[తెలుగు సాహితీ వనం సమూహం తరఫున ‘విభిన్న’ అనే కథా సంకలనాన్ని వెలువరించిన శ్రీమతి శాంతి కృష్ణ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]
సంచిక టీమ్: నమస్కారం శాంతి కృష్ణ గారూ.
శాంతి కృష్ణ: నమస్కారం.
~
ప్రశ్న 1. ఫేస్బుక్లో తెలుగు సాహితీ వనం సమూహం ఏర్పరచడంలో మీ ఉద్దేశమేమిటి? ప్రస్తుతం ఎంత మంది సభ్యులున్నారు? ఈ సమూహం తరఫున ఏయే సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు?
ప్రశ్న 2. కొత్తగా చేరేవారికీ, పాత సభ్యులకీ మధ్య సమన్వయం ఎలా సాధిస్తున్నారు? ఈ సమూహం మనది అనే భావన అందరిలోనూ ఎలా కలిగించగలిగారు?
జ: ఇప్పుడు ఫేస్బుక్ సమూహాల సంఖ్య ఎక్కువగా ఉన్నందు వల్ల కొద్దిమంది సభ్యులు ఎక్కువ గ్రూప్స్ లలో ఉంటున్నారు. వాళ్ళకు ఏ గ్రూప్ కూడా మనది అని అనిపించదు. తక్కువ గ్రూప్స్‌లో ఉన్న వాళ్ళకు, లేదా ఈ ఒక్క గ్రూప్‌లో ఉన్న వాళ్ళకు మాత్రం ఈ సమూహం మనది అనే ఆత్మీయ భావన కలుగుతుంది. అలాంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు.
కొత్త వాళ్ళతో పుస్తక పరిచయాలు చేయించడం, అన్ని పోటీలలో పాల్గొనేలా చేయడం చేస్తుంటాము. ఈ విధంగా కొత్త వాళ్ళను ఎక్కువ ప్రోత్సహిస్తుంటాము. సమూహంలో ఉన్న పాత రచయితలు, సీనియర్ రచయితలు కొత్త వాళ్ళు రాసిన సాహిత్యానికి స్పందించాలని, వాళ్ళకు సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. అప్పుడే కదా ఆ ఇరువురికీ సమన్వయం కుదురుతుంది. మంచి సాహిత్యం రావడానికి అవకాశం ఉంటుంది. సీనియర్ రైటర్స్ ఈ విషయం లో సహృదయంతో స్పందించాలని కోరుకుంటున్నాను.
ప్రశ్న 3. సమూహం లక్ష్యాలకు వ్యతిరేకంగా నడుచునేవారి పట్ల మీ వైఖరి ఏమిటి?
జ: సమూహం లక్ష్యాలకు వ్యతిరేకంగా నడుచుకునే వారికి ముందు వార్నింగ్ ఇవ్వడం, మార్పు రాకుంటే గ్రూప్ నుండి తొలగించడం జరుగుతుంది.
ప్రశ్న 4. తెలుగు సాహితీ వనం బృందం తరఫున మీరు ఏడు సంవత్సరాలుగా ప్రతీ ఏడాది కథా సంకనలమో/కవితా సంకలనమో వెలువరించడం వెనుక ఆలోచనని వివరిస్తారా?
జ: తెలుగు సాహితీవనంలో ప్రతినెలా కవితల పోటీ నిర్వహించి విజేతలకు ప్రకటించిన బహుమతులను అందజేస్తాము. ఆ కవితలన్నీ ఒక్క చోట చేర్చాలనే ఉద్దేశ్యంతో ఏడాదికి ఒకసారి విజేతగా నిలిచిన కవితలన్నీ కలిపి కవితా సంకలనం చేస్తున్నాము. ఆ విధంగా ఇప్పటి వరకు వచ్చిన కవితా సంకలనాలు ‘పాడవే కోయిలా, వసంతవీచిక, సమరధీర, ఎన్నో వర్ణాలు, అలవోక, మిళిత’.
