Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఫిల్మ్ జర్నలిస్ట్, గీత, కథా రచయిత శ్రీ పులగం చిన్నారాయణ ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘జై విఠలాచార్య’ అనే పుస్తకాన్ని వెలువరించిన శ్రీ పులగం చిన్నారాయణ ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం పులగం చిన్నారాయణ గారూ.

పులగం చిన్నారాయణ: నమస్కారం.

~

ప్రశ్న 1. సాధారణంగా సినీ జర్నలిస్టులు యూరోపియన్ సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడతారు. ఇందుకు భిన్నంగా మీరు తెలుగు మాస్ దర్శకుడు విఠలాచార్య గురించి పుస్తకం తీసుకురావాలని ఎందుకు అనుకున్నారు?

జ: తెలుగులో మహామహులైన దర్శకులు ఉన్నారు. కె.వి.రెడ్డి, బి.యన్.రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు.. జాబితా చెబుతూ వెళితే చాలా పెద్దది. ఆ తరం దర్శకులలో విఠలాచార్య కూడా ఉన్నారు. వాస్తవంగా ఆయన తెలుగు దర్శకుడు కాదు. కన్నడ చిత్రసీమలో తన ప్రయాణం ప్రారంభించారు. ఆ తర్వాత మద్రాసు షిఫ్ట్ అయ్యి.. తెలుగు సినిమాలు తీయడం మొదలుపెట్టారు. తెలుగు నేర్చుకుని మరీ సినిమాలు తీశారు. విఠలాచార్య కంటే ముందు జానపద చిత్రాలు వచ్చాయి. అయితే జానపద చిత్రాలకు ఒక ప్రత్యేక రూపం ఇచ్చినది మాత్రం విఠలాచార్య గారు అని చెప్పాలి. జానపద చిత్రాల శైలిని ఆయన మార్చారు. జానపదం అంటే మాస్ సినిమా అనే ఇమేజ్ తీసుకువచ్చారు. దాంతో అగ్ర హీరోలు అందరూ జానపద చిత్రాలు చేయడానికి మొగ్గు చూపించారు. విఠలాచార్య దర్శకత్వంలో ఎన్టీఆర్ గారు, కాంతారావు గారు సినిమాలు చేశారు. వాళ్లందరూ తమతమ సినిమా ప్రయాణంలో విఠలాచార్య దర్శకత్వంలో నటించిన సినిమాలు మధుర జ్ఞాపకాలు. తక్కువ రోజుల్లో సినిమా తీయడం మాత్రమే కాదు.. సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే ఎంత వ్యయంలో సినిమా తీయాలి? ఎప్పుడు విడుదల చేయాలి? ప్రచారం ఏ విధంగా చేయాలి? అని ప్రతి విషయంలో ముందుగా ఒక నిర్ణయానికి వచ్చేవారు. ఆ రోజుల్లోనే అంత ప్రణాళికతో సినిమాలు చేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి, పూరి జగన్నాథ్ వంటి దర్శకులు సినిమాకు కొబ్బరికాయ కొట్టిన రోజునే విడుదల తేదీ ప్రకటించడం ఈతరం ప్రేక్షకులకు తెలుసు. అయితే ఆ రోజులలో విఠలాచార్య అటువంటివి చేశారు. పబ్లిసిటీ పరంగానూ ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అవన్నీ ఈ తరానికి తెలియాలనే ఉద్దేశంతో పుస్తకం రాశాను.

ప్రశ్న 2. ఈ పుస్తకం ముందుమాటలో మీరు హాలీవుడ్ దర్శకుల కన్నా విఠలాచార్య గొప్ప అన్నట్టు రాశారు. మరి విఠలాచార్యను మన సినీ విమర్శకులు ఎందుకని గొప్ప దర్శకుడిగా అంగీకరించరు?

