Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

స్ఫూర్తిప్రదాత ఎపిజె అబ్దుల్ కలామ్

[బాలబాలికల కోసం ‘స్ఫూర్తిప్రదాత ఎపిజె అబ్దుల్ కలామ్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

క్షిపణి శాస్త్రవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత మన ప్రియతమ మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ గారంటే మీకు ఎంతో ఇష్టం కదా! ఎందుకంటే విద్యార్థులకు మార్గదర్శకులూ, విద్యార్థుల పట్ల అమితమైన ప్రేమనూ, ప్రోత్సాహాన్నీ చూపిస్తున్నవారు కాబట్టి. ఇంతవరకూ ఏ శాస్త్రవేత్తా, ఏ రాష్ట్రపతీ విద్యార్థులతో ఇంత ఎక్కువ సమయాన్ని కేటాయించలేదు. అబ్దుల్ కలామ్ క్షిపణుల్ని తయారు చేయటంలో పడిన కష్టాలనూ, పొందిన విజయాలనూ తెలుసుకుందామా!

అవుల్ పకీర్ జెనులాబ్దీన్ అబ్దుల్ కలామ్ 1931వ సం॥లో తమిళనాడు లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలో జన్మించారు. తండ్రిపేరు జైనులాబ్దీన్, తల్లి పేరు అశియమ్మ. తల్లిదండ్రులు సామాన్య కుటుంబీకులే అయినప్పటికీ ఔదార్యం కలిగినవారు. జలాలుద్దీన్ అనే స్నేహితుని వలన శాస్త్రీయ ఆవిష్కరణలు, సమకాలీన సాహిత్యం, వైద్య రంగంలో సాధిస్తున్న విజయాలూ తెలుసుకునేవారు. ఎస్.టి.ఆర్. మాణిక్యం నడిపే గ్రంథాలయంలో పుస్తకాలను చదివేవారు. రామేశ్వరం లోని పాఠకులకు ‘దినమణి’ పత్రికలను అందిస్తూ పేపర్ బాయ్‌గా పనిచేసేవారు.

1950లో ట్రిచీ సెంట్ జోసెఫ్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. సెంట్ జోసెఫ్ బి.ఎస్.సి. డిగ్రీనీ, మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ నూ చదివారు. 1958లో ఢిల్లీలో రక్షణ మంత్రిత్వ శాఖలో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అక్కడ సూపర్‌సానిక్ లక్ష్యభేదక విమానాల్ని డిజైన్ చేశారు. ‘నంది’ అనే హోవర్ క్రాప్ట్ ను తయారు చేశారు. ఆ తరువాత టాటా ఇన్‌స్టిట్యూట్‌లో రాకెట్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. కేరళలోని తిరువనంతపురం దగ్గర ఉండే తుంబాలో రాకెట్ ప్రయోగశాలను నెలకొల్పి అక్కడ పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. ఆ తరువాత ‘ఇస్రో’లో ఎస్.ఎల్.వి.లు తయారుచేసే పనిలో నిమగ్నులయ్యారు. అపజయాలు లేకుండా విజయాలు పొందడం ఎవరికీ సాధ్యం కాదు. అబ్దుల్ కలామ్ విషయమూ అంతే. హోవర్ క్రాఫ్ట్ ‘నంది’ మూలబడింది. రాటో ప్రాజెక్టు అటకెక్కింది. ఎస్.ఎల్.వి. డయామోంట్ నాల్గవదశ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎస్.ఎల్.వి. 3 శ్రీహరి కోటలో కూలిపోయింది. అపజయాల పునాదుల మీదనుంచే విజయాల గోడలు లేస్తాయి. ఎన్నో పరాజయాలు, ఇరవై సంవత్సరాల నిర్విరామ కృషి తర్వాత 1980 జూలై 18న ఉదయం 8-03 ని॥లకు షార్ కేంద్రం నుండి భారతదేశపు మొదటి శాటిలైట్ లాంచ్ వెహికిల్ ఎస్.ఎల్.వి-3 ప్రయోగించబడింది. ఆ విజయాన్ని చూసి ఆనందించడానికి ఆయనను ప్రభావితం చేసిన తండ్రి, బావమరిది జలాలుద్దీన్, ప్రొ॥ విక్రం సారాభాయి జీవించి లేకపోవటం విషాదం.

పద్దెనిమిది సంవత్సరాలు ఇస్రోలో పనిచేసిన తరువాత 1982లో డి.ఆర్.డి.ఎల్. డైరెక్టరుగా నియమితులయ్యారు. మిస్సైల్ ప్రాజెక్ట్‌ను డా॥ అరుణాచలం ఆరంభించారు. నేలనుంచి నేలకు ప్రయోగించే మిస్సైళ్లకు ‘పృథ్వి’ అన్న పేరును, టాక్టికల్ కోర్ వెహికిల్‌కు ‘త్రిశూల్’ అన్న పేరును, నేలమీద నుంచి నింగికెగిరే మిస్సైల్‌కు ‘ఆకాశ్’ అనే పేరును, శతఘ్ని విధ్వంసక మిస్సైల్ కు ‘నాగ్’ అన్న పేరును, ఆయన చిరకాల స్వప్నమైన ‘రీ ఎంట్రీ ఎక్స్‌పెరిమెంట్’కు ‘అగ్ని’ అన్న పేరును పెట్టారు. నేలమీద నుంచి నేల మీదకు ప్రయోగించే మిస్సైళ్ళలో నేడు పృథ్విని మించింది లేదు. కఠిన శ్రమ చేస్తే సాధించలేనిదేమీ లేదు. అందుకే పెద్దలు ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 1981 జనవరి 26 తేదీన అబ్దుల్ కలామ్‌ను ‘పద్మభూషణ్’ అవార్డుతో సత్కరించింది. 1982లో మద్రాసులోని అన్నా విశ్వవిద్యాలయం కలామ్‌ను డాక్టరేట్‌తో సత్కరించింది. 1990 రిపబ్లిక్ దినోత్సవం నాడు కేంద్ర హోంశాఖ ‘పద్మ విభూషణ్’ సత్కారాన్ని అందజేసింది. 1990 చివరలో జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ డిగ్రీని ప్రదానం చేసింది. 1991లో బొంబాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కలామ్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఆ తరువాత భారత ప్రభుత్వం నుండి ‘భారతరత్న’ను అందుకున్నారు. తరువాత భారత రాష్ట్రపతి అయ్యారు. చూశారా పిల్లలూ! కఠోర పరిశ్రమ చెయ్యాలే గాని ఎంత తక్కువ అవకాశాలున్నప్పటికీ ఎంతో ఉన్నత విజయాలను పొందవచ్చు.

Exit mobile version