[‘తొలితరం తెలుగు రచయిత్రులు – అభ్యుదయ కథలు’ అనే వ్యాససంపుటి వెలువరించిన ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం నమస్కారం ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారూ గారూ.
నమస్కారం ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారూ: నమస్కారమండి.
~
ప్రశ్న 1. ‘తొలితరం తెలుగు రచయిత్రులు – అభ్యుదయ కథలు’ అన్న వ్యాస సంపుటి వెలువరించినందుకు అభినందనలు. ఈ వ్యాసాల రచన వెనుక ఉన్న ఆలోచనని వివరిస్తారా??
జ: ‘సంచిక’ అంతర్జాల పత్రికతో పాటు గతంలో ‘నెచ్చెలి’ అంతర్జాల పత్రికలో కూడా మంచి పుస్తకాలు గురించి విశ్లేషణాత్మక వ్యాసాలు రాసేదాన్ని. నెచ్చెలి సంపాదకురాలు కె.గీత ఒకసారి ఒక సూచన చేశారు. పాత కథలను తీసుకుని ఒక్కో నెల ఒక్కోదాన్ని విశ్లేషించండి అని. నేను పాత రచయిత్రులు అంటే – మొదట 1950లో కథలు చూసాను. అంతకు ముందు కూడా ఉండడం గమనించి, పూర్తిగా వెనక్కు వెళ్లి 1902 భండారు అచ్చమాంబ కథతో మొదలుపెట్టాను.
ప్రశ్న 2. విశ్వవిద్యాలయాలు, అకాడమీలు చేయాల్సిన కృషిని మీరు వ్యక్తిగతంగా సాధించారు. రచయితల ఎంపిక, కథల ఎంపిక వెనుక ప్రణాళికలు ఏమిటి?
జ: ఏ భాషలోనైనా, ఏ ప్రక్రియలోనైనా పూర్వ రచనల పునాది పైననే ఆధునిక రచనా సౌధం ఏర్పడుతుంది. కనుక పూర్వం రచించిన కవులు, రచయితలను తరువాతి తరం వారికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆనాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఆ రచనపై ఎంత వరకు ప్రభావం చూపాయో విశ్లేషించాల్సిన అవసరం ఉంది. 1980 ప్రాంతాల నుండి ‘స్త్రీవాదం’ పేరిట విస్తృతమైన రచనలు వెలువడ్డాయి. నేను పాత కథలను వెదికి, పరిశీలించే సమయంలో ‘స్త్రీవాదం’ అంటూ ప్రత్యేకంగా పేర్కొనక పోయినా ఆనాడే ‘అభ్యుదయ’ భావాలతో రచయిత్రులు రాసిన కథలను చూసి చాలా ఆశ్చర్యపోయాను, ఆనందపడ్డాను. ఆ కథలను నేటి తరం వారికి పరిచయం చేయాలని సంకల్పించుకొన్నాను.
ప్రశ్న 3. ఈ వ్యాసాల రచనలో సమాచార సేకరణ ఎలా జరిగింది? ఏఏ ఇబ్బందులు ఎదురయ్యాయి వాటిని ఎలా అధిగమించారు?
జ: నిజం చెప్పాలంటే ఒక యజ్ఞం లానే నిర్వహించానండి. కథ పేరు కానీ, రచయిత్రి పేరు కానీ ఖచ్చితంగా తెలిసివుంటే కథానిలయంలో కొన్ని కథలు లభ్యమయ్యాయి. మొదట నేనైతే గుంటూరులో సాహిత్యాభిమానులకు కల్పతరువు వంటి గ్రంథాలయం ‘అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం’ లో కథల జాబితాలో వెదికేదాన్ని. పాత కథా సంకలనాలు చూసేదాన్ని. లభించిన ఏదో ఒక కొస పట్టుకుని అన్వేషణ మొదలుపెట్టేదాన్ని. ప్రతి నెలా ఇంతే. కథ పేరు దొరికితే రచయిత్రి పేరు, రచయిత్రి పేరు పట్టుకుంటే కథ, ఈ రెండూ దొరికితే, కొందరు రచయిత్రుల పరిచయ వాక్యాలు ఎక్కడా లభ్యమయ్యేవి కావు. కానీ కథ అద్భుతంగా ఉండడంతో స్వీకరించి, ఆమె వారసులు ఉంటే వివరాలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేసాను. ఆ విధంగా కొందరు విస్మృతిలో పడిన రచయిత్రుల కథలను పరిచయం చేయడం ఆనందంగా ఉంది.
