుధ్ధుడు!