[‘నన్ను ప్రభావితం చేసిన నా గురువు’ అనే శీర్షిక కోసం తమ గురువు జయలక్ష్మి గారి గురించి వివరిస్తున్నారు చంద్రకళ దీకొండ.]
నా ఆత్మవిశ్వాసాన్ని వెన్నుతట్టి లేపి..
నా ప్రతిభకు పదును పెట్టి..
నాకు తెలియని, నాలో దాగున్న రచనా సామర్థ్యాన్ని ప్రోత్సహించి..
నా సాహితీ ప్రయాణానికి పునాది వేసి..
నా నైపుణ్యాలను వెలికితీసి..
నా వృత్తి, ప్రవృత్తులకు పాదులు కట్టిన నా గురువు..
నేను చదివిన పాఠశాలలో తెలుగు మరియు సాంఘిక శాస్త్రం బోధించేవారు.
ప్రతిరోజూ ఉక్తలేఖనం వ్రాయించి, పదాలను అక్షర దోషాలు లేకుండా వ్రాయడంలో శిక్షణనిచ్చారు. మెరుగు పడిన నా వ్రాతను గమనించి, వచ్చిన మార్కులను చూసుకుని ఎంతో మురిసిపోయేదాన్ని.
ఒకసారి పాఠశాలలో వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలకు పేర్లిమ్మని అడిగినప్పుడు, నేను వ్యాసరచనకు మాత్రమే పేరు ఇచ్చాను.
“వక్తృత్వ పోటీకి కూడా పేరు ఇవ్వు” అంటే..”అమ్మో.. నాకు భయం” అన్నాను.
“నీకు అన్నీ వచ్చినా.. ఎందుకు పోటీలో పాల్గొనవు..?” అంటూ స్కేలుతో చిన్న దెబ్బ వేసారు. అదే మొదటిసారి, చివరిసారి కూడా.. నేను గురువు చేత దెబ్బ తినడం! ఎలాగైతేనేం.. వణుకుతూ వెళ్లి రెండు ముక్కలు మాట్లాడాను.
నా చదువు నేను చదువుకుంటూ, మితభాషిగా ఉన్న నన్ను మాట్లాడక, బోధించక తప్పని ఉపాధ్యాయ వృత్తిని చేపట్టేలా.. సభల్లోనూ మాట్లాడేలా.. ఆత్మవిశ్వాసాన్ని కల్పించారు.
కళాశాలలో సాహిత్యం చదివేలా..
ఉద్యోగం చేస్తూ.. తెలుగు భాషలో
ఎం.ఎ. పట్టా సాధించేలా స్ఫూర్తినిచ్చారు.
అంతేకాదు.. పాఠశాలలో పిల్లలతో కలిసి చిన్న చిన్న నాటికలు వేయడం, పేరడీ పాటలు వ్రాసి పాడడం.. ఇలాంటి వాటన్నిటికీ ఆ గురువే మార్గదర్శకం.. మేము చదివేటప్పుడు ఆ గురువు అలానే చేసేవారు.
భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వం విషయంపై ఉదాహరణలతో బోధించిన తీరు నాకు ఇప్పటికీ గుర్తుంది.
బి. ఎడ్.పట్టా లేని సహజమైన ప్రతిభ ఆ గురువు స్వంతం. చాలా ఏళ్ల తర్వాత ఆ పట్టా పొందారు.
అంతేనా.. రాష్ట్ర ప్రభుత్వంచే సత్కారం కూడా సాధించారు.
ఉద్యోగ విరమణ తర్వాత బుల్లితెర ధారావాహికల్లోనూ నటించారు. ఇప్పటికీ నటిస్తున్నారు కూడా. ‘మనం’ చలనచిత్రంలో కథానాయిక ‘శ్రేయ’కు బామ్మగా నటించారు కూడా!
ఆమే మా గురువు జయలక్ష్మి గారు!
ఒక గురువు విద్యార్థిని ఎంతగా ప్రభావితం చేయగలరు అన్నదానికి ప్రత్యక్ష ఉదాహరణగా నేను నిలిచానీ నాడు.
చంద్రకళ దీకొండ గారు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.