జ: అప్పట్లో విఠలాచార్య గారి మీద చిన్నచూపు ఉండేదట. నేను చదివిన దాని బట్టి.. నాకు అర్థమైన దాన్ని బట్టి.. ఏదో చుట్టేస్తారనే చిన్నచూపు ఉండేదట. అంతిమంగా ఏ సినిమాకైనా కావాల్సింది కాసుల వర్షమే. విఠలాచార్య గారి సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర బోలెడు కలెక్షన్లు వచ్చాయి. ఆయన సినిమాలు అన్నీ మంచి వసూళ్లు సాధించాయి. ఈ తరం ప్రేక్షకులకు కూడా ఆయన తెలుసు. ఇప్పటి ప్రేక్షకులకు పాత తరం దర్శకులు కొందరు తెలియకపోవచ్చు. కానీ జానపద బ్రహ్మ విఠలాచార్య ప్రతి ఒక్కరికి పరిచయమే. ఏదో ఒక సమయంలో ఆయన చేసిన సినిమా చూసే ఉంటారు. జగన్మోహిని, బందిపోటు సినిమాలు ఇప్పటికీ చూస్తుంటారు. ఆయన మేకింగ్ స్టైల్ ఈతరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. అడ్వాన్స్డ్ కెమెరాలు, గ్రాఫిక్స్, టెక్నాలజీ అందుబాటు లేని సమయంలోనే సాధారణ కెమెరాలతో విఠలాచార్య అద్భుతాలు సృష్టించారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఆ విధంగా సినిమాలు తీయవచ్చు అనే ఊహ రావడమే గొప్ప. విఠలాచార్యలో మరో గొప్పదనం ఏమిటంటే.. తక్కువ రోజుల్లో పరిమిత వ్యయంతో సినిమాలు తీశారు. ఆయనలో ఈ ప్రత్యేకత నేను ఈ పుస్తకం రాయడానికి ప్రధాన కారణం. ఉదాహరణకు ఆయన ఒక గది తీసుకుంటే.. అందులో వంట సామాను పెడితే కిచెన్, మంచం వేస్తే బెడ్ రూమ్, సోఫా పెడితే హాల్ అన్న విధంగా సన్నివేశానికి తగ్గట్టు మార్చుకుని త్వరితగతిన సినిమాలు చేశారు. పర్ఫెక్ట్ ప్లానింగ్ విఠలాచార్య సొంతం. మేకింగ్ విషయంలో విఠలాచార్య ప్రయాణం రాబోయే దర్శకులకు సైతం ఒక పెద్ద బాలశిక్ష వంటిది.

ప్రశ్న 3. జై విఠలాచార్యపుస్తకం రాయడం ఎలా మొదలుపెట్టారు?

జ: ‘జై విఠలాచార్య’ నేను రాసిన తొమ్మిదో పుస్తకం. జంధ్యామారుతం, ఆనాటి ఆనవాళ్లు, సినీ పూర్ణోదయం, స్వర్ణయుగ సంగీత దర్శకులు, పసిడి తెర, సినిమా వెనుక స్టోరీలు, మాయాబజార్ మధుర స్మృతులు, వెండి చందమామలు రాశా. సినిమా జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన నేను.. ఇప్పుడు సినిమాలకు కథలు, మాటలు రాస్తూ బిజీగా ఉన్నాను. ఇకపై పుస్తకాలు రాయకూడదని అనుకున్నాను. అటువంటి సమయంలో విఠలాచార్యపై పుస్తకం రాయమని ప్రతిపాదన వచ్చింది. జెమినీ టీవీలో కొన్ని రోజులు పనిచేసి, ఆ తర్వాత మూవీ వాల్యూమ్ వెబ్ సైట్ & యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన జిలాన్ బాషా పబ్లిషింగ్ హౌస్ ప్రారంభించారు. నన్ను సలహా అడిగారు. పుస్తకాలు పబ్లిష్ చేయడం రిస్క్ అని చెప్పాను. పుస్తకాల మార్కెటింగ్ కష్టమని చెప్పాను. లేదండి నేను చేస్తానండి అని చెప్పాడు. అప్పుడు కరోనా కాలంలో ఇంటికి పరిమితం కావడంతో వీలు దొరికింది. రెండు నెలల కాలంలో పుస్తక రచన పూర్తయింది.

