Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రచయిత్రి, ప్రచురణకర్త శ్రీమతి భావరాజు పద్మినీ ప్రియదర్శిని ప్రత్యేక ఇంటర్వ్యూ

[‘ఆఁయ్! మాది నర్సాపురఁవండి’ అనే కథాసంపుటి వెలువరించిన శ్రీమతి భావరాజు పద్మినీ ప్రియదర్శిని గారి ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

సంచిక టీమ్: నమస్కారం భావరాజు పద్మినీ ప్రియదర్శిని గారూ.

భావరాజు పద్మినీ ప్రియదర్శిని: నమస్కారం.

~

ప్రశ్న 1: మీ ఎనిమిదవ పుస్తకంగా, ‘ఆఁయ్! మాది నర్సాపురఁవండికథాసంపుటి వెలువరించినందుకు అభినందనలు. ఈ పుస్తకాన్ని సాధారణ పుస్తకాలకి సైజుకి భిన్నంగా, గ్లాసీ కలర్ పేపర్ మీద ముద్రించడం వెనుక మీ ఆలోచన ఏమిటి?

జ: మా పత్రికకు దాదాపు ఒక 10 ఏళ్ల పాటు బొమ్మలను అందించిన మా ఆర్టిస్ట్ శ్రీ బీవీ నాగేంద్రబాబు గారు, అనుకోకుండా రెండేళ్ల క్రితం గతించారు. కథలోని భావమంతా చిన్న బొమ్మగా వేయడంలో అయిన దిట్ట. ఈ పుస్తకంలోని ‘శ్రీనగజా తనయం’ అనే కథకు ఆయన చివరగా బొమ్మ వేసారు. ఈ బొమ్మలకు తగిన న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని మల్టీ కలర్ లోనే తీసుకురావాలని ఈ విధంగా ముద్రించటం జరిగింది. ఈ పుస్తకాన్ని ఆయనకే అంకితం ఇచ్చాను, తొలి ప్రతిని వారి శ్రీమతి గారికి అందించాను. అంతేకాక ఈ పుస్తకాల అమ్మకాల్లో కొంత భాగాన్ని వారి కుటుంబానికి అందజేయడం జరిగింది.

ప్రశ్న 2: మీరు కథలే కాకుండా వచన కవిత్వం, పద్య కవిత్వం, నవలలు వ్రాసారు కదా. మీ రచనా వ్యాసంగం ఎప్పుడు ఏ ప్రక్రియతో మొదలయింది? మీ సాహితీ ప్రస్థానం గురించి పాఠకులకు తెలియజేస్తారా?

జ: చిన్నప్పటి నుంచి రచన పట్ల నాకు మక్కువ ఉంది. కాలేజీ జర్నల్స్ లోను, ఇతర సందర్భాల్లోనూ చిన్నచిన్న రచనలు చేస్తూ ఉండేదాన్ని. 2012 లో ‘అచ్చంగా తెలుగు’ అన్న ఫేస్‌బుక్ గ్రూప్ స్థాపించిన దగ్గర నుంచి నా రచన ప్రస్థానం సంపూర్ణంగా ఆరంభమైంది. నా రచన వ్యాసంగం చిన్న చిన్న సరదా వ్యాసాలతో మొదలైంది. వాటిని 2014లో ఎమెస్కో వారు ‘వ్యంగ్యాస్త్రం’ అన్న పుస్తకంగా ప్రచురించారు. అదే నా తొలి పుస్తకం.

ప్రశ్న 3: ఆఁయ్! మాది నర్సాపురఁవండిమీ రెండో కథాసంపుటి. పుస్తకానికి మా నర్సాపురం కథలుఅని ఉపశీర్షిక పెట్టారు. మీ మొదటి కథాసంపుటి పేరు మా బాపట్ల కథలు’. మీ కథా సంపుటాలని ఒక ప్రాంతంతో ఎందుకు ఐడింటిఫై చేయాలనుకున్నారు? బాపట్లతో గాని, నర్సాపురంతో గాని మీకెటువంటి అనుబంధం ఉందో పాఠకులకి వివరిస్తారా?