‘తొలితరం తెలుగు రచయిత్రులు – అభ్యుదయ కథలు’ పుస్తకావిష్కరణ
ప్రశ్న 4. ఈ వ్యాసాలు 1900-1955 సంవత్సరాల మధ్య ప్రచరింపబడిన అభ్యుదయ కథలయి ఉండాలని ఎలా నిర్ణయించారు? ఈ కాల పరిమితి ప్రత్యేకత ఏమిటి?
జ: మొదట నేను ‘అర్ధ శతాబ్ది’ 1900-1950 వరకు తీసుకుని, తర్వాత 1950-2000 వరకు రెండు భాగాలుగా రాయాలని నిర్ణయించుకున్నాను. మొదటి అర్ధ శతాబ్ది భారతదేశంలో, ఆంధ్ర ప్రాంతంలో చాలా ముఖ్యమైన ఘట్టం కదా. ఒక వైపున భారత స్వాతంత్ర్య సమరం, మరోవైపు సాంఘిక సంస్కరణలకై పోరాటం, ఇంకో వైపున వ్యావహారిక భాషోద్యమం ఊపందుకున్న సమయం అది. పురుషులతో పాటు స్త్రీలు స్వాతంత్రోద్యమంలో పాల్గొని, జైలుకు సైతం వెళ్ళారు. ఒకవేళ పురుషులు జైలుకు వెళితే స్త్రీలు ఇంటిని, పిల్లలను సమర్ధవంతంగా నిర్వహించుకునేవారు. పెద్ద పెద్ద చదువులు చదవకపోయినా, గాంధీ తత్వాన్ని ఆదర్శంగా తీసుకుని, జాతీయ భావాలతో, స్త్రీ విద్య, స్త్రీల బాధ్యతలకు సంబంధించి చైతన్యం కలిగేలా కవిత్వం, వ్యాసాలు ఎక్కువగా రచించారు. తరువాత కాలంలో స్త్రీలను ఆకర్షించే తిరుగులేని ప్రక్రియ ‘కథ’ అని గ్రహించి కథలు విరివిగా రచించారు. ఆనాటి భారతి, గృహలక్ష్మి, కిన్నెర, ఉదయవాణి వంటి పత్రికలు కూడా వాటిని ప్రచురించి ప్రోత్సహించాయి. ఈ క్రమంలో స్త్రీలు దేశానికి స్వాతంత్ర్యం సాధించడానికి కంటే ముందు తమ వ్యక్తిగత స్వాతంత్ర్యం ముఖ్యమని భావించి విస్తృతంగా రచనలు చేసారు. కానీ చాలామంది చరిత్ర మరుగున పడిపోవడం, వారి రచనలు లభ్యం కాకపోవడం దురదృష్టకరం. లభ్యమైనంత వరకు – వారి ఆలోచనా పటిమ, వ్యక్తిగత స్వాతంత్ర్యం కొరకు ఆరాటం, మూఢ విశ్వాసాల ఊబిలో కూరుకుపోతున్న సమాజం పట్ల ఆవేదన, ధైర్యం గా తమ భావాలను వెల్లడిస్తూ కథలు రాయడం చూస్తే వారి పట్ల గౌరవం కలుగక మానదు.
ప్రశ్న 5. ఈ వ్యాస సంపుటి లోని 25 మంది రచయిత్రుల కథా వస్తువుల ఎంపిక లో శైలి, శిల్పాలలో ఏదైనా సారూప్యత గోచరించిందా! వీరి వివిధ కాలాల నడుమ ఒకే ఇతివృత్తంతో వచ్చిన కథలేమైనా మీ దృష్టికి వచ్చాయా?