ప్రశ్న 4. మీరు ఈ పుస్తకాన్ని సాధారణ జీవిత చరిత్రలా కాకుండా, ప్రముఖుల ఇంటర్వ్యూలలో ఆయన గురించి చెప్పించారు. విఠలాచార్య గారితో పనిచేసిన వారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ పద్ధతిని ఎందుకు అవలంబించారు?

జ: జీవిత చరిత్రలా రాయాలంటే.. విఠలాచార్య గారితో అనుబంధం అయినా ఉండాలి. ఆయన గురించి పూర్తిగా అయినా తెలియాలి. నేను ఆయన జనరేషన్ కాదు. విఠలాచార్య గారిని ఎప్పుడు కలవను కూడా కలవలేదు. నేను జర్నలిజంలోకి వచ్చే సమయానికి ఆయన లేరు. ఆయన గురించి పూర్తిగా తెలిసినవారు లేదా ఆయన పిల్లలు ఎవరైనా ఆయన జీవితంలో జరిగిన ప్రతి అంశాన్ని వివరిస్తే జీవిత చరిత్రలా రాయడం వీలు అవుతుంది. అందుకని, విఠలాచార్య గారితో సినిమాలు చేసిన వాళ్లను.. అలాగే ఆయన పిల్లలను ఇంటర్వ్యూ చేశా. ప్రతి ఒక్కరూ ఆయన గురించి గొప్పగా చెప్పారు.

ప్రశ్న 5. వాణిశ్రీ గారు, జయమాలిని గారు, కైకాల గారు.. ఇలా.. జై విఠలాచార్య పుస్తకం కోసం ప్రముఖులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీకు ఏమనిపించింది?

జ: ప్రతి ఒక్కరూ విఠలాచార్య గారి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఈతరం సైతం స్ఫూర్తి పొందే విషయాన్ని ఏదో ఒకటి వివరించారు. ఇప్పటికీ ‘గురువు గారు’ అంటూ విఠలాచార్య గారిని సంబోధించారు. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారు. తమకు విఠలాచార్య గారితో ఉన్న అనుబంధం గురించి వివరించుకుంటూ వెళ్లారు. విఠలాచార్య వాళ్ల జీవితాన్ని మలుపు తిప్పిన కృతజ్ఞత వాళ్ల మాటల్లో వ్యక్తం అయింది.

ప్రశ్న 6. మీరు ఈ పుస్తకంలో సమాచార సేకరణ కోసం ఏయే పద్ధతులు అవలంబించారు?

జ: విఠలాచార్య చాలా స్పీడుగా సినిమాలు తీసే వారు అని చెప్పాను కదా. ఆయనపై రాసిన ఈ పుస్తకం కూడా అంతే స్పీడుగా పూర్తయింది. ప్రతిరోజూ విఠలాచార్య తీసిన ఒక సినిమా చూడడం, ఆ సినిమాకు సంబంధించిన వివరాలు విశేషాలు సేకరించడం, ఆ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటీనటులను ఫోన్లో సంప్రదించడం చేసేవాడిని. పుస్తకానికి సంబంధించిన 90 శాతం పని ఫోన్లో పూర్తయింది. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే ప్రముఖులు సైతం విఠలాచార్య పై పుస్తకం రాస్తున్నా అని చెప్పేసరికి వెంటనే స్పందించారు. జయమాలిని గారు చాలా రోజులు ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాలేదు. విఠలాచార్య గారిపై పుస్తకం అనే విషయం తెలిసి ‘మా గురువుగారు’ అంటూ గంటకు పైగా మాట్లాడారు.

ప్రశ్న 7. కైకాల సత్యనారాయణ గారితో జై విఠలాచార్యబుక్ ముందుమాట రాయించారు. ఆయన గురించి..