జ: సొంత ఊరు, కన్న తల్లి, పుట్టి పెరిగిన సంస్కృతి వంటివి ఒక వ్యక్తి జీవితంలో మరపురాని అనుభూతులు. ఇవన్నీ ఆ వ్యక్తి ఎదుగుదలలో చెరిగిపోని ముద్రను వేస్తాయి. అందరూ ఎవరి ఊరి కథలను వారు వ్రాయడం – మా పెద్దమావగారు బివిఎస్ రామారావు గారి ‘గోదావరి కథలు’తో ఆరంభమైంది. మరి మా ఊరి కథలను ఎవరు వ్రాస్తారు? మా ఊరి తాలూకు అద్భుతాలను, చరిత్ర అనే శిలాఫలకం మీద ఎవరు ముద్రిస్తారు? అందుకే నేనే వ్రాయాలనుకున్నాను. బాపట్ల మా నాన్నగారి ఊరు, నరసాపురం మా అమ్మగారి ఊరు. ఈ రెండు ఊళ్లకు – ఊరిపేరు దగ్గర నుంచి, ఎంతో గొప్ప చరిత్ర, దేవతలు, ఆనవాయితీలు ఉన్నాయి.‌ మామూలుగా చరిత్ర చెబితే ఎవరూ వినరు, చదవరు. కానీ, ఇవన్నింటినీ మేళవించి మంచి కథలుగా వ్రాస్తే.. అవి సాధారణ పాఠకులకు కూడా కలకాలం గుర్తుండిపోతాయి. అందుకే ఎంతో పరిశోధించి, ఈ పుస్తకాలను తీసుకువచ్చాను.

ప్రశ్న 4: అమరావతి కథలు, గుంటూరు కథలు, పసలపూడి కథలు, మిట్టూరోడి కథలు, భట్టిప్రోలు కథలు, యానం కథలు వంటి కథాసంపుటాల వలె మీ కథాసంపుటి ఆఁయ్! మాది నర్సాపురఁవండికూడా ఒక ఊరికి ప్రాతినిధ్యం వహించేలా చేసేందుకు ఈ కథల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

జ: ప్రత్యేకించి కథల్లో ఒక ఊరి సంస్కృతి గురించి, అక్కడి ఆచారాల గురించి, వ్రాస్తూన్నప్పుడు ఒక ప్రామాణికత ఉండాలి. ‘రచయిత తను వ్రాసే ప్రతి అక్షరానికి బాధ్యత వహించాలన్న’ సిరివెన్నెల గారి మాటలను నేను చిత్తశుద్ధితో ఆచరిస్తాను. అందుకే ఈ కథల్లో ప్రతి ఒక్క మలుపులోను, వ్రాసిన విషయాలను ఒకటికి పది సార్లు పరిశీలించుకుని, అనేక మందికి ఫోన్లు చేసిన నిర్ధారించుకుని మరీ వ్రాశాను. మరొక పెద్ద సవాలు – యాస! నేను పుట్టి పెరిగిందంతా గుంటూరు జిల్లాలోనే. కానీ ఈ కథలో గోదావరి జిల్లా యాస లేకపోతే వాటిలోని ఆత్మ లోపిస్తుంది. అందుకే ఈ యాస విషయంలో కూడా మొదట్లో నేను బాగా కష్టపడాల్సి వచ్చింది. వాళ్లు వాడే పదాలు, మాట్లాడే మాటలు, నిశితంగా పరిశీలించి, క్రమంగా దాన్ని అభివృద్ధి చేసుకున్నాను.

