Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత్రి సుస్మిత ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘వలస’ అనే నవల వెలువరించిన సుస్మిత గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం సుస్మిత గారూ.

సుస్మిత: నమస్కారం.

~

ప్రశ్న 1: మీ పేరు గమ్మత్తుగా వుంది. కొత్తావకాయ సుస్మిత.. ఈ పేరు నేపథ్యం తెలుపుతారా?

జ: నా బ్లాగ్ పేరు కొత్తావకాయ. బ్లాగ్‌కి ఆ పేరు పెట్టుకోడానికి కూడా ప్రత్యేకమైన కారణమేమీ లేదు. భానుమతీ రామకృష్ణ ‘అత్తగారి కథలు’ చదివిన కొత్తల్లో బ్లాగ్ మొదలుపెట్టాను. అందులో నాకిష్టమైన కథ ‘అత్తగారూ ఆవకాయ’ గుర్తొచ్చేలా కొత్తావకాయ అని బ్లాగ్ పేరు పెట్టుకున్నాను. ప్రొఫైల్లో నా అసలు పేరు పెట్టుకోవచ్చని అప్పట్లో నాకు తెలీదు. అలాగే చలామణీ అయిపోయింది. ఇప్పటికీ బ్లాగర్ ఫ్రెండ్స్ కొత్తావకాయగారూ అనే పిలుస్తారు. నెమ్మదిగా సుస్మిత అనే పేరు సోషల్ మీడియాలో పరిచయమైంది.

ప్రశ్న 2: ఇది మీ తొలి నవలా? నవల రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జ: 2012లో కౌముది వెబ్ మేగజీన్‌లో ‘గాలిసంకెళ్ళు’ అనే నవల ధారావాహికగా రాసాను. ‘వలస’ రెండవ నవల. కథ, నవలల మధ్య ఉన్న ప్రాథమిక తేడా అర్ధమైనప్పుడు చెప్పాలనుకున్న అంశానికి సరిపోయేలా నవల అనే మాధ్యమాన్ని ఎంచుకోడం సులువవుతుంది. ‘వలస’ విషయంలో కూడా అదే జరిగింది.

ప్రశ్న 3: ఆలోచనను ఆచరణలో పెట్టటంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు, ఆనందాలు వివరిస్తారా?

జ: రాసేందుకు సమయం చేజిక్కించుకోవడమనేది నా వరకూ పెద్ద ఛాలెంజ్ అయింది. ఒక్కో మనస్థితిలో, ఆలోచనలో మునిగిపోయి రాసేటపుడు దాన్ని పక్కన పెట్టి వృత్తి వ్యక్తిగత జీవితాలకు సమయాన్ని కేటాయించాల్సి రావడం కష్టమనిపించేది. ఇది రాయలవారి కాలమూ కాదు నేను పెద్దననూ కాను. కాబట్టి నా అతిపెద్ద సమస్య సమయం. నవల మొదటి డ్రాఫ్ట్ పూర్తయిన రోజు సంతోషమనిపించింది.

ప్రశ్న 4: ఈ నవల రచనలో మీరు పలు విభిన్నమైన పాత్రల జీవితాలను ప్రదర్శనకు ఎన్నుకున్నారు. ఇన్ని పాత్రలు ఇన్ని విభిన్నమైన మనస్తత్వాలను ప్రదర్శించేందుకు మీరు ప్రణాళిక ఎలా వేసుకున్నారు? పాత్రల ప్రదర్శనలో సమతౌల్యం, సమన్వయం ఎలా సాధించారు?

