[‘కొరియానం’ అనే పుస్తకం వెలువరించిన వేదాల గీతాచార్య గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం వేదాల గీతాచార్య గారూ.
వేదాల గీతాచార్య: నమస్కారం.
~
ప్రశ్న1: సంచికలో ధారావాహికగా ప్రచురితమైన ‘కొరియానం’ సినీ వ్యాసాలను పుస్తకంగా వెలువరించినందుకు అభినందనలు. ఈ పుస్తకం గురించి మాట్లాడుకోడానికి ముందుగా, అసలు మీకు కొరియన్ సినిమాలపై ఆసక్తి ఎలా కలిగిందో వివరిస్తారా?
జవాబు: కొరియన్ సినిమాల మీద నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఏమీ లేదండీ. ఎప్పుడైనా నా ప్రాధాన్యం స్టోరీ టెల్లింగ్‌కే. ఇక సినిమా అంటే “the art and science of visual storytelling” అని దిగ్దర్శకుడు జేమ్స్ కామరాన్ చెప్పాడు. కనుక నాకు స్టోరీటెల్లింగ్‌తో పాటూ విజువల్ స్టోరీటెల్లింగ్ అయిన సినిమా అంటే అందరిలాగే ఆసక్తి. కాకపోతే కామరాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నాకు కొరియన్ల filmmaking శైలి కామరాన్ నిర్వచనానికి చాలా దగ్గరగా ఉండటం వల్ల వారి సినిమాలు నేను చూడటానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తాను. ఎవరైనా వారికి నచ్చిన దానిలో the best కావాలని కోరుకుంటారు కదా. ఆ రకంగా చూస్తే నాకు కొరియన్ సినిమా అంటే ప్రత్యేకమైన ఆసక్తి అనుకోవచ్చు. నేను కొరియన్ సినిమా చూడటానికి బీజం విచిత్రంగా పడింది. ఒరే కడల్ అని ఒక మమ్ముట్టి నటించిన మలయాళం సినిమా చాలా బాగుంటుంది అని ఒక సినిమా బ్లాగ్‌లో చదివి ఆ సినిమాను మా స్నేహితుడికి సజెస్ట్ చేశాను. అతనికి ఆ సినిమా నచ్చలేదు. ఆ కోపంతో నాకు (unsuspecting victim) అతను Peppermint Candy అనే సినిమా చూడమని డిస్క్ ఇచ్చాడు. అదేదో సరదా రొమాంటిక్ కామెడీ అనుకుని చూశాను పేరుని బట్టీ. ఏదో తేడాగా ఉందే (ప్రతీకారం) అనుకుంటూ చూశాను కానీ, ఆ దర్శకుడి విజువల్ స్టోరీటెల్లింగ్ (అప్పటికి నాకు ఆ వివరాలు అంత తెలియవు) నన్ను చివరి దాకా చూసేలా చేసింది. కొన్ని నేను తట్టుకోలేని సన్నివేశాలు ఉన్నా, ఆ దర్శకుడి మాయలో పడి సినిమా పూర్తి చేశాను. ఆ తరువాత జరిగింది కొరియానంలో ఉంది.
ప్రశ్న 2: ఈ పుస్తకానికి రాసిన పీఠికలో కొరియానం గురించి చెబుతూ, “ప్రశ్న, బదులు రూపంలో సినిమా గురించి నేను నేర్చుకుంటూ చేసిన ప్రయాణం” అన్నారు. అసలు సినిమాల గురించి మీకు ఇష్టం ఎప్పుడు కలిగింది, తెలుగు/భారతీయ/హాలీవుడ్ సినిమాలను కొరియా సినిమాలతో కనెక్ట్ చేయవచ్చు, వాటి మధ్య పోలికలు తేవచ్చు అని ఎలా అనిపించింది?
జవాబు: నేను పుట్టి పెరిగింది చిన్న టౌన్‌లో. అందరి లాగానే సినిమాలంటే సాధారణంగా ఉండే ఆసక్తి మా కుటుంబంలో అందరికీ ఉండేది. అలా చిన్నతనం నుంచీ సినిమాలు మామూలుగానే చూస్తుండే వాడిని. మొదట టెర్మినేటర్ 2 (దానికో పెద్ద చరిత్ర ఉంది), తరువాత 2001: A Space Odyssey, Once Upon A Time in the West, Peppermint Candy.. ఇలాంటి సినిమాలు ప్రత్యేకంగా నిలిచి, సినిమాలు అంటే డైలాగులు కాదు. డైలాగులు సినిమాలో భాగం అని అర్థమవటం ప్రారంభమైంది. అందరి లాగా స్కూల్, కాలేజ్ సమయంలో కన్నా నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎక్కువ సినిమాలు చూడటం ప్రారంభమైంది. నవతరంగం వెబ్జైన్‌లో accidental గా కొన్ని ఆర్టికల్స్ వ్రాయటం, అదే సమయంలో అక్కడ cinephiles పరిచయం కావటంతో నాకు సినిమాల మీద మరింత ఆసక్తి కలిగింది. అప్పుడే ప్రపంచ సినిమా పరిచయం కావటం, మిత్రుల సహాయంతో సినిమాలు ఎలా చూడాలో తెలుసుకోవటం దీనిలో భాగం. టెర్మినేటర్‌లో సారా కానర్ ఇంకా పుట్టని బిడ్డ మీద మమకారం చూసినా, ఏలియన్స్ సినిమాలో తను కనని కూతురు అయిన Newt ను రక్షించేందుకు ఎలెన్ రిప్లే పడే తపన (the iconic – Not My Daughter You Bitch sequence) అయినా basic emotions and human bonds ఎక్కడ అయినా ఒకటే అని తెలిసేలా చేశాయి.