జ: కథా వస్తు వైవిధ్యం అమోఘంగా ఉందండి. అంతస్సూత్రంగా జాతీయోద్యమం, గాంధీజీ అహింస పోరాటం, విదేశీ వస్తు బహిష్కరణ, ఖద్దరు ప్రాధాన్యత ప్రముఖంగా ఉంది. సంసారంలో పురుషాధిక్యత, కుటుంబంలో స్తీల పట్ల వివక్షతకు సంబంధించిన కథలు ఉన్నాయి. వాటిని వ్యతిరేకిస్తూ రచయిత్రులు తమ గళాన్ని బలంగా వినిపించిన ఆ కథలను చూసి ఆశ్చర్యపోయాను కూడా. పతి పాదసేవ, పాతివ్రత్య ప్రాధాన్యత వంటి కథలు ఉన్నా – మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, అభ్యుదయ భావాలతో ఎక్కువగా రచించారు. చైతన్యవంతంగా రచించారు. కానీ నేను ఒకే మూసలో ఉన్న కథలను స్వీకరించలేదు. 25 నెలల పాటు ప్రతి నెలా వైవిధ్యమైన కథాంశం ఉన్న కథలనే తీసుకున్నాను.
అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ..
“నేను పెండ్లాడిన భార్యను గానీ దాసిని గాను. వివాహమాడుట వలనను భర్తకు దాసినగుదునా యేమి?” అనే పదునైన వాక్యాలతో మొదలైన భండారు అచ్చమాంబ కథ ‘దంపతుల ప్రథమ కలహం’ 1902లో ‘హిందూసుందరి’ పత్రికలో ప్రచురితమైంది. ఈనాటి స్త్రీవాద రచయిత్రుల కంటే ఎంతో ముందు ఆనాడే ఇంత స్ధిరంగా ప్రశ్నించడం చాలా గొప్ప విషయం. బహుశా పెద్ద సంచలనమే కలిగించివుంటుంది.
“ఒక స్త్రీ ప్రాణము తీసిన నేరము కంటే ఒక స్త్రీ సుఖమును, సంతోషమును, ఉత్సాహ ఉల్లాసములను నాశనము చేసి జీవన్మృతులుగా చేసిన నేరము బలవత్తరమైనది” అని శక్తిమంతంగా చెప్పిన రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మ.
కులాంతర వివాహం, మతాంతర వివాహం, కులవివక్షత (మాదిగ వెంకడు), వితంతువు ఆవేదన, వర్గ పోరాటం, ప్రేమ (జయం, అపజయం కూడా), మూఢనమ్మకాలు, దొంగ బాబాలు, ఫోబియాతో బాధపడే పాత్ర, పత్రికల్లో ముఖచిత్రంగా కానీ, లోపల అడ్వర్టైజ్ కోసం కానీ స్త్రీల అర్ధ నగ్న చిత్రాలు ఉంటే తీవ్రంగా వ్యతిరేకించిన ఇల్లాలు, ఇంటి చాకిరీ నుండి దూరంగా ‘ఒక్కరోజు’ అయినా ఏకాంతంగా ప్రకృతిని ఆస్వాదించాలని, నచ్చిన పుస్తకం చదవాలని ఆశించే ఇల్లాలు, తన ప్రమేయం లేకుండా విచ్ఛిన్నమైన సంసారం, భర్త లేదా బంధువులు సహకారం లేకపోయినా ధైర్యంగా నిలబడిన స్త్రీలు, సినీనటి జీవితం.. వంటి వైవిధ్యమైన కథలను అన్వేషించి, చాలా ‘ఇష్టం’గా విశ్లేషించడం నాకు సంతోషంగా, తృప్తిగా ఉందండి.
ప్రశ్న 6. వ్యాస సంపుటిలోని మంచి వ్యాసాల్లో మరీ మంచి వ్యాసం అని విహారి గారు పేర్కొన్న స్థానాపతి రుక్మిణమ్మ గారి ఘనపాటి కథ నేపథ్యం గురించి వివరిస్తారా?