ఇంక కథా సంకలనాల విషయానికి వస్తే, కథా పురస్కారం పోటీలో విజేతగా నిలిచిన నాలుగు కథలతో పాటుగా మేము ఎంపిక చేసుకున్న కథకుల నుండి కొత్త కథలను తీసుకుని కథల సంకలనాలు తీసుకుని వస్తున్నాము. ఆ విధంగా ఇప్పటి వరకు వచ్చినవి ‘అంతర్వాహిని, కడలి, విభిన్న’. ఇలా మొత్తం తెలుగు సాహితీవనం ప్రచురణలు తొమ్మిది.
విభిన్న కథా సంకలనం ఆవిష్కరణ
ప్రశ్న 5. తెలుగు సాహితీ వనం 8వ వార్షికోత్సవం సందర్భంగా కవితా సంకలనాలతో పాటు, ‘విభిన్న’ అనే కథా సంపుటిని ప్రచురించినందుకు అభినందనలు. రచయితల నుంచి కథలు స్వీకరించి, సంకలనం చేయడంలోని సాధకబాధకాలు ఎలాంటివి? ఎప్పుడైనా ఎందుకీ బాధ్యత తలకెత్తుకున్నాను అని అనిపించిందా?
జ: మీ అభినందనలకు ధన్యవాదాలు. ఈ పుస్తకానికి ‘విభిన్న’ అనే పేరు సూచించినందుకు సోమ శంకర్ గారికి కృతజ్ఞతలు.
ఈ సంకలనాలు ముద్రించే విషయంలో సాధకబాధకాలు అంటే.. మేము ఎంపిక చేసుకున్న రచయితల్లో కొద్దిమంది మాత్రమే సకాలంలో కథలను అందజేశారు. మరికొందరు సమయం అయిపోతున్నా కూడా ఇవ్వలేకపోయారు. లాస్ట్ మినిట్‌లో వాళ్ళను వదులుకోలేక కొత్తవాళ్ళను అంత తక్కువ టైమ్‌లో కథ ఇమ్మని అడగలేక చాలా టెన్షన్‌కు గురి అయ్యాను. ఇస్తామని చెప్పి రెండు మూడు వాయిదాలు సమయం తీసుకున్న వాళ్ళను మాత్రం పదే పదే వాళ్ళకు ఫోన్స్ చేసి కథలు తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఇబ్బందులను రచయితలు ప్రచురణకర్తలకు ఇవ్వకూడదు.
కొద్దిమంది రచయితలు కథ రాసిన తరువాత మరొక్కసారి దాన్ని చదివి చెక్ చేసుకుని ఇస్తే బాగుంటుందనిపించింది. విరామ చిహ్నాలకు తప్పకుండా వాడే విధానం ఉంటుంది కదా.. వాటిని సరిచేయడానికి నాకు ఎక్కువ సమయం పట్టింది. ఇలాంటి ఇబ్బందులు ప్రతి సంకలనం వేసేటప్పుడు నాకు ఎదురవుతాయి.
ఆచార్య కొలకలూరి ఇనాక్ గారి ప్రసంగం
ప్రశ్న 6. సాధారణంగా సంకలనానికి కథల ఎంపిక ఎలా జరుగుతుంది? సంకలనం కోసం ఏ కథ ఇవ్వాలనేది రచయిత ఇష్టమా? లేక రచయితలు రెండు మూడు కథలిస్తే, వాటిల్లోంచి మీరు ఒకటి తీసుకుంటారా?
జ: కథ కోసం ఎటువంటి వివాదాస్పదం కాని సామాజిక అంశం తీసుకోవాలని, నిడివి 8 పేజీలు దాటకూడదు అనే నియమం ఉంటుంది.
ప్రతి రచయిత దగ్గర 2, 3 కథలు తీసుకుని సెలెక్ట్ చేసుకున్నాము. ఆ క్రమంలో దాదాపు పది మంది రచయితల కథలు పక్కన పెట్టడం జరిగింది.