కొరియన్ సినిమాలలో మన పాతతరం సినిమాల్లో ఎక్కువగా చూసే మెలోడ్రామా ఉంటుంది. ఎంత ఆధునిక సాంకేతికతతో తీసినా, వారి సినిమాలను – excesses, stylistic choices ను strip down చేసి చూస్తే, మన 1960ల కాలంలో వచ్చిన తెలుగు సినిమాల skeleton ఉంటుంది. అందుకే అవి మనకు తెలియకుండా మరింత కనెక్ట్ అవుతాయి. ఉదాహరణకు టే గుక్-గీ అనే సినిమాలో అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్.
ప్రశ్న 3: అంతర్జాతీయ సినిమాల టాపిక్ వచ్చినప్పుడు, చాలామంది హాలీవుడ్ సినిమాలను ప్రస్తావిస్తారు. మీరు ప్రధానంగా కొరియన్ సినిమాలను ఎందుకు ఎంచుకున్నారు? కొన్ని వ్యాసాలలో హాలీవుడ్ సినిమాల కన్నా కొరియా సినిమాలే మిన్న అని వ్యాఖ్యానించినట్టు తోచింది. వివరిస్తారా?
జవాబు: పైన చెప్పినట్లు art and science of visual storytelling ను కొరియన్లు ఔపాసన పట్టినట్లు contemporary cinema లో ఎవరూ అవగాహన చేసుకోలేదు. మీకో చిన్న ప్రయోగం చెప్తాను. Oldboy కానీయండి, మరేదైనా ప్రముఖ కొరియన్ సినిమా కానీయండీ.. వాటిలో ఒక సన్నివేశాన్ని మ్యూట్ లో చూడండి. అదే పని ఆ స్థాయికే చెందిన కొన్ని హాలీవుడ్, తెలుగు/తమిళ సినిమాతో చేయండి. మీరు కొరియన్ సినిమాను మాత్రమే తల తిప్పకుండా చూడగలరు. అనిరుధ్ ఇచ్చిన rousing score లేకుండా రజనీకాంత్ జైలర్ ఎలివేషన్ సీన్లు చూడండి. హాస్యాస్పదంగా అనిపిస్తాయి. కేవలం రజనీకాంత్ కావటం వల్ల మనం సరిపెట్టుకుంటాము. అదే విధంగా Oldboy corridor fight (25:1) చూడండి. దృశ్యం కట్టిపడేస్తుంది మొదట. తర్వాతే శబ్దం. మనం సైన్స్‌లో నేర్చుకుంటాం. మొదట కాంతి కనిపిస్తుంది. తరువాతే శబ్దం వినిపిస్తుంది. పిడుగు పడ్డప్పుడు. సినిమా – దృశ్యాలకు ప్రాధాన్యం. శబ్దం తరువాత. అక్కడే కొరియన్ సినిమాలు మిగిలిన వారికన్నా ముందుంటాయి.
ప్రశ్న 4: ఓల్డ్ బోయ్ సినిమా గురించి చెబుతూ “ఒక సాధారణ మంచి కథ ఎలా చరిత్రలోనే ఎన్నదగిన గొప్ప సినిమా అయింది?” అని ప్రశ్నించి, “ఇక్కడే పార్క్ దర్శకత్వ ప్రతిభతో పాటూ మేధస్సు ప్రకాశిస్తుంది” అన్నారు. వెంజెన్స్ ట్రయాలజీ కాకుండా, ప్రేక్షకులను మెప్పించిన ‘పార్క్’ ఇతర సినిమాల గురించి చెప్తారా?
జవాబు: ప్రేక్షకులని మెప్పించని పార్క్ సినిమాలు లేవు. అందుకే అతను కొరియానంలో కథానాయకుడయ్యాడు. కొరియన్ వేవ్‌కు పూర్వ దశలో రెండు ఫ్లాప్ సినిమాలు తీసి కనుమరుగయ్యాడు. తరువాత విమర్శకుడిగా గొప్ప పేరు పొందాడు. కొన్ని సర్కిల్స్ లో. ఆ పాత సినిమాలు ఇప్పుడు చూసినా ఆ కాలంలో ఆడకపోవచ్చు కానీ, సినిమాలుగా బాగనే ఉంటాయి. నాకు ప్రత్యేకించి నచ్చిన సినిమా లేడీ వెంజన్స్. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే ఆ సినిమాది కూడా Fade to Black and White Edition. ఆయనకు నచ్చిన సినిమా I’m a Cyborg, But that’s Okay! Joint Security Area తో ఇంట గెలిచాడు. Oldboy తో రచ్చ గెలిచాడు. ఆ తరువాత విశ్రాంతి చరిత్ర అయినది (laughter). I mean.. Rest is history.
