[విశ్వనాథ శోభనాద్రి గారు రచించిన ‘శ్రీ ఆంజనేయం’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు డా. చెంగల్వ రామలక్ష్మి.]
హనుమంతుడు అంటే వాల్మీకి రామాయణంలో సుందర కాండలో చెప్పిన, రామ సుగ్రీవులకు మైత్రీ బంధాన్ని కూర్చినవాడు, సీతాన్వేషణకై సముద్రాన్ని లంఘించి లంకకు చేరి, సీతమాతను కలిసి, శ్రీరామునికి సమాచారాన్ని అందించిన రామభక్తునిగా, మంచి వ్యవహర్తగా, రాముడు మెచ్చిన భాషణాచతురునిగా మనలో చాలా మందికి తెలుసు. శ్రీరామ పరమ భక్తునిగా ప్రసిద్ధి చెందిన హనుమ ఇంటింటా దైవమై వెలిసాడు.
కాని, హనుమంతుడు ఎవరు? ఆయన చరిత్ర, మహిమలు, లీలలు మొదలైన హనుమంతునికి సంబంధించిన సమస్త విషయాలు పరాశర సంహిత ద్వారా తెలుస్తున్నాయి. ఒకప్పుడు పరాశర మహర్షిని మైత్రేయ మహర్షి, భయంకరమైన కలియుగంలో వ్యాధులచే, దారిద్ర్యంచే బాధపడే జనులకు ఏ మంత్రం విజయాన్నిస్తుంది? వెంటనే ఫలితం నిచ్చేది ఏదీ? అని అడిగినప్పుడు పరాశరమహర్షి సకల శుభాలను చేకూర్చే హనుమత్ వ్రతాన్ని, హనుమంతుని మంత్ర ప్రభావాన్నీ, హనుమంతుని ఉపాసనా విధానాన్ని వివరించాడు. పరాశర సంహిత సమగ్ర ఆంజనేయ చరిత్రను చెపుతుంది.
పరాశర సంహిత లోని ఆంజనేయ చరిత్ర ఆధారంగా హనుమంతుని జన్మ వృత్తాంతాన్ని, ఆయన మహిమలను, ఆయనను సేవించి తరించిన భక్తుల గాథలను, హనుమంతుని మంత్ర ప్రభావాన్నీ చిన్న చిన్న కథల రూపంలో, సరళమైన వచనంలో కళా ప్రపూర్ణ శ్రీ విశ్వనాథ శోభనాద్రి ‘శ్రీ ఆంజనేయం’ (ఆంజనేయ కథా మాలిక) ను తెలుగు పాఠకులకు అందించారు.
విశ్వనాథ శోభనాద్రి గారు
కవి సమ్రాట్, తొలి తెలుగు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి తమ్ముడు విశ్వనాథ శ్రీరామమూర్తి, మహాలక్ష్మి వీరి తల్లిదండ్రులు. సంస్కృతంలో ఎం.ఏ. చదివి విజయవాడ, బెంగళూరు, హైదరాబాద్, బెహరిన్ మొదలైన చోట్ల ఉద్యోగం చేసి, ప్రస్తుతం కాశీని నివాస స్థానంగా చేసుకున్నారు. వీరు కల్పవృక్షము-వాల్మీకి రామాయణ కథలు, మహాభారత కల్ప తరువు – కవిత్రయ మహా భారత కథలు, భాగవత కల్ప ద్రువం -పోతన భాగవత కథలు వంటి అనేక గ్రంధాలను చిన్న చిన్న కథల రూపంలో పిల్లలకు, పెద్దలకు కూడా సులభంగా చదువుకుని అర్థం చేసుకోవటానికి అనువుగా రచించారు. ఈ గ్రంధాలన్నీ భారత, భాగవత, రామాయణ ఇతివృత్తాల పట్ల సమగ్ర అవగాహనను పాఠకులకు కలిగిస్తాయి.
