[శ్రీ చిరువోలు విజయ నరసింహారావు రచించిన ‘శ్రీ భారతీ నారద భాషా విచారము’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము. ఇది 4వ భాగము.]


~
31.
దృశ్య కావ్యమై సినిమాలు తేజరిల్లె
నందు పాటలు శ్రావ్యమై యలరుచుండె
గీత రచయితా, కథకులై కీర్తి గనిరి
వారును సినిమా కవులన్న వాసి గనిరి
32.
వివిధ భాషల ఖ్యాతమై విలువ గలుగు
భవ్య గ్రంథంబు లనువాద పరచు వారు
కవులు కొందరు తమ భాష గరిమ బెంచ
వారె అనువాద కవులన్న పేరు గనిరి
33.
కలము, కాగితములు లేక, మలచి మదిని
అడిగినంత నాశువుగ తామల్లి నారు
భవ్యు లవధానులను కీర్తి బడసినారు
వారి మేధ కర్పించరే వందనములు
34.
సంస్కృతంబాంధ్ర భాషకు జన్మ మూల
మనుచు పల్కుదు రెందరో ఆద్యులకట!
సంస్కృతంబును మించు నసాధ్య ప్రక్రి
యలను రూపొంద జేసిరీ యాంధ్ర కవులు
యతులు, గణములు, ప్రాస నియమము లొప్ప
క్లిష్ట సూత్ర చయము నిల్పి కీర్తి గనిరి
35.
కావ్య నిర్మాణా సూత్రముల్ కలవు పెక్కు
తగిన గ్రంథ నియమములు దాన వెలసె
వేద వేదంగ శాస్త్రార్థ విషయ వేద్య
వివరణంబులు,వ్యాఖ్యలున్ పెక్కు వ్రాయ
కవుల ధిషణకు తార్కాణ కాగ నిలిచె
36.
ఆంధ్ర భారతీ గ్రంథంబు లవతరించె
పెక్కు కవుల మేధను చాటి పేర్మి గూర్చె
లెక్క లేనన్ని రచనలీ లీల మెరయ
వెలసె వాణి సేవింపగా వివిధ గతుల
వాని కీర్తి, వారి ప్రతిభ భవ్య మయ్యె
37.
గణిత శాస్త్రంబు కవితల గలుగ జేసి
జ్యోతిష, ఖగోళ ,వైద్యంబు ఖ్యాతి గనగ
నాంధ్ర భాషను రచియించి రాంధ్ర కవులు
వారి మేధ, వ్యుత్పత్తి సంభావ్య మగును
38.
సభల నష్టావధానంబు శక్తి జూపి
రల సహస్రావధానముల్ వెలయ జేయు
మేధ, ఏకాగ్రతల కవి సాధనలను
వినగ, తెలియంగ పులకల తనువు లూగు
39.
ఆంద్ర భాష యమృత భాష యనుచు మెచ్చి
రెల్ల దేశ విదేశీయు లుల్లసిల్లి
మధు మధుర మంజుల సరస మాన్య భాష
ఇద్ది, నేర్చి ధన్యులు కారె ,హితము నెంచి
యనుచు నర్థింతు రెందరో ఆర్యు లకట!
40.
శ్రేయమును గూర్ప మాన్యులు చేరి యొకట
భాష నభివృద్ధి పరచగా పట్టు పట్టి
యెల్లరును యత్న మొనరింప నుల్ల మందు
నిశ్చయాత్ములై కదలగా నిరతు లగుడు
రండు, రండని రాహ్వాన రంగమునకు
(సశేషం)

21 అక్టోబర్ 1939 న జన్మించిన శ్రీ చిరువోలు విజయ నరసింహారావు ప్రవృత్తి రీత్యా కవి. దుర్గా మహాలక్ష్మి, దుర్గా ప్రసాదరావు గార్లు తల్లిదండ్రులు. ఎం.ఎ. విద్యార్హత. రైల్వే మెయిల్ గార్డుగా ఉద్యోగ విరమణ చేశారు. భార్య సత్యప్రసూన. ముగ్గురు కుమారులు.
15 శతకములు ముద్రితములు. రెండు జీవితచరిత్ర గ్రంథాలు వెలువరించారు. అనువాదాలు చేశారు. నీతి శతకములు, సాయి శతకములు తదితర రచనలన్నీ కలిపి 73.