జ: ఈ విశ్లేషణలను పుస్తకంగా ప్రచురించదలచి ముందుమాట రాయవలసిందిగా సీనియర్ రచయిత విహారి గారిని (జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి) కోరాను. ఆయన సంపూర్ణంగా చదివి, నా ప్రణాళికను గుర్తించి, దాదాపు ప్రతి వ్యాసాన్ని ఉటంకించారు. కథను సంగ్రహంగా చెప్పడం, నాదైన విశ్లేషణ చేయడం, ఆ రచయిత్రి యొక్క పరిచయం చేయడం అనే మూడు అంశాలతో ప్రణాళిక వేసుకున్నాను. ఇక స్థానాపతి రుక్మిణమ్మ గారి గురించి. తెలుగులో మొట్టమొదటి హారర్ (దెయ్యాలు) కథలు రాసింది ఆమే. కేవలం భయపెట్టడం కోసం కాదు. దానిలో ఒక నీతి ఉండేది. సందేశం ఉండేది. ‘ఘనాపాటి’ అనే కథలో – ఒక గురువు తనకు వచ్చిన విద్యలు అన్నీ శిష్యులకు చెప్పకపోవడంతో చనిపోయిన తర్వాత ప్రేతాత్మగా తిరుగుతూ, ఒక అమాయకుడైన శిష్యుడికి విద్యలన్నీ నేర్పి, పాపం తీరి, అంతర్ధానమవుతాడు. ఈ సందర్భంగా గురువుకు ఉండకూడని లక్షణాలను విపులంగా వివరించాను. బహుశా నేను అధ్యాపకురాలిని కనుక మరింతగా ఇన్వాల్వ్ అయి చెప్పినట్టున్నాను. విహారి గారి ప్రశంస పదిలంగా దాచుకోదగ్గది.
ప్రశ్న 7. ఈ 25 మంది రచయిత్రుల ప్రభావం ఆనాటి సమాజం పైన, పాఠకుల పైన ఎలా ఉండేదని మీరు భావిస్తున్నారు?
జ: బలమైన ప్రభావాన్ని చూపిందండి. భండారు అచ్చమాంబ స్కూల్‌కి వెళ్ళి చదువుకోలేదు. తమ్ముడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావుకు చదువు చెప్పడానికి ఉపాధ్యాయుడు వచ్చినపుడు తను కూడా పక్కనే ఉండి చదవడం, రాయడం నేర్చుకున్నారు. తర్వాత చాలా ఆసక్తితో ఎన్నెన్నో పుస్తకాలు చదువుకున్నారు. హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం భాషలు నేర్చుకున్నారు. పూర్తిగా ఇలా కాకపోయినా, చాలామంది రచయిత్రులు ఆ రోజుల్లో పెద్ద చదువులు చదవలేదు. అయినా కలం చేతపట్టి, తమ భావాలను ధైర్యంగా వెల్లడించడమే కాక, తర్వాత రచయిత్రులకు మార్గదర్శకంగా నిలిచారు. పాఠకులలో చైతన్యం కలిగి, సాధారణ గృహిణులలో కూడా కొందరు రచయిత్రులుగా విరివిగా కథలు రాయడమే దానికి తార్కాణం.
విశిష్ట అతిథి డా. పాపినేని శివశంకర్ ప్రసంగిస్తూ..
ప్రశ్న 8. ఇటీవలి కాలంలో తెలుగులో సాహితీ విమర్శ ప్రాధాన్యం తగ్గినట్లు తోస్తోంది. విమర్శని ఓ ప్రక్రియగా సాధన చేసేవారు, లోతైన అధ్యయనం చేసే వారి సంఖ్య ప్రస్తుతం బాగా తగ్గినట్టు అనిపిస్తోంది. భవిష్యత్తులో చక్కని సాహితీ విమర్శకుడిగా రాణించగలరన్న యువ విమర్శకులు ఎవరైనా మీ దృష్టికి వచ్చారా?
జ: రచన ఏ ప్రక్రియలో ఉన్నా దానిని చదివి, కవి/రచయిత ‘ఆత్మ’, లేదా ‘కథాత్మ’ను తాను అవగాహన కలిగించుకుని, దాని గుణ దోషాలను ఎలాంటి రాగద్వేషాలకు లోను కాకుండా ‘విమర్శ’ చేయడం విమర్శకుని ప్రధాన కర్తవ్యం. రా.రా. వంటి విమర్శకులు నిర్మొహమాటంగా, కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేవారు. కొందరు వ్యంగ్యంగా చెప్పేవారు. సూచనలు చేసేవారు. కానీ కాలక్రమేణా ‘విమర్శ’ను స్వీకరించే స్థితిలో రచయిత ఉండడం లేదు. కోపం తెచ్చుకుంటున్నారు. నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లు చెప్పి, శత్రువుగా చూడబడడం ఎందుకు అని విమర్శకులు మిన్నకుంటున్నారు. అయితే బాగా ‘పొగడడం’ లేదా మొహమాటంగా ఏదో రాసాననిపించుకోవడం ఒక తంతుగా మారింది. అంతకు మించి ‘సద్విమర్శ’ చేయడానికి వెనకాడుతున్న పరిస్థితి నేడు ఉంది. విమర్శ, విశ్లేషణ, సమీక్ష – ఏదైనా, పొగిడేస్తే ‘ఓ పనై పోతుంది’ అనుకుంటున్నారు యువ విమర్శకులు. ఎంత పేలవంగా, అసంతృప్తిగా ఉంటుంది అవి చదివితే! నేను బాగా గమనించే ఈ విషయం చెబుతున్నాను (నేను నిక్కచ్చిగా చెప్తానని, రాస్తానని కోపం తెచ్చుకున్నవారు ఉన్నారు).