శ్రీ అంపశయ్య నవీన్ గారికి సత్కారం
ప్రశ్న 7. విభిన్న ఇతివృత్తాల కథలను సంకలనంలో చేరుస్తున్నప్పుడు ఏదైనా ఏకసూత్రత కోసం చూస్తారా? కథల ఎంపికకు మీరు పాటించే ప్రమాణాలేమిటి?
జ: ఒకే అంశంలో రెండు కథలు ఉన్నప్పుడు రచయితకు చెప్పి మరో కథ రాయించి తీసుకున్నాము. ఈ విధంగా సబ్జెక్ట్ రిపీట్ అవకుండా చూశాము. శైలి, ఎత్తుగడ, కథనం, ముగింపు ఇవన్నీ పరిశీలించాము. కథలో కొత్తదనం కోరుకున్నాము. అన్ని కథలు ఇలా ఉండకపోవచ్చు. చాలా వరకు ఉన్నాయి.
సభలో ప్రసంగిస్తున్న డా. ఏనుగు నరసింహారెడ్డి
ప్రశ్న 8. సంకలనం లోని కథలకు పేజీల నిడివి పరిమితి విధించారా? లేదా నిడివితో నిమిత్తం లేకుండా, ఎంపిక చేసుకున్న కథలను ప్రచురించారా?
జ: పేజీల నిడివిని పాటించాము కానీ కొంచెం అటూ ఇటూగా తీసుకున్నాము. పేజీల నిడివి పాటిస్తే అందరి కథలు ఒకేలాగా ఉంటాయని. ఇంక మేము ఎంపిక చేసుకున్న కథలనే ప్రచురించాము.
కథలను విశ్లేషిస్తున్న శ్రీ సత్యాజీ గారు
ప్రశ్న 9. మీ కృషికి రచయితల సహకారం ఎలా ఉంటుంది? ఇంతమంది రచయితలతో ఎలా సమన్వయం చేసుకున్నారు?
జ: ‘విభిన్న’ లోని 25మంది రచయితలు సహకరించారు. ఇంకా చెప్పాలంటే సహకరించిన వాళ్ళ కథలే ‘విభిన్న’లో ఉన్నాయంటాను. కొద్దిమంది కథలు మేము చెప్పిన దానికన్నా రెండింతలు పెద్దగా ఉన్నప్పుడు కూడా అడిగిన వెంటనే short చేసిచ్చారు. కొద్దిమంది చేయమన్నారు. వాళ్ళ కథలు మేము తీసుకోలేదు.
కథలను విశ్లేషిస్తున్న శ్రీ పెద్దింటి అశోక్ కుమార్ గారు
ప్రశ్న 10. కథ నిడివి విషయంలో కాకుండా, ఏదైనా కథలో ఒక పేరాని గాని లేదా ఓ వాక్యం కాని ఓ పదం కానీ వాడకూడదని అనిపించి – రచయితని సంప్రదించి, ఓ ఎడిటర్‌గా మీరు మార్పించిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా?
జ: అవును కొన్ని కథల్లో కొన్ని మార్పులు రచయితలకు చెప్పి చేయడం జరిగింది. సంకలనాలకు ఎడిటింగ్ తప్పనిసరిగా ఉంటుంది కదా.. కానీ అనవసరంగా ఏ కథను ఎడిట్ చేయాలని అనుకోలేదు.
ప్రశ్న11. ‘విభిన్న’ కథా సంకలనం రూపకల్పన (అంటే డిటిపి, పేజ్ లేఅవుట్, కవర్ పేజీ డిజైన్, ముందుమాటలు వగైరా..) ఎలా అమలు చేశారు? ఎప్పుడు ప్రారంభించారు? ఎప్పటికి పుస్తకం తొలి ప్రతి సిద్ధమయింది?
జ: ఈ పుస్తకం తీసుకుని రావడానికి 4 నెలలు సమయం నాకు పట్టింది. పుస్తకం రూపకల్పన, కథల ఎంపిక తదితర విషయాల్లో సత్యాజీ గారు పూర్తి సహకారం అందించారు.