జ: విఠలాచార్య గారి సినిమాలతో తన జీవితం మలుపు తీసుకుందని కైకాల గారు పలు సందర్భాలలో చెప్పారు. ఆయన హీరోగా ఫెయిల్ అయిన తర్వాత విలన్ వేషాలు ఇచ్చి నిలదొక్కుకోవడానికి విఠలాచార్య ఎంతో తోడ్పాటు ఇచ్చారు. మీరు ముందుమాట రాయాలని కైకాల గారిని అడిగితే ఆయన చాలా సంతోషించారు. ఈ పుస్తకాన్ని ఆయనతో లాంచ్ చేయాలని మేం భావించాం. మా బ్యాడ్ లక్ ఏమిటంటే.. ముందుమాట రాసిన తర్వాత ఆయన కాలం చేశారు. అది మాకు ఆవేదన కలిగించిన అంశం.

ప్రశ్న 8. జై విఠలాచార్య పుస్తకానికి ప్రత్యేకంగా కవర్ పేజీ డిజైన్ చేయించారు కదా! దాని గురించి..

జ: విఠలాచార్య గారి ఫోటో ఏదో ఒకటి తీసుకుని దానిని కవర్ పేజీగా ముద్రించవచ్చు. సాధారణంగా పుస్తకాలకు చేసేది అదే. ఆ విధంగా కాకుండా విఠలాచార్య గారి చేతిలో ఒక మంత్రదండం, మాయా దీపం వంటివి ఉండేలా చేస్తే బాగుంటుందని అనిపించింది. సీనియర్ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ గారికి ఆ విషయం చెప్పాను. ఆరోగ్యం సహకరించడం లేదు కష్టం అన్నారు. సివిల్ సర్వెంట్ రవి పాడిగారు ‘ఈ పుస్తకానికి కవర్ పేజీ మీరే పెయింటింగ్ వేయాలి గురువు గారూ’ అని రిక్వెస్ట్ చేయడంతో ప్రస్తుతం మీరు చూస్తున్న డిజైన్ చేసి ఇచ్చారు ఈశ్వర్ గారు. దురదృష్టవశాత్తు ఆయన ఆఖరి పెయింటింగ్ ఇదే. బుక్ లాంచ్ చేసినప్పుడు త్రివిక్రమ్ గారు కవర్ పేజీ చూసి ‘భలే ఉంది. చాలా బాగుంది’ అని ప్రశంసించారు. కవర్ పేజీ చూసిన ప్రతి ఒక్కరూ ఈ పుస్తకానికి తొలుత ఫిదా అయ్యారు. ఆ తర్వాత లోపల విషయం చదివి మరింత ప్రశంసించారు. ఇప్పటివరకు నేను రాసిన ప్రతి పుస్తకానికి మంచి పేరు వచ్చింది. విఠలాచార్య గారి పుస్తకం కొత్త అనుభవాన్ని అందించింది.

ప్రశ్న 9. సూపర్ స్టార్ కృష్ణ గారితో కవర్ పేజీ విడుదల చేయించారు కదా!

జ: అది ఓ ప్రయోగమే. సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేస్తారు కదా! ఆ విధంగా విఠలాచార్య బుక్ ఫస్ట్ లుక్ కృష్ణ గారితో విడుదల చేయించాం. బుక్ ఫస్ట్ లుక్ విడుదల చేయించడం ఇదే ప్రథమం. విఠలాచార్య గారి దర్శకత్వంలో కృష్ణ గారు ఓ సినిమా చేశారు. ఇలా పుస్తకం రాస్తున్నామని తెలియగానే ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి అంగీకరించారు.

ప్రశ్న 10. విఠలాచార్య కుటుంబ సభ్యులు, ఆయన వారసులు పుస్తకం చూసి ఏమన్నారు?