ప్రశ్న 5: చిన్న విషయాలలో ఆనందాన్ని వెతుక్కోవటమే జీవిత పరమార్థం అని చెప్పే ..ing సినిమా తీసిన దర్శకురాలు Lee Eon-hee అందించిన The Killer’s Shopping List series గురించి మరింత వివరిస్తారా?
జవాబు: ‘ద కిల్లర్స్ షాపింగ్ లిస్ట్’ (The Killer’s Shopping List) 2022లో ప్రసారమైన కొరియా టెలివిజన్ సిరీస్. కామెడీ, మిస్టరీ, థ్రిల్లర్ జాన్రాల మిశ్రమం. ఈ సిరీస్లో ఈ క్వాంగ్-సూ, కిమ్ స్యుల్-హ్యూన్, జిన్ హీ-క్యుంగ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇది కాంగ్ జీ-యంగ్ రాసిన నవల ఆధారంగా రూపొందించబడింది.
దీని కథ అన్ డే-సంగ్ (లీ క్వాంగ్-సూ) అనే కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. అతనికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. విస్లేషణా సామర్థ్యం శూన్యం. దానివల్ల, సివిల్ సర్వీస్ పరీక్షలో మూడు సంవత్సరాలుగా విఫలమవుతున్నాడు. ఇక చేసేది లేక తన తల్లి జంగ్ మ్యుంగ్-స్యుక్ (జిన్ హీ-క్యుంగ్) నడిపే MS మార్ట్‌లో పనిచేస్తుంటాడు (ఏం చేత్తన్నావ్ రా? క్వశ్చన్లుంటాయి మన దేశంలో లాగనే). అతని స్నేహితురాలు డో ఆ-హీ (కిమ్ స్యుల్-హ్యూన్) ఒక పోలీసు అధికారిణి. ఒక రోజు, వారి అపార్ట్మెంట్ సమీపంలో ఒక హత్య జరుగుతుంది. ఆ హత్యకు సంబంధించిన ఏకైక క్లూ మన కథానాయకుడి తల్లి నడిపే MS మార్ట్ నుండి వచ్చిన బిల్. ఈ ముగ్గురూ కలిసి హంతకుడిని కనుగొనేందుకు వినూత్నంగా బిల్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తారు.
దర్శకురాలు Lee Eon-hee natural humour ను హత్తుకునేలా deal చేసింది. మానవ సంబంధాలను మెలోడ్రామా మాయలో పడకుండా ఎంత బాగా చూపిస్తుందో …Ing సినిమాతో నిరూపించుకుంది.
8 ఎపిసోడ్ల ఈ సిరీస్ tvNలో ఏప్రిల్ 27 నుండి మే 19, 2022 వరకు ప్రసారమైంది. హాస్యం, సస్పెన్స్, కొంత రొమాన్స్ మేళవింపుతో కూడిన ఒక సరదా దర్యాప్తు కథగా ప్రేక్షకులను ఆకర్షించింది. జోరుగా హుషారుగా ఉంటుంది.
ప్రశ్న 6: “ఈ సినిమా కథను చెప్పటం చాలా కష్టం ఎంత కష్టమంటే మానవ హృదయపు లోతులను కనుగొనే ప్రయత్నమంత.” అని పోయెట్రీ సినిమా గురించి వ్యాఖ్యానించారు. ఈ సినిమా దర్శకుడు ఈ చాంగ్-డాంగ్ గురించి పుస్తకంలో చెప్పని విషయం ఏదైనా పాఠకులతో పంచుకుంటారా?
జవాబు: ఈమధ్యే ఒక సోషల్ మీడియా పోస్టు పెట్టాను. అది ఇలా సాగుతుంది. <<<“ఒక దేశపు సినిమా సూపర్ స్టార్ అక్కడి చిన్న సినిమాకు సరైన సహాయం ప్రభుత్వం నుంచీ రావటం లేదని కెరియర్ పీక్‌లో ఉన్నప్పుడు తన గళం వినిపించి నాలుగేళ్ళు సినిమాలకు దూరంగా ఉండటం విన్నారా? దేశం వదిలేసినా తన అవకాశాలకు ఢోకా ఉండదు. అయినా..