ప్రశ్న 5: శ్రీ కూచి గారు తమ ముందుమాటలో “చుట్టూ ఉన్న సంఘాన్ని.. అందులోని మనుషుల్ని.. వారి లోతైన మనసుల్ని.. చిటారుకొమ్మన మిఠాయిపొట్లంలా ఒడుపుగా అందుకుని పాఠకాళికి బహుశ్రద్ధగా అందివ్వడంలో ఈ రచయిత్రిది ఓ మనోజ్ఞమైన శైలి” అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా, కథకి సంబంధించి వస్తువు, శిల్పం, శైలి లలో మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారో చెప్తారా?

జ: నా పరంగా వస్తువు, శిల్పం, శైలి అన్నీ ముఖ్యమే. ఏదో ఒక కథలు వ్రాసేయాలంటే రోజుకి 10 వ్రాసేయవచ్చు. కానీ ప్రతి కథ వెనకాల ఉన్న నేపథ్యం, సూటిగా పాఠకుల మనసును తాకాలంటే, నిశ్చయంగా కథా వస్తువు, ఆ వస్తువును ఒక శిల్పం లాగా మలిచేటప్పుడు వాడే మాటలు, గోదావరి ప్రవహిస్తున్నట్లు సహజంగా ఉండే శైలి.. ఈ మూడు త్రివేణి సంగమంలాగా కలవకపోతే ఆ కథ అసంపూర్ణమవుతుందని నా భావన.

ప్రశ్న 6: మా బాపట్ల కథలులోని కథలకీ, ‘మా నర్సాపురం కథలులోని కథలకి ఉన్న సారూప్యతలు, వైవిధ్యాలను వివరిస్తారా?

జ: వైవిధ్యాలను వివరించడం చాలా తేలిక! ఎందుకంటే, ‘మా బాపట్ల కథల’ను పూర్తిగా గుంటూరు జిల్లా యాసలో వ్రాసాను. కానీ ‘మా నరసాపురం కథల’ను పూర్తిగా గోదావరి జిల్లా యాసలో వ్రాసాను. గుంటూరు జిల్లా వైపు ముక్కుసూటి మనుషులు ఎక్కువ! ఏదైనా మొహం మీద అనేస్తారు. పెద్దగా మర్యాదలు ఉండవు. ‘అమ్మ, నాన్నా..’ అంటారు. కానీ గోదావరి జిల్లాల్లో ‘అమ్మగారండీ, నాన్నగారండీ..’ అంటూ అమ్మా నాన్నలతో సహా అందరికీ మర్యాద ఇస్తూ పిలవడం చూస్తూంటాము. ఏదైనా విషయం గురించి అడిగినప్పుడు కూడా, వాళ్లకు ఇష్టం లేకపోయినా, ‘ఆఁయ్, అలాగేనండి, మీకెందుకండి, సేసేద్దామండి’ అంటూ సర్దిచెప్పి పంపుతారు తప్ప, ఖరాకండిగా కాదు పొమ్మనరు. గోదావరి జిల్లాలో వెటకారం కూడా ఎక్కువ. ఈ రకమైన మనస్తత్వాలను, ప్రాంతీయతలను కథల్లో చొప్పించే ప్రయత్నం చేశాను. సారూప్యతలు తక్కువనే చెప్పాలి.

ప్రశ్న 7: ప్రాంతీయ ఇతివృత్తాలతో సార్వజనీనమైన కథలను అందించడం మీ దృష్టిలో తేలికా? కష్టమా? ఎందుకని?