జ: ‘వలస’ నవలలో ఇతివృత్తానికి అవసరమైన పాత్రలని నిర్ణయించుకుని ఆ పాత్రల స్వభావాలను, వృత్తులనీ, సమస్యలనీ క్లుప్తంగా రాసుకుని అప్పుడు రాయడం మొదలుపెట్టాను. ముఖ్యపాత్రలన్నీ ఒకదానికొకటి తారసపడాలన్నది ఈ నవల వరకూ నేను పెట్టుకున్న నియమం. ఏ పాత్రా ఎక్కువ మాట్లాడకూడదన్నది నా సహజమైన రూల్. నా పాత్ర చెప్పిన డైలాగ్ నేను బయటికి చదివితే నాకు ఆయాసం రాకూడదు, నేను తొట్రు పడకూడదు. ఇవీ నేను రాసేటప్పుడు పెట్టుకున్న గైడ్లైన్స్.

ప్రశ్న 5: మీ రచన సంవిధానంలో రచయితగా ఒక డిస్కనెక్ట్ కనిపిస్తుంది. రచయిత పాత్రలను దూరంగా వుండి పరిశీలిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే, రచయిత పాత్రలతో తాదాత్మ్యం చెందకుండా ఒక నిష్పాక్షిక పరిశీలకుడిలా కథ చెప్తున్నట్టు తోస్తుంది. చదువుతున్నప్పుడు పాఠకులు సైతం పాత్రలతో మమేకం అవటంలో ఈ కథ చెప్పే విధానం అడ్డుపడుతుంది. ఈ రచనా శైలి మీరు కావాలని ఎన్నుకున్నారా? లేక, మీ రచనాపద్ధతే అదా?

జ: ఉత్తమపురుష కథనానికీ, చైతన్యస్రవంతికీ ఉన్న వెసులుబాటు తాద్యాత్మ్యంగా రచయిత తన భావనలని చెప్పగలగడం. సర్వసాక్షి కథనానికి స్పష్టమైన పరిమితులున్నాయి. వాటిని దాటి తన ఉద్దేశ్యాలని పాత్రల ప్రవర్తనకి రుద్దే పని రచయిత పెట్టుకోకూడదు. ఈ స్పష్టమైన తేడాలను పాఠకురాలిగా గమనించాను కనుకే ‘వలస’ కోసం రచయితగా సర్వసాక్షి కథనాన్ని ఎంచుకున్నాను. సున్నితమైన ఇతివృత్తం అవడం వలన కూడా చాలా జాగ్రత్తగా కథ నడిపే ప్రయత్నం చేసాను.

ప్రశ్న 6: సాధారణంగా రచించే సమయంలో రచయితకు ఒకోసారి ఇదంతా ఎవరు చదువుతారు? అన్న సంశయం వస్తుంది. మీరు అలాంటి సందిగ్ధానికి గురయ్యారా? అలాంటి సమయాల్లో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు?

జ: ‘వలస’ నవల విషయంలో నాకు మొదట్నుంచీ నమ్మకం ఉంది. ఇది చేరాల్సిన తీరం కచ్చితంగా చేరి తీరుతుందని తెలుసు. రచయితగా చిత్తశుద్ధితో చెయ్యాల్సిన కసరత్తు చెయ్యడం, అవసరమనుకున్న చోట లౌల్యానికి పోకుండా తిరగరాయడం, చాపల్యం వదిలి కత్తిరించడం వరకే నా పని. మార్కెటింగ్ కూడా నేనే చెయ్యాల్సి రావడం భుజాలకెత్తుకున్న అదనపు బాధ్యత. అంతకుమించి ‘వలస’ నవల ఇతివృత్తం చాలా అవసరమైనదని నమ్మబట్టే రాసాను కనుక ఎక్కడా సంశయాలు కలగలేదు. నా మిగిలిన రచనల విషయంలో నాకొక తాత్విక దృక్పథం అలవడింది. గింజకి జీవశక్తి ఉంటే ఎక్కడ పడేసినా పోదనే శ్రీరమణ చెప్పిన మాట నన్ను దారి తప్పకుండా కాపాడుతూ ఉంటుంది. అందుకని నా పని ఎంత బాగా చెయ్యగలనన్నదాని మీదే నా దృష్టి కేంద్రీకరిస్తాను.