దేశపు నంబర్ వన్ డైరక్టర్‌గా ఉన్న సమయంలో మంత్రి పదవి లభిస్తే దాన్ని సరైన రీతిలో జనాలకు మేలు జరిగేలా చేయటంలో విఫలమయ్యానని రాజీనామా చేసిన మనిషి గురించి తెలుసా?”>>>
ఆ దర్శకుడు ఈ నే. ఆ సంఘటన జరిగింది 2005లో. ఆ నటుడు చోయ్ మిన్-సిక్.
కొరియాలో అత్యంత ఎక్కువగా రైట్ వింగ్ భావాలు ఉన్న నగరంలో తరతరాలుగా సోషలిస్టు (కంఠశోషలిజమ్ కాదులెండి) భావాలున్న కుటుంబంలో జన్మించాడు. రాజరికపు కుటుంబాలకు చెందిన వారు ఆయన పూర్వీకులు. వారంతా కూడా ఎక్కువగా ప్రజల పక్షాన నిలిచిన వారు. ప్రజోపయోగ కార్యక్రమాలు చేయాలంటే అధికారమే అవసరం లేదని వారి భావన. మినిస్టర్ ఆఫ్ కల్చర్‌గా చేస్తూ కూడా, చిన్న సినిమాకు మేలు జరిగే తన ప్రొపోజల్స్‌ను తిరిస్కరించారని, ఇతరత్రా కూడా తాను అనుకున్న విధంగా ground level లో నుంచీ మంచి మార్పులు వచ్చేలా పని చేయనీయటం లేదని తృణప్రాయంగా తన పదవిని వదిలేశాడు.
ప్రశ్న 7: కొరియన్ దర్శకుల గురించి చెబుతూ, “కొరియన్ దర్శకులు విజువల్ లాంగ్వేజ్‌లు అర్థం చేసుకున్నారు. సినిమా పర్పస్‌ను అవగతం చేసుకున్నారు. మంత్రదండం పెట్టి బోనులోకి లాగినట్లు, గాఢత కలిగిన విజువల్స్ వాడకం కొరియన్ దర్శకుల ప్రత్యేకత” అని అన్నారు. ఈ లక్షణాలున్న లేక కనీసం దగ్గరగా వచ్చిన భారతీయ దర్శకుడు ఎవరైనా మీ దృష్టిలో ఉన్నారా?
జవాబు: అరుణ్ మాదేశ్వరన్. తమిళ దర్శకుడు. కీర్తీ సురేశ్‌తో సానికాయిదం అనే సినిమా తీశాడు. కెప్టెన్ మిల్లర్ అని ధనుశ్‌తో తీసాడు. ఇతను వారి వైలెన్స్‌ను ఒక visual aesthetic గా వాడటాన్ని పట్టుకున్నాడు కానీ, అంత ఎఫెక్టివ్‌గా కనపడదు. గీత దాటినట్లు అనిపిస్తాయి. సందీప్ రెడ్డి వంగా. ప్రశాంత్ నీల్. వీళ్ళిద్దరూ తీసే దృశ్యాలు మన subconscious mind లో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. సుజొయ్ ఘోష్. ఇతను బద్లా అనే సినిమాలో అమితాభ్ బచ్చన్‌ను ఒక నటుడిగా కాక ఒక landscape లాగా వాడుకుని అద్భుతం సృష్టించాడు. తమిళ దర్శకుడే, మిస్కిన్. 9 సినిమాలు తీస్తే ఏడు క్లాసిక్స్ గా నిలిచాయి. 8 విజయవంతం అయ్యాయి.
ప్రశ్న 8: “కొరియన్ సినిమాలు, కొరియన్ పాటలు, కొరియన్ భాష, కొరియన్ సెలబ్రిటీలు, కొరియన్ కల్చర్.. ఇవన్నీ ఎందుకు ప్రపంచ వ్యాప్తంగా ఈమధ్య బాగా నచ్చుతున్నాయి? మనవాళ్ళలో కూడా విపరీతమైన క్రేజ్ ఎందుకు వచ్చింది?” అని ప్రశ్నలు వేశారు ఓ వ్యాసంలో. దానికి జవాబు ఏం చెప్తారు?
జవాబు: కొరియన్లు హృదయంతో ఆలోచిస్తారు. మెదడుతో పనిచేస్తారు. హృదయానికి, ఆత్మకు మధ్య ఒక చిన్న బ్రిజ్ (వారధి) ఉంటుంది. దాన్ని బాగా access చేయగలిగిన వారు దాదాపు ఒకే సమయంలో కొరియా నుంచీ వచ్చారు. వస్తున్నారు. అందుకే వారి ఆర్ట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంటోంది. అత్యంత రిమోట్ దేశంగా (దీవి, చిలీ దేశానికి చెందింది) పరిగణించే ఈస్టర్ ఐలండ్‌లో కూడా కొరియన్ సినిమాలకు, వారి డ్రామాలకు క్రేజ్ ఉంది.
