Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథ, నవలా రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘పొగమంచు’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీమతి గంటి భానుమతి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం గంటి భానుమతి గారూ.

గంటి భానుమతి: నమస్కారం.

~

ప్రశ్న 1. మీరు ప్రచురించిన 13 కథల సంపుటికి శీర్షికగా మొదటి కథ పొగమంచుపేరునే ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

జ: ఈ పదమూడు కథల సంపుటికి ‘పొగమంచు’ పేరునే ఎంచుకోడానికి కారణం పెద్దగా ఏం లేదు. చూడగానే పుస్తకం ఆసక్తికరంగా ఉంటుందని, ఆకర్షణీయంగా ఉంటుందని ఈ సంపుటికి మొదటి కథ పెట్టడం జరిగింది. అంతే.

ప్రశ్న 2: ఇది మీ 12వ కథాసంపుటి అని మీ మాటలో అన్నారు. గత 18 ఏళ్ళుగా సాగుతున్న మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా? మొదటగా ఏ ప్రకియతో సాహిత్య వ్యాసంగం మొదలుపెట్టారు? ఎప్పుడు? మీ కథా రచన గురించి వివరిస్తారా?

జ: ఈ పొగమంచు నా 12వ కథా సంపుటి. మొదటి సంపుటిని 2006 ముద్రించుకున్నాను. అంటే 18 ఏళ్ళ నుంచి నా కథలు, నవలలు నేనే వేసుకుంటున్నాను.

నా సాహితీ ప్రస్తానం నా పధ్నాలుగవ ఏటనుంచి బాలానందంకి రాసిన చిన్న కవితతో ప్రారంభం అయిందని చెప్పచ్చు. ఆ తరవాత మా స్కూలు (మాడపాటి హనుమంతరావు నారాయణగూడా) మాగజైన్ మాతృభారతిలో విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి రాసిన వ్యాసంతో మరో అడుగు ముందుకు వేసాను, ఆ తరవాత కాలేజీ (కమలా నెహ్రూ పాలిటెక్నిక్) మాగజైన్ స్పార్టెక్‌ కోసం కథలు రాసాను.

నేను రాసిన కవితలని నారాయణగూడా వైఎంసిఏలో, కృష్ణదేవరాయ భాషానిలయంలో, ఆంధ్ర సారస్వత పరిషత్తులో, హిమాయత్ నగర్ మగ్దుమ్ భవన్‌లో చదివే అవకాశం లభించింది.

మా వారి ట్రాన్స్‌ఫర్ల మూలంగా ఏది వీలైతే అవే రాసాను. ఏ ఊళ్ళో ఉంటే అక్కడి గురించిన వ్యాసాలు, కవితలు కథలు రాసాను.

హిమాచల్‌లో ఉన్నప్పుడు హిమాచలీల జీవితాలు, కుల్లూ దసరా ఉత్సవాలపైన, మనాలి అందాలు, మణికరణ్, చాలా రాసాను, కవితలు కూడా పంజాబ్ నృత్యాలు, ఖలిస్తాన్ పైన, మా ఇంటి ముందు నుంచి పారే సట్లెజ్ నది అందాలు గురించి కవితలు రాసాను. తరవాత కవితలు తగ్గించి, కథలు రాసాను. మొదట్లో అభ్యుదయ భావాల కథలు రాసాను. ఆఖరుగా రాసినది 2002 నవ్యలో వచ్చిన కథ. దాని తరవాత నేను ఆ భావజాలంతో కథలు రాయలేదు. అలా రాసిన వాటిని నా సంపుటాలలో చేర్చలేదు. అక్కడ రాసిన వాటిల్లో కొన్ని కథలు పోయాయి. ఒక నాలుగు మాత్రం శ్రీకాకుళం కథానిలయంలో ఉన్నాయని విన్నాను. ఈ మాటు వాటిని తెచ్చుకుని నా 13వ కథల సంపుటిలో చేర్చుకుంటాను.

నేను ఎక్కువగా చదువుతాను కాబట్టి, కథలు ఎలా ఉంటే బావుంటుందో తెలుసు కాబట్టి, అలా రాయడానికి ప్రయత్నిస్తాను. నేను ఒక్కసారిగా కథని రాయలేను. రాసాక నాకు నేనే ఓ పాఠకురాలిగా మారిపోతాను. అప్పుడు నా తప్పులు నాకు తెలుస్తాయి. వాక్యాలు, పదాలు మార్చి, తిప్పితిప్పి రాసిన కథలు రాసి, నా మనసుకి నచ్చింది అని అనుకున్న తరవాతే పత్రికలకి పంపుతాను.