ప్రశ్న 7: ఈ నవల రచనలో మీరు ఏ ఒక్క పాత్రపైనో సానుభూతి కలిగించాలనో, పాఠకులకు దగ్గర చేయాలనో ప్రయత్నించలేదు. ఇందువల్ల నవల పూర్తయిన తరువాత, ఈ నవల ఏ ఒక్క వ్యక్తి గురించోకాదు, ఇది విదేశాలకు వలసవెళ్తున్న భారతీయుల మనస్తత్వాలు, వారి పరిస్థితుల విహంగ వీక్షణం అనిపిస్తుంది. A slice of Life. ఈ నవల రచనలో మీ లక్ష్యం అదేనా? మీరు అనుకున్నది అనుకున్నట్టు ప్రదర్శించటంలో మీరు విజయవంతమయ్యారనిపిస్తున్నదా?

జ: నూటికి నూరుపాళ్ళు.

ప్రశ్న 8: ఒక రకంగా, మీ నవల విదేశీ జీవితాలపట్ల వుండే పొరలను తొలగించి చూపిస్తుంది. మీ దృష్టిలో, ఒక వ్యక్తి ఎదుగుదల విదేశీ జీవితంలో అధికంగా వీలవుతుందా? అదే వ్యక్తి స్వదేశంలో వుంటే అధికంగా వీలవుతుందా?

జ: వ్యక్తి ఎదుగుదలకి ఎవరి నిర్వచనం వారిది కదా. పురోభివృద్ధి ఎక్కడుంటే అక్కడికి మనిషి ప్రయాణం చేయడమనేది అనాదిగా జరుగుతున్న విషయమే. డాలరు విలువ రూపాయి కంటే ఎక్కువ ఉన్నన్నాళ్ళూ అమెరికాకి వలసలుంటాయి. ఆర్థిక పురోభివృద్ధిని మించినదేదైనా పట్టి ఉంచితే తప్ప పుట్టిన ఊళ్ళోనే ఉండిపోవడమనేది ఈ రోజుల్లో దాదాపుగా అసాధ్యం. ఆర్థికంగా ఉన్నచోటు కదలకుండా కూడా ఎదిగే అవకాశాలు ఇరవై ఏళ్ళ క్రితం కంటే ఇప్పుడు ఎక్కువగా కనబడుతున్నాయి. అది కూడా గ్లోబలైజేషన్, టెక్నాలజీ పుణ్యమే. జోహో లాంటి దేశీయ కంపెనీలు పెరుగుతున్న వేగం చూస్తుంటే రాబోయే రోజుల్లో చాలా మార్పులు జరగబోతున్నాయనిపిస్తుంది.

ప్రశ్న 9: సాధారణంగా విదేశీ విద్యావిధానంలో వ్యక్తిత్వ వికాసానికి అధికావకాశాలుంటాయంటారు. ఈ నవలలో వున్న పిల్లల పాత్రలన్నీ ఏదో ఒక మానసిక సమస్యలున్నవారే. ఇది సాంస్కృతిక ధార్మిక సంఘర్షణల సమస్యనా? లేక , ఆయా కుటుంబాలకే ప్రత్యేకమైన సమస్యనా?