రచయిత్రి సిహెచ్. సుశీలమ్మ స్పందన
ప్రశ్న 9. విమర్శని రచన పై దాడిగా, విమర్శకుడిది సంకుచిత మనస్తత్వంగా భావిస్తున్నారు కొందరు. ఓ సాహితీ విమర్శకురాలిగా, పరిశోధకురాలిగా ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?
జ: ఎం.ఫిల్., పిహెచ్.డి., పట్టాల కోసం కూడా సరియైన ‘పరిశోధన’ జరగడం లేదు. ఇక రచన చేయడం కోసం కానీ, విమర్శ చేయడం కోసం కానీ అధ్యయనం చేయడం ఎక్కడ ఉంది! పరిశోధన చేయడం ఎక్కడ? అలాంటి పేలవమైన రచనపై నిర్మొహమాటంగా చెప్తే, రాస్తే ‘రచనపై దాడి’ గానే భావిస్తున్నారు మరి.
ముఖ్య అతిథి ప్రముఖ రచయిత్రి పి. సత్యవతి గారిని సన్మానించుకుంటూ..
ప్రశ్న 10. ఈ పుస్తకం రూపొందించేందుకు (వ్యాసాలు రాయాలన్న ఆలోచన నుంచి – వ్యాస సంపుటి విడుదలయ్యేంత వరకు) ఎంత కాలం పట్టింది? ఈ పుస్తకం ప్రచురణలో ఏవైనా ప్రత్యేక అనుభవాలు ఎదురయ్యాయా?
జ: నెచ్చెలి అంతర్జాల పత్రిక సంపాదకురాలు సూచన మేరకు మొదట పాత కథలపై రాయడం మొదలుపెట్టాను. నాలుగైదు నెలల తర్వాత ఈ కథల అన్వేషణలో వైవిధ్యభరితమైన, అద్భుతమైన కథలు లభించడంతో నాకు చాలా ఆసక్తిగా, ఆనందంగా అనిపించింది. మరీమరీ పాత పత్రికలు చూసాను. ఇష్టంగా రాసాను. 25 నెలలు 25 మంది రచయిత్రుల కథల గురించి చెప్పిన తర్వాత, నా ఈ కృషి, శ్రమ పుస్తకంగా ప్రచురిస్తే తప్ప సమాజానికి తెలియదు కదా అనుకుని, రాయడం తాత్కాలికంగా ఆపి, అచ్చువేసే ప్రయత్నం చేశాను. ఆనాటి కథలను, రచయిత్రులను పరిచయం చేసాను, మరి వాళ్ళను చూపాలి కదాని, ఫోటోల కోసం వెదికాను. 14 మంది ఫోటోలు మాత్రమే లభ్యమయ్యాయి. ఆ ఫోటోలనే ముఖచిత్రంగా రూపొందించాం.
ప్రశ్న11. ఈ పుస్తకానికి పాఠకుల ఆదరణ ఎలా ఉంది? ఈ పుస్తకాన్ని పాఠకులకు చేర్చడానికి ఏయే చర్యలు తీసుకుంటున్నారు?