ప్రశ్న 3: కథకి సంబంధించి – వస్తువు, శిల్పం, శైలి లో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు? ఈ సంపుటి లోని చాలా కథలను నేనుఅంటూ ఉత్తమ పురుషలో వ్రాశారు. ఇందుకు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? లేక యాదృచ్ఛికంగా జరిగిందా?

జ: కథకి శైలి, శిల్పం రెండూ ఉండాలి. నా మటుక్కి నేను రెడింటికి ప్రాముఖ్యతనిస్తాను. ఈ రెండూ ఉండాలంటే నా మనసుని అక్షరాలలోకి అనువదించాలి. నేను రాసేటప్పుడు నేనే కథల్లోని పాత్రలోకి వెళ్ళిపోతాను, మారిపోతాను. అప్పుడే నా ఆలోచనలు, భావాలు, ఊహలు పూర్తిగా కాగితం మీద పెట్టగలుగుతాను. అవి అన్ని కూడా నా మైండ్, నా మనసు, హృదయంలోంచి వస్తాయి కాబట్టి ఉత్తమ పురుషలోనే రాయాలి. అందుకే నేను ఎక్కువగా కథలని ఉత్తమ పురుషలో రాస్తాను. కొన్ని మామూలుగానే రాస్తాను.

ప్రశ్న 4: “ఇది ప్రయాణం. మనుషులు కలుస్తారు, విడిపోతారు” అనేవి చాలా లోతైన మాటలు. ‘దూరపు కొండలు’ వేదన నిండిన కథ. ఈ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?

జ: నేను రాసే కథలన్నింటికి కూడా ఓ చిన్న నేపథ్యం ఉంటుంది. దానికి నేను కొన్ని కల్పించి, కొన్ని ఊహించి రాస్తాను. ఈ సంపుటిలో మూడు కథలు దుబాయ్‌లో జీవిస్తున్న ముగ్గురి గురించి రాసాను. దుబాయ్‌లో మా అబ్బాయ్ ఉంటాడు కాబట్టి, నాలుగు సార్లు వెళ్ళాను కాబట్టి వాళ్ళ గురించి రాసాను. వాళ్ళవి నాకు తెలియని జీవితాలు కాబట్టి దీన్ని ఓ అవుట్ సైడర్‌లా చూసాను కాబట్టి ఉత్తమ పురుషలో రాసాను.

ప్రశ్న 5: సెరెబ్రల్ ఫాల్సీతో జన్మించిన పిల్లవాడు ఎంతో శ్రమించి, అమ్మ ప్రోత్సాహంతో, తలతోనే రాయడం నేర్చుకుని తన ఊహలకి అక్షర రూపమిచ్చి, పుస్తకాలు ప్రచురించి, ఎందరికో ప్రేరణగా నిలుస్తాడు రెక్కలొచ్చిన ఊహలుకథలో. ఈ కథ నేపథ్యం గురించి వివరిస్తారా?

జ: రెక్కలొచ్చిన ఊహలు కూడా అంతే. ఓ చిన్న ఇన్సిడెంట్, రోజూ సాయంత్రం, మా కాంప్లెక్స్‌లో ఒకబ్బాయిని వాళ్ళమ్మ ప్రామ్‌లో కూచోపెట్టి తిప్పుతూంటుంది. ఆ పిల్లాడిలో ఏమాత్రం చలనం ఉండదు ఓ బొమ్మలా కూచుంటాడు. అప్పుడప్పుడ కళ్లు మాత్రం తిప్పుతూంటాడు. ఆ అబ్బాయికి సెరిబ్రల్ పాల్సీ అని తెలిసింది. వెంటనే నేను దాని గురించి నేను గూగుల్‌లో వెతికాను. చాలా వివరాలు ఉన్నాయి. అందులో ఇలాంటి అబ్బాయి గురించిన ఆర్టికల్ చదివాను. అది రీడర్స్ డైజెస్ట్ పత్రిక లోని ఆర్టికల్. ఇలా పుట్టిన అబ్బాయిని, ఆ తల్లి ఓ రచయితగా మార్చిన తీరు, దిద్దిన విధానం అదీ చాలా ఇన్‌స్పైరింగ్‌గా నిపించింది. అదే కథకి ఆధారం.