జ: విఠలాచార్య గారి కుటుంబ సభ్యులను కూడా పుస్తకం పబ్లిష్ కావడానికి ముందు కలవలేదు. ఫోనులో సంప్రదించా. ఆయన కుమారులు, కుమార్తెలకు ఫోను చేసి మాట్లాడాను. ఈ స్థాయిలో పుస్తకం వస్తుందని ముందు వారు కూడా ఊహించలేదు. బుక్ రిలీజ్ అయిన తర్వాత చూసి షాక్ అయ్యారు. విఠలాచార్య కుమార్తెలు రాధ, లలిత గారు హైదరాబాద్ వచ్చి నన్ను, పబ్లిషర్ జిలాన్ బాషాని ప్రత్యేకంగా కలిశారు. వాళ్ళిద్దరూ ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. ‘మా నాన్నగారు మీకు తెలుసా? మీ కుటుంబంలో ఎవరికైనా పరిచయమా? ఆయనపై పుస్తకం రాయడానికి కారణాలు ఏంటి?’ అని పలు ప్రశ్నలు అడిగారు. ఇంత కష్టపడి ఎందుకు రాశారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో పుస్తకం వస్తుందని తాము అసలు ఊహించలేదని చెప్పారు. ఈ తరం పిల్లలు అందరూ ఎక్కువ ఇంగ్లీష్ పుస్తకాలు చదువుతున్నారని, తాతయ్య గురించి ఇంగ్లీషు పాఠకులకు కూడా తెలిసేలా చేస్తే బాగుంటుందని వాళ్ల పిల్లలు చెప్పడంతో ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులో అనువదిస్తున్నారు. ‘జై విఠలాచార్య’ పుస్తకం త్వరలో ఇంగ్లీష్‌లో రానుంది.

ప్రశ్న 11. పుస్తకం విడుదల కావడానికి ముందే ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రముఖులు, విడుదల చేసిన త్రివిక్రమ్ సహా పలువురు మీ ప్రయత్నాన్ని మెచ్చుకున్నారు. ప్రశంసించారు. అయితే.. బుక్ విడుదలైన తర్వాత ప్రశంసించిన తొలి సెలబ్రిటీ ఎవరు?

జ: సీనియర్ దర్శకులు వంశీ గారి నుంచి తొలి ఫోన్ వచ్చింది. ఆయన చాలా సంతోషించారు. ‘చాలా బాగా రాశావు చాలా రీసెర్చ్ చేసావ్’ అని మాట్లాడారు. ఆ తరువాత పలువురు ప్రముఖులు ఫోన్లు చేశారు. విఠలాచార్య గురించి ఈ తరానికి కూడా తెలిసేలా చక్కగా రాశావని ప్రశంసించారు.

ప్రశ్న 12. జై విఠలాచార్యపుస్తకం రాయడం కోసం ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు మీపై ఎక్కువ ప్రభావం చూపించిన సినిమా లేదా సన్నివేశం?

జ: ఇప్పుడు నేను మూవీ రైటింగ్ వైపు ఉన్నాను కాబట్టి.. ఆయన సినిమాల్లో ఎక్కువగా గమనించిన అంశం ఏమిటంటే.. ల్యాగ్ ఉండదు. వేస్టేజ్ ఎక్కడా కనిపించదు. సన్నివేశాన్ని తీసే విధానం చాలా బాగుంటుంది. ఏ కథ తీసుకున్న సరే నేరుగా కథలోకి వెళ్లిపోయేవారు. ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో ఆయనకు బాగా తెలుసు. ఆ పల్స్ పట్టుకున్నారు. ముఖ్యంగా సంగీతం చేయించుకోవడంలో ఆయన స్పెషలిస్ట్. ఆయన సినిమాల్లో పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆయన పాటల్ని తీసిన విధానం కూడా బాగుంటుంది. గొప్ప గొప్ప సాంకేతిక నిపుణులతో ఆయన పనిచేయలేదు. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేసినా, చిన్న వాళ్ళతో పని చేసినా బెస్ట్ అవుట్ పుట్ తీసుకున్నారు. ఒక టెక్నీషియన్ నుంచి బెస్ట్ తీసుకునే చాతుర్యం కూడా ఉండాలి కదా! టాలెంట్ గుర్తించడంలోనూ విఠలాచార్య ది బెస్ట్. జానపద సినిమా తీయాలి అంటే ఆయన తర్వాతే ఎవరైనా. అప్పట్లో మీడియా తక్కువ ఉండేది. విఠలాచార్య గారు ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా తక్కువే. అయితే ఒక్క విషయాన్ని ఆయన ఎప్పుడూ చెబుతుండే వారట. జానపదం ఎవర్ గ్రీన్.. ఎప్పటికీ నిలిచే ఉంటుంది అని.

