[శ్రీ చిరువోలు విజయ నరసింహారావు రచించిన ‘శ్రీ భారతీ నారద భాషా విచారము’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము. ఇది మొదటి భాగము.]
~
ప్రార్థన:
1.
అంబ!కవితా వనాంతర హంస వాహ
నా విహారి!అక్షర దేవి! భావ రూపి!
సకల శాస్త్రాధి దేవతా శక్తి మూర్తి!
పండిత కవి జన సుపూజ్య! బ్రహ్మ మహిషి!
అంజలి గొనుమా, మము బ్రోవు మమ్మ!నెమ్మి
2.
బ్రహ్మయును వాణి సభ యందు ప్రాజ్ఞుల దరి
నాసనాసీనులై యున్న నద్దినమున
బ్రహ్మ ఋషి నారదుండు తా బరఁగుదెంచె
నెల్లరానంద మందిరి హితము నెంచి
3.
వందనం బొనరించి తా భక్తి తోడ
నారదు డజునకును,మాత శారదకును
ఆశిషంబుల నర్థించె నఘము బాప
వినయ మతి యౌచు విజ్ఞాన వేద నిధికి
4.
నారదుని రాక కెయ్యది కారణ మని
యడిగి, యతని విచారించి రజుడు, సతియు
దర్శనము జేసి, కలియుగ ధర్మములను
మనుజ లోక విషయములు మనవి సేయ
నరుగు దెంచితి ననె మౌని పరమ భక్తి
5.
జనులు భక్తి ధర్మమరసి శ్రద్ధ తోడ
దేవతార్చన విధు లందు తేలు వారె?
వింత లేమైన గలవె ? యా వివరములను
తెలుపు మని కోరె బ్రహ్మ యా దివ్య మునిని
6.
జనులు సంసార చింతల సతమతమయి
అర్థ కామంబులను జిక్కి యహరహంబు
కార్య రతులౌచు చనువారు కర్మ లందు
ముక్తి చింతలే దిసుమంత మూర్ఖ మతులు
7.
ఆలు బిడ్డల పోషణం బనవరతము
నర్థ సంపాదనే తమ స్వార్థ మనుచు
కలహ మతు లౌచు, రణచింత గడఁగి నారు
మరచి సహకార మను మాట మసలి రకట!
8.
లౌకిక విషయ మదె ముఖ్య లాభ మనుచు
దైవ చింత వ్యర్థమనుచు, ధర్మములను
వీడి, సతతంబు నలజడి వేదనలను
బడుచు, వ్యథను దినదినంబు బ్రతుకు వారు
9.
వివరముగ దెల్ప వచ్చితీ విషయములను
అమ్మ సమ్ముఖమున సభయందు మీకు
భారతీ వ్యవసాయంబు పరగు రీతి
కవుల కలహముల్ గణనీయ ఘాత మయ్యె
భువి జనుల వివాద మది, యపూర్వ మగును
10.
కలరు వివిధ శాస్త్ర విషయ కవులు భువిని
పూర్వ కవి వర్యుల ఫణితి బుద్ధి నరసి
ప్రౌఢ కవితలు వెలయించు భవ్యు లకట!
వారె ఘనులన్న సత్కీర్తి బడసి నారు
(సశేషం)
21 అక్టోబర్ 1939 న జన్మించిన శ్రీ చిరువోలు విజయ నరసింహారావు ప్రవృత్తి రీత్యా కవి. దుర్గా మహాలక్ష్మి, దుర్గా ప్రసాదరావు గార్లు తల్లిదండ్రులు. ఎం.ఎ. విద్యార్హత. రైల్వే మెయిల్ గార్డుగా ఉద్యోగ విరమణ చేశారు. భార్య సత్యప్రసూన. ముగ్గురు కుమారులు.
15 శతకములు ముద్రితములు. రెండు జీవితచరిత్ర గ్రంథాలు వెలువరించారు. అనువాదాలు చేశారు. నీతి శతకములు, సాయి శతకములు తదితర రచనలన్నీ కలిపి 73.