ప్రశ్న 6: ఉద్యోగం నన్ను తినేస్తోందా, నన్ను నేను త్యజించి పరాయిదాన్నయిపోయానా? అని ప్రశ్నలు వేసుకున్న మహిళ కథ నేటి ఉద్యోగి’. ఈ కథకి స్ఫూర్తి ఏమిటి? కోషీ పాత్ర లాంటి వ్యక్తులు నిజ జీవితంలో మీకు తారసపడ్డారా?

జ: చాలా మంది ఉద్యోగినులు, ఉద్యోగ బాధ్యతల్లో పడిపోయి ఎక్కడికైనా వెళ్ళడానికి తీరిక చేసుకోలేక, సమయం కుదరక, ఎన్నింటినో మిస్ అవుతున్నారు, వాళ్లు జీవితంలో విలువైనవి ఏం పోగొట్టుకుంటున్నారో వాళ్ళ ద్వారానే విన్నాను. ఇదే నేటి ఉద్యోగి కథకి నేపథ్యం.

ప్రశ్న 7: ‘జీవన్మరణాల మధ్య’ కథలో ఆత్మహత్య చేసుకోబోతున్న మహిళని తెలివిగా కాపాడుతుంది జర్నలిస్ట్ ద్యుతి. ఆ సమయంలో ఆమె చూపిన సమయస్ఫూర్తి ప్రశంసనీయం. ఈ కథకి ఆధారం ఏదైనా వాస్తవ ఘటనా లేక కేవలం కల్పితమా?

జ: ఈమధ్య టీవీల్లో సెల్ఫీలో మాట్లాడుతు చచ్చిపోతూన్న వాళ్ళన చూసాక అనిపించింది, ఎవరైనా ఆ మొబైల్ ఆధారంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చావుని ఆపగలిగితే బావుండని. అలా అనిపించినదానికి కథా రూపమే ‘జీవన్మరణాల మధ్య’.

కొన్నేళ్ళ క్రితం ఓ యువకుడు ఏవో కారణాల వల్ల చచ్చిపోతూ సెల్పీ పెట్టి కాస్సేపు ఏవో కారణాలు చెప్తూ తనకు తానే ఉరి వేసుకున్నాడు. ఎవరైనా అతని మొబైల్ ఆధారంగా అక్కడికి వెళ్ళి ఆ చావుని ఆపగలిగితే బావుండుననిపించింది. ఇలా జరిగితే బావుంటుందని ఊహించి రాసాను. ఈ ఆధారంగా రాసిన కథే ఇది.

ప్రశ్న 8: వైకల్యం శరీరానికే కాని మనసుకు కాదని గట్టిగా చెప్పిన కథ అనూహ్యం’. ఈ కథలో ప్రధాన పాత్రధారి అయిన ఫొటోగ్రాఫర్‍ పేరు చెప్పలేదు. పేరు చెప్పకుండా కథని వ్రాయడాన్ని ఓ ప్రయోగమని అనుకోవచ్చా? ఆ పాత్రకి కావాలనే పేరు పెట్టలేదా?

జ: ఇదివరకూ ఏ న్యూస్ ఛానెల్లోనో గుర్తు లేదు, టీవిలో గ్రేట్ సర్వైవర్స్ అనే ప్రోగ్రామ్ వచ్చేది. ఒకసారి వీల్ చెయిర్‌లో కూచుని పెయింటింగ్‌లు వేసిన ఓ మహిళ గురించి వచ్చింది. ఆ మహిళ గురించి విన్న ఓ రంగుల కంపెనీ ఆమె వేసిన పన్నెండు పెయింటింగ్స్‌ని కొనుకుని, ఆ సంవత్సరపు కాలెండర్ కోసం వాడుకుంది. అదే ఈ ‘అనూహ్యం’ అనే కథకి నేపథ్యం.

ఈ ‘అనూహ్యం’ అనే కథలో ఫొటోగ్రాఫర్ ప్రధాన పాత్రధారి. ఇందులో అతని పేరు చెప్పాల్సిన పని లేదు. నేను ఫలానా, నా పేరు ఇది అని తనకు తానుగా చెప్పుకోడు. అతనే తన గురించి చెప్పుకుంటున్నప్పుడు పేరు అక్కర్లేదు. ఇది ఓ ప్రయోగం అని అనుకోలేదు.