పుస్తకానికి ముఖచిత్రం గీసి, ఒక కథని అందించిన శ్రీ చరణ్ పరిమి
ప్రశ్న12. చదివినప్పుడు బావుందనిపించినా, మీ ప్రమాణాలలో ఒదగక పోవడం వల్ల పుస్తకంలో చేర్చలేకపోయిన కథ ఏదైనా ఉందా?
జ. అవును ఉన్నాయి. కొన్ని కథలు చదివినప్పుడు బాగుండి, మరికొన్ని మార్పులు అవసరం అనిపించినప్పుడు వాళ్ళను అడిగాము. వాళ్ళు మార్పులు చేయలేదు. ఇలా కొన్ని కథలను అనేక కారణాలతో పక్కన పెట్టేశాము.
కథకుడు శ్రీ సురేంద్రనాథ్ గారితో శ్రీమతి శాంతి కృష్ణ
ప్రశ్న13. ఈ సంకలనం ప్రచురణలో ఏదైనా మరపురాని సంఘటన లేక ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవం ఏదైనా ఉంటే తెలియజేస్తారా?
జ: ఈ పుస్తకం లోని దాదాపు చాలా కథలు ముఖచిత్రం లోకి వచ్చేలా చరణ్ పరిమి వేసిన కవర్ డిజైన్ చాలా చాలా నచ్చింది. రూప్ కుమార్ గారి ముందు మాటలు బాగున్నాయి. ఇంకా కొందరి కథలు అద్భుతంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల మాండలికాలు ఈ పుస్తకంలో చోటుచేసుకున్నాయి.
ముందుమాట వ్రాసిన శ్రీ రూప్ మార్ డబ్బీకార్ గారితో శ్రీమతి శాంతి కృష్ణ
ప్రశ్న14. ఈ కథా సంకలనంతో పాటు వెలువరించిన ఇతర పుస్తకాల ప్రచురణ లోనూ, ఆవిష్కరణ సభ నిర్వహణ లోనూ నిర్దిష్ట బాధ్యతలు పంచుకున్న మీ టీమ్ మెంబర్స్‌ని పరిచయం చేయండి.
జ: నాతో పాటు తెలుగు సాహితీవనంకు సంబంధించిన అన్ని విషయాల్లోను బాధ్యతలు పంచుకుని శ్రమించిన టీం మెంబెర్స్ డా. కృష్ణారావు రెడ్నం, శ్రీధర్ రెడ్డి బిల్లా, శ్రీనివాస్ తొడుపునూరి, విజయ్ అప్పళ్ళ, అరుణ సందడి, సుమన ప్రణవ్, కంచిపాటి వెంకట్, నవీన్ చంద్ర మరియు కొత్తగా టీమ్ లోకి వచ్చిన సుధా కళ్యాణి. ఇంక మా తెలుగు సాహితీ వనం నిర్వహణలలో ఎల్లవేళలా, అన్ని విషయాలకు సలహాలు, సూచనలు అందించే వారు డా. ఏనుగు నరసింహా రెడ్డి గారు, సత్యాజీ గారు. వీరందరి సహకారం ఎప్పుడూ మరువలేనిది. ఇంత పెద్ద సమూహం ఇంత సమర్ధవంతంగా నిర్వహించాలంటే వీరందరి సహకారంతో పాటు ఇంకా కొందరు మిత్రుల ప్రోత్సాహం కూడా ఉంది.
ప్రసంగిస్తున్న శ్రీమతి శాంతి కృష్ణ
ప్రశ్న15. తెలుగులో పుస్తకాలకు ఆదరణ తగ్గిందని కొందరు ప్రచురణకర్తలు, పుస్తక విక్రేతలు అంటున్నారు. ఎందుకనంటారు? పాఠకులు తగ్గారా? వారిని ఆకర్షించే రచనలు తగ్గాయా? లేక ఇంకా ఏదయినా కారణం వుందా?
