Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీ భారతీ నారద భాషా విచారము-2

[శ్రీ చిరువోలు విజయ నరసింహారావు రచించిన ‘శ్రీ భారతీ నారద భాషా విచారము’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము. ఇది 2వ భాగము.]


~
11.
నాటి గ్రాంథిక భాష ఔన్నత్య మొప్ప
సంస్కృత పద భరితమౌచు సాగు చుండె
నద్ధి గొప్ప పండితులకే యర్థ మగును
నాటి సామాన్యుల మదికి నాట బోదు

12.
అట్టి కవితా ప్రతిభ గన నధిక శ్రమయు
శ్రద్ధయు, గురు శుశ్రూష, సద్బుద్ధి వలయు
నంత కష్ట పడుచు వ్రాయ నెంతొ క్లిష్ట
మనుచు, దాని ఖండింపగా నడ్డు పడిరి
నాటి కవితకు వ్యతిరేక నవ్య పథము
నేర్పరుప సమకట్టిరా నీతి మార్చి

13.
ప్రౌఢ కవుల గౌరవ మిచ్చు మూఢ మతిని
వీడి, నవ్య పథంబున బోవ విజ్ఞత యను
వాదమును లేపి, రతి తీవ్రవాదులైరి
కూడ గట్టిరి జనులను గోల చేసి

14.
అంత భావ కవులు పుట్టి రచట నాటి
వారి గ్రాంథిక భాషను వదలి, రచన
సరళ పదముల వ్రాయగా సాగినారు
వర్ణనలు నలంకారముల్ పండితులకె
సాటి వారికి నర్థమౌ సాధు రచన
యొప్పగు నదె కవిత లందు యుక్త మనిరి

15.
తరులు, గిరులును, ఆకులు, తరుణి, పైరు
పచ్చ, బడుగుల వర్ణనల్ పరగ జేసి
మదికి నచ్చిన విషయాలు పదిల పరచి
సులభ కవితలు వెలయించి శోభ గనిరి

16.
కవిత కే సూత్రముల్, శాస్త్ర గణము లెవ్వి
వలదనుచు దెల్పుచు యథేచ్ఛ వ్రాసినారు
తోచినదె కవిత్వము, మది దోచు నద్ది
ఇచ్ఛ వచ్చిన పదములన్ ముచ్చటించి
వివిధ కవితలు వ్రాయగా ప్రీతి గనిరి

17.
కవులు వివిధ వర్గంబులే ఘనమటంచు
నెవరి శాఖకు వారె తా ఏలిక యని
తిరుగుబాటు వర్గము వారు తేల్చు కొనిరి
దీటుగా నిల్ప తమ శాఖ మేటి యనిరి

18.
భావ మమలిన శృంగార వర్ణనలను
భావ పేశలపు గరిమ ప్రకట పరచి
భావ వైచిత్రి, వైదగ్ది భరితముగను
కొన్నిరచనలు చేసిరి, మన్నన గన
వారె భావ కవుల మని పల్కినారు

19.
ఛందముల సంకెలలు ద్రుంచి, చక్కనైన
పదము లల్లిక జేసి, సెబాసనంగ
తాము మెచ్చిన గతుల విస్తారముగను
వ్రాసి మెప్పింప జూచిరి భవ్య రీతి
వారె గేయ కవుల మన్న వాసి గనిరి

20.
వస్తు భేదంబె ముఖ్యమౌ వ్రాయు కొరకు
ఊక దంపుడు రచనల నొప్పు కాదు
వస్తు వైవిధ్య కవితలు విస్తరిల్ల
జేయ సేమ మంచనిరి విచిత్ర కవులు

(సశేషం)

Exit mobile version