జ: ఇటీవలే ఆగస్టు 10న ఈ పుస్తకావిష్కరణ జరిగింది. సభాధ్యక్షులుగా పెనుగొండ లక్ష్మీనారాయణ, ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత్రి పి. సత్యవతి, విశిష్ట అతిథిగా డా. పాపినేని శివశంకర్ (ముగ్గురూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు సభలో పాల్గొనడం కాకతాళీయం) ఆవిష్కరించారు. ఈ కథలు, పాత పత్రికలు అన్వేషించడంలో ‘అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం’ నాకు ఆధారమయింది. అందుకే గ్రంథాలయ వ్యవస్థాపకులు శ్రీ లంకా సూర్యనారాయణ (91సం.లు) గారికి ఈ పుస్తకం అంకితమిచ్చి గౌరవించుకొన్నాను. సభకు సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పుస్తకం పట్ల ఆసక్తి చూపారు. సంచిక వంటి అంతర్జాల పత్రికలో సమీక్ష, ముఖాముఖి వల్ల మరి కొందరికి పరిచయం అవుతుంది కదా! కొన్ని పత్రికలకు సమీక్ష కోసం పంపాను. నేటి పత్రికలు సమీక్షలకు, విమర్శలకు మరికొంత పేజీలను కేటాయిస్తే, ఈ పుస్తకమే కాదు ఇంకా ఎన్నో పుస్తకాల మంచీ చెడూ పాఠకులకు తెలుస్తుంది.
అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయం వ్యవస్థాపకులు లంకా సూర్యనారాయణ గారు రచయిత్రిని సన్మానిస్తూ..
ప్రశ్న12. పరిశోధకురాలిగా, సాహితీ విశ్లేషకురాలిగా మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి?
జ. చదువుకునే సమయంలోను, అధ్యాపక వృత్తిలో ఉన్నప్పుడు, ఇప్పుడు విశ్రాంత జీవనం లోను ‘సాహిత్య విమర్శ’ నా అభిమాన జానర్. లోతైన అధ్యయనం పట్ల ఆసక్తి. వైవిధ్యభరితమైన రచనలను విశ్లేషించడం – అదే గుణదోష విచారణ చేసి ‘సద్విమర్శ’ చేయడం నా కర్తవ్యం. నాకు లభించిన పురస్కారాలు విమర్శ రంగంలోనే. అలాంటి విమర్శకులను గుర్తించి, మా నాన్నగారి పేరు మీద ‘శ్రీ సిహెచ్. లక్ష్మీనారాయణ స్మారక పురస్కారం’ (11,111రూ.లు) గత ఐదేళ్ల నుండి ఇస్తున్నాను. పెద్ద పెద్ద ప్రణాళికలు ఏమీ లేవండి. గంటల తరబడి చదువుకోవడం, రాసుకోవడం నా అలవాటు. ప్రస్తుతం కేంద్ర సాహిత్య అకాడమీ వారు అనుమతించిన ‘కొవ్వలి లక్ష్మీనరసింహారావు మోనోగ్రాఫ్’ రాసే పనిలో ఉన్నాను.
విమర్శ రంగంలో నేను చేస్తున్న కృషికి గాను తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు ‘కీర్తి పురస్కారం’ ప్రకటించారని నాలుగు రోజుల క్రితం తెలిసింది. ఆ ఆనందాన్ని ‘సంచిక టీం’తో పంచుకుంటున్నాను.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారూ. తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం అందుకోబోతున్నందుకు అభినందనలు.
ప్రొ. సిహెచ్. సుశీలమ్మ: ధన్యవాదాలు. ఐదేళ్ల నుండి సంచికకు రాస్తూనే ఉన్నాను. (రెగ్యులర్‌గా, పూర్తిగా చదివే పాఠకురాలిని కూడా నేనేనేమో)! ఎంతో ప్రోత్సాహమిస్తున్న సంపాదకులకు, సంచిక టీం అందరికీ ధన్యవాదాలు.
***
రచన: ప్రొ. సిహెచ్. సుశీలమ్మ
ప్రచురణ: శ్రీ సిహెచ్. లక్ష్మీనారాయణ పబ్లికేషన్స్, గుంటూరు
పేజీలు: 112
వెల: ₹ 200.00
ప్రతులకు:
విశాలాంధ్ర బుక్ హౌస్ అన్ని శాఖలు
నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ఇతర శాఖలు
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
రచయిత్రి:
9849117879
~
‘తొలితరం తెలుగు రచయిత్రులు – అభ్యుదయ కథలు’ వ్యాససంపుటిని సమీక్ష
https://sanchika.com/tolitaram-telugu-rachayitrulu-abhyudaya-kathalu-book-review-kss/