ప్రశ్న 13. ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో విఠలాచార్య వండర్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఆయన సినిమాలలో రీమేక్ చేయాల్సి వస్తే.. మీరు ఏ సినిమా చెబుతారు?

జ: ‘బందిపోటు’ చాలా బాగుంటుంది. ‘గురువును మించిన శిష్యుడు’ కూడా రీమేక్ చేయవచ్చు. జ్వాలాద్వీప రహస్యం, గండికోట రహస్యం, ఆలీబాబా 40 దొంగలు, అగ్గి పిడుగు, జగన్మోహిని.. ఇలా చెబుతూ వెళ్తే చాలా సినిమాలు ఉన్నాయి. తెలుగులో 39 చిత్రాలకు విఠలాచార్య దర్శకత్వం వహించారు. వాటిలో 20 సినిమాలను బ్రహ్మాండంగా రీమేక్ చేయవచ్చు. అంత గొప్ప కంటెంట్ ఉంది. పురాణాలు, చరిత్ర ఎప్పటికీ చిరంజీవి లాంటివి. కాశీ మజిలీ కథలు, బేతాళ కథలు వంటి వాటిలో ఆత్మను తీసుకుని మోడ్రనైజ్ చేసి ఆయన సినిమాలు చేశారు.

ప్రశ్న 14. హాలీవుడ్, హిందీ సినిమా కళాకారుల్లాగా మన తెలుగు కళాకారులు, నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, గేయ రచయితల గురించి సమగ్రమైన పుస్తకాలు ఎందుకు లేవు? జీవిత చరిత్రల కాకుండా వారి ప్రతిభను విశ్లేషిస్తూ రాసిన పుస్తకాలు లేవు?

జ: ‘స్వర్ణ యుగ సంగీత దర్శకులు’ పేరుతో నేను పుస్తకం రాశా. దానికి అద్భుతమైన స్పందన లభించింది. అటువంటి పుస్తకాలు మరిన్ని రావడానికి ప్రయత్నాలు జరగాలి. హిందీతో పోలిస్తే ఒక విధంగా తెలుగులో తక్కువ పుస్తకాలు వస్తున్నాయి. ప్రజలు పుస్తకాలు చదవడం లేదు అని చెప్పకూడదు. ప్రస్తుతం సినిమా పుస్తకాలకు ఆదరణ చాలా బాగుంది. పుస్తకం తీసుకురావడానికి ఎక్కువ సమయం అవసరం అవుతుంది. అలాగే, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కూడా! టైం, మనీ ఉన్నప్పటికీ ఒక్కోసారి ఎవరి మీద అయితే పుస్తకం తీసుకు రావాలని అనుకుంటున్నామో వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారం కూడా అవసరం అవుతుంది. నేను ‘స్వర్ణయుగ సంగీత దర్శకులు’ పుస్తకం రాసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. కంటెంట్, ఫోటోల విషయంలో చాలా కష్టపడాల్సి వచ్చింది. కొంతమంది నుంచి అసలు కోపరేషన్ లేదు. ప్రేమతో, ఉన్మాదంతో పనిచేస్తే తప్ప పుస్తకం పూర్తి కాదు.

ప్రశ్న 15. ప్రజెంట్ డిజిటల్ యుగంలో ఈ-బుక్ కల్చర్ పెరిగింది. ఇటువంటి తరుణంలో పుస్తకాలకు ఆదరణ తగ్గుతోందని విమర్శలు సైతం వినపడుతున్నాయి. వాటిపై మీరేమంటారు?