ప్రశ్న 9: ‘డెసిషన్ టు లీవ్’ సినిమాని పరిచయం చేసే వ్యాసానికి ‘ఎద లోతుల్లో మొదలైందోలి గిలి’ అని పేరు పెట్టి, అసలు సినిమాని వివరించే వ్యాసానికి ‘వెన్నులో మొదలైంది చలి’ అనే శీర్షికనిచ్చారు. ఎందుకలా? విభిన్నమైన అనుభూతుల మేళవింపా ఆ సినిమా? మరింత వివరించండి.
జవాబు: అవును.
ఇంతకన్నా వివరణ ఇస్తే ఆ సినిమా చూడటం వల్ల వచ్చే అనుభూతి మిస్ అవుతుంది. మజా రాదు.
ప్రశ్న 10: “నిజ జీవిత సంఘటనలే చాలా కొరియన్ సినిమాలకు సరుకు. వాటికి హై కాన్సెప్ట్ కలిపి సినిమాలుగా తీస్తారు” అన్నారో వ్యాసం చివర్లో. హై కాన్సెప్ట్ అంటే ఏమిటో వివరించండి.
జవాబు: హైకాన్సెప్ట్ సినిమా అనేది ఒక సినిమా శైలి. సులభంగా అర్థమయ్యే, ఆకర్షణీయంగా కనిపించే, ఒకే వాక్యంలో వివరించగల ఒక ప్రత్యేకమైన, బలమైన ఆలోచన లేదా పాయింట్ ఆధారంగా రూపొందిస్తారు. ఈ రకమైన సినిమాలు సాధారణంగా వాణిజ్యపరంగా విజయవంతమవడానికి రూపొందించబడతాయి.
హైకాన్సెప్ట్ సినిమా యొక్క ప్రధాన లక్షణం.. సరళమైన ఆలోచన. సాలీడు కుడితే మనం చెయ్యి రుద్దుకుని, దాన్ని చంపి, వైద్యం అవసరమైతే చేయించుకుంటాం. అదే ఆ సాలీడు వల్ల అద్భుత శక్తులు వచ్చి ఒక సూపర్‌హీరోగా మారితే? ఆ వచ్చే కథ హైకాన్సెప్ట్.
బలమైన హుక్ ఉంటుంది. ప్రేక్షకులను వెంటనే ఆకర్షించే ఒక ఆసక్తికరమైన లేదా అసాధారణమైన ఆలోచన ఉంటుంది. Oldboy లో పదిహేను సంవత్సరాలు జైలులో ఉంచటం.
విజువల్ అప్పీల్ కలిగి ఉండటం. అవతార్, కల్కి 2898 ఏడీ. హైకాన్సెప్ట్ సినిమాలు తరచూ బలమైన విజువల్ ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటాయి, ఇవి ట్రైలర్లు లేదా పోస్టర్లలో సులభంగా ప్రచారం చేసేందుకు వీలుగా ఉంటాయి. ఎక్కువమంది ప్రేక్షకులకు చేరేలా ఉంటాయి సాధారణంగా. Train to Busan లో zombie apocalypse లో ఒక రైలులో చిక్కుకున్న ప్రయాణీకులు ఏమయ్యారు అని కథ – ఇది ఒక సరళమైనా కూడా శక్తివంతమైన ఆలోచన.
ప్రశ్న 11: ‘సేవ్ ద గ్రీన్ ప్లానెట్’ సినిమా గురించి చెప్తూ, “ఈ శతాబ్దంలో most underrated sci-fi black comedies లో ఒకటి” అని అన్నారు. ఈ సినిమా గురించి పుస్తకంలో లేని ఆసక్తికరమైన విశేషం ఏదైనా ఉంటే చెప్తారా?
జవాబు: సినిమా గురించి చెప్పాల్సినదంతా చెప్పేశాను. ఈ చిత్ర దర్శకుడు సినిమాకు సంబంధించిన ప్రతి డిపార్టుమెంటులో (24 crafts అంటారు కదా) ఏదోక సందర్భంలో పని చేశాడు. అదొక విశేషం. జేమ్స్ కామరాన్ కూడా అలా చేసిన వాడే. Jang Joon-hwan గురించి కొరియానం లాంటి పుస్తకంలో ప్రముఖంగా ఒక కథనం ఇవ్వదగిన వాడు. Main narrative కు అడ్డు వస్తోందని ఆయన గురించి ఎక్కువ సమాచారం ఇవ్వలేదు. చాలా విచిత్రమైన విశేషాలు ఉన్నాయి చెప్పాలంటే.
ప్రశ్న 12: “ఫెయిలైన ఫిల్మ్ మేకర్ గురించి మనం ఎందుకు ఇంతలా చెప్పుకుంటున్నాం” అని మ్యుంగ్ సే గురించి వ్యాఖ్యానించారు. ఆయన శైలిని యథేచ్ఛగా వాడుకున్న తెలుగు సినిమాలను ప్రస్తావించారు. ఆయన గురించి మరి కాస్త చెప్తారా?