ప్రశ్న9: లోయల్లోకి జారిపోయిన ప్రేమ కథ పొగమంచు’. ఈ కథ వెనుక నేపథ్యం వివరిస్తారా?

జ: మేము హిమాచల్ ప్రదేశ్‌లో ఏడేళ్ళున్నాము. అక్కడ పేపర్లలో రోజూ, వర్షాకాలాల్లో లాండ్‌స్లైడ్స్, క్లౌడ్ బరస్టు, లోయల్లో జారి పడిపోయిన బస్సులు, కార్ల గురించి, ఫొటోల కోసం బండరాళ్ళ మీద నుంచుని బియాస్ నదిలో పడిపోయిన వాళ్ల గురించి, ట్రెకింగ్ సీజన్‌లో ట్రెకింగ్‌కి వెళ్ళి జారి పడిన వాళ్ళ గురించి వచ్చేది. అప్పుడు ఇలాంటి కథకి కావలసిన సమాచారాన్ని నెట్‌లో చూసుకుని, దీనికి మరి కొంచం ఊహించి, మలుపు తిప్పి రాసిన కథ ఈ లోయల్లోకి జారిపోయిన ప్రేమ కథ.

ప్రశ్న 10: ‘పరిష్కారం దొరికింది’ కథలోని నిర్మల తల్లిదండ్రులది స్వార్థమా? జీవితపు మలిదశలో కలిగే భయమా? వీరు కల్పిత వ్యక్తులా లేక నిజజీవితంలో మీకు తారసపడిన వ్యక్తులా? ఈ కథ నేపథ్యం చెప్పండి?

జ: ‘పరిష్కారం దొరికింది’ కథలో తల్లీ తండ్రులది స్వార్థం అని పూర్తిగా అనలేను. ఆర్ధికంగా వెనకబడ్డ వృద్దులు, కొడుకులు లేని వాళ్లు ఆలంబన, ఆసరా కోసం తెలీయకుండానే ప్రవర్తిసూంటారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.

ప్రశ్న11: సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయితే ఈ సంపుటిలోని ఏ కథ మీ మనసుకు బాగా దగ్గరయింది? ఎందువలన?

జ: నేను రాసినవన్నీ నాకు నచ్చుతాయి. నచ్చకుండా కథని పంపించను. నాకు నచ్చినది ‘దూరపు కొండలు’. దీనిని వంగూరి ఫౌండేషన్ వారి డయాస్పోరా కథల కోసం రాసినది. దీనినే పునాస పత్రికకి పంపాను. అందులో వచ్చింది.

ఇందులోని పదమూడు కథలు ఒకదాని కొకటి పోలి లేదు. ఒక మూస కథలు కావు. పదమూడు ఇతివృత్తాల మీద నడిచిన కథలు.

ప్రశ్న12. ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?

జ: ‘ముందుకొచ్చిన గతం’ అనే కథ ఇంకా బాగా రాసి ఉండచ్చేమో అనిపించింది.

ప్రశ్న13. సాహిత్యరంగంలో మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలు ఏవైనా సిద్ధమవుతున్నాయా?

జ: ఇంక రాయడం ఆపేయాలని నేను ఎప్పుడూ అనుకోను. రాసినదానితో నాకు తృప్తి లేదు. ఇంకా బాగా రాయాలి, ముందు ముందు ఇంకా మంచి ఇతివృత్తాలతో మంచి రచనలు చేయాలనే ఎప్పుడూ అనుకుంటున్నాను. ఈ సంవత్సరం ఒక నవల, ఒక కథల సంపుటి సిద్ధం చేసుకుంటున్నాను. అన్ని కుదిరితే రెండు నవలలు కూడా రావచ్చు.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు గంటి భానుమతి గారు.

గంటి భానుమతి: సంచిక టీమ్‌కి నా ధన్యవాదాలు.

***

పొగమంచు (కథాసంపుటి)
రచన: గంటి భానుమతి
ప్రచురణ: గంటి ప్రచురణలు, హైదరాబాద్
పేజీలు: 104
వెల: ₹ 150/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
రచయిత్రి:
ఫోన్: 8897643009
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/pogamanchu-katha-samputi

~
‘పొగమంచు’ కథాసంపుటి సమీక్ష
https://sanchika.com/pogamanchu-book-review-kss/

Exit mobile version