జ: చాలా కష్టమండి. ఎందుకంటే, ఒక మామూలు కథను వ్రాసినప్పుడు పాఠకులు దాన్ని కేవలం ఒక కథలాగే చదువుతారు. కానీ ప్రాంతీయ కథలలో – అద్దంలా ప్రతిబింబంలా – తమను తాము చూసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ప్రాంతీయ ఇతివృత్తాలతో అందరూ ఆమోదించేలాగా కథలను వ్రాయాలంటే ఆ ఊరు, అక్కడ ఉన్న ప్రదేశాలు, వాళ్లు మాట్లాడే పదాలు, వారి వేషభాషలు, చరిత్ర, సంస్కృతి, మనస్తత్వాలు, ఇవన్నీటినీ గమనించి, వాటిని కథల్లో మేళవించినప్పుడే ‘ఈ కథలు మావి’ అని పాఠకులు ఆమోదిస్తారు. అందుకే ఇలా అందరూ ‘మన’ అనుకునే కథలను వ్రాయాలంటే చాలా కష్టమని నా భావన.

ప్రశ్న 8: ఒక ఊరి గురించి, అక్కడి మనుషుల గురించి ప్రత్యేకంగా కథలల్లేటప్పుడు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు?

జ: ఈ సందర్భంగా మీకు మా గురువుగారు, శ్రీ వి.వి.శ్రీథర్ గురూజీ చెప్పిన ఒక మంచి మాట చెప్తాను. ప్రతి ఒక్క భారతీయుడు ఏదైనా ఒక పనిని ఆరంభించే ముందు, “ఈ పని చెయ్యడం వల్ల నా దేశానికి, నా ప్రజలకు మంచి జరుగుతుందా?” అని తనను తాను ప్రశ్నించుకుని మరీ ఆరంభించాలట! ఆ రకంగా రచనల పరంగానే కాదు, ఈ దేశ పౌరులైన ప్రతి ఒక్కరూ ఏ పనిని చేసినా అది అందరికీ సానుకూలంగా ఉండేలాగా ఉండాలి. విద్వేషాలు రగిలించే లాగా, మనసులో వికారాలు పుట్టించే లాగా ఉండకూడదు. బురద జల్లే బదులు, ఆ బురదలో కూడా పూసే పద్మాలను చూపితే.. ఆశావహంగా, స్పూర్తిదాయకంగా ఉంటుంది కదా! నా పథం ఇదే! కాకపోతే చెప్పదలుచుకున్న విషయాన్ని ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకుని, సమీక్షించుకుని వ్రాశాను. నా కథను ప్రచురించే ముందు కనీసం ఓ పాతిక సార్లు చదువుకుంటాను. ఈ వాక్యాన్ని మరింత మెరుగ్గా చెప్పే వీలుందని అనిపించినప్పుడు, ఆ వాక్యాన్ని తిరగ వ్రాసుకుంటాను. నేటి ‘జెన్ జీ’ కాలంలో నా పద్ధతి కాస్త చాదస్తంగా అనిపించొచ్చు. కానీ, కలకాలం నిలిచిపోయే రచనలు చేయాలంటే ఈ మాత్రం కష్టపడాలని నా భావన.

ప్రశ్న 9: నరసన్న తీర్థంకథలో ఒక పాత్ర నేను గుర్రాలక్కలా అలిగాను అని అంటే, అలిగిన అమ్మాయిలని అలా ఆటపట్టించడం నర్సాపురంలో ఓ సరదా అన్నారు. దీని గురించి మరింత వివరంగా చెప్తారా?