జ: పుస్తకాలకు డిమాండ్ తగ్గిందని చెబితే నేను ఒప్పుకోను. పుస్తకాలకు డిమాండ్ బావుంది. అయితే మార్కెటింగ్ సరిగా లేదు. ఉదాహరణకు హైదరాబాద్ తీసుకుందాం. అమీర్‌పేట ఏరియాలో ఉంటున్న వ్యక్తి పుస్తకం కొనాలంటే కోఠి లేదా కాచిగూడ వెళ్లాలి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి అందుబాటులో వచ్చినప్పటికీ తెలుగు పుస్తకాలకి రీచ్ అంతగా లేదు. అందరికీ అందుబాటులో ఉంటే ఎక్కువ కాపీలు వెళ్తాయి. కోట్ల మంది జనాభాలో 1000 కాపీలు కూడా వెళ్లడం లేదంటే కాస్త బాధాకరమైన విషయమే. కొంతమందికి కొనాలని ఉన్న అందుబాటులో ఉండడం లేదు. బుక్ ఫెస్టివల్స్ చూస్తుంటే ప్రతి ఏడాది అక్కడికి వచ్చే పాఠకుల సంఖ్య పెరుగుతోంది. జై విఠలాచార్య పుస్తకానికి వస్తే 650 రూపాయలు. ఖరీదు కాస్త ఎక్కువని కొందరు అన్నారు. అయితే నెలలో 500 కాపీలు అమ్ముడు అయ్యాయి. చాలామంది బుక్ కోసం ఫోన్ చేస్తున్నారు. కొందరు పెద్దలు పుస్తకం కోసం వెయ్యి రూపాయలు పంపించారు. మిగతా అమౌంట్ ఇవ్వబోతే వద్దని వారించారు. మీరు చేసిన ప్రయత్నానికి అంతకంటే ఎక్కువ ఇవ్వాలన్నారు. సోషల్ మీడియా కూడా హెల్ప్ అవుతోంది. వాటి మీద ఫోకస్ చేస్తే బుక్ సేల్స్ పెరుగుతాయి.

ప్రశ్న 16. జై విఠలాచార్య తర్వాత ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు హిచ్‌కాక్ మీద మీరు పుస్తకం రాస్తున్నారని తెలిసింది!

జ: అవును. ఆరోగ్య సమస్యలు వంటివి పక్కన పెడితే, కోవిడ్ పీరియడ్ నాకు చాలా హెల్ప్ చేసింది. విపరీతంగా సినిమాలు చూశా. బోలెడు పుస్తకాలు చదివాను. ఆ సమయంలో హిచ్‌కాక్ సినిమాలు చూశా. అప్పుడు పుస్తకం రాయాలని ఐడియా వచ్చింది. హైదరాబాద్ వంటి సిటీలలో ప్రేక్షకులకు, సినిమా ప్రముఖులకు హాలీవుడ్ సినిమాల గురించి తెలుస్తుంది. పల్లెటూరి ప్రజలకు సైతం జాకీ చాన్, బ్రూస్ లీ, హిచ్‌కాక్, చార్లీ చాప్లిన్ తెలుసు. నా చిన్నతనం నుంచి హిచ్‌కాక్ గురించి వింటున్నాను. ఆయన సినిమాలు చూసిన తర్వాత భలే అనిపించింది. ఆయన కూడా విఠలాచార్య తరహాలోనే తక్కువ బడ్జెట్, చిన్నచిన్న లొకేషన్లలో వండర్ క్రియేట్ చేశారు. కరోనా తర్వాత సినిమా మేకింగ్ స్టైల్ మారుతుందని అంచనా వేశా. హిచ్‌కాక్ గురించి అందరికీ తెలియాలని.. నేను రాయడం కాకుండా ఆయన తీసిన ఒక్కో సినిమా గురించి ఒక్కొక్క దర్శకుడు లేదా సినిమా ప్రముఖునితో చెప్పించాలని ప్రయత్నించా. తొలుత సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారికి మెసేజ్ చేశా. హిచ్‌కాక్ తీసిన 53 సినిమాల గురించి 53 మందితో రాయిద్దామని అనుకుంటున్నా అని చెప్పాను. మీరు ఓకే అంటే పుస్తకం ప్రారంభిస్తానని చెప్పాను. ఆయన వెంటనే ఓకే చెప్పారు. తర్వాత పూరి జగన్నాథ్, వంశీ గారు, హరీష్ శంకర్, ఇంద్రగంటి మోహనకృష్ణ, వీఎన్ ఆదిత్య, రేలంగి నరసింహారావు గారు.. ప్రతి ఒక్కరికి మెసేజ్ చేసిన వెంటనే ఓకే చెప్పారు. ఒక్కో సినిమా గురించి ఒక్కో ప్రముఖుడు రాశారు. గోపి మోహన్ వంటి ప్రముఖ రచయితలు ప్రత్యేక కథనాలు రాశారు. ప్రస్తుతం చెన్నైలో పుస్తకం రెడీ అవుతోంది. 2024లో తప్పకుండా ఈ పుస్తకం వస్తుంది.