జవాబు: ఈ మ్యుంగ్-సే కొరియన్ సినిమా పరిశ్రమలో ‘సినిమాటిక్ ఎక్స్ప్రెషన్’ అనే భావనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే దర్శకుడిగా పేరుగాంచారు. ఆయనకు సినిమా అంటే ఇతర మాధ్యమాలకు భిన్నంగా ఉండాలి. కేవలం సినిమాకు మాత్రమే సాధ్యమయ్యే విజువల్ మరియు కథన శైలి ప్రాధాన్యత పొందాలి అని ఆయన ఉద్దేశ్యం. ఈ విధానం ఆయన చిత్రాలైన Gagman (1988), Nowhere to Hide (1999)లో స్పష్టంగా కనిపిస్తుంది, ఇవి సాంప్రదాయ రియలిజంను అధిగమించి ప్రయోగాత్మక శైలిని ప్రదర్శిస్తాయి.
The Fountainhead నవలలో Howard Roark ఇలా అంటాడు “A building has integrity, just as a man and just as seldom! It must be true to its own idea, have its own form, and serve its own purpose.” దీన్ని సినిమాకు అప్లయ్ చేసిన వాడు ఈ మ్యుంగ్-సే.
ప్రశ్న 13: ఏప్రిల్ 2023లో వచ్చిన Killing Romance చాలా విచిత్రమైన సినిమా అని అన్నారు. ఎలాగ?
జవాబు: మన టేబ్లాయిడ్ లలో వచ్చే హత్య, మోసం వీటికి సంబందిచిన న్యూస్‌లు మాదిరిగా ఉంటుంది ఈ సినిమా కథ. మొన్నీమధ్యనే జరిగిన హనీమూన్ హత్య, ప్రేమకు అడ్డం పడుతోందని తల్లిని చంపిన 16 సంవత్సరాల కూతురు. వీటిలాగే ఈ సినిమా కథ ఉంటుంది. దాన్ని ఒక విభిన్నమైన aesthetic style లో సెటైరికల్ గా చూపుతారు. సంప్రదాయ బద్ధంగా ప్రియుని సహాయంతో భర్తను హతమార్చాలని చూడటం. కానీ దీనికి పూసిన పైపూత, వాడిన set-pieces ఈ సినిమాను ఒక సెమీ క్లాసిక్‌గా మార్చాయి. ఇందులో కూడా కొంతమేర హైకాన్సెప్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి.
ప్రశ్న 14: మీరు OTTలలో ఇప్పుడు వస్తున్న కొరియన్ సీరిస్లు ఫాలో అవుతారా? కొరియన్ సినిమాలలో ఉండే, మీకు నచ్చే లక్షణాలున్న సీరిస్ ఏదైనా ఉందా? ఉంటే వివరించండి.
జవాబు: Series లు నేను చూడను. కథా కథనాలను సాగతీస్తూ ఉంటే నాకు నచ్చదు. మరింత స్కోప్ ఉంటే ఒక సీక్వెల్ తీయవచ్చు. ఎక్కడికక్కడ కథతో conclusion ఉండాలి. లేదా ఉన్న కథ పెద్దది అయితే ఒకటి రెండు సీజన్లు. అలా సీజన్ల పాటూ ఎదురు చూసే సమయం ఓపిక ప్రస్తుతం నాకు లేవు. The Killer’s Shopping List, Park Chan-wook తీసిన మూడు ఎపిసోడ్లు (The Sympathiser), నట సార్వభౌముడు చోయ్ మిన్-సిక్ చేసిన బిగ్ బెట్ (రెండు సీజన్లు) చూసానంతే.
ప్రశ్న 15: ఇది కొద్దిగా వ్యక్తిగతమైన ప్రశ్న. పీఠికలో – ‘నీతో ఇదే సమస్య, కుళ్ళు జోకులేస్తావు’ అని ఆ వ్యక్తి అన్న మాటలని బహిర్గతం చేయడంలో ఇబ్బంది అనిపించలేదా? మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నట్టు అనిపించలేదా?
జవాబు: అతను మురిపెంగా అన్న మాట అది. ఆ విషయం నాకు తెలుసు కనుక సమస్య లేదు. పైగా కొరియానం narrator and writer (ఇద్దరూ వేరు వేరు) ఎలాంటి వారో పాఠకులకు ఒక expectation set చేసినట్లవుతుందని కూడా. పక్కనే ఉంటూ మంచి చెపుతూనే మన కాన్ఫిడెన్స్‌ను sabotage చేయాలని చూసే మనుషులను ఎక్కువ చూసిన నాకు ఆ వ్యక్తి matter of fact nature నచ్చింది. ఆయన నన్ను తక్కువ చేయలేదు (ఎప్పుడూ) కనుక నన్ను నేను తక్కువ చేసుకుంటం అనే మాటే లేదు. కొరియానం కొరియన్ అనువాదం కోసం ఆయన ఇచ్చిన endorsement letter లో వాక్యాలు చూస్తే అర్థమౌతుంది.
ప్రశ్న 16: ‘కొరియానం’ పుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఉంటే వాటిని పంచుకుంటారా? ఈ పుస్తకానికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది?
