Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ భారతీ నారద భాషా విచారము-6

[శ్రీ చిరువోలు విజయ నరసింహారావు రచించిన ‘శ్రీ భారతీ నారద భాషా విచారము’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము. ఇది 6వ భాగము.]

~

51.
తెలుగు మధురమౌ భాషగా తెలియు డయ్య!
సుధలు విరజిమ్ము,మది మెచ్చ శోభ గూర్చు
వీను విందగు ప్రాసల మేను పొంగు
గమక, గమనాల సొంపుల ఖ్యాతి గూర్చు
భాష నుగ్గడింపగ వేరు పల్కు లేల?
దాని కదె సాటి, లేదేది దాని సాటి

52.
కవిత విధములు వేరైన కవన మొకటె
కవులు వేరైన యొక్కటే కవిత భాష
వాని ఆహార్యములు వేరు కాని లోన
నున్న ఆకార మొక్కటే యుండు నయ్య
అరసి వర్తించుడీ మీరు, అమరవాణి
బోధ ననుసరించుచు సాగి, బుద్ధి గనుడు

53.
నారదా! విను మీవేగి నరుల కెల్ల
తెల్ల మొనరింపు నా మాట లెల్ల నరసి
సఖ్యమున నుండి భాషకు చక్కనై న
వృద్ధి సాధించ యత్నింప వెలయు శాంతి

54.
కవిత లన్నియు నొప్పైన కాన్క లగుచు
కావ్య మాతకు భూషలై భవ్య మగును
వాణి నర్చింపగా భాష వరలు భూష
ణంబని యరసి, సద్బుద్ధి నడువ వలయు

55.
ఛందస్సు కష్టమే అందంబు సమకూర్చు
భాషకు భూషయై పరిఢవిల్లు
అలనాటి కవులకు తులలేని కీర్తిని
మేధకు ప్రతిభకున్ మేలి తొడవు
మల్ల యుద్ధంబున మల్లుల సాధనల్
తలపించు కవివర్యు ధన్య కృతులు
అవధాన శేఖరు కవనంపు సృష్టి తా
నచ్చెరువు గొలుపు నమృత భాష
కష్ట మని ఎంచగా రాదు, కవిత లల్లి

భాష యభివృద్ధికై ఎంచి పాటు పడుడ
ఛందముల కవితారీతి యందములను
యువకు లెల్లరు నేర్వగా యుక్త మగును
యత్న మొనరింప సాధ్యమౌ నన్ని యవని

56.
కవితల్ ప్రాసల కృతులను
కవులు యతుల తోడ సృజన గావింపంగా
చవులూరు చుండు మధురిమ
చెవులకు విందు గలిగించి శ్రేయము గూర్చున్

57.
తెలుగు మధుర భాష తెలియగా మేలౌను
తెలుగు పాఠశాల తెలివి గూర్చు
తెలుగు చెవుల కింపు తేనె లూరుచు నుండు
తెలుగు తెలియ మీరు తెరువు గనుడు

58.
కన్న తల్లి వోలె కాపాడు సతతంబు
అన్నవస్త్రములకు మిన్న ఇద్ది
విన్నవారి కెల్ల వీనుల విందగు
తిన్న వారి తృప్తి తీరు దోచు

59.
అంబ కంజలి ఘటియించి అరుగుదెంచె
నవని నరుల కంబ పలుకు లవధరింప
వినయముగ దెల్పె నారద మునియు, బుద్ధి
వినుడు మీరెల్ల రా వాణి వివరణమును

60.
కవిత లన్నియు భవ్యమై గణన కెక్కు
కవులు నొప్పారు భవ్య విఖ్యాతు లగుచు
అంతరంగాల వీడరే అంతరములు
కలసి బ్రతుకగా సుఖములు వెలయు గాదె!
భాష వృద్ధికై సమకట్టి ,ప్రగతి బడయ
సకల చర్యలు చేపట్టి సాగుడయ్య!

61.
దేశ భాషల నరయుడీ తెలుగు లెస్స
యన్న నానుడి సత్యమై మిన్న యగుట
నిది “ఇటాలియన్ ఆఫీస్టు ”ముద మొసంగు
ననిరి ఆంగ్లేయు లానాడు ,వినుడు నేడు
ఖ్యాతి నిలబెట్ట యత్నింప కర్జ మగును
ఆంధ్ర మాదర్శ భాషగా నరయ దగును

62.
నతుల నుతి జేసి, పంపిరా నారద ముని
మదిని నిశ్చయ మొనరించి,మాతృ భాష
వృద్ధికై బద్ధ కంకణ బుద్ధి గనిరి
శుభము లాశింప నత్తఱి యభయ మబ్బె

శాంతి
63.
వసుధ కవులెల్ల సుఖ శాంతి వరలు గాక!
సత్య సద్బుద్ధి, సత్త్వంబు, సకల సిద్ధి
సఖ్యమున్ ప్రేమ, సౌఖ్యంబు, జయము నంది
నరుల కారొగ్య భాగ్యముల్ వరలు గాత!
అమ్మ నర్చించు గతి వీరు నమ్మ భాష
నాదరంబున నేర్చి, తా మమరు లగుత!

అర్పణము
64.
భాష గూర్చి లఘు రచన పలుక జేయ
వాణి నన్ను ప్రేరేపించె భవ్యరీతి
నిద్ది యంబ కంకిత మిడి, ఇచ్ఛ మెచ్చు
కవితలను వెలయింపగా కాంక్ష జేసి
వందనం బాచరించెద వాణి కెపుడు
భక్తి నర్చించు నరసింహ భవ్య కవిని

(సమాప్తం)

Exit mobile version