జ: తెలుగు పుస్తకాలకు, ముఖ్యంగా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలకు నిజంగానే ఆదరణ తగ్గింది. మునుపటికన్నా కొనుగోలు శక్తి పెరిగినా కూడా కొద్దిమంది పుస్తకాలకు డబ్బును వెచ్చించడానికి ఇష్టపడడం లేదు. కొద్దిమంది కొన్నా కూడా చదవడానికి సమయాన్ని కేటాయించలేక పోతున్నారు. అనేక మాధ్యమాల హోరులో సాహిత్యం కొట్టుకుపోతోందేమో అని బాధ కలుగుతుంది.
ప్రశ్న16. సాధారణంగా సంకలనాలను ప్రచురించే సంస్థలు సహకార పద్ధతిలో, రచయితల నుంచి కొద్ది మొత్తంలో డబ్బు తీసుకుని పుస్తకాలు తెస్తున్నాయి. మీరు రచయితల నుంచి డబ్బు తీసుకోకుండా పుస్తకాలు ప్రచురణను ఎలా కొనసాగిస్తున్నారు? ఆర్థికంగా భారం కాదా? అమ్మకాల ద్వారా వచ్చే ఎమౌంట్ మీరు పెట్టిన ఖర్చుకు సమీపంగానైనా వస్తుందని అనుకుంటున్నారా?
జ: కవితల పుస్తకాలకు పెట్టిన ఖర్చు ఎప్పుడూ తిరిగి రాదు. కథల పుస్తకాలకు మాత్రం కొంచెం నామ మాత్రంగా వస్తుంది. ఇంతమంది సభ్యులు ఉన్న తెలుగు సాహితీవనంలో కొందరైనా బుక్స్ కొంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఇంకా మరికొన్ని సంకలనాలు తేవాలనే ఉత్సాహం మాలో పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా పుస్తకాలను కొనే అలవాటును అందరూ చేసుకోవాలి. ఏదైనా సందర్భాలలో పుస్తకాలను బహుమతులుగా ఇచ్చే అలవాటు కూడా మనమందరం చేసులుకోవాలని ఆశిస్తున్నాను.
శ్రీ అంపశయ్య నవీన్ గారితో శ్రీమతి శాంతి కృష్ణ
ప్రశ్న17. రచయిత్రిగా, సంపాదకురాలిగా, సంకలనకర్తగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? ఈ సంకలనాలే కాకుండా మరేవైనా పుస్తకాలు వెలువరించే ఉద్దేశం ఉందా?
జ: రచయిత్రిగా చెప్పాలంటే తెలుగు సాహితీవనం నిర్వహణలో తలమునకలై నా స్వీయ రచనలకు సమయమే లేదనే బాధ అప్పుడప్పుడు కలుగుతుంది. మనసులోని భావాలకు అక్షర రూపం ఇవ్వడానికి కాస్త సమయాన్ని కేటాయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.
సంపాదకురాలిగా గత ఏడాది జూమ్ ద్వారా నిర్వహించిన విశ్వసాహిత్యం కార్యక్రమాన్ని త్వరలో ‘విశ్వసాహిత్యం’ పేరుతో పుస్తకంగా తీసుకుని వస్తున్నాము. ఇంకా ఒక ‘లేఖల’ సంకలనం తేవాలనేది చిరకాల కోరిక. అది కూడా ఈ సంవత్సరం సాధ్యమవ్వాలని ఆశిస్తున్నాను.
ప్రచురణకర్తగా అప్పుడప్పుడు కొన్ని పుస్తకాలు కూడా తీసుకుని వస్తున్నాను.
~
సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు శాంతి కృష్ణ గారూ.
శాంతి కృష్ణ: ధన్యవాదాలు.
***
సంపాదకత్వం: శ్రీమతి శాంతి కృష్ణ
ప్రచురణ: శామ్ పబ్లికేషన్స్
పేజీలు: 200
వెల: ₹ 200/-
ప్రతులకు
శ్రీమతి శాంతి కృష్ణ:
9502236670
శ్రీ నవీన్:
8309686404
~
‘విభిన్న’ కథా సంకలనం సమీక్ష:
https://sanchika.com/vibhinna-book-review-kss/