జ: సమాజంలో పుట్టి పెరుగుతున్న పిల్లలని, భారతదేశ మూలాలున్న తల్లిదండ్రులు పెంచాల్సి వచ్చినప్పుడు ఒడిదుడుకులు తప్పవు. భారతీయ సమాజానికి యూనిట్ కుటుంబం. అదే పాశ్చాత్య సమాజంలో వ్యక్తే ప్రధానం. సర్వతోముఖమైన వ్యక్తిత్వ వికాసానికి ధార్మికమైన మూలాలుండాలి. Resilience, మానసిక దృఢత్వం భారతదేశంలో పుట్టిన వారికి సహజంగా ఉందనిపిస్తుంది. భారతదేశ విద్యావిధానంలో అతిగా పోటీతత్వమున్నట్టే అమెరికాలో అతిగా వ్యక్తివాదముంటుంది. అసమానతలని చెరిపేయడమే ఏకైక లక్ష్యంగా పిల్లల్ని పెంచుతారు. అది ఎంతవరకూ విజయవంతమైందో హేట్ క్రైమ్స్ లెక్కలు చూస్తే అర్థమవుతుంది. వీటన్నిటిలో పడి పిల్లలు హక్కుల గురించి మాత్రమే నేర్చుకుని బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. యువతరం యాక్టివిస్టులవుతున్నారు తప్ప కంట్రిబ్యూటర్లు లేకుండా పోతున్నారు. స్వేచ్ఛ అనే నాణానికి మరొకవైపు ఒంటరితనం ఉంటున్నదన్న స్పృహ లేకపోవడం మనిషిని అనుకోని మలుపుల్లో కుంగదీస్తుంది. It is now hitting the rock bottom. ఈ సాంస్కృతిక మార్పుని కోరి దిగుమతి చేసుకుంటున్న భారతసమాజానికి ‘వలస’ ఒక హెచ్చరిక కాగలిగితే మంచిదే.

ప్రశ్న 10: పలు పాత్రలను, జీవితాలనూ ప్రదర్శించటంవల్ల, పాత్రల మానసిక స్థితులను లోతుగా వర్ణించటం ప్రతిబంధకంగా అనిపించిందా? ఉదాహరణకు, తురీయ పాత్ర కానీ, శంకర్ పాత్రకానీ, కోకిల పాత్రకానీ, ఆదిత్య పాత్రకానీ అనుకున్న రీతిలో ఎదగలేదనిపిస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి?

జ: రచయిత మస్తిష్కంలో చిన్నాపెద్దా పాత్రలన్నీ సంపూర్ణంగా దిద్దుకున్నాకే, అందులో ఆ సన్నివేశానికీ, ఆ నవల పరిధిలో అవసరమైన మేరకు పాత్రల ప్రస్తావన జరుగుతుంది. నిజానికి మీరు ప్రస్తావించిన ఒక్కొక్కరినీ ప్రధాన పాత్రగా తీసుకుని ఒక్కో నవల రాయవచ్చు. ‘వలస’ సందర్భం అది కాదు.

ప్రశ్న 11: ఈ నవలలోని పాత్రలలో మీ మనసుకు దగ్గరగా వచ్చిన పాత్ర ఏది?

జ: పాఠకురాలిగా చదివేటప్పుడు శంకర్, రచయితగా రాసేటప్పుడు కమల.

ప్రశ్న 12: ఏ పాత్రను తీర్చిదిద్దటం మీకు కఠినమనిపించింది?

జ: బాబ్జీ, భువన్ – ఏమాత్రం అదుపు తప్పినా పూర్తిగా నెగిటివ్ షేడ్‌లో పడిపోయే అవకాశమున్న పాత్రలు వారిద్దరూ.

ప్రశ్న 13: ఈ నవలలో ఈనగాచి నక్కలపాలుచేయటంఅన్నది ప్రతి ఒక్కరి మనసును స్పందింపచేస్తుంది. ప్రస్తుత సమాజంలో అమెరికా అయినా, భారత్ అయినా పిల్లల పెంపకం దైవాధీనమయిపోయింది. రెండు సమాజాలనూ సన్నిహితంగా చూస్తున్నవారు కనుక, ఈ విషయంలో ఈ రెండు సమాజాలలోని వారికి మీరు ఏమైన సలహాలు, సూచనలు ఇస్తారా?

జ: డబ్బు చెట్లకి కాయనట్టే, పిల్లలు ఊరికే రారు. ఏమరుపాటుగా ఒక్క క్షణమున్నా కబళించేసే బూచులు సమాజంలో చాలా పొంచి వున్నాయి. ఈనగాచి నక్కలపాలు చెయ్యకూడదు. ఇంతకుమించి చెప్పడానికి ఏమీ లేదు. చెప్పాల్సినదంతా నవలలో చెప్పేసాను.