జవాబు: పుస్తకంగా తీసుకుని వస్తానని అనుకోలేదు. పైగా మొదట్లో వచ్చిన కొన్ని విమర్శలు అసలు ఈ సీరీస్ నిలబడుతుందా అన్న అనుమానాలు create చేసాయి. కానీ మిత్రుడు మూడవ ఎపిసోడ్ చూడగానే అనువాదానికి సంబంధించిన ఏర్పాట్లు చేయటం నాకు moral boost ఇచ్చింది. 52 వారాలు వ్రాశాక ఇలాంటి పుస్తకం ప్రపంచ సాహిత్య చరిత్రలో రాలేదు అని డప్పు వేసుకున్నాను కనుక దీన్ని పుస్తక రూపంలో తీసుకు రావటం నా బాధ్యత అనుకున్నాను. మహా అయితే వంద కాపీలు. ఒక ISBN Number ఉంటే, తెలుగులో (మాత్రమే) ఇలాంటి పుస్తకం వచ్చిందని ఒక రికార్డుగా పడి ఉంటుంది, అమ్మకాలు సంగతి తరువాత అనుకున్నాను. మీకు కొరియానంలో ముగ్గురే రీడర్లు అనే రన్నింగ్ జోక్ తెలుసు కదా.
క్రమంగా నేను 2013లో రాసిన చందమామ రావే.. పుస్తకం చదివిన వారు కొరియానం పుస్తక రూపంలో రావాలని అడగటం, నేను అనుకున్న దానిని అనుకున్నట్లుగా execute చేయగలగటం వల్ల వచ్చిన confidence పుస్తకంగా కొరియానం తీసుకు రావటానికి దోహదం చేశాయి. ఎక్కవ ప్రైస్ ఉండటం, ప్రయోగాత్మక శైలి వల్ల లిమిటెడ్‌గా కాపీలు వేసి అమ్మకాలు జరిపాము(రు). పబ్లిషర్లకు టేబుల్ ప్రాఫిట్ ఇవ్వగలిగాను. Pre-bookings. చాలామంది యువ/సమకాలిక రచయితల పుస్తకాలకు వచ్చిన విధంగా త్వరగా కొరియానానికి రివ్యూలు రాకపోవటం ఒక ఇబ్బంది అయింది. రివ్యూ కోసం పుస్తకాలు పంపించమని చెప్పిన తరువాత పుస్తకాలు పంపినా రివ్యూ రాకపోవటం నాకు పర్సనల్‌గా ఒక లెసన్. కొనే వారు వారు చదవబోతున్న పుస్తకం ఎలా ఉంటుందో తెలుసుకుని కొంటే బాగుంటుందనేది మా ఆలోచన. అంటగట్టాడు అనే మాట రాకూడదని నా భావన. అందుకే కొనే వారు ఉన్నా, పుస్తకాలు వెంటవెంటనే తీసుకు రాలేదు.
Book Festival సీజన్‌లో పెడితే అమ్మకాలు పెరుగుతాయి అని సలహాలు వచ్చినా ఆ పని చేయలేదు. అలా చేస్తే పుస్తకాలు అమ్ముడు పోతాయి కానీ పాఠకులు మిగలరు. చివరకు, ఫలానా రివ్యూ చూసి వచ్చాము అన్న వారికే అమ్మటం జరుగుతోంది. వారు చదవబోతున్న పుస్తకం ఎలా ఉండబోతోందో కొంత అవగాహనతో వస్తారు కనుక we don’t have to worry about conscience.
ఎంత గొప్ప పుస్తకమైనా, సినిమా అయినా, కళా రూపం అయినా ఈ రోజుల్లో విజిబులిటీ, endorsement కావాలి. అవి తీసుకు రావటంలో పబ్లిషర్లు కొంత వెనుకంజ వేశారు నా గత పుస్తకంతో పోలిస్తే. అదృష్టవశాత్తూ సరైన సమయంలో వచ్చిన కొన్ని రివ్యూలు/endorsements ఉపకరించాయి. పైగా కొరియానం సీజనల్ సబ్జెక్ట్ కాదు. ట్రెండు ఉన్నంత వరకే నడుస్తుంది అనే భయం లేదు. ఆలస్యంగా గుర్తింపు అన్న బాధ తప్ప ఓపిక పడితే నిలిచే పుస్తకమే. కొరియానం చదివిన వారందరూ దాదాపు ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. అంటే ఆ పుస్తకం విజయవంతమైనట్లే కదా. చందమామ రావే నచ్చలేదన్న కొద్దిమంది కూడా కొరియానం కొని చదివారు. కారణం వారికి నచ్చలేదు అన్న విషయాన్ని నేను స్వీకరించిన విధానం. ఆ పుస్తకాన్ని మేము మార్కెట్ చేసిన విధానం. కొరియానం బాగుంది అని అన్నారు. ఆత్మీయులు – అడిగితే చాలు కొంటారు అని నాకు తెలిసిన వారు – చాలామందికి కొరియానం ఇవ్వలేదు. దానికి కారణం వారికి కొరియానం తగిన పుస్తకం కాదు. వారికంత ఆసక్తి కలిగించే సబ్జక్ట్ కాదు. ఆ క్లారిటీ నాకు ఉంది.
