[శ్రీ చిరువోలు విజయ నరసింహారావు రచించిన ‘శ్రీ భారతీ నారద భాషా విచారము’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము. ఇది 5వ భాగము.]
~
41.
ధనము వెచ్చింప నేతలన్ తాము వినతి
సేసి, భాషాభివృద్ధికై చేయి కలిపి
చట్టములు చేసి శ్రద్ధగా చదువు కొనగ
తగిన ఏర్పాటు చేయగా తలచు మనిరి
42.
మంత్రు లెన్నియో వచియించి మాట లందు
కార్య మాచరింపగా లేని కథల నల్లి
వృద్ధి శూన్యమౌ నార్భాట విస్తరణను
కాలమును బుచ్చ సాగిరి చాల వరకు
43.
మాతృ భాష నేర్వ మనకు మాన్య మనుచు
ప్రాథమిక చదువుల నాంగ్ల భాష గరప
ముఖ్యమని చట్టమును చేసి, మోద మంది
రాంధ్ర భాష కన్యాయంబు నమలు పరచి
మొసలి కన్నీరు గార్చిరి మోసగించి
44.
తెలుగు ప్రాచీన భాషగా తేల్చి చెప్పి
ప్రభుత చాటించునే కాని ప్రగతి పథము
నడుప సద్యత్న మొనరింప గడగ లేదు
చింతగా మిగిలెను భాష చెందు వృద్ధి
45.
నారదుండీ స్థితి గతులు వేరు వేరు
వాదముల తీరు వివరించె వాణి మాత
సభను, శాంతయై వినె నామె సత్యమెల్ల
మంద హాస వదన యౌచు మాత పలికె
46.
మెచ్చి నారద ముని బాధ, మేలు గూర్ప
నామె వివరించె నీ రీతి నాదరమున
మునివరా! నీ హిత వచనము లవి చర్చ
నీయములె సుమ్ము, కనుగొంటి నేడు భువిని
గల్గు నాంధ్ర భాషా స్థితి గతుల నెల్ల
సంతసంబయ్యె నా మది, చింత విడుము
47.
శీఘ్ర మేగు భువి కీవు, చెప్పు మిట్లు
నాదు బోధగా వివరముల్ నరుల కెల్ల
శాంత చిత్తులై చరియించి, చింత వీడి
మాతృ భాషను నేర్వగా మాన వలదు
తల్లి నాదరించిన రీతి తలచి మదిని
తల్లి భాషాభివృద్ధికై తరలి వచ్చి
ఐక్య మతులౌచు కృషి సల్పు రంద రెపుడు
48.
విద్య నేర్చిన మీరెల్ల వినగ లేదె?
పండితుల బోధ మతముల పథము లెల్ల
మతము లెన్నైన పరమాత్మ మన కొకండె
అనుదినాచారములు పెక్కు, ఆత్మ యొకటె
49.
మార్గములు వేరు మనకు గమ్య మది యొకటె
అంతరంగాల వైవిధ్య మంత వీడి
ఒకటిగా సమైక్య మతులై ఓర్పు గలిగి
కలసి కట్టుగా యత్నింప గలుగు ఫలము
వృద్ధియును సేమ మబ్బు సమృద్ధి గాను
50.
నిరత మారాటమున పోరి, దురిత మూడ్చి
సంఘ సహకార జీవన సరళి సాగి
ఎవరి భాష నవ్వారు తా మెరుగ వలయు
మాతృ భాషను నేర్వగా మరువ వలదు
(సశేషం)
21 అక్టోబర్ 1939 న జన్మించిన శ్రీ చిరువోలు విజయ నరసింహారావు ప్రవృత్తి రీత్యా కవి. దుర్గా మహాలక్ష్మి, దుర్గా ప్రసాదరావు గార్లు తల్లిదండ్రులు. ఎం.ఎ. విద్యార్హత. రైల్వే మెయిల్ గార్డుగా ఉద్యోగ విరమణ చేశారు. భార్య సత్యప్రసూన. ముగ్గురు కుమారులు.
15 శతకములు ముద్రితములు. రెండు జీవితచరిత్ర గ్రంథాలు వెలువరించారు. అనువాదాలు చేశారు. నీతి శతకములు, సాయి శతకములు తదితర రచనలన్నీ కలిపి 73.