ప్రశ్న 14: మీరీ నవలలో, భారత్ రావాలనుకున్నా రాలేక పోవటం, అక్కడే ఆనందంగా వుండలేని సందిగ్ధాన్ని పలుపాత్రలలో ప్రదర్శించారు. మీ అనుభవం ఏమిటి? ఈ సందిగ్ధం భారతీయులకు ప్రత్యేకమా? లేక, ఇతర దేశాలనుంచి అమెరికా వలసవచ్చేవారందరికీ వర్తిస్తుందా?

జ: మంచి ప్రశ్న. ఇతరదేశాలనుండి ‘వలస’ వచ్చేవారిలో నాకు తెలిసినంత వరకూ ఈ సందిగ్ధం తక్కువగా కనబడింది. ‘వలస’ పక్షుల్ని వెనక్కి రమ్మని లాగే బలమైన ఆకర్షణ, బంధం భారతదేశంలో కచ్చితంగా ఉంది. స్పష్టమైన కారణమిది అని చెప్పలేను.

ప్రశ్న 15: ఈ నవలలో మీరు ప్రదర్శించాలనుకుని ప్రదర్శించని అంశాలగురించి చెప్తారా?

జ: అరటిపండు వొలిచినట్టు అన్నీ విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదని, కొన్ని పాఠకుడి ఊహకి, మేధకి వదిలివేయాలని నమ్మే పాఠకురాల్ని. రచయితగా కూడా నేను ఆ పంథానే ఇష్టపడతాను. అలా మార్మికంగా, సూచనప్రాయంగా చెప్పినవి కొందరు పాఠకులు పట్టుకున్నప్పుడు సంతోషంగా అనిపిస్తోంది.

ప్రశ్న 16: నవల ముగింపు గురించి వివరించండి. ఇలా ముగించటానికి ప్రేరణ ఏమిటి?

జ: A good writer is one who stops where there is nothing further to convey for him. అనే వాక్యంతో యండమూరి ‘ఆనందోబ్రహ్మ’ నవల ముగుస్తుంది. నేనూ అదే నమ్ముతాను.

ప్రశ్న 17: నవలలో ప్రస్తావించిన సంగీతం సాహిత్యం రిఫరెన్సుల గురించి ఏమైనా చెప్తారా?

జ: సందర్భానుసారంగా సాహిత్యాన్ని సంగీతాన్ని ప్రస్తావించాను. ఎన్నారైల జాతీయగీతంలాంటి పాట ‘జీవితం సప్తసాగరగీతం..’ అనిపిస్తుంది. కన్నడ ఉష కల్యాణితో ప్రస్తావించిన ‘అమెరికాదల్లి గోరూరు’ సాహిత్య అకాడెమీ బహుమతి పొందిన ట్రావెలాగ్. అలాగే నా అభిమాన నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తికి గౌరవ పురస్సరంగా రెండు సందర్భాల్లో ఆయన ‘స్రవంతి’, ‘అంకుల్ సామ్’ నవలలోని సన్నివేశాలు, వాక్యాలని ప్రస్తావించాను. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగానైనా ఎవరైనా పాఠకులు పట్టుకుంటే బావుంటుంది కదా.. నేనూ ఎదురుచూస్తున్నాను.

ప్రశ్న 18: పుస్తక ప్రచురణలో మీ అనుభవాలేమిటి?