I’m very satisfied with my work – delivered a highly unique work in Telugu literature.
గీతాచార్య రాశాడు కనుక, అని ఒక దృష్టికోణంలో కొంతమంది ఆలోచిస్తారు. దాన్ని నేను ఏమీ చేయలేను. ముందు తరాల వారు కొరియానం significance ను గుర్తిస్తారని నమ్మకం.
ప్రశ్న 17: ఏమిటి ఆ సిగ్నిఫికెన్స్? మీరు మహాభారతంతో పోల్చుకుంటూ ‘యదిహాస్తి తదన్యత్ర’ శ్లోకం కొరియానం పుస్తకం కవర్ మీద ఉంచారు. దానికి కారణం? Arrogance అనిపించలేదా?
జవాబు: రాగద్వేషాలు, ప్రేమ, మోక్షం (ఆత్మతృప్తి, జీవన సాఫల్యం). వీటి గురించి సవివరంగా కొరియానంలో ఉన్నాయి. Anatomy of crime, people’s behavioural patterns, the root cause of violence and other human emotions గురించి కనీసం తెలుగుకు సంబంధించినంత వరకూ పూర్తి సైంటిఫిక్‌గా ఎక్కడా రాలేదు. నేను సమస్యను ఎత్తి చూపటం కన్నా, పరిష్కారాలను కనుగొనటానికి ఇష్టపడతాను సాహిత్యంతో. కొరియానంలో ఆ పరిష్కారాలు కొంత వరకూ ఉన్నాయి. రాగద్వేషాలు, ప్రేమ, మోక్షం – వీటి గురించి కొరియానంలో ఉన్నవే ప్రపంచంలో ఉన్నాయి. కొరియానంలో లేనివి.. లేవు. గమనిస్తే ఒక సైకాలజీ పుస్తకంగా, ఒక సినిమా పుస్తకంగా, జీవితం గురించి చెప్పిన పుస్తకంగా, marginalised lives గురించి empathy తో రాసిన పుస్తకంగా, సాహిత్య స్థాయి అందుకున్న ఒక వినూత్నమైన రచనగా, ఒక వ్యంగ్య రచనగా, ఒక స్టాటిస్టికల్ ఎనాలిసిస్ (సినిమాలకు సంబందించి బాక్సాఫీస్) పుస్తకంగా, a book about cultural appropriation గా.. ఎలా కావాలంటే అలా ఉంటుంది కొరియానం. ఒక్కొక్కరూ ఒక్కో యాంగిల్ లో రివ్యూ ఇస్తున్నారు. So, it’s not arrogance. Just stating a fact. మీకు ఏదైనా తెలుగు పద్యం గుర్తుకు వస్తోందా? మహాభారతానికి సంబంధించి?
PTSD ని డైరక్టుగా అడ్రస్ చేస్తూ, దాన్ని అధిగమించే సూచనలు, పరిష్కార మార్గాలు ఉన్నాయి కొరియానంలో. అలాంటి పుస్తకాలు తక్కువైనా తెలుగులో?
ప్రశ్న 18: చివరగా, కొరియానం లాంటి రచనలు భవిష్యత్‌లో చేస్తారా? కొరియానంకు కొనసాగింపు ఉంటుందా?
జవాబు: కొరియానం నేను ప్లాన్ చేసిన SSC (Science Sports Cinema) Trilogy లో సినిమాకు సంబంధించిన పుస్తకం. సైన్స్ రిలేటెడ్ సీరీస్ “అన్నీ సైన్సులో ఉన్నాయి ష! – From Copernicus to Quantum Computing” (Or Thus Spake Science! – ఇంగ్లీష్ వర్షన్) ప్రస్తుతం నడుస్తోంది. Sports పుస్తకం “Rafael Sampras: Up the Memory Plane (A personal History of Tennis from 1934 to 2024)” Pre-writing stage లో ఉంది. కొరియానం లాంటి రచనలు కాదు. దానికి మించిన రచనలు చేయాలి. ఎదుగుదల ఉండాలి కదా. కొనసాగింపు ఉండదు. ఏవైనా విశేషాలు ఉంటే, సంచికతోనే పంచుకుంటున్నాను కదా.
~
సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు వేదాల గీతాచార్య గారు.
వేదాల గీతాచార్య: ధన్యవాదాలు.
***
రచన: వేదాల గీతాచార్య
ప్రచురణ: GALTing Parables
పేజీలు: 432
వెల: ₹ 500/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 8008160011
~
‘కొరియానం’ పుస్తక సమీక్ష:
https://sanchika.com/koreanam-book-review-kolluri-ss/