విశ్వనాథ శోభనాద్రిగారి ‘శ్రీ ఆంజనేయం’ పాఠకులను ఆసక్తితో చదివిస్తుంది. మొదటి కథ ఆంజనేయ జన్మ వృత్తాంతంతో మొదలవుతుంది. వాల్మీకి రామాయణంలో ఆంజనేయుని వివాహ ప్రసక్తి కనిపించదు. ఇందులో ఆంజనేయుడు, సూర్య తేజస్సు నుంచి పుట్టిన సువర్చలను వివాహం చేసుకున్న కథ ఉంది. సువర్చలాంజనేయ స్వామి దేవాలయాలు కొన్ని చోట్ల ఉన్నాయి.
అలాగే ఆంజనేయునికి సంతానం ఉన్నట్లు కూడా ఈ కథా మాలిక తెల్పుతుంది.
శతకంఠ రావణుడు, దశకంఠ రావణుడు, మైరావణ రావణుడు అని ముగ్గురు రావణులున్నారు. రామ రావణ యుద్ధం జరుగుతున్నప్పుడు, రావణాసురుడు, తమ్ముడు వరసైన మైరావణుని వద్దకు వెళ్లి, “మనలో మనకు ఎన్ని అభిప్రాయ బేధాలున్నా మర్చిపోయి ఒక్కటై రాముణ్ణి జయించాలి” అని అభ్యర్థించాడు. మైరావణుడు ఒప్పుకుంటాడు. రామలక్ష్మణులను తన మాయతో చిన్న ఆకారాలుగా మార్చి ఒక పెట్టెలో పెట్టి తమ కులదేవతకు బలి ఇవ్వాలనుకుంటాడు. బలి ఇచ్చేముందు ఇంటి ఆడపడుచు కడవతో కొలను నుంచి నీళ్లు తేవటం వంటి ఆసక్తికర సమాచారం ఈ కథలో కనిపిస్తుంది. విభీషణుడు ఇదంతా తెలుసుకుని ఆంజనేయునితో వెంటనే రామలక్ష్మణులను విడిపించాలని, మైరావణ పురం వెళ్లే మార్గాన్ని చెపుతాడు. ఆ ప్రాంతం లోకి ఆంజనేయుడు సూక్ష్మ రూపంతో ఎవరికీ తెలియకుండా ప్రవేశిస్తాడు. అక్కడ తనలాగే ఉన్న బాల వానరుని చూసి ఈ రాక్షస రాజ్యంలో వానరయోధుడు ఉండటం ఏమిటని ఆశ్చర్యపడుతూ, తనతో యుద్దానికి వచ్చిన ఆ బాల వీరుని నీ తల్లిదండ్రులు ఎవరని అడిగాడు. అప్పుడు అతడు తన పేరు మత్స్య నాధుడని, శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడు తన తండ్రి అని, తల్లి దీర్ఘ దేహి అనే గంధర్వ కాంత అని, ఆమె గురించి చెపుతాడు. ఆ బాల వీరుడు తండ్రికి నమస్కరించి మైరావణుని జాడ చెపుతాడు. ఇది చాలా ఆసక్తికరమైన కథ.
ఇలాగే, గర్గ మహర్షి ద్వారా హనుమత్ ద్వాదశాక్షర మంత్రం ఉపదేశం పొంది, ఆ మంత్ర ప్రభావంతో సీతా మాత కాళీ రూపంలో శతకంఠ రావణుని సంహరించిన కథ కూడా విశేషమైనది. ఈ సందర్భంలోనే సుగ్రీవుడు మొదలైన వానర వీరులంతా హనుమంతుని చేసిన స్తుతి వానరగీతగా ప్రసిద్ధమైంది.
ఇలాంటి, హనుమంతుని గురించి విశేష విషయాలను, హనుమద్భక్తుల కథలను, మహిమలను వర్ణించిన కథల కూర్పు ఈ ‘శ్రీ ఆంజనేయం’. ఇది హనుమంతుని పలు కోణాలను ఆవిష్కరిస్తూ హనుమ భక్తులను అలరించే కథా మాలిక.
***
రచన: విశ్వనాథ శోభనాద్రి
ప్రచురణ: విశ్వనాథ శోభనాద్రి లిటరరీ ఫౌండేషన్
పేజీలు: 140
వెల: ₹ 500/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.
~
విశ్వనాథ శోభనాద్రి లిటరరీ ఫౌండేషన్,
16-2-836/B/3, ఎల్.ఐ.సి. కాలనీ,
సైదాబాద్, హైదరాబాద్ -500059
ఫోన్: 9440666669