జ: అమెరికాలో ఉంటూ భారతదేశంలో పుస్తకం ప్రచురించడమనేది చాలా పెద్ద పని. డీటీపీ, కవర్ పేజీ దగ్గర నుండి ప్రింటింగ్, డిస్ట్రిబ్యూషన్ వరకూ ప్రతి దశలోనూ ఫోన్‌లో మాట్లాడుతూ, మార్పులూ చేర్పులూ చేస్తూ తుడుపు నుంచీ దేవతార్చన దాకా స్వయంగా చేసుకోవాల్సి రావడం తక్కువ కష్టం కాదు. అమెరికాలో ఎన్నో సాహిత్య సంఘాలున్నా ప్రచురణకి సరైన ఎకో సిస్టమ్ లేదు. భారత్‌లో ఉన్న పుస్తక ప్రచురణ ఎకో సిస్టమ్ ఎన్నారైలకి కలిసి రాదు. I don’t need to reinvent the wheel but I had to. నాకు తెలిసీ స్వయంగా పుస్తకం ప్రచురిస్తున్న అమెరికా తెలుగు రచయితలందరి పుస్తక ప్రచురణ అనుభవాలూ దాదాపుగా ఇవే.

ప్రశ్న 19: పుస్తక ప్రచురణ తరువాత తెలుగు సాహిత్య ప్రపంచంలో పుస్తకానికి వస్తున్న స్పందనపై మీ స్పందన?

జ: బంగారపు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలంటారు. ఈ నవలని పాఠకుల దాకా చేర్చడానికి అలాంటి సపోర్ట్ దొరుకుతుందని ఆశపడ్డాను. ఆశ్చర్యకరంగా అది పాఠకుల దగ్గర్నుంచే నేరుగా దొరికింది. సోషల్ మీడియాలో నవలలోని పాత్రల పరిచయాలతో పాఠకుల్లో ఆసక్తి కలిగించగలిగాను. కన్నడ డిజిటల్ ఆర్టిస్ట్ సౌమ్యా కల్యాణ్ కర్ అంతే ఆసక్తికరమైన ఆకర్షణీయమైన కవర్ పేజీ డిజైన్ చేసిచ్చింది. నవల చదివిన వారందరి దగ్గరుంచీ మంచి స్పందన దొరుకుతోంది.

ప్రశ్న 20: మీ పరిచయం మా సంచిక పాఠకుల కోసం?

జ: పేరు సుస్మిత. పుట్టి పెరిగింది విజయనగరంలో. గత ఇరవై ఏళ్ళుగా అమెరికాలో ఉంటున్నాను. వృత్తిరీత్యా ఐటీ ప్రొఫెషనల్‌ని. సాహిత్యాభిమానిని. 2010 నుంచీ బ్లాగర్‌ని. తిరుప్పావై పాశురాల ఆధారంగా బ్లాగ్‌లో రాసిన ‘మంచి వెన్నెలవేళ’ అనే ముప్పై ఒక్క కథల సంకలనాన్ని అనల్ప ప్రచురణ సంస్థ ముద్రించింది. ‘గాలిసంకెళ్ళు’ నవల కౌముదిలో ధారావాహికగా ప్రచురితమైంది. కొన్ని కథలు రాసాను.

ప్రశ్న 21: సాహిత్యరంగంలో రచయిత్రిగా, ప్రచురణకర్తగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధమవుతున్నాయా?

జ: ‘వలస’ నవల తరువాత ఇందులోంచి బయటపడటానికి కొంత విరామం అవసరమనిపిస్తోంది. మూడేళ్ళుగా చదవాల్సిన పుస్తకాలు చాలానే పేరుకున్నాయి.

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు సుస్మిత గారూ.

సుస్మిత: ధన్యవాదాలు.

***

వలస (నవల)
రచన: సుస్మిత
ప్రచురణ: అక్షమాల బుక్స్,
పేజీలు: 246
వెల: ₹ 225/-
ప్రతులకు:
పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ. ఫోన్ 9866115655
ఆన్‌లైన్‌లో:
https://logilitelugubooks.com/book/valasa-susmita

 

 

 

~

‘వలస’ నవల సమీక్ష:
https://sanchika.com/valasa-s-book-review/

Exit mobile version