జ: అంతర్వేది నరసింహ స్వామి వారు హిరణ్యకశిపుని కుమారుడైన రత్నలోచనుడిని సంహరించాలని చూసినప్పుడు, అతనికున్న వరప్రభావం వల్ల, అతని దేహం నుండి నేలరాలిన ప్రతి ఒక్క రక్తపు చుక్క నుంచి, మరొక రత్నలోచనుడు పుట్టసాగాడట. అప్పుడు స్వామి వారు మాయా శక్తిని ఆవాహన చేస్తే, ఆమె అశ్వముఖంతో ప్రత్యక్షమై, యుద్ధక్షేత్రమంతా తన పొడవైన నాలుకను చాచి, అసుర సంహారానికి తోడ్పడిందట. ఆమెకు అశ్వముఖం ఉన్నది కనుక ‘గుర్రాలక్క’ అన్నారు. అంతర్వేది నరసింహ స్వామిని ‘నరసన్న’ అంటారు. ఆ తర్వాత స్వామివారు స్వయంభూ మూర్తిగా అంతర్వేదిలో వెలిసారు. ఆయనకు అనేకమార్లు కళ్యాణాలు జరగడం, ఆయన ఉత్సవ వైభోగం చూసి అసూయ కలిగిన గుర్రాలక్క, మూతి తిప్పుకుని, అలిగి వెళ్లిపోయిందట. తోబుట్టువుల మధ్య అసూయలు సహజమే కదా! ఆ నేపథ్యంలో వచ్చిన సరదా కథ ఇది. అందుకే అసూయతో అలిగే అమ్మాయిలని మా నరసాపురంలో ఇలా ఆటపట్టిస్తూ‌ ఉంటారు.

ప్రశ్న 10: రీల్స్ రంగమ్మకథలో, కనకయ్య గొప్ప జీవిత సత్యం చెప్తాడు. రంగమ్మ, కనకయ్య పాత్రలు కల్పితమా లేక మీకు నిజ జీవితంలో తారసపడిన వ్యక్తులా?

జ: కల్పిత పాత్రలేనండి! నేడు రీల్స్ పేరుతో, వాటి ద్వారా వచ్చే డబ్బు, కీర్తి కోసం సమాజం ఎంతో దిగజారడం చూస్తూన్నాము. అలాంటి వారిలో ఒక చిన్న ఆలోచన, వివేచన కలిగించాలనే ఈ ప్రయత్నం!

ప్రశ్న 11: తుమ్మమొద్దుకథలోని వేదవతి పాత్రని ఎంతో స్ఫూర్తిదాయకంగా చిత్రించారు. ఈ కథ నేపథ్యం వివరిస్తారా?

జ: నరసాపురం లేసు పరిశ్రమకు ఎంతో ప్రఖ్యాతి చెందింది. సహజంగానే ఇల్లాళ్ల పట్ల ఒక లోకువ భావన గత తరంలో ఉంది. ఆ మనస్తత్తాన్ని, ఈ కళను, లేసు పరిశ్రమ చరిత్రను, మేళవించి ఒక మంచి కథను చెబితే.. అది కుటుంబ పరిస్థితుల రీత్యా ఇంట్లోనే ఉంటూ ఏదైనా చేయాలన్న పట్టుదల ఉన్న గృహిణులకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని భావించాను. ఆ లక్ష్యం కోసం అల్లిన కథే ఇది!

ప్రశ్న 12: సాధారణంగా రచయితలకు తాము రచించేవన్నీ నచ్చుతాయి. అయినా, ఈ పుస్తకం నుంచి మీ మనసుకు బాగా దగ్గరయిన ఓ కథని ఎంచుకోమంటే దేనిని ఎంచుకుంటారు? ఎందువలన?

జ: చిన్నమ్మలు – కథను ఎంచుకుంటాను. ఎందుకంటే, పనులు లేక, కుటుంబ పరిస్థితులు అనుకూలించక, ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది ఈ రోజుకీ కువైట్ వెళుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు పడే ఇబ్బందులు పగవాళ్లకు కూడా వద్దు. వెళ్లగానే పాస్‌పోర్ట్ లాక్కుంటారట. కోపమొస్తే వాళ్లను బెల్టు తీసుకుని చావగొడతారట. రోగాలొచ్చినా పనులు మానకూడదట. ఇలా ఎన్నో విన్నాను. పద్మ వ్యూహం లాంటి ఆ ఇళ్లలో చిక్కుకుని, చదువు రాక, బయటపడే దారి తెలియక, ఈ రోజుకీ, పడరాని పాట్లు పడుతున్న వారు ఎందరో!  గోదావరి జిల్లాలోని ప్రతి ఒక్క ఊరు నుంచి ఇలా కువైట్ వెళ్లే వాళ్ళు ఎవరో ఒకరు ఉండనే ఉంటారు. అలా వెళ్లాక అక్కడ ఉండే పరిణామాలను ఈ కథలో చెప్పే ప్రయత్నం చేశాను. ‘రెక్కలు కట్టుకుని’ విదేశాలకు ఎగిరే బదులు, ‘రెక్కలు ముక్కలు చేసుకునైనా’ మన దేశంలో బ్రతకడమే మేలన్న అంశాన్ని, శ్రామికులకు, ఈ కథ ద్వారా చెప్పడమే నా ఉద్దేశం.