ప్రశ్న 17. మీరు రాసిన తొమ్మిది పుస్తకాలలో దేని కోసం ఎక్కువ కష్టపడ్డారు? అనుకున్న సమయం కంటే ముందుగా పూర్తయినది ఏది?

జ: ‘జై విఠలాచార్య’ పుస్తకం త్వరగా పూర్తయింది. దీనికోసం యుద్ధ ప్రాతిపదికన పని చేశా. బాగా కష్టపడి, ఇష్టపడి రాసిన పుస్తకం ‘స్వర్ణయుగ సంగీత దర్శకులు’. 1932లో మన తెలుగు సినిమా మొదలైంది. అప్పటినుంచి 50 ఏళ్లలో మన సంగీత దర్శకులు, వాళ్ల సినీ జీవన ప్రయాణం.. లైఫ్ స్టోరీ, సినీ జర్నీ రెండిటినీ మిక్స్ చేస్తూ పుస్తకం తీసుకొచ్చా. సుమారు 50 మంది సంగీత దర్శకుల వరకు వచ్చారు. తెలుగు సినిమా తొలి సంగీత దర్శకుడు HR పద్మనాభ శాస్త్రి నుంచి మొదలుపెడితే ఇళయరాజా వరకు.. అందరి సినీ జీవన ప్రయాణాన్ని అక్షరబద్ధం చేశాను. ఆ బుక్ కోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్.. పలు ప్రాంతాలు తిరిగా. ఆ బుక్ రాసే సమయానికి గూగుల్, వికీపీడియాలో కూడా ఇంత సమాచారం లేదు. ఒకవేళ దొరికినా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎవరికీ దక్కని అదృష్టం ఏమిటంటే.. ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఆ బుక్ కరెక్షన్స్ చేశారు. ఫ్లైట్ జర్నీలో కొన్నిసార్లు కరెక్షన్స్ చేశారు. ఆయన చేతుల మీదుగా ఆ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఇప్పటికి రెండు ఎడిషన్స్ వచ్చాయి. మొత్తం కాపీలు అమ్ముడు అయ్యాయి. పుస్తకాల గురించి నాకు వచ్చే ఫోనులలో ఇప్పటికీ ‘స్వర్ణయుగ సంగీత దర్శకులు’ గురించి అడిగేవారు ఎక్కువగా ఉన్నారు. ఆ బుక్ పబ్లిషర్ చిమట శ్రీనివాస్ గారు. త్వరలో మూడో ఎడిషన్ తీసుకు వచ్చే ఆలోచన ఉంది. నా జీవితంలో ఆ బుక్ ఓ గొప్ప టర్నింగ్ పాయింట్.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు చిన్నారాయణ గారూ.

చిన్నారాయణ: ధన్యవాదాలు, నమస్కారం.

***

జై విఠలాచార్య
రచన: పులగం చిన్నారాయణ
ప్రచురణ: మూవీ వాల్యుమ్ మీడియా, హైదరాబాద్
పేజీలు: ‎ 528
వెల: ₹ 650.00
ప్రతులకు:
ఫోన్: 9640254786
సాహితీ ప్రచురణలు, విజయవాడ. ఫోన్: 8121098500
నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్. ఫోన్: 9000 413 413
ఆన్‍లైన్‍లో:
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1307&BrandId=18&Name=jai+vittalacharya
https://www.telugubooks.in/te/products/jai-vittalachaarya

~

‘జై విఠలాచార్య’ పుస్తక సమీక్ష
https://sanchika.com/jai-vittalacharya-book-review-st/

Exit mobile version