ప్రశ్న 13: ఈ సంపుటిలోని ఏదైనా కథ రాయడం కష్టమనిపించిందా? అనిపిస్తే ఎందువలన? ఏ కథనైనా ఇంకా మెరుగ్గా రాసి ఉండచ్చు అని అనిపించిందా?

జ: ‘శ్రీనగజా తనయం’ – కథ చాలా కష్టమనిపించింది. ఎందుకంటే హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు గారంత గొప్పవారు మా దీక్షిత దాసు గారు. సరైన సమాచారం దొరకక ఈ కథ దాదాపు ఒక ఏడాది పాటు ఆగిపోయింది. ఆ సమయంలోనే మా ఆర్టిస్ట్ గారు గతించటం జరిగింది. చివరికి, నర్సాపురం వాస్తవ్యులైన రిటైర్ హిందీ టీచర్ శ్రీ భట్టిప్రోలు సత్యనారాయణ గారు, ఎలాగో వారి కుమారుడిని పట్టుకుని, ప్రామాణికమైన సమాచారం సేకరించి అందించారు. అందుకే ఈ కథను పూర్తి చేయడానికి చాలా సమయం పట్టింది. అంతరించిపోతున్న హరికథల వంటి సంస్కృతిని ప్రోత్సహించడానికి, నా కష్టం ఎంతోకొంత ఉపయోగపడుతుందని భావిస్తూన్నాను.

‘ఇంకా మెరుగ్గా వ్రాయవచ్చని’ అనిపించిన కథ ఏదీ లేదు. ఎందుకంటే, ముందు చెప్పిన విధంగా, ప్రతి కథను కనీసం ఒక పాతిక సార్లైనా పునః సమీక్షించుకుంటాను.

ప్రశ్న 14: ఆఁయ్! మాది నర్సాపురఁవండిపుస్తకం ప్రచురణలో మీకు ఎదురైన ప్రత్యేక అనుభవాలు ఏవైనా ఉన్నాయా? ఈ పుస్తకం గురించి ఎక్కువమందికి తెలిసేలా చేయడానికి ఏవైనా కొత్త ప్రయత్నాలు ఆలోచించారా?

జ: అసలీ కథల పుట్టుక వెనక ఉన్న ఒక రహస్యం మీకు చెప్తాను. నర్సాపురంలో జరగనున్న మా అన్నయ్య కొడుకు సాయి ఒడుగు కోసం మేము అక్కడికి వెళ్ళాము. ఆ సమయంలో నేను మా అక్క కొడుకు వినయ్ తో కలిసి, పంటి ఎక్కి, రేవుదాటి సఖినేటిపల్లి వెళ్లాను. గోదాట్లో దిగి, ఆ నీళ్లను దోసిలి పట్టి, గోదారమ్మకు అంజలి ఘటిస్తూ ఉండగా.. మా వినయ్ తీసిన ఫోటోనే ఈ పుస్తకానికి కవర్ పేజీగా వేసాను. అలా గోదారి నీళ్లు నా దోసిట్లో ఉండగా.. గోదారమ్మ నాతో మాట్లాడినట్టు అనిపించింది. ‘ఏమ్మా, మీ బామ్మగారి ఊరి గురించి బాపట్ల కథలు వ్రాసావు, అలా మీ నాన్నవైపు వారికి ఒక కీర్తి మిగిల్చావు. అహోబిల నృసింహునికి రెండు కావ్యాలు అంకితమిచ్చి ఆయనకూ పాదసేవ చేసుకున్నావు. గురుసేవ, సమాజసేవ, చేస్తూ.. ఎంతోమందికి ఉపయోగపడుతున్నావు. కానీ.. అమ్మడూ, నన్ను మర్చిపోయావా? నీ ఎదుగుదలలో ఈ గోదారమ్మకు, నర్సాపురానికి కూడా భాగం ఉంది కదా! మా కోసం కూడా ఏమైనా వ్రాయకూడదా?’ అని గోదారి తల్లి నన్ను అడిగినట్టు అనిపించింది. అదే క్షణంలో దోసిట్లో ఉన్న గోదారి నీటితో అమ్మకు చేసిన ప్రమాణం – మూడేళ్ల తర్వాత ఈ పుస్తకంగా రూపుదాల్చింది.

పత్రికలలో రివ్యూలు, వ్రాతకోతల కాలం చెల్లిందండి. ఇప్పుడంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్, వీడియోల కాలం. ఒక నిముషం కంటే తక్కువ నిడివి ఉన్న చిన్న వీడియోలు పెడితే పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. అందుకే ఈ రకంగా పుస్తకాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని అనుకుంటున్నాను.

ప్రశ్న 15: సాహిత్యరంగంలో రచయిత్రిగా, ప్రచురణకర్తగా మీ భవిష్యత్తు ప్రణాళికలేమిటి? కొత్త పుస్తకాలేవైనా సిద్ధమవుతున్నాయా?

జ: భవిష్యత్తులో ‘ఆనందాస్త్రం’ అనే సరదా వ్యాసాల పుస్తకాన్ని, ఈ ధనుర్మాసానికి ఆండాళ్ తల్లి రచనలన్నీ తెలుగులో తీసుకు వచ్చే ‘గోదా మధురగీతికలు’ అనే పుస్తకాన్ని తీసుకురావాలని అనుకుంటున్నాను. మరికొన్ని రచనలు కూడా చేస్తూ ఉన్నాను. మా ప్రచురణల ద్వారా వచ్చిన పుస్తకాల సంఖ్య ప్రస్తుతం 142. అనేక కొత్త పుస్తకాలు కూడా ఇంకా సిద్ధమవుతూ ఉన్నాయి. భగవదనుగ్రహం, గురు అనుగ్రహంతో నా ప్రస్థానం చక్కగా సాగుతోంది.

~

సంచిక టీమ్: విలువైన మీ సమయం వెచ్చించి మా ఈ ఇంటర్వ్యూకి జవాబులిచ్చినందుకు ధన్యవాదాలు భావరాజు పద్మినీ ప్రియదర్శిని గారూ.

భావరాజు పద్మినీ ప్రియదర్శిని: ధన్యవాదాలు.

***

ఆఁయ్! మాది నర్సాపురఁవండి
రచన: భావరాజు పద్మినీ ప్రియదర్శిని
ప్రచురణ: అచ్చంగా తెలుగు ప్రచురణలు
పేజీలు: 136
వెల: ₹ 350/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు ప్రచురణలు, హైదరాబాద్.
ఫోన్: 8558899478 (వాట్సప్ మాత్రమే)
~
నవోదయా బుక్‍హౌస్, కాచీగుడా, హైదరాబాద్. ఫోన్: 9000413413
~
ఆన్‌లైన్‌లో
https://www.amazon.in/gp/product/B0FS1913W6

 

~

‘ఆఁయ్! మాది నర్సాపురఁవండి’ కథాసంపుటి సమీక్ష:
https://sanchika.com/aay-maadi-narsapuravandi-book-review